నల్లని, పొడువాటి కురులు కావాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి జుట్టునే కోరుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో జుట్టు బాగా పెరిగిన తర్వాత.. దాని ఎదుగుదల ఆగిపోతుంది. అలాంటి సమయాల్లో జుట్టు పెరిగేందుకు చాలామంది చాలా చిట్కాలు చెబుతుంటారు. వాటన్నింటిలో ఏది పాటించాలో తెలీక మనం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది.
మరికొందరైతే పలు చిట్కాలు పాటించి అవి తమ తత్వానికి సరిపడకపోవడం వల్ల.. జుట్టు రాలే సమస్యను కొని తెచ్చుకుంటారు. వీటితో పాటు ప్రస్తుతం కాలుష్య ప్రభావం వల్ల జుట్టు రాలడం, తెల్లబడడం, పొడిబారిపోవడం మొదలైన సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీ జుట్టు ఎలాంటిది అన్న విషయంపై మీకు మంచి అవగాహన ఉంటే చాలు.. జుట్టు పెరిగేలా చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు.
జుట్టు పెరగడాన్ని అడ్డుకునే విషయాలు
పొడవైన జుట్టు కోసం ఇంటి చిట్కాలు
జుట్టు పెరిగేందుకు తోడ్పడే నూనెలు
తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు
జుట్టు పెరగడాన్ని అడ్డుకునే విషయాలు (Things That Prevent Hair Growth)
జుట్టు సాధారణంగా ప్రతి నెల ఒక అంగుళం పొడవు పెరుగుతుంది. కానీ కొన్ని కారణాలు మన జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంటాయి. దీంతో పాటు జుట్టు పెరిగే ఫేజ్ కాలాన్ని తగ్గిస్తాయి. ఈ కారణాలేంటంటే..
1. పెరిగే వయసు
2. విటమిన్లు, మినరల్స్ లేదా ప్రొటీన్లు తక్కువగా తీసుకోవడం
3. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారడం
4. హార్మోన్ల అసమతుల్యత
5. హెయిర్ స్టైలింగ్, జుట్టుకి ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగించడం
6. వాతావరణంలో మార్పులు, కాలుష్యం
7. శారీరక, మానసిక ఒత్తిడి
8. బరువు తగ్గడం
9. పీసీఓఎస్
జుట్టు పెరుగుదల చాలా కారణాల పై ఆధారపడుతుంది. ఇందులో కొన్ని సమస్యలకు మనం చికిత్స తీసుకోగలం. మరికొన్ని మన చేతుల్లో లేని కారణాలుంటాయి. అయితే కారణాలేవైనా.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చక్కటి ఆహారం తీసుకోవడం, కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం మంచిది. వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అందుకే పొడవైన, ఒత్తైన జుట్టు కోసం ఈ చిట్కాలు పాటించండి.
స్త్రీట్నెర్స్ వాడేముందు ఏ హీట్ ప్రొటెక్టర్ మంచిది
పొడవైన జుట్టు కోసం ఇంటి చిట్కాలు (Hair Growth Tips & Home Remedies)
1. బయోటిన్ టాబ్లెట్స్ (Biotin Tablets)
బయోటిన్ టాబ్లెట్స్ వాడడం వల్ల జుట్టు చాలా బాగా పెరుగుతుంది. వీటిలో విటమిన్ బి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనివల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ పద్ధతిని వారానికి రెండు సార్లు ఫాలో కావచ్చు. ఇందుకోసం రెండు మూడు బయోటిన్ టాబ్లెట్లను గ్రైండ్ చేసి.. ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి.. జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. రాత్రివేళ ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి.. ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
2. విటమిన్లు (Vitamins)
బయోటినేజ్, విటమిన్ ఇ వంటి విటమిన్లు జుట్టు పెరగడానికి ఎంతో తోడ్పడతాయి. ఇవి మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే విటమిన్ సి కూడా జుట్టు పెరుగుదలలో భాగంగా మృత కణాలను తొలిగిస్తుంది. విటమిన్ ఇ ఆయిల్, బయోటిన్ క్యాప్సూల్స్ వంటివి తరచూ నూనెతో కలిపి జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన మాంసాహారం
3. ఉల్లిపాయ రసంతో.. (Onion Juice)
ఉల్లిపాయలోని సల్ఫర్ మన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు పెరిగేందుకు చాలామంది ఉపయోగించే పద్ధతి. దీనికోసం ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వాటిని వేసి గ్రైండ్ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
పదిహేను నిమిషాల పాటు అలా పట్టించి.. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. అయితే ముందు ఒకసారి పరీక్ష చేసుకొని అప్లై చేయడం మంచిది. దీనికోసం ఫ్రెష్ ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి.
