న‌య‌న‌తార‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. ప్రముఖ తమిళ నటుడి స‌స్పెన్ష‌న్..!

న‌య‌న‌తార‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. ప్రముఖ తమిళ నటుడి స‌స్పెన్ష‌న్..!

ఈ మ‌ధ్య సినిమాల‌కు సంబంధించిన ప్ర‌తి కార్య‌క్ర‌మం ఒక వేడుక‌లా నిర్వ‌హించ‌డం మామూలైపోయింది. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార (Nayanthara) న‌టించిన కొల‌యుతీర్ కాల‌మ్ (Kolayuthir Kaalam) చిత్రానికి సంబంధించిన ఒక ఈవెంట్‌ను నిర్వ‌హించారు. దీనికి ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, త‌మిళ‌నాడు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ప్రతినిధి రాధా ర‌వి ముఖ్యఅతిథిగా హాజ‌రయ్యారు.


ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన రాధా ర‌వి నటి న‌య‌న‌తార‌పై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న న‌య‌న్ గురించి మాట్లాడుతూ- "ఆమె ఇటు దెయ్యం పాత్ర‌ల్ల‌ోనూ న‌టిస్తుంది. అలాగే అటు సీత వంటి దైవ పాత్ర‌ల్లోనూ న‌టిస్తుంది. కానీ ఒక‌ప్పుడు ఎవ‌రైన క‌థ రాసుకుంటే అందులో ఉన్న దేవ‌త పాత్ర‌కు కేఆర్ విజ‌య వంటి న‌టీమ‌ణుల వైపు చూసేవారు. ఇప్పుడు న‌టించ‌డం వ‌స్తే చాలు.. దేవ‌త అయినా.. దెయ్యం పాత్రైనా.. ఎవ‌రైనా చేసేస్తున్నారు." అన్నారు."న‌య‌న‌తార బాగా న‌టిస్తుంది. అందుకే ప‌రిశ్ర‌మ‌లో ఇన్నాళ్లుగా కొన‌సాగుతోంది.. అయితే ఒక‌ప్పుడు దేవ‌తా పాత్ర‌లు చేసిన వారిని చూస్తే చేతులు ఎత్తి మొక్కాల‌ని అనిపించేది. ఇప్పుడు మాత్రం అస‌లు ఆ భావ‌న రావ‌ట్లేదు స‌రిక‌దా.. ఇంకేదో ఆలోచ‌న వ‌చ్చేలా ఉంటోంది" అంటూ వ్య‌క్తిగ‌తంగా న‌య‌న్‌ను టార్గెట్ చేసి విమ‌ర్శించారు.


ఈ కార్య‌క్ర‌మానికి న‌య‌న‌తార హాజ‌రు కాలేదు. దీనికే కాదు.. అస‌లు ఏ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనూ న‌య‌న్ పాల్గొన‌దు. చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర్నుంచీ ఆమె పాటిస్తోన్న నియమం ఇది. దీని గురించి కూడా రాధా ర‌వి మాట్లాడుతూ- ఈ సినిమాలో న‌టించిన న‌టీన‌టులంద‌రితోనూ.. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో కూడా పాల్గొనాల‌ని ముందే ఒప్పందం చేసుకుంటే మంచిద‌ని చిత్ర నిర్మాత‌కు హిత‌వు ప‌లికారు. 


అదీకాకుండా.. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు సాధారణంగా ఏ వార్త‌నైనా నాలుగు రోజుల కంటే ఎక్కువ గుర్తు పెట్టుకోర‌ని, అందుకే ఇప్ప‌టి త‌ర‌మంతా స్టార్స్ అయ్యారంటూ న‌య‌న్ కెరీర్ గురించి రాధారవి వ్యాఖ్యానించారు. ఇదంతా విన్న అక్క‌డున్న ప్రేక్ష‌కులు కూడా ఆయ‌న పెద్ద వ‌య‌సుకు, స‌మాజంలో ఆయ‌న‌కు ఉన్న గుర్తింపుకు విలువ‌నిచ్చి చ‌ప్ప‌ట్లు కొట్టారు. అయితే ఈ స్పీచ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కాగా.. నయన్ అభిమానులు ఆగ్ర‌హానికి లోన‌వుతున్నారు. ముఖ్యంగా త‌మిళ చిత్ర‌సీమ‌కు చెందిన మ‌హిళా నటులు ఆయ‌న‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు వేయాల‌ని డిమాండ్ చేశారు.


