సక్సెస్ కోసం పరితపించే కుర్రాడి కథ.. 'చిత్రలహరి' మూవీ రివ్యూ..!

సక్సెస్ కోసం పరితపించే కుర్రాడి కథ.. 'చిత్రలహరి' మూవీ రివ్యూ..!

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ... 2014లో 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంతో వెండితెరకు పరిచయమైన మెగా హీరో. గత ఆరు చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో.. సరైన హిట్ కోసం తను ఎదురుచూస్తున్న సమయమిది. అందుకు తను పడ్డ శ్రమ 'చిత్రలహరి' (Chitralahari) చిత్రంలో బాగానే కనిపిస్తుంది. ఈ చిత్రంతో హీరో తన పేరులోని ధరమ్‌ అనే పదాన్ని తొలిగించి.. 'సాయి తేజ్'గా మార్చుకోవడం గమనార్హం.


మరి, ఈ సినిమా అయినా సాయి తేజ్‌కి హిట్ ఇచ్చిందా? లేదా? తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన పాటల కార్యక్రమం 'చిత్రలహరి' పేరుతో కథను రాసి, దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల (Kishore Thirumala) ప్రేక్షకుల మనసుని గెలుచుకోగలిగారా?? మొదలైన అంశాలను ఈ రివ్యూలో చూద్దాం..


చిత్రలహరి సినిమా మొదలవుతుండగానే.. దర్శకుడు మనకి ఈ చిత్రానికి సంబంధించిన కథను మూడు ముక్కల్లో చెప్పేస్తాడు. అదేంటంటే - చిత్రలహరి కార్యక్రమంలో ఒక పాట తరువాత.. మరొకటి సంబంధం లేకుండా ఎలాగైతే వస్తుంటుందో.. అలాగే రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఒక చోట కలిస్తే వారి మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రమని అంటారు.  దీనితో ఈ సినిమా ఎలా ఉండనుందో సగటు ప్రేక్షకుడికి ఒక ఐడియా వచ్చేస్తుంది.


ప్రేక్షకుల ఊహలు, అంచనాలకు తగినట్లే.. ఇందులోని పాత్రలను కూడా తీర్చిదిద్దారు కిషోర్ తిరుమల. చిన్నతనం నుండీ ఏదైనా సాధించాలనే తపన కలిగిన కుర్రాడు విజయ్. ఈ పాత్రలో తేజ్ ఒదిగిపోయి నటించాడు.


 


అయితే ఎంత కష్టపడినా ప్రతిఫలం అందని సగటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఈ కథలో హీరో. చివరికి అందరూ అతనికి రిజెక్టెడ్ పీస్ అనే ముద్ర కూడా వేసేస్తారు. ఈ క్రమంలో తన గురించి ఎలాగైనా ఈ ప్రపంచానికి చాటిచెప్పాలని.. యాక్సిడెంట్ అలెర్ట్ అనే ఒక యాప్‌ని తయారుచేసి.. దానికి స్పాన్సర్స్ కోసం ప్రయత్నిస్తుంటాడు విజయ్.


అలా సాగుతున్న విజయ్ జీవితంలోకి లహరి (కళ్యాణి ప్రియదర్శన్) ప్రవేశిస్తుంది. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం, ఆ తరువాత ప్రేమించుకోవడం జరిగిపోతాయి. అయితే ఏదీ సొంతంగా ఒక నిర్ణయం తీసుకోలేని మనస్తత్వం కలిగిన లహరి... యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు, ఇతరులు చెప్పిన మాటల వల్ల విజయ్‌తో బ్రేకప్ చేసుకుంటుంది.