4. కలబంద గుజ్జుతో.. (Aloe Vera Pulp)
కలబంద మన చర్మానికి మాత్రమే కాదు.. జుట్టుకు కూడా ఎంతో మేలుని కలిగిస్తుంది. మన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మన జుట్టుకు కావాల్సిన ఎన్నో పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో తోడ్పడతాయి.
దీని కోసం మీరు చేయాల్సిందల్లా కలబంద ఆకులోని ఆకుపచ్చ పదార్థాన్ని తీసేసి.. గుజ్టును మాత్రం సేకరించాలి. ఈ గుజ్జును మిక్సీ సాయంతో.. గ్రైండ్ చేసి జుట్టుకు అప్లై చేసుకోవాలి. ముందు కుదుళ్లకు అప్లై చేసి.. తర్వాత చివర్ల వరకూ పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ తలస్నానం చేయడానికి చల్లని లేదా గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.
5. తేనెతో.. (Honey)
తేనెను జుట్టుకు రాయడం.. అది తెల్లబడిపోతుందనేది ఓ అపోహ. కానీ ఇది నిజం కాదు. తేనె వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది. పోషకాలను అందించి జుట్టు పట్టులా మెరిసేలా చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సాయపడతాయి.
అంతేకాదు.. జుట్టు కాలుష్యం, ఎండ వంటి వాటి హాని బారిన పడకుండా చేస్తుంది. తేనెను కనీసం వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. దీనికోసం టీ స్పూన్ తేనెను తీసుకొని.. రెండు టీ స్పూన్ల షాంపూతో కలపాలి. తర్వాత సాధారణంగానే షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల.. జుట్టు పట్టులా మెరవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
6. టీ పొడితో.. (Tea Powder)
గ్రీన్ టీలో పలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన జుట్టు రాలిపోకుండా చేస్తాయి. అంతేకాదు.. ఇందులోని సహజ గుణాలు మన జుట్టు పెరిగేందుకు ఎంతో సాయం చేస్తాయి. గ్రీన్ టీని జుట్టుకి పట్టించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. దీనికోసం మీరు సాధారణ గ్రీన్ టీతో పాటు మట్చా గ్రీన్‌ని కూడా ఉపయోగించవచ్చు. బ్యాంబూ టీ, సేజ్ టీ మొదలైనవాటిని కూడా ప్రయత్నించవచ్చు.
ఈ పద్దతిలో మీకు గ్రీన్ టీ అందుబాటులో లేకపోతే.. సాధారణ టీ పౌడర్ని కూడా ఉపయోగించవచ్చు. గ్రీన్ టీతో మిశ్రమాన్ని తయారుచేసే క్రమంలో.. తొలుత ఒక బ్యాగ్ గ్రీన్ టీ తీసుకోవాలి. దాన్ని మరుగుతున్న నీటిలో ఒక కప్పు వేయాలి. ఇప్పుడు ఈ నీటిని తలకు పట్టించి.. కుదుళ్లు తడిచేలా చేయాలి. అలా తడిపిన తర్వాత.. గంట పాటు జుట్టును అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసిన ప్రతిసారి.. మంచి ఫలితాలు రావడం ఖాయం.
7. హెన్నా పౌడర్ (Henna Powder)
హెన్నా మన జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడి జుట్టును మృదువుగా మార్చి మెరిసేలా చేస్తుంది. దీంతో పాటు మీ జుట్టుకి పోషకాలను కూడా అందిస్తుంది. మంచి ఫలితాల కోసం దీన్ని నెలకోసారి తలకు అప్లై చేస్తే మంచిది.