రాధా ర‌వి చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోను త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అంద‌రితోనూ పంచుకుంటూ- "ఈ అంశం గురించి త‌మిళ‌నాడుకు చెందిన పురుషులు మాట్లాడ‌తారేమోన‌ని నిన్నటి నుంచి ఎదురుచూస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి శ్రీ‌పాద‌.


అలాగే న‌టి రాధిక‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌లు సైతం ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించారు. ఇలాంటి వారిని చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తే.. భ‌విష్య‌త్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌రిన్ని చోటు చేసుకుంటాయంటూ న‌య‌న్‌కు త‌మ పూర్తి మ‌ద్ద‌తు తెలియ‌జేశారు.


 ఇక న‌య‌న్ ప్రియుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడైన విఘ్నేశ్ శివ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ "అస‌లు సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి కాకుండా ఈవెంట్ నిర్వ‌హించ‌డం, దానికి ఒక పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి ముఖ్యఅతిథిగా హాజ‌రై ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌డం, అక్క‌డున్న ప్రేక్ష‌కులు వాటికి చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం.. ఏదీ స‌క్ర‌మంగా లేదు. పెద్ద స్థాయిలో ఉన్న మీకు ఇది త‌గ‌దంటూ" అంటూ ఆయ‌న తన బాధ‌ను వ్యక్తం చేశారు.


న‌య‌న‌తారతో క‌లిసి ఇప్ప‌టికే మూడు విజ‌య‌వంత‌మైన సినిమాలు - ఆరమ్ (Aramm), విశ్వాసం (Viswaasam) & ఐరా (Airaa) రూపొందించిన కె.జె.ఆర్ స్టూడియోస్ (K.J.R Studios) సైతం రాధా ర‌వి వ్యాఖ్య‌ల ప‌ట్ల ఘాటుగానే స్పందించింది. న‌య‌న్ పై చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఇక పై త‌మ నిర్మాణ సంస్థ నిర్మించే ఏ చిత్రంలోనూ రాధా ర‌విని తీసుకోబోమ‌ని, ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న్ను త‌మ నిర్మాణ సంస్థ నుంచి బ‌హిష్క‌రించామ‌ని చెప్పుకొచ్చిన సంస్థ యాజ‌మాన్యం ... చిత్ర‌సీమ‌లోని త‌మ తోటి నిర్మాణ సంస్థ‌ల‌ను కూడా ఈ నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా ఒక ప్రకటన విడుదల చేస్తామని.. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా అంద‌రికీ తెలియ‌జేయడం గమనార్హం.మ‌రోవైపు న‌టి న‌య‌న‌తార‌పై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు గుప్పించిన న‌టుడు రాధా ర‌వికి న‌డిగ‌ర్ సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ విశాల్ నోటీసులు జారీ చేశారు. అలాగే ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ - మ‌హిళ‌ల ప‌ట్ల మీరు చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా మీకు నోటీసులు పంపుతూ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా సంత‌కం చేసినందుకు సంతోషంగా ఉంది. ఇక పై మీ పేరులో ఉన్న రాధ అనే అక్ష‌రం తీసేసి కేవ‌లం ర‌వి అని మాత్రమే పిలిపించుకోండి.. అని అన్నారు.


ఇటు సినీతార‌ల నుంచి అభిమానుల వ‌ర‌కు అంతా ఆగ్ర‌హావేశాల‌ను వ్య‌క్తం చేస్తున్న క్ర‌మంలో రాధా ర‌వి మీడియాతో మాట్లాడుతూ- త‌న వ్యాఖ్య‌లు ఎవ‌రినైనా బాధించి ఉంటే క్ష‌మించాల‌ని అన్నారు. మ‌రోవైపు డీఎంకే పార్టీ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కుగానూ.. రాధా ర‌విని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.


ఇవి కూడా చ‌ద‌వండి


ఆసుపత్రిలో "అర్జున్ రెడ్డి".. విజయ్ దేవరకొండకు ఏమైంది...?


"సాహూ" నిర్మాతలకి ప్రభాస్ పెట్టిన చిత్రమైన కండీషన్.. వింటే ఆశ్చర్యపోతారు..!


RX 100 హీరో "కార్తికేయ" కొత్త చిత్రం... "హిప్పీ" టీజర్ ఎందుకు స్పెషల్ అంటే..?