కాలేజీ రోజుల్లో.. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకూ ఉన్నాయా??

కాలేజీ రోజుల్లో.. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకూ ఉన్నాయా??

చదువుకొనే రోజుల్లో ఎప్పుడెప్పుడు చదువు పూర్తయిపోతుందా? ఎప్పుడు కాలేజీ (College) నుంచి బయటపడతామా అనే ఆలోచిస్తాం. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత గానీ దాని విలువ తెలీదు. అప్పుడు అనిపిస్తుంది.. అది కదా అసలైన ఎంజాయ్‌మెంట్ అని. అప్పటి వరకు చదువుకొన్న క్లాస్ రూమ్‌ని మిస్సవుతాం. అల్లరి చేస్తే తిట్టిపోసే లెక్చరర్స్‌ని మిస్సవుతాం. క్లాస్‌కి బంక్ కొట్టి సినిమాకెళ్లే అవకాశం మళ్లీ వస్తుందా? ఆ ఆనందాన్ని మళ్లీ మనం పొందగలుగుతామా? రోజూ మన హార్ట్ క్రష్‌ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొనే వీలుంటుందా? అందుకే మరపు రావు ఆ కాలేజీ రోజులు అంటూ ఎంతోమంది కవులు వర్ణించారు.


ఆ రోజుల్లో మనం చేసిన పనులు తలచుకొంటే ఇప్పటికీ నవ్వొస్తుంటుంది. కాలాన్ని వెనక్కి తిప్పైనా సరే అక్కడికి వెళ్లిపోదామనిపిస్తుంది. అసలు ఎలాంటి మధురానుభూతులు (Sweet memories) మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి? గుర్తొచ్చిన ప్రతిసారీ మన పెదవులపై ఎలాంటి చిరునవ్వులు తెప్పిస్తాయి? అని ఆలోచిస్తూ.. వాటిని మళ్లీ ఓ సారి మననం చేసుకొందాం..


సందడంతా లాస్ట్ బెంచ్‌లోనే..


నిజం చెప్పుకోవాలంటే.. మొదటి, రెండు బెంచీల్లో కూర్చున్నవారే క్లాస్ పూర్తిగా వింటారు. మిగిలిన వారు ఇతరత్రా పనులు చేసుకొంటారు. నిద్రపోయేవాళ్లు నిద్రపోతూనే ఉంటారు. ఆడుకొనేవాళ్లు ఆడుకొంటూనే ఉంటారు. కబుర్లు చెప్పుకొనేవారు చెప్పుకొంటూనే ఉంటారు. కానీ అదేం చిత్రమో కానీ.. వారి పెదవులు కదలవు.కానీ మాటలు వినిపిస్తాయి.


కొందరు బోర్డు వంక చూస్తూనే ఉంటారు.. కానీ టిక్ టాక్ టో, దాడి వంటి ఆటలు ఆడుతూనే ఉంటారు. ఇంకొందరైతే.. రికార్డు వర్క్ చేసుకొంటూ ఉంటారు. మరికొందరు సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తారు. ఆ చాటింగ్ చేసే వాళ్లు కూడా వారి పక్కనే ఉంటారు. అసలు క్లాస్ రూంలో చివరి బెంచీల్లో కూర్చున్నవారు ఎంజాయ్ చేసినంత బాగా ఇంకెవరూ చేయలేరు. అంతేగా..?


college-1


బంక్ కొట్టి సినిమాకి వెళ్లడం..


అసలు ఆ రోజుల్లో కాలేజ్ బంక్ కొట్టడమంటే ఒక ప్రహసనం..  నోబెల్ ప్రైజ్ కొట్టినంత ఆనందం.. ఉత్సాహం ఒకేసారి వచ్చేస్తాయి. బంక్ కొట్టి సినిమాకెళితే వచ్చే మజానే వేరు. ఎప్పుడైనా సెలవు కావాలంటే.. అందరూ కలసి మాస్ బంక్ కొట్టడం.. అబ్బ.. ఆ రోజులు గుర్తు తెచ్చుకొంటుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది కదా.


పలు విషయాల్లో స్టూడెంట్స్ అందరూ ఏకీభవించరేమో కానీ.. మాస్ బంక్ కొట్టే విషయంలో మాత్రం అందరూ ఒక్కతాటి పైకి వచ్చేస్తారు. చాలా ఫాస్ట్‌గా మెసేజెస్ ఫార్వార్డ్ అయిపోతుంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీల్లో.. ఈ  మాస్ బంక్ ఫార్ములా బాగా వర్కవుట్ అవుతుంది.


college-2


ప్రాక్సీ అటెండెన్స్


హాల్ టిక్కెట్ రావాలన్నా.. ఎగ్జామ్స్ రాయాలన్నా అటెండెన్స్ తప్పనిసరి. కానీ అస్తమానూ క్లాస్‌కి బంక్ కొడుతుంటే.. అటెండెన్స్ తగ్గిపోతుంది కదా. మరి, అలా జరగకుండా మనకు ప్రాక్సీ ఫార్ములా ఉంది కదా.