అందుకోసం మీరు చేయాల్సిందల్లా కప్పు హెన్నా పొడిని (గోరింటాకు పొడి).. అరకప్పు పెరుగులో కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆపై దీన్ని తలకు పట్టించాలి. కుదుళ్లకి మొత్తం పట్టించిన తర్వాత చివర్ల వరకూ రుద్దాలి. జుట్టు మొత్తం ఆరిపోయిన తర్వాత.. గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి.
8. గుడ్డుతో ఒత్తైన జుట్టు.. (Eggs)
మన జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే దానికి కావాల్సింది ప్రొటీన్. జుట్టు పెరుగుదలకు కావాల్సిన మొదటి పదార్థం ఇది. ఆ ప్రోటీన్ ఎక్కువ లభించేది గుడ్డులోనే. అంతే కాదు.. గుడ్డులో సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియం, ఫాస్పరస్, అయోడిన్ వంటివన్నీ ఉంటాయి. అందుకే దీన్ని అప్లై చేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. గుడ్లు సాధారణంగా జుట్టు పెరుగుదలకు తోడ్పడడం మాత్రమే కాకుండా.. దానికి తేమను కూడా అందిస్తాయి.
గుడ్డులో లభించే ఏ,ఇ,డి విటమిన్లు.. మన కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని అరికడతాయి. అలాగే మీ జుట్టు మృదువుగా మెరుస్తూ కనిపించేలా చేస్తాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఎగ్ ప్యాక్‌ని కనీసం వారానికి ఒకసారైనా వేసుకోవడం. ఈ ప్యాక్ తయారు చేయడానికి అవసరమైనవి – ఒక గుడ్డు, టీ స్పూన్ ఆలివ్ నూనె, టీ స్పూన్ తేనె.
ఎగ్ ప్యాక్ తయారుచేయాలంటే.. తొలుత గుడ్డును బౌల్లో వేసి బాగా బీట్ చేయాలి. తర్వాత అందులో కొద్దికొద్దిగా ఆలివ్ నూనె, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మీ జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్ల నీటితో తలస్నానం చేయాలి. గోరు వెచ్చని లేదా వేడి నీటిని వాడడం వల్ల గుడ్డు మిశ్రమం వెంట్రుకలకు అంటుకుపోతుంది. కాబట్టి.. తప్పనిసరిగా చల్లని నీటినే ఉపయోగించాలి.
9. పసుపుతో.. (Turmeric)
సాధారణంగా మనం పసుపును చర్మ సౌందర్యం కోసం మాత్రమే వాడతాం. కానీ పసుపుతో మరెన్నో ఉపయోగాలున్నాయి. ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మంతో పాటు.. జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులోని యాంటీబయోటిక్ గుణాలు కేశ సంరక్షణకు బాగా పనికొస్తాయి.
పసుపుతో పాటు.. ఇంట్లో లభించే దినుసులతో.. నల్లటి పొడవైన జుట్టును సొంతం చేసుకోవాలంటే ఓ పద్ధతిని పాటించండి. తొలుత నాలుగు టీస్పూన్ల పసుపును.. కప్పు పచ్చిపాలలో వేసి.. ఆ తర్వాత రెండు టీస్పూన్ల తేనెతో మిక్స్ చేసి మిశ్రమాన్ని తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి.. తర్వాత అంచుల వరకూ రుద్దుతూ అప్లై చేసుకోవాలి. ఆపై గంట పాటు అలాగే ఉంచి.. తర్వాత గోరు వెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ఆరోగ్యకరమైన కేశాలు మీ సొంతమవుతాయి.
10. కరివేపాకుతో.. (curry leaves)
జుట్టు పొడుగ్గా పెరిగేలా చేసే వాటిలో కరివేపాకు ఎంతో ముఖ్యమైనది. దీనికోసం కరివేపాకు రెబ్బలు తీసుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల పెరుగు లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఆ తర్వాత దీన్ని తలకు పట్టించి అరగంట పాటు ఆగి ఆపై తలస్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టు పెరిగేందుకు తోడ్పడే నూనెలు (Best Oil For Hair Growth)
జుట్టు పెరగడానికి ఈ ఇంటి చిట్కాలతో పాటు.. సహజమైన నూనెలు కూడా ఎన్నో తోడ్పడతాయి. వాటి వివరాలు తెలుసుకుందాం రండి..
