తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 'దొరసాని' చిత్రం.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ ..!

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో  'దొరసాని' చిత్రం.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ ..!

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'దొరసాని' (Dorasani). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ ప్రారంభంలోనే సినిమా టైటిల్‌కు తగ్గట్లుగా ఈ చిత్ర కథ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోందని స్పష్టంగా అర్థమైపోతుంది.


దొరసాని, ఘడి.. వంటి పదాలు మనకు ఈ టీజర్‌లో ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఈ సినిమా కేవలం ఆనంద్ దేవరకొండ ఒక్కడికే మొదటి చిత్రం కాదు.. కథానాయికకు కూడా తొలి చిత్రమే..


ఈ చిత్రంలో దొరసాని దేవకి పాత్రలో మనకు కనిపించే అందాల బొమ్మ ఎవరో కాదు.. జీవిత - రాజశేఖర్‌ల (Jeevitha - Rajasekhar) ముద్దుల కుమార్తెల్లో ఒకరైన శివాత్మిక (Shivathmika). పాత్రకు తగ్గట్లుగా పట్టు లంగా ఓణీలో, అమాయకపు చూపులు, చూపుతిప్పుకోలేని అందంతో అందరినీ ఆకర్షిస్తోందీ ముద్దుగుమ్మ. 


ఒక స్టార్ హీరో తమ్ముడు, ప్రముఖ హీరో- హీరోయిన్‌ల కుమార్తె కలిసి ఒకే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారంటే.. ఆ సినిమా పై ఏ స్థాయి ఆసక్తి ఉంటుందో చెప్పనవసరం లేదు. కానీ ఎలాంటి హడావుడి లేకుండా.. ఈ చిత్ర షూటింగ్ చాలా సైలెంట్‌గా జరగుతోందని వినికిడి. అదీకాకుండా టీజర్ లాంచ్‌కి కూడా అంత హంగామా ఏమీ లేదు. చాలా సింపుల్‌గా దీనిని విడుదల చేశారు.


ఈ సినిమా టీజర్ విషయానికొస్తే.. ప్రారంభంలోనే ‘చిన్న దొరసాని ఘడి నుంచి బయటకే రాదు..’ అంటూ తెలంగాణ మాండలికంలో మనకు డైలాగ్స్ వినిపిస్తాయి. దీనికి తోడు స్క్రీన్ పై మనకు కనిపించే మనుషులు, పరిసరాలు కూడా ఆ కాలానికి తగ్గట్లుగానే ఉంటాయి.


టీజర్ మొత్తాన్ని చూస్తే.. ఊరిలో ఉండే ఓ ఘడీ.. అందులో ఓ దొరసాని.. ఓ సామాన్యుడు ఆమెను ప్రేమించడం.. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం ప్రేమించుకోవడం.. వారి విషయం పెద్దలకు తెలిసిన తర్వాత ఏం జరిగింది?? అనే అంశాల చుట్టూనే ఈ కథ అల్లుకున్నట్లు అర్థమవుతోంది. అయితే టీజర్‌లోనే కథను సుమారుగా చెప్పేసిన దర్శకుడు.. మరి సినిమాలో ఏం చూపించనున్నాడు?? అనే ఆత్రుత కూడా ప్రేక్షకుల్లో మొదలైపోయింది.


ఇక, ఈ టీజర్‌లో మనకు వినిపించే సంభాషణలు కొన్ని-


"నేను చిన్న దొరసానని ప్రేమిస్తాన రా... అంటే!! దొరసాని కూడా నన్ను జూతాంది!


దొరసాని ప్రేమిత్తాందా? ఎవలకన్నా జేప్పేవ్!! నిజమే అనుకుంటర్..


నీ పేరు??


రాజు ...


మీరు దొరసాని... కాదు.. దేవకి...


కాదు.. మీరు నా దొరసాని!!"

Subscribe to POPxoTV

ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) రచన, దర్శకత్వ బాధ్యతలు వహిస్తుండగా; మధుర శ్రీధర్ (Madhura Sreedhar) & యశ్ రంగినేని (Yash Rangineni) కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు  సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో.. ఈ సినిమాలో సురేష్ ప్రొడక్షన్స్  కూడా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.


తెలంగాణ గ్రామీణ నేపథ్యానికి చెందిన కథ కావడంతో ఈ చిత్రానికి సుప్రసిద్ధ కవి, రచయిత గోరేటి వెంకన్న కొన్ని పాటలు రాయగా; మరికొన్ని పాటలను రామజోగయ్య శాస్త్రి, చైతన్య రాశారు. ఇక సంగీతం విషయానికొస్తే.. ప్రశాంత్ విహారి స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రాన్ని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక- నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


తెలంగాణ నేపథ్యంలో సాగే కథలు, చిత్రాలు ఈ మధ్య విరివిగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన మల్లేశం సినిమా ట్రైలర్ కూడా ఈ మధ్యే విడుదలైన విషయం మనకు విదితమే.


ఇది నల్గొండ జిల్లా వాసైన చింతకంది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం. ఇప్పుడు దొరసాని చిత్రం టీజర్ విడుదల కావడంతో.. ఈ జాబితాలో మరో చిత్రం కొత్తగా చేరిందని అర్థమవుతోంది.


తాజాగా విడుదలైన దొరసాని టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయంటూ చాలామంది కితాబు కూడా ఇస్తున్నారు. మరి, అంతగా అందరినీ ఫిదా చేసేస్తోన్న దొరసాని టీజర్‌ని మీరూ ఓసారి చూసేయండి..


ఇవి కూడా చదవండి


అతని వయసు 50.. ఆమె వయసు 25.. చిత్రమైన ప్రేమకథలో "విక్టరీ వెంకటేష్"


#Metoo తమిళ నటి పై లైంగిక వేధింపులు.. విజయ్ దేవరకొండ చిత్రంలో ఛాన్స్ ఇస్తానన్న దర్శకుడు


హిరణ్యకశ్యపుడిగా అప్పట్లో "ఎస్వీఆర్".. ఇప్పుడు మన భళ్లాలదేవుడు "దగ్గుబాటి రానా"