ఈ ఫార్ములా ప్రకారం..  మన బదులు మన గొంతుతో.. మన ఫ్రెండ్ అటెండెన్స్ పలుకుతుంది. ఈ పని అబ్బాయిలు మాత్రమే చేస్తారనుకొంటే పొరపాటే. అమ్మాయిలు కూడా ప్రాక్సీ అటెండెన్స్ పలుకడంలో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు.


college-3


లంచ్ అంటే విందు భోజనమే..


కాలేజీకి వెళితే లంచ్ బాక్స్ తప్పనిసరిగా వెంట తీసుకెళతాం. బుక్స్, రికార్డ్స్.. మరిచిపోతాం కానీ.. బాక్స్ మాత్రం మరచిపోం. మధ్యాహ్నం ఫ్రెండ్సందరితో కలసి భోజనం చేస్తుంటే.. ఏదో విందు భోజనం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ మనకి నచ్చని కూర వండినా ఫర్వాలేదు. ఆ కూర ఫ్రెండ్స్‌కి ఇచ్చి.. వారి కూరలు మనం వేసుకోవచ్చు. కొంతమంది లంచ్ బ్రేక్ వరకు కూడా వెయిట్ చెయ్యరు. క్లాసులోనే భోజనం లాగించేస్తారు. ఇక అబ్బాయిల సంగతి చెప్పక్కర్లేదు.. అప్పుడప్పుడు లంచ్ చేయడం మాని.. ఎక్కడైనా పెళ్లి భోజనాలు పెడితే.. ఎవరికీ చెప్పకుండా అక్కడ అనుకోని అతిథుల్లా ప్రత్యక్షమవుతారు. 


college-4


ఐస్ క్రీం బెట్టింగ్స్


ప్రతి చిన్న విషయానికి బెట్ ఎంత అని ఛాలెంజ్ చేసేవాళ్లు ప్రతి క్లాసులోనూ ఉంటారు. అలా బెట్ కట్టేది అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా. అయితే అమ్మాయిలు కట్టే బెట్స్ చాలా సింపుల్‌గా, ఫన్నీగా ఉంటాయి. బెట్ ఓడిపోతే.. ఐస్ క్రీంస్, చాక్లెట్స్ కొనివ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. సాధారణంగా వీరు కాసే పందేలు ఎలా ఉంటాయంటే.. ఈ రోజు ఫలానా లెక్చరర్ క్లాసుకి వస్తారా? లేదా? ఈ రోజు ఎస్సైన్మెంట్ ఉంటుందా? లేదా? ఇలాంటి సిల్లీ అంశాలపైనే బెట్టింగ్స్ కాస్తూ ఉంటారు.


college-5


రికార్డులు కాపీ కొట్టడం..


రికార్డులు సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు.. స్టూడెంట్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తమ గ్రూప్‌లో ఉండే టాపర్స్ రికార్డులు తీసుకొని వాటిని కాపీ కొడుతుంటారు. ఆదరాబాదరా వాటిని రాయడం పూర్తి చేసి సబ్మిట్ చేస్తారు. అదేంటో అంత బాగా కాపీ కొడతాం కానీ.. కావాలనే కొన్ని తప్పులు రాస్తాం. లేదంటే లెక్చరర్‌కి అనుమానం వస్తుంది కదా.. మనం కాపీ కొట్టామని. అదే ముందే కొన్ని తప్పులు రాస్తే.. కనీసం సొంతంగా అయినా రాశామనే సింపతీ ఉంటుంది.


college-6


ఇలాంటి తీపి గుర్తులు కాలేజీ లైఫ్‌లో ఎన్నో ఉంటాయి. మీక్కూడా ఇలాంటి అనుభవాలు, అనుభూతులు ఉండే ఉంటాయి కదా. సరదాగా ఓసారి వెనక్కి వెళ్లి వాటిని గుర్తు తెచ్చుకోండి.


ఇవి కూడా చదవండి..


సినిమాలో చూపించినట్టు.. కాలేజీ జీవితం ఉండదమ్మా..!


ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యక్తులు మార్కెట్లో మీకూ ఎదురయ్యారా?


అల్లరి పిడుగు బుడుగు మనింట్లో చిచ్చర పిడుగు అయితే..?