1. కొబ్బరి నూనె (Coconut Oil)
తలకు కొబ్బరి నూనె పట్టించడం వల్ల.. జుట్టు కుదుళ్లు బలంగా మారడంతో పాటు మృదువుగా తయారవుతాయి. అంతేకాదు.. తలలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా మారుతుంది. దీనికోసం చేయాల్సిందల్లా కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి.. గోరు వెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా రాత్రి చేసి.. ఉదయాన్నే తలస్నానం చేయాలి.
వేర్వేరు సమస్యలకు నూనె ఎలా అప్లై చేసుకోవాలంటే..
2. విటమిన్ ఇ ఆయిల్ (Vitamin E Oil)
మన కేశ సంరక్షణకు విటమిన్ ఇ ఆయిల్ అనేది.. ఎంతో ఉపయోగకరమైన తైలం. జుట్టు ఎదుగుదలకు ఇది ఎంతో అవసరం. జుట్టు బాగా పెరగాలంటే.. ఐదారు విటమిన్ ఇ క్యాప్సూల్స్ గ్రైండ్ చేసి.. ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెతో మిక్స్ చేయాలి. ఆ తర్వాత దాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత.. ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా, పట్టులా మారుతుంది. ఇలా తరచూ చేస్తే తొందరగా జుట్టు పొడవు పెరిగే అవకాశం కూడా ఉంది.
3. ఆముదం (Castor Oil)
జుట్టు నల్లగా, పొడవుగా మారేందుకు.. మన పూర్వీకుల నుంచి వస్తున్న నూనె ఆముదం. ఇది మన కేశ ఆరోగ్యానికి ఎంతో మంచిది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. తొలుత కేశాలకు ఆముదం బాగా పట్టించి.. తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్ని జుట్టుకు చుట్టాలి. అలా అరగంట పాటు ఉంచిన తర్వాత తలస్నానం చేయాలి. లేదా అలాగే ఉంచుకోవచ్చు. ఆముదం జిడ్డుగా లేకుండా ఉండేందుకు కావాలంటే.. అందులో కాస్త నిమ్మరసం కలపవచ్చు.
4. బాదం నూనె (Almond Oil)
బాదంలో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతాయి. దీనికోసం బాదం నూనెను రాత్రిపూట.. జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకొని ఉదయం తలస్నానం చేస్తే సరి.
5. లావెండర్ ఆయిల్ (Lavender Oil)
సాధారణంగా లావెండర్ నూనెను ఎస్సెన్షియల్ ఆయిల్గా తలనొప్పి, ఒత్తిడి వంటివి తగ్గించేందుకు ఉపయోగిస్తారు. కానీ ఇదే నూనెను కేశాల పొడవు పెరిగేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని.. అందులో నాలుగైదు చుక్కల లావెండర్ నూనె వేసి తలకు అప్లై చేయాలి. ఆ తర్వాత కాస్త మసాజ్ చేసుకోవాలి. ఆ పైన షవర్ క్యాప్ పెట్టుకొని.. గంటసేపు ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
6. జొజొబా ఆయిల్ (Jojoba Oil)
జొజొబా నూనె కూడా ఎస్సెన్షియల్ ఆయిలే. ఇది మన ఒత్తిడిని తగ్గించేందుకే కాదు.. జుట్టుని, చర్మాన్ని మృదువుగా మార్చేందుకు కూడా తోడ్పడుతుంది. దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో.. టీ స్పూన్ జొజొబా నూనె కలిపి తలకు పట్టించాలి. దీన్ని రాత్రంతా ఉంచుకొని.. మర్నాడు ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.
7. ఆలివ్ నూనె (Olive Oil)
హార్మోన్ల తేడాతో జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారు.. ఆలివ్ నూనెను వాడితే మంచిది. ఇది జుట్టును రాలకుండా చేయడంతో పాటు.. దానిని మెత్తగా పట్టులా మారుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. దీనికోసం ఆలివ్ ఆయిల్‌ని తలకు బాగా పట్టించి.. వేడి నీటిలో ముంచిన టవల్ని తలకు చుట్టాలి. ఇలా కాసేపు ఉంచుకొని తర్వాత మామూలుగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు.
ఇవే కాదు.. సేజ్ ఆయిల్, రోజ్ మేరీ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వంటి నూనెలు కూడా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో తోడ్పడతాయి.
