అతని వయసు 50.. ఆమె వయసు 25.. చిత్రమైన ప్రేమకథలో "విక్టరీ వెంకటేష్"

అతని వయసు 50.. ఆమె వయసు 25.. చిత్రమైన ప్రేమకథలో "విక్టరీ వెంకటేష్"

ఏంటీ టైటిల్ చూసి షాక్ అయ్యారా? పైన చెప్పిన స్టోరీ లైన్‌తో మొన్నీమధ్యనే హిందీలో అజయ్ దేవగన్ (Ajya Devgn) - టబు (Tabu) - రకుల్ ప్రీత్‌లు (Rakul Preet) జంటగా వచ్చిన చిత్రం "దే దే ప్యార్ దే" (De De Pyaar De) విడుదలైంది. ఈ చిత్రంలో హీరో తనకన్నా సగం వయసులో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. అలా తనకన్నా వయసులో చిన్నదైన కథానాయికతో ప్రేమలో పడితే.. ఆ హీరో ఎదుర్కొనే పరిణామాలు, కుటుంబంలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. 


అయితే ఈ సినిమాలోని సన్నివేశాల్లో సందర్భోచిత హాస్యాన్ని పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరో, ఇద్దరు హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో హాస్యానికి మంచి స్కోప్ దక్కింది. ఇక బాక్స్ ఆఫీస్ పరంగా కూడా సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి.


సెటైరికల్ లవ్ స్టోరీస్ రాయడంలో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న లవ్ రంజన్ (Luv Ranjan).. ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. ప్రముఖ ఎడిటర్ అకివ్ అలీ (Akiv Ali) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


అయితే 'దే దే ప్యార్ దే' చిత్రాన్ని చూస్తే.. ఎవరికైనా అజయ్ దేవగన్ పోషించిన పాత్రకి టాలీవుడ్‌లో (Tollywood) వెంకటేష్ (Venkatesh) కూడా సరిగ్గా సరిపోతాడు అని అనిపించవచ్చు. ఎందుకంటే ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్రల్లో ఇప్పటికే వెంకటేష్ చాలా సినిమాల్లో నటించాడు.  ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ప్రేమతో.. రా, సుందరకాండ లాంటి చిత్రాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 


ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అచ్చం అలాంటి పాత్రే వెంకీకి దక్కింది! అందుకే 'దే దే ప్యార్ దే' కథ తనకి బాగా నప్పుతుందని ఏరి కోరి మరీ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చెప్పడం జరిగింది.


అయితే 'దే దే ప్యార్ దే' సినిమాలోని హీరోయిన్లు  టబు, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఇద్దరూ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నవారే కావడం గమనార్హం. టబు, వెంకటేష్ ఇద్దరూ కలిసి గతంలో కూలీ నెంబర్ 1 లాంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కనుక 'దే దే ప్యార్ దే' రీమేక్‌లో కూడా ఈ ఇద్దరే చేస్తారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


అలాగే ఒకరకంగా ఈ చిత్రంతో రకుల్ ప్రీత్‌కి బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ దక్కిందనే చెప్పాలి. కానీ తెలుగు రీమేక్‌లో ఆమె నటిస్తుందో లేదో తెలియదు. ఈ తెలుగు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. 


మొత్తానికి వెంకటేష్... చాలా రోజుల తరువాత ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే హీరో పాత్ర చేయబోతున్నాడు అనే విషయం తెలిసి.. ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే వెంకటేష్ చేసిన రీమేక్స్‌లో అధిక శాతం హిట్ కావడమే అందుకు కారణం. 


ఒకసారి ఆయన కెరీర్‌లో చేసిన రీమేక్ చిత్రాలను పరిశీలిస్తే - భారతంలో అర్జునుడు, బ్రహ్మపుత్రుడు, టూ టౌన్ రౌడీ, చంటి, చినరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు, పోకిరి రాజా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం, రాజా, శీను, జెమిని, ఘర్షణ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లి, మసాలా, దృశ్యం, గోపాల గోపాల, గురు... ఇలా ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. 


ఈ పైన పేర్కొన్న చిత్రాల్లో దాదాపు 80 శాతానికి పైగా హిట్స్ ఉన్నాయి. అందుకనే ఆయన రీమేక్ చేస్తున్నాడు అంటే చాలు ..దాదాపుగా ఆ సినిమా హిట్ అవుతుందనే టాక్ వినపడుతుంది.


ప్రస్తుతం వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆ తర్వాత 'దే దే ప్యార్ దే' తెలుగు రీమేక్ పట్టాలెక్కనుందని సమాచారం.


మనం కూడా.. ఈ  'దే దే ప్యార్ దే' చిత్రంతో వెంకటేష్ మంచి హిట్ కొట్టాలని.. అలాగే మరిన్ని విభిన్న పాత్రల్లో నటిస్తూ మనల్ని అలరించాలని కోరుకుందాం.


ఇవి కూడా చదవండి


'విక్టరీ' వెంకటేష్ ముద్దుల కూతురు ఆశ్రిత.. పెళ్లి ముచ్చట్లు మీకోసం..!


హాలీవుడ్ చిత్రం 'అల్లాదీన్'లో జీనీ పాత్రకు.. వెంకీ డబ్బింగ్..!


నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ "వెంకీ మామ" విశేషాలివే..!