#ToMaaWithLove "మదర్స్ డే" సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు మీకు ప్రత్యేకం

#ToMaaWithLove "మదర్స్ డే" సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు మీకు ప్రత్యేకం

"అమ్మను మించిన దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే" అని అమ్మ గురించి చాలా చక్కగా వివరించాడు ఓ సినీ కవి.


నిజం చెప్పాలంటే తెలుగు సినిమాల్లో అమ్మ ప్రేమ గురించి.. వైవిధ్యమైన రీతిలో, తమదైన శైలిలో దర్శకులు రూపొందించిన చిత్రాలు అనేకం ఉన్నాయి. మదర్ సెంటిమెంట్‌తో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసిన ఇలాంటి చిత్రాల్లో.. కొన్నింటిని గురించి "మదర్స్ డే" (Mothers Day) సందర్భంగా మనమూ తెలుసుకుందాం..!


matrudevabhava-1


మాతృదేవోభవ - కె.అజయ్ కుమార్ దర్శకత్వంలో నాజర్, మాధవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం పూర్తి స్థాయి మదర్ సెంటిమెంట్‌తో కూడుకున్న సినిమా. తన భర్త చనిపోయాక.. క్యాన్సర్ బారిన పడిన ఓ ఇల్లాలు.. తన పిల్లలను దత్తత ఇచ్చే క్రమంలో పడే ఆవేదనను ఈ చిత్రంలో చాలా హృద్యంగా చూపించారు దర్శకులు. మదర్స్ డే సందర్భంగా తల్లీ, బిడ్డల అనుబంధాన్ని పరిపుష్టంగా చూపించే ఈ సినిమాని కచ్చితంగా చూడాల్సిందే.


amma-rajeenama-1


అమ్మా రాజీనామా - దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అమ్మ కథను కొత్త కోణంలో చూపించిన సినిమా. సంసార బాధ్యతలను వెన్నంటే మోసే అమ్మ.. కొన్నాళ్లు బిడ్డలకు బాధ్యతలను గుర్తుచేసే ఉద్దేశంతో.. తాను బాధ్యతల నుండి తప్పుకుంటే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం ఈ చిత్రం.


ఈ చిత్రంలో అమ్మ పాత్రలో నటించిన శారద.. ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశారు అని చెప్పవచ్చు. మదర్స్ డే సందర్భంగా ఈ చిత్రం చూస్తే.. అమ్మ పై మీకున్న మమకారం మరో వెయ్యి రెట్లు పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


amma-nanna-tamilammayi


అమ్మా.. నాన్న.. ఓ తమిళ అమ్మాయి - కిక్ బాక్సర్ అవ్వాలనే ఓ యువకుడికి.. తల్లి అందించే ప్రేరణ.. అంతకు మించి బెస్ట్ ఫ్రెండ్స్‌గా వారి మధ్య సాగే స్నేహబంధాన్ని వైవిధ్యంగా చూపించిన చిత్రం "అమ్మా.. నాన్న.. ఓ తమిళ అమ్మాయి".


ఈ చిత్రంలో తల్లి పాత్రలో జయసుధ, కొడుకు పాత్రలో రవితేజ నటించారు. మదర్స్ డే సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన సినిమా ఇది.


yama-leela-1


యమలీల - తన తల్లి ప్రాణాలను దక్కించుకోవడం కోసం సాక్షాత్తు యముడితోనే పేచీకి దిగిన.. ఓ కుర్రాడి కథ "యమలీల". ఎస్వీ క్రిష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో  తల్లి పాత్రలో మంజుభార్గవి, కొడుకు పాత్రలో ఆలీ నటించడం విశేషం.


chatrapathi-1


ఛత్రపతి - చిన్నప్పుడు తన నుండి దూరమైన పెంపుడు కొడుకు కోసం.. జీవితాంతం ఎదురుచూసే ఓ అమ్మ కథ "ఛత్రపతి". ఈ చిత్రంలో తల్లిపాత్రలో భానుప్రియ నటించగా.. కొడుకు పాత్రలో ప్రభాస్ నటించడం గమనార్హం.


