నా ఆఫీస్‌లో ఆడవారికి మాత్రమే ఎంట్రీ : రేణు దేశాయ్

నా ఆఫీస్‌లో ఆడవారికి మాత్రమే ఎంట్రీ : రేణు దేశాయ్

రేణూ దేశాయ్ (Renu Desai) - ఈ పేరు వినగానే చాలామందికి ఠక్కున గుర్తుకువచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య అనే విషయం. అందుకనే ఇప్పటికీ చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెని "వదిన" అని సంబోధిస్తుంటారు. అయితే ఈ పిలుపు వరకు ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే పవర్ స్టార్ సతీమణిగా తనను గుర్తుపట్టడం కాకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తేనే బాగుంటుందని.. అలాంటి వ్యక్తిత్వమే తనకు ఉంటే ఇష్టపడతానని అంటారు రేణూ దేశాయ్.


ఈ ఆలోచన కేవలం తన విషయంలోనే కాదు.. తన చుట్టూ ఉండే మహిళల్లోనూ ఉండాలంటున్నారామె. ఒక తల్లిగా, భార్యగా, సోదరిగా ఎలాగైతే వివిధ పాత్రల్లో మహిళలు తమ బాధ్యతను నిర్వర్తిస్తారో.. అదే బాధ్యతను జీవితం పట్ల కూడా కలిగుండాలని.. సొంత కాళ్లపై నిలబడాలని చెబుతారామె. అందుకే తన నిర్మాణ సంస్థలో ఎక్కువ శాతం మహిళలకే పని కల్పించారు రేణూ దేశాయ్. మరో ఆసక్తికరమైన అంశమేంటంటే - రేణూ దేశాయ్ వ్యక్తిగత కార్యాలయంలో పనిచేసే వారంతా కూడా మహిళలే కావడం విశేషం.


 


ఈ విషయాన్ని స్వయంగా రేణూ దేశాయ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన ‘ఆలీతో సరదాగా’ అనే కార్యక్రమంలో తన మనోగతాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ టాక్ షోలో "మీరు మీ కార్యాలయంలో పని చేసేందుకు కేవలం మహిళలనే ఎందుకు తీసుకుంటున్నారు? దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా?" అని అలీ ప్రశ్నించగా; రేణూ దానికి చక్కగా సమాధానమిచ్చారు.


ఆమె మాట్లాడుతూ - మహిళల్లో కష్టపడి పని చేయడానికి వెనుకాడని మనస్తత్వం ఉంటుంది.అదీకాకుండా మల్టీ టాస్కింగ్ పనులు చేయడంలో స్త్రీలు సిద్ధహస్తులు. ఇక సినిమా అనేది ఎంతో క్రియేటివిటీకి స్కోప్ ఇచ్చే రంగమని మనకు బాగా తెలుసు. మల్టీ టాస్కింగ్ చేయగలిగే వారైతే ఈ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే తమ కాళ్లపై తాము నిలబడాలని భావించే మహిళలకు సహాయం చేస్తున్నాననే సంతృప్తి నాకు మిగులుతుంది" అని చెప్పుకొచ్చారు.


అంతేకాదు.. ఆమె త్వరలో ఓ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు కూడా ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఆ సినిమాకు పని చేయనున్న టీంలో కూడా.. దాదాపు 70% మహిళలే ఉంటారని తెలిపారామె.


 


ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి అలీ ప్రశ్నించగా; బాల్యం నుండి రైతులను చాలా దగ్గరగా చూస్తూ ఆమె పెరిగారని, వ్యవసాయ కూలీల కష్టాలు తనకు బాగా తెలుసని, వాటిని తెరకెక్కించడం ద్వారా వాటి గురించి అందరికీ తెలియజేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ కథ త్వరలోనే కార్యరూపం కూడా దాల్చనుందని రేణూ అన్నారు.


ప్రస్తుతం తన పిల్లలు అకిరా నందన్, ఆద్యలతో కలిసి పుణెలో నివాసం ఉంటున్నారు రేణూ దేశాయ్. గత ఏడాది పుణెకు చెెెెందిన ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకున్న ఆమె.. వారి ఎంగేజ్ మెంట్ సందర్భంగా వారిద్దరు చేతులు పట్టుకున్న ఒక ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేయగా; దానిపై తీవ్రస్థాయిలోనే దుమారం చెలరేగిన విషయం విదితమే.


అయినా సరే.. ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా తన పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడమే కాదు.. మగవాళ్లు రెండో పెళ్లి చేసుకుంటే లేని తప్పు ఆడవాళ్లకు ఎలా వర్తిస్తుందంటూ ప్రశ్నించారు. తనను ట్రాల్ చేసిన వారికి గట్టిగా బదులిచ్చారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించిన వారికి దీటైన సమాధానాలు కూడా ఇచ్చారు రేణూ.


అయితే సినీ పరిశ్రమలో ఇప్పటివరకు నటిగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. ఇలా పలు విభాగాల్లో పని చేసిన రేణూ తాజాగా నిర్మాణ, దర్శకత్వ విభాగంలోనూ అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది మరాఠీలో ఒక చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు పొందిన రేణూ దేశాయ్ ఈ సంవత్సరం తెలుగులో దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ కాళ్లపై తాము నిలబడాలని అనుకునే మహిళలకు రేణూ దేశాయ్ తప్పకుండా ఒక ప్రేరణ.


Featured Images: Facebook.com/RenuDesai


ఇవి కూడా చదవండి


"ఓల్డ్ మ్యాన్" వేషాల్లో సల్మాన్, అమీర్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!


కొడుకు కోసం.. మళ్లీ క్రికెటర్‌గా మారే తండ్రి కథ "జెర్సీ"..!


సక్సెస్ కోసం పరితపించే కుర్రాడి కథ.. 'చిత్రలహరి' మూవీ రివ్యూ..!