ఆహారం ముఖ్యం.. (Food For Hair Growth)
ఇన్ని చిట్కాలు పాటించినా.. మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోతే జుట్టు పెరగదు. ఒకవేళ పెరుగుదల ఉన్నా జుట్టు ఎక్కువగా.. త్వరగానే రాలిపోతుంది. అందుకే ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఇందులో భాగంగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వేయించిన కూరలు, ప్రాసెస్డ్ ఫుడ్, కొవ్వు పదార్థాలను తినకుండా ఉండాలి.
అంతేకాదు.. విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ధాన్యాలు వంటివి ఎక్కువగా తినాలి. జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్ పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారంలో ఉంటుంది. వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే మీ జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పొడుగ్గా, మెరుస్తూ కూడా కనిపిస్తుంది.
తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు (FAQ’s)
1. నాకు పొడుగు జుట్టంటే ఎంతో ఇష్టం. కానీ నా జుట్టు చివర్లు చిట్లుతున్నాయి. దీనివల్ల నా జుట్టు పెరగడం ఆగుతుందా?
సాధారణంగా చివర్లు చిట్లడం వల్ల జుట్టు పొడవుగా పెరగడం ఆగదు. జుట్టు పెరుగుదలకు చిట్లడానికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే జుట్టు పెరుగుదల కంటే వేగంగా జుట్టు చివర్లు చిట్లడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. పెరుగుదల కంటే డ్యామేజ్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు పెరిగే వేగం తగ్గిపోతుంది. అందుకే జుట్టు చిట్లడాన్ని నివారించేందుకు అప్పుడప్పుడూ జుట్టును ట్రిమ్ చేస్తుండాలి.
2. జుట్టు కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా?
జుట్టు కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందని కేవలం ఓ అపోహ మాత్రమే. అయితే జుట్టు డ్యామేజ్ అవుతున్నప్పుడు దాన్ని తగ్గించేందుకు జుట్టును ట్రిమ్ చేయడం వల్ల జుట్టు అందంగా కనిపించడంతో పాటు డ్యామేజ్ ఉండదు కాబట్టి జుట్టు వేగంగా పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే కేవలం కట్ చేయడం వల్లే జుట్టు వేగంగా పెరుగుతుందన్నది మాత్రం నిజం కాదు. కట్ చేసినా లేకపోయినా జుట్టు పెరుగుతూనే ఉంటుంది.
3. ఈ హెయిర్ ప్యాక్స్ అందరికీ పనిచేస్తాయా? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
ఈ హెయిర్ ప్యాక్స్ అన్నీ సహజమైనవి మాత్రమే కాబట్టి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కానీ ఒకవేళ మీకు ఒక పదార్థం పడకపోతే దానితో తయారుచేసిన ప్యాక్స్ మాత్రం ఉపయోగించకపోవడం మంచిది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
4. పొడవైన జుట్టు పొందేందుకు ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా మన జుట్టు నెలకు అర అంగుళం మేరకు పెరుగుతుంది. అయితే డ్యామేజ్ వల్ల పొడుగ్గా పెరగడం ఆగిపోతుంది. అందుకే డ్యామేజ్ లేకుండా చూసుకుంటూ జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చూసుకుంటే చాలు. సంవత్సరానికి ఆరు అంగుళాల వరకూ పెరుగుతుంది. అయితే జుట్టు పొడుగ్గా పెరగడానికి మీ జన్యువులు కూడా కారణమవుతుంది. మీ అమ్మ, నానమ్మ, అమ్మమ్మల్లో ఎవరికీ పొడుగు జుట్టు లేకపోతే మీ జుట్టు కూడా అంత పొడవుగా పెరిగే వీలుండకపోవచ్చు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ
కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !
ఇవి కూడా చదవండి.
ఇలా చేస్తే మీ పొట్టి జుట్టు కూడా.. పొడుగ్గా కనిపిస్తుంది..!
జుట్టు రాలుతోందా? అయితే మీకోసమే ఈ పరిష్కార మార్గాలు..!
31 రోజులు.. 31 హెయిర్‌స్టైల్స్.. నెలలో ప్రతిరోజూ కొత్తగా కనిపించండిలా..!