పెళ్లి (marriage) లేదా ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ బంధం మొదలైన తర్వాత.. ప్రారంభంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత హనీమూన్ ఫేజ్ పూర్తవుతుంది. అయితే ఆ తర్వాత కూడా.. ఇద్దరూ తమ మధ్య ఉన్న ప్రేమను అలాగే కొనసాగించాలంటే ఆ కొత్తదనాన్ని, అందులోని ఆనందాన్ని ఆ బంధంలో అలాగే కొనసాగించడం ఎంతో అవసరం. అలా కొత్తదనాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేస్తూ.. మీ బంధంలోని ఆ స్పార్క్‌ని కొనసాగించాలి.
దీనికోసం వీలైనంత తరచుగా అడ్వెంచర్లు (Adventures) చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ప్రేమను మరింత పటిష్టమయ్యేలా చూసుకోవచ్చు. ఈ క్రమంలో మనం కూడా ఆలుమగలు అప్పుడప్పుడూ చేయాల్సిన కొన్ని అడ్వెంచర్ల గురించి తెలుసుకుందాం రండి. వీటన్నింటినీ ఎవరైనా జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రయత్నించి.. అందులోని ఆనందాన్ని చవిచూడాల్సిందే.
1. ఫాలో మీ సిరీస్ ప్లాన్ చేయండి.
మురాద్ ఒస్మాన్ ప్రారంభించిన ఫాలో మీ సిరీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కేవలం తన ప్రేయసి వెనుక భాగం మాత్రం కనిపించేలా.. ఆమె చెయ్యి పట్టుకొని తీసిన ఆ ఫొటోలు ప్రపంచమంతా పాపులర్‌గా మారాయి. మీరూ వివిధ ప్రదేశాలకు వెళ్తూ ఉండడం సహజం. అక్కడ రకరకాల ఫొటోలు దిగడం కూడా సహజం. కానీ ఇలా ఫాలో మీ పోజుల్లో మీరూ ఫొటోలు దిగండి. వీటిని మీరు మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మాత్రమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా వాటిని దాచుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
2. ఏకాంతంలో ఉన్నా.. అంటూ పాడేయండి..
ఈ ప్రపంచంలో మీరిద్దరూ తప్ప ఇంకెవరూ ఉండకూడదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అలా అనిపిస్తే ఈ తరహా ట్రిప్ మీకెంతో ముఖ్యం అని చెప్పచ్చు. మీ ఇద్దరూ కలిసి మంచి హిల్ స్టేషన్ ఉన్న ప్రాంతానికి వెళ్లండి. హోటల్ గదిలో కాకుండా మీరిద్దరే ఉండేలా ఓ కాటేజీ బుక్ చేసుకోండి.
ప్రపంచానికి దూరంగా ఎక్కువగా జనసంచారం లేని ఆ గుడిసెల్లో.. మీరిద్దరూ కలిసి జీవిస్తూ ఇక ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేనట్లుగా ఆనందంగా గడపండి. ఇది ఒక్కరోజైనా సరే.. మీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది.
3. మారథాన్‌లో పరిగెత్తండి.
పరుగెత్తడం వల్ల మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. అంతేకాదు శరీరానికి కూడా ఇది ఎంతో మంచిది. కేవలం మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మీ బంధం ఆనందంగా సాగేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరిద్దరూ ఫిట్ నెస్ని ఇష్టపడితే ఇద్దరూ కలిసి మారథాన్‌లో పరిగెత్తడం వల్ల ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు.
అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ పరుగెత్తి దాన్ని పూర్తి చేయడం వల్ల ఎంతో అద్బుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఓసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది.
4. చుక్కల మధ్య ఓ రాత్రి..
సిటీలో రణగొణ ధ్వనుల మధ్య ఆనందం దొరకడం కాస్త కష్టమే. అందుకే ఈ ఫాస్ట్ ప్రపంచానికి కాస్త దూరంగా కాలుష్యం లేని పల్లెలు లేదా ఏదైనా మంచి ప్రదేశాలకు ట్రిప్‌కి వెళ్లండి. రాత్రి వెన్నెల్లో పడుకొని ఇద్దరూ కలిసి చుక్కలు లెక్కబెడుతూ ముచ్చట్లాడుకుంటూ గడపండి.
దీనికోసం మీకు నచ్చిన బీచ్ లేదా మీ సొంత వూరిలో మీ పొలాల మధ్య మంచెపై పడుకున్నా సరిపోతుంది. ఈ ఫీలింగ్ ప్రపంచంలో ఎక్కడా దొరకదంటే అది అతిశయోక్తి కాదు. సులువైన పద్ధతే కాబట్టి ఓసారి ప్రయత్నించి చూడండి.
5. డ్యాన్స్ పోటీల్లో పాల్గొనండి..
