అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాతో అక్కినేని హీరోకి కలిసొచ్చేనా??

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాతో అక్కినేని హీరోకి కలిసొచ్చేనా??

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా త్రివిక్రమ్ (Trivikram) చిత్రంలో నటిస్తున్న విషయం మనకు విదితమే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి మొన్నటివరకు ఓ వార్త మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అదేంటంటే.. అక్కినేని నాగేశ్వరరావు మనవడైన సుశాంత్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. తాజాగా సుశాంత్ చేసిన ఓ ట్వీట్‌తో ఈ వార్త నిజమేనని తేలిపోయింది. ఇంతకీ ట్విట్టర్‌లో సుశాంత్ ఏమని చెప్పుకొచ్చారంటే..


"#AA19 సెట్స్‌లో నా మొదటి రోజు..


ఈ సినిమా గురించి ఇప్పుడే నేను ఏ వివరాలు చెప్పలేను. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ర్. ఆర్య సినిమా మొదలుకొని.. నేను ఎంతో ఇష్టపడే అల్లు అర్జున్, పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టబు, నా ఫ్రెండ్ పూజ, పీఎస్ వినోద్ గారు, తమన్, మొదలైనవారితో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కని అవకాశాన్ని నాకు అందిస్తూ, నన్ను కూడా ఈ సినిమాలో భాగం చేసుకున్నందుకు గీతా ఆర్ట్స్ & హారిక - హాసిని క్రియేషన్స్ వంటి పెద్ద సంస్థలకు నా ధన్యవాదాలు.


చి.ల.సౌ సినిమా తర్వాత నేను చేస్తున్న మరో కొత్త అడ్వంచర్ ఇది. ఈ కొత్త ప్రయాణంలో నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని భావిస్తున్నాను..’’ - అంటూ తన మనసులో ఉన్న భావాలకు అక్షరరూపం ఇచ్చాడు.


గతేడాది చి.ల.సౌతో హిట్ కొట్టిన తర్వాత.. సుశాంత్ ఏ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని అంతా ఆత్రంగా ఎదురుచూస్తుంటే; నచ్చిన కథ వస్తేనే సినిమా చేద్దామని తను కూల్‌గా ఉన్నాడు. అదీకాకుండా ఇప్పటివరకు తనని తాను హీరోగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ.. భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్న సుశాంత్ ఉన్నట్లుండి ట్రాక్ మార్చాడా? లేక అల్లు అర్జున్ చిత్రంలో సుశాంత్ నటించనున్న పాత్ర అంత కీలకమైందా? అంటూ అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి.


 వీటికి తోడు ఈ సినిమాలో సుశాంత్ నటించనున్న పాత్ర గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా బాలీవుడ్‌లోని సోను కే టీటు కి స్వీటీ చిత్రానికి (Sonu Ke Tittu Ki Sweety) రీమేక్ అంటూ మొన్నటివరకు వార్తలు రావడం గమనార్హం. అదే నిజం అయితే సుశాంత్ పాత్ర గురించి మనకు ఓ క్లూ దొరికినట్లే. అలాగే అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో సుశాంత్ కనిపించే అవకాశాలున్నాయి. కానీ  ఇది ఊహాగానమే అయితే.. ఈ పాత్ర పై క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది.  


ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ఇటీవలే సినిమా రెండో షెడ్యూల్ పూర్తయింది. కనుక దర్శక - నిర్మాతలు వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.


ఇక సుశాంత్ కెరీర్‌ని ఓసారి పరిశీలిస్తే.. 2008లో కాళిదాసు (Kalidasu) సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ యువహీరో.. ఆ తర్వాత కరెంట్‌తో ఓ మోస్తరు హిట్‌ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత విడుదలైన అడ్డా, ఆటాడుకుందాం రా.. చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.


అయితే గతేడాది విడుదలైన చి.ల.సౌ మాత్రం సుశాంత్ కెరీర్‌లో చక్కని హిట్‌గా నిలవడమే కాదు.. ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది. ఈ క్రమంలో దీని తర్వాత ఎలాంటి కథతో సుశాంత్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ తరుణంలో బన్నీ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్త మరింత ఆసక్తిని రేపింది. మరి, ఈ పాత్ర ఆయన కెరీర్‌కు ఎంత వరకు ప్లస్ అవుతుంది? ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది?? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే..


ఇవి కూడా చదవండి


 దొరసాని.. మల్లేశం.. ఫలక్‌నామా దాస్ ... తెలుగులో మొదలైన "ఆఫ్ - బీట్" సినిమాల ట్రెండ్..!


అతని వయసు 50.. ఆమె వయసు 25.. చిత్రమైన ప్రేమకథలో "విక్టరీ వెంకటేష్"


తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 'దొరసాని' చిత్రం.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ ..!