ADVERTISEMENT
home / Family
#ToMaaWithLove కంటేనే అమ్మ అని అంటే ఎలా?? క‌రుణించే ప్ర‌తి దేవ‌త అమ్మే క‌దా

#ToMaaWithLove కంటేనే అమ్మ అని అంటే ఎలా?? క‌రుణించే ప్ర‌తి దేవ‌త అమ్మే క‌దా

(కంటేనే అమ్మ అని అంటే ఎలా?? క‌రుణించే ప్ర‌తి దేవ‌త అమ్మే క‌దా.. అన్నాడో సినీక‌వి. సినిమాలో ఇది ఆయా స‌న్నివేశానికి త‌గ్గ‌ట్లుగా పెట్టిన పాటే అయినా.. నిజ‌జీవితంలోనూ ఈ వాక్యాల‌ను అక్ష‌ర సత్యం అని నిరూపించే అమ్మ‌లు మ‌న‌కు తార‌స‌ప‌డుతూనే ఉంటారు.

ముఖ్యంగా నాలాంటి అదృష్ట‌వంతుల‌కు అయితే అత్త రూపంలోనూ అమ్మ దొరుకుతుంది. అందుకే ఈ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మా అమ్మ‌తో పాటు.. మా అత్త‌గారికి కూడా నా మ‌న‌సులో ఉన్న మాట‌ను తెలియ‌జేస్తూ ఓ ఉత్త‌రం రాద్దామ‌ని నిర్ణ‌యించుకున్నా)

ప్రియ‌మైన అత్త‌మ్మ‌కు..

అత్త లేని కోడ‌లు ఉత్త‌మురాలు.. కోడ‌లు లేని అత్త గుణ‌వంతురాలు.. అని అంటారు. అలా ఎందుకు అన్నారో నాకు తెలీదు కానీ మిమ్మ‌ల్ని చూసిన ఎవ్వ‌రైనా ఆ మాట‌ల్లో నిజం లేద‌ని ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే పుట్టింట్లో 25 ఏళ్లు అపూరూపంగా పెరిగి.. మెట్టినింట అడుగుపెట్టి ఐదేళ్లు కావ‌స్తున్నా నాకు ఇప్ప‌టికీ రెండు ఇళ్లూ ఒకేలా అనిపిస్తాయి. మీరు పంచే ప్రేమ‌, అప్యాయ‌త‌, అనురాగం, అభిమానం.. ప్ర‌తి విష‌యంలోనూ మా అమ్మ‌ని త‌ల‌పిస్తాయి. ఇక నాకు ఆ తేడా ఎలా తెలుస్తుంది మీరే చెప్పండి?

ADVERTISEMENT

ఒక అమ్మాయిని ఎలా గౌర‌వించాలి? త‌న‌తో ఎలా మెల‌గాలి?? ఒక మంచి భ‌ర్త అనిపించుకోవాలంటే ఏ విధంగా ఉండాలి.. ఇలాంటి విష‌యాల‌తో పాటు మ‌హిళ‌లంద‌రి విష‌యంలోనూ ఎలా వ్య‌వ‌హ‌రించాలో మీ అబ్బాయికి మీరు చిన్న‌ప్ప‌ట్నుంచీ చ‌క్క‌గా నేర్పించారు. అంత‌టి చ‌క్క‌ని పెంప‌కానికి ఒక అమ్మాయిగా నేను మీకు దాసోహం అవ్వాల్సిందే. ఇక మీ కోడ‌లిగా ఇందుకు మీకు నేను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటా.

సాధార‌ణంగా పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయ‌ని, ఆమె ప్రాధాన్యాలు సైతం మారిపోతాయ‌ని పెళ్లికి ముందు నేను చాలాసార్లు విన్నాను. కొందరి స్నేహితుల విషయంలో ప్ర‌త్య‌క్షంగా చూశా కూడా. కానీ నాకు పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టింది.. మొద‌లు మా అమ్మ‌లానే మీరు కూడా న‌న్ను చూసుకుంటూ వ‌చ్చారు. నాకు పూర్తి స్వేచ్ఛ, స్వ‌తంత్రాలు అందించి నా ప్రాధాన్యాల‌కు విలువ‌నిచ్చి న‌న్ను ఎంత‌గానో గౌర‌వించారు.

ఇలాంటి అదృష్టం చాలా త‌క్కువ‌మంది అమ్మాయిల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంది. వారిలో న‌న్నూ ఒక‌రిని చేసినందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు. ఒక మ‌హిళ త‌న జీవితంలో ఎన్నో ద‌శ‌ల‌ను దాటుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ క్ర‌మంలో ఓ కూతురిగా, ఓ భార్య‌గా, ఓ కోడ‌లిగా, ఓ అమ్మ‌గా.. ఇలా ఎన్నో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. ఇన్ని బాధ్య‌త‌ల న‌డుమ కుటుంబ స‌భ్యులంద‌రినీ చూసుకుంటూనే మీ అభిరుచుల‌కు కూడా మీరు స‌మ‌యం కేటాయించుకుంటూ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దునుపెట్టుకోవ‌డం నిజంగా చాలా గొప్ప విష‌యం.