డ్యాన్స్ అంటే మీ ఇద్దరికీ ఇష్టమైతే.. ఇద్దరూ కలిసి మంచి డ్యాన్స్ క్లాస్‌లో చేరండి. ఇంకా కావాలంటే.. ఇద్దరూ డ్యాన్స్ పోటీల్లోనూ పాల్గొనండి.
దీనికోసం ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేయడం.. ఆ కెమిస్ట్రీ కోసం ప్రయత్నించడం వంటివన్నీ మిమ్మల్ని మరింత దగ్గరికి చేరుస్తాయి. పోటీల్లో పాల్గొన్నంత మాత్రాన గెలవాలని రూలేం లేదు. అయితే మీ ఇద్దరూ ఈ ప్రక్రియలో ఒకరి మనసులను మరొకరు గెలుచుకోవడం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది.
6. లైవ్ మ్యూజిక్ షోకి వెళ్లండి.
మీరిద్దరికీ ఒక సింగర్ అంటే ఇష్టం. లేదా మీ ఇద్దరి ఫేవరెట్ సింగర్లు కలిసి ఓ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రాం చేస్తున్నారు. అలాంటి కార్యక్రమానికి మీరు వెళ్లి మీ ఫేవరెట్ గాయనీగాయకులు పాటలు పాడుతుంటే ఉల్లాసంగా డ్యాన్సులు చేయడం, వారితో కలిసి పాడడం వంటివి చేయడం మీకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు.
7. నదిలో లేదా సముద్రంలో ఈత కొట్టండి.
చెరువులో, పిల్ల కాలువలో లేదా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం ఎవరైనా చేయగలరు.. కానీ వేగంగా పారుతోన్న నదిలో లేక సముద్రంలో ఈత కొట్టడం మాత్రం కాస్త కష్టమైన పనే. పైగా ఎక్కువ మంది చేయని పని ఇది. మీరు దీన్ని ఒకసారి ప్రయత్నించండి.
దీనివల్ల ఓ అడ్వెంచర్ చేసిన అనుభూతి మీకు కలుగుతుంది. అంతేకాదు.. చుట్టూ ఎవరూ లేకుండా మీకు నచ్చినంత సేపు నచ్చినంత దూరం ఈత కొట్టవచ్చు. అయితే ముందుగా ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు.
8 సాహస క్రీడలను ప్రయత్నించండి.
భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదైనా సాహస క్రీడను ప్రయత్నించడం వల్ల ఫన్ పొందే వీలుంటుంది. ఇలా ఇద్దరూ కలిసి ఫన్ మూడ్‌లో ఉండే జంటలు చాలా క్లోజ్‌గా ఉంటాయట. అందుకే ఐస్ స్కేటింగ్, క్లిఫ్ జంపింగ్, రాఫ్టింగ్, స్కూబా డైవింగ్ వంటివి ఏవైనా ప్రయత్నించవచ్చు.
ఈ ఫీలింగ్ మీకు చాలా కాలం పాటు అలాగే నిలిచి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఓసారి ఈ సాహసక్రీడలను ప్రయత్నించి చూడండి.
9. క్రూజ్ లేదా యాష్త్లో ప్రయాణించండి.
చుట్టూ నీళ్లు మధ్యలో మీరు.. మీకు నచ్చిన వ్యక్తితో కలిసి నిలబడితే ఎలా ఉంటుందో ఒక్కసారి వూహించుకోండి. అంత రొమాంటిక్ ఫీలింగ్ ఇంకేదీ ఉండదు.
అందుకే మీరూ ఏదైనా క్రూజ్ ట్రిప్‌లో వెళ్లడం.. అది కుదరకపోతే యాష్త్లో అయినా ప్రయత్నించండి. టైటానిక్ వంటి పోజ్ కూడా ప్రయత్నించవచ్చండోయ్.. ఓసారి ట్రై చేయండి.
10. మాటలను రాతలుగా..
సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో రాజేంద్రప్రసాద్.. ఆయన భార్య ఒకరితో ఒకరు సంభాషించుకోవాలని భావిస్తే.. గోడపై చిట్స్ రాసి పెడుతుంటారు. అవి చదువుకొని… ఆలుమగలు ఒకరి మనసులో విషయాన్ని మరొకరు తెలుసుకుంటారన్నమాట.
అలా మీరూ ఓ మూడు రోజుల పాటు అసలేమీ మాట్లాడుకోకుండా.. మీ మనసులోని మాటలన్నింటినీ పేపర్ పై రాసి పెట్టి ఎదుటివారికి చెప్పండి. ఇది మీకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. మీరిద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలుపుకున్న ఈ లేఖలు మీకు జీవితాంతం ఒక చక్కటి జ్ఞాపకంగా మిగిలిపోతాయి.
ఇవి కూడా చదవండి.
తొలిచూపులోనే పుట్టిన ఈ ప్రేమ కథలు.. మీ మనసును హత్తుకుంటాయి..!
సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?
కాలేజీలో మొదలై.. జీవితాంతం నిలిచిన అందమైన ప్రేమ కథలు మీకోసం..!
Images : Giphy