ఈ రెండు పాత్రలకి సమాంతరంగా నడిచే మరో పాత్ర స్వేచ్ఛ. ఈ పాత్రని నివేథా పేతురాజ్ పోషించింది. జీవితంలో ప్రాక్టికల్‌గా ఉండాలి అనే తత్వం కలిగిన అమ్మాయి తను. అయితే చిన్నతనంలో తనని, తన తల్లిని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రి పైన ఉన్న కోపాన్ని మగవాళ్ళపై ఆమె చూపెడుతూ ఉంటుంది. కథలో భాగంగా గ్లాస్ మేట్‌గా సాయి తేజ్‌తో కలిసి సునీల్ పండించిన హాస్యం బాగుంది. అలాగే రెండవ భాగంలో తమిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వెన్నెల కిషోర్ కూడా అలరించాడు.


 


ఇలాంటి భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన పాత్రల ప్రయాణంలో విజయ్ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? యాక్సిడెంట్ అలెర్ట్ యాప్‌కి స్పాన్సర్ షిప్‌ని సాధించగలిగాడా లేదా? ఎప్పటిలాగే ఈ విషయంలోనూ అపజయం అతన్ని పలకరించిందా?? మొదలైన విషయాలను వెండితెర పైన చూడాల్సిందే...

ఇక ఈ చిత్ర కథ & కథనాల విషయానికి వస్తే - సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు.. వాటి మధ్య ఉండే సంఘర్షణలని తెరకెక్కించే క్రమంలో దర్శకుడు విజయం సాధించారని చెప్పవచ్చు. అలాగే సక్సెస్ కోసం పరితపించే కొడుకుని ప్రోత్సహించే.. ఒక మంచి తండ్రి పాత్ర మనకి పోసాని కృష్ణమురళి రూపంలో కనపడుతుంది.


ముఖ్యంగా వీరి మధ్య వచ్చే రెండు సన్నివేశాలు.. ప్రేక్షకుల చేత థియేటర్‌లో చప్పట్లు కొట్టిస్తాయి. ఒక లక్ష్యం కోసం ప్రయత్నించే సమయంలో.. అతనికి తోడ్పాటునందించే వ్యక్తులు సరైన వారైతే.. సదరు వ్యక్తి తన లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలుగుతాడు? అనే విషయాన్ని ఈ చిత్రంలో పాత్రల ద్వారా.. వారి సంభాషణల ద్వారా మనకి తెలియచేస్తాడు దర్శకుడు. ఈ సినిమాలోని సంభాషణలు.. ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు.


 


భావోద్వేగాలతో మిళితమైన.. ఇంత చక్కటి కథకి నేపధ్య సంగీతంతో పాటుగా.. మంచి స్వరాలు సమకూర్చడంలో దేవిశ్రీప్రసాద్ సక్సెస్ అయ్యాడు. చక్కటి విజువల్స్‌తో మనకి ఈ చిత్రాన్ని.. అత్యంత సహజంగా కనిపించేలా చూపించడంలో కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహకుడిగా విజయం సాధించాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారి నిర్మాణపు విలువలు చాలా ఘనంగా ఉన్నాయి.


ఆఖరుగా "కల కన్న ప్రతివాడు కలామ్ కాలేడు" అంటూ సినిమాని ప్రారంభించి.. చివరిలో "కలామ్ అలా అని అనుకొని ఉండకపోతే.. ఇప్పటివారికి ఒక మంచి స్ఫూర్తి ఉండకుండా పోయేది కదా" అనే అంతర్లీనమైన ఒక సందేశంతో ఈ చిత్రాన్ని ముగిస్తాడు దర్శకుడు.


"కల కనడం మంచిదే... అది సాకారం చేసుకునే సమయంలో ఎన్ని అపజయాలు ఎదురైనా.. సక్సెస్ కోసం మన ప్రయాణాన్ని ఆపకూడదు అని చెప్పడమే ఈ చిత్రలహరి ఉద్దేశ్యం".


ఇవి కూడా చదవండి


అర్జున్ రెడ్డి వర్సెస్ కబీర్ సింగ్: ఎవరి సత్తా ఏమిటి..?


జయలలిత జీవితంలో.. చివరి 75 రోజులు ఆధారంగా మరో బయోపిక్..!


"మేము ఓటేశాం.. మరి మీరు ? " అంటున్న సెలబ్రిటీలు.. ఫొటోలతో అవగాహన కల్పించే యత్నం