మదర్ సెంటిమెంట్‌ని హైలెట్ చేస్తూ.. ఈ సినిమాలో రూపొందించిన కొన్ని సన్నివేశాలు.. ప్రేక్షకుల భావోద్వేగాలకు కూడా పరీక్ష పెడతాయనడంలో సందేహం లేదు.


amma-cheppindi-1


అమ్మ చెప్పింది - మానసిక ఇబ్బందులతో బాధపడే ఓ కుర్రాడికి.. తన తల్లి అందించే ప్రేరణ ఏ విధంగా ఒక రాకెట్ సైన్స్ అడ్వెంచర్ చేయడానికి పురిగొల్పుతుందో చెప్పిన చిత్రమే  "అమ్మ చెప్పింది". ఈ చిత్రంలో కొడుకు పాత్రలో శర్వానంద్, తల్లి పాత్రలో సుహాసిని నటించిన తీరు అద్భుతమే అని చెప్పవచ్చు. గంగరాజు గుణ్ణం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


loafer-1


లోఫర్ - చిన్నప్పుడే తన తల్లికి దూరమైన ఓ కొడుకు.. పాతికేళ్ల తర్వాత మళ్లీ తనను వెతుక్కుంటూ రావడమే ఈ చిత్రకథ. ఈ చిత్రంలో తల్లి పాత్రలో రేవతి నటించగా.. కొడుకు పాత్రలో వరుణ్ తేజ్ నటించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. రేవతి, వరుణ్‌ల నటనకు మంచి మార్కులే పడ్డాయి.


abhishekam-1


అభిషేకం- ఎస్వీ క్రిష్ణారెడ్డి నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మదర్ సెంటిమెంటే ప్రధానంగా సాగుతుంది. చిన్నప్పుడే మతి స్థిమితం కోల్పోయిన ఓ తల్లి  ఆలనా పాలనను ఓ బిడ్డ ఎలా చూస్తాడు.. ఆమెను మామూలు మనిషిని ఎలా చేస్తాడు అన్నది సినిమా ప్రధాన కాన్సెప్ట్.


అయితే పెద్దయ్యాక.. క్యాన్సర్ బారిన పడిన అదే కొడుకు తన తల్లికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఏం చేస్తాడన్నదే ఈ చిత్రకథ. ఈ చిత్రంలో తల్లి పాత్రను రాధిక పోషించగా.. కొడుకు పాత్రను ఎస్వీ క్రిష్ణారెడ్డి పోషించారు.


bichagadu-1


బిచ్చగాడు - తమిళ చిత్రం పిచైకరన్ చిత్రాన్ని.. తెలుగులో "బిచ్చగాడు" పేరుతో డబ్ చేశారు. విజయ్ ఆంటోని నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక చిత్రమైన కాన్సెప్ట్‌తో నడుస్తుంది.


అనారోగ్యం బారిన పడ్డ తన తల్లి వేగంగా కోలుకొనేందుకు.. కొన్ని రోజులు బిచ్చగాడిగా మారాలని వ్రతదీక్ష చేపట్టిన ఓ కొడుకు కథే ఈ చిత్రం. ఈ చిత్రంలో దీపా రామానుజం తల్లి పాత్రలో నటించారు.


మరెన్నో చిత్రాలు - ఇలా చెప్పుకుంటూ పోతే మదర్ సెంటిమెంట్‌తో రూపొందిన తెలుగు చిత్రాలు అనేకం ఉన్నాయి. అమ్మ, ఓ అమ్మ కథ, మదరిండియా, అమ్మ లేని పుట్టిల్లు,  అమ్మకోసం మొదలైన చిత్రాలు కూడా తల్లి సెంటిమెంట్‌ని చూపించిన చిత్రాలే. ఈ చిత్రాలన్ని కూడా మదర్స్ డే స్పెషల్సే.


ఇవి కూడా చదవండి


#ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?


మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ గురించి.. అమ్మ చేసే కామెంట్లు ఎలా ఉంటాయంటే..!


 #ToMaaWithLove 'మదర్స్ డే' కానుకగా.. ఈ స్టార్ రెస్టారెంట్లకు అమ్మను తీసుకెళదాం..!