అన్నింటినీ మించి నేను కోరుకున్న రంగంలో మ‌రింత ఎదిగేలా న‌న్ను అనుక్షణం వెంట ఉండి ప్రోత్స‌హించారు. కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా నేను నా కెరీర్‌కు దూరం కాకూడ‌ద‌ని నా పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు కూడా మీరే తీసుకున్నారు. వారిని నాన్న‌మ్మ‌గా సంర‌క్షిస్తూనే త‌ల్లిలా ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను కూడా పంచుతున్నారు. నేను ఆఫీసుకు వెళ్లి వ‌చ్చేంత‌ర‌కు వారిని కంటికి రెప్ప‌లా కాచుకుంటున్నారు.

ADVERTISEMENT

ఆఫీసు ప‌నుల్లో ఆల‌స్యమై రాత్రి స‌మ‌యాల్లో ఇంటికి ఆల‌స్యంగా వ‌చ్చినా.. తీరిక లేదంటూ ఒక్కోసారి ఆదివారాలు ఇంట్లో ఉండ‌క‌పోయినా.. నన్ను అర్థం చేసుకొని నేను వేసే ప్ర‌తి అడుగులోనూ నాకు తోడు నిలుస్తూ వ‌చ్చారు. మ‌హిళ‌లు ఎందులోనూ తీసిపోర‌ని, పురుషుల‌కు దీటుగా త‌మ‌ని తామూ నిరూపించుకోగ‌ల‌ర‌నే మీ న‌మ్మ‌కాన్ని నా రూపంలో చూసి మురిపోతుంటారు.

అస‌లు ఒక్క మాట‌లో చెప్పాలంటే అమ్మ అంటే మీలా ఉండాల‌నిపించే ఆద‌ర్శం మీ సొంతం. అందుకే మీ నుంచి నేను ప్రేరణ పొందా. భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా నేనూ మీలా స‌మ‌ర్థంగా అన్ని బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తా. ముఖ్యంగా అబ్బాయిల‌ను పెంచే క్ర‌మంలో వారు అమ్మాయిల‌ను గౌర‌వించే విధంగా, లింగ వివ‌క్ష లేకుండా వారు అన్ని విష‌యాల్లోనూ స‌మాన‌త్వం దిశ‌గా ఆలోచించేలా వారిని ప్రోత్స‌హిస్తా.

వీట‌న్నింటినీ మించి నాకు భ‌విష్య‌త్తులో వ‌చ్చే కోడ‌లిని కూడా కూతురిలానే చూస్తూ ఆమెను ప్ర‌తి అడుగులోనూ ప్రోత్స‌హిస్తా. ఇటు కుటుంబ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ, అటు కెరీర్‌లోనూ రాణించాల‌నుకునే ఆడ‌పిల్ల‌ల‌కు ఇంత‌క‌న్నా ఇంకేంకావాలి చెప్పండి.

చివ‌రిగా నేను చెప్పేది ఒక్క‌టే. అత్తింట్లోనూ నాకు ఓ అమ్మ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మీలోనూ మా అమ్మ‌ను చూసుకొంటూ మీరు అందించిన ప్రోత్సాహంతోనే ఇదంతా సాధించా అని గ‌ర్వంగా చెప్తున్నా. ఈ మాతృదినోత్స‌వం (Mothers Day) రోజున మా అమ్మ‌ని త‌లపించే మీకు కూడా మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయాల‌ని ఇలా లేఖ రాస్తున్నా. అత్త‌మ్మ అని పిలిచినా మిమ్మ‌ల్ని నాకు దేవుడిచ్చిన మరో అమ్మ‌గానే భావిస్తా. అందుకే ఓ కోడ‌లిగా, కూతురిగా మీకు కూడా మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెబుతున్నా.

ADVERTISEMENT

హ్యాపీ మ‌ద‌ర్స్ డే అత్త‌మ్మ‌..

ఇట్లు,
ప్రేమ‌తో
మీ కోడ‌లు

Featured Image: Shutterstock

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

“మదర్స్ డే” సందర్భంగా.. అమ్మ ప్రేమను తెలిపే సినీ గీతాలు మీకోసం (Mothers Day Special Songs)

“మదర్స్ డే” సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు మీకు ప్రత్యేకం (Mothers Day Special Movies)

#ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?

11 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT