ఆ వస్తువులు మనకు తెలియకుండానే.. పర్యావరణానికి హాని చేస్తున్నాయి..!

ఆ వస్తువులు మనకు తెలియకుండానే.. పర్యావరణానికి హాని చేస్తున్నాయి..!

పర్యావరణాన్ని (environment) పరిరక్షించి, కాలుష్యాన్ని తగ్గించే విషయంలో మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. మొక్కలు నాటడం, వాటిని  పెంచి పెద్ద చేయడం, పాలిథీన్ క్యారీ బ్యాగులను ఉపయోగించకపోవడం, ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించడం లాంటివి చేస్తూనే ఉన్నాం.


ఇన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ.. ఏదో ఒక రూపంలో మనం పర్యావరణానికి హాని చేస్తున్నాం. అసలు మనం ఉపయోగించే ఆ వస్తువుల వల్ల.. ఎంతో నష్టం జరుగుతుందని మనకి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ క్రమంలో మన రోజువారీ జీవితంలో.. మనం ఉపయోగించే ఎలాంటి వస్తువులు వల్ల పర్యావరణం దెబ్బతింటుందో ఓసారి తెలుసుకొందాం. వాటి వినియోగాన్ని మనకు మనమే నియంత్రించుకొందాం.


1. సన్ స్క్రీన్


1-things-you-didnt-realise-were-harming-the-environment


మనం ఉపయోగించే సన్ స్క్రీన్‌లో సముద్రజీవులకు హాని కలిగించే పది రకాల విషపదార్థాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటి వల్ల సముద్ర గర్భంలో ఉండే పగడపు దీవులు కరిగిపోతాయి. అందుకే పలావు దేశంలో సన్ స్క్రీన్ ఉపయోగించడాన్ని నిషేధించారు. పూర్తిగా రసాయనాలతో తయారైన సన్ స్క్రీన్ లోషన్లకు బదులుగా ఎకో ఫ్రెండ్లీ కెమికల్ సన్  స్క్రీన్స్ , ఆర్గానిక్ మినరల్ సన్ స్క్రీన్ ఉపయోగించడం మంచిది.


మన శరీరం మీద రాసుకొనే సన్ స్క్రీన్ ఎక్కడో సముద్రంలో ఉండే జీవులకు.. హాని ఎలా కలిగిస్తుందనే అనుమానం మీకు వస్తోంది కదా. యూవీ కిరణాల ప్రభావం మనపై పడకుండా ఉండటానికి రాసుకొనే సన్  స్క్రీన్ పర్యావరణానికి హాని కలిగిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. సాధారణంగా బీచ్ వెకేషన్లకి వెళ్లినప్పుడు కచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకొంటాం. ఆ తర్వాత సముద్రంలో స్నానం చేస్తాం. అలాగే ఇంట్లో సన్ స్క్రీన్ రాసుకొన్నాక.. చర్మాన్ని శుభ్రం చేసుకొన్నప్పుడు అది చివరిగా చేరేది నదులు, సముద్రాల్లోకే కదా.


2. ఫేస్ వాష్


మనలో చాలామందికి రోజుకి రెండు నుంచి మూడు సార్లు ఫేస్ వాష్‌తో ముఖం శుభ్రం చేసుకొనే అలవాటు ఉంటుంది. మీక్కూడా ఆ అలవాటు ఉందా? అయితే మీరు కూడా పర్యావరణానికి (environment) తీరని చేటు చేస్తున్నారు. దీనికి కారణం వీటిలో ఉండే ప్లాస్టిక్ మైక్రోబీడ్స్. ఈ మైక్రోబీడ్స్ అతిగా ఉపయోగించడం వల్ల మీ చర్మానికి మాత్రమే కాదు పర్యావరణానికి సైతం హాని కలుగుతుంది.


సన్నని ఈ ప్లాస్టిక్ బీడ్స్ వల్ల నీరు కలుషితం కావడం మాత్రమే కాదు.  వాటి వల్ల జలచరాలకు సైతం హాని కలుగుతోంది. ఈ మైక్రోబీడ్స్‌ను ఆహారంగా భావించి చేపలు, ఇతర జలచరాలు వాటిని ఆహారంగా తీసుకొంటున్నాయి. దీనివల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఫేస్ వాష్‌లో మాత్రమే కాదు.. టూత్ పేస్ట్‌లోనూ ఈ ప్లాస్టిక్ మైక్రోబీడ్స్ ఉంటాయి.


3. కాంట్రాసెప్టివ్ పిల్స్


3-things-you-didnt-realise-were-harming-the-environment %282%29


కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగించడం వల్ల జనాభా అదుపులో ఉంటుంది. కానీ దీనివల్ల పర్యావరాణం(environment) దెబ్బ తింటుందని 2016లో స్వీడన్‌లో జరిగిన ఓ అధ్యయనం చెబుతోంది. లీనా నికోలెరిస్ అనే పర్యావరణ వేత్త చేసిన అధ్యయనం ప్రకారం కాంట్రాసెప్టివ్ పిల్స్‌లో ఎథినైల్ ఈస్ట్రడియోల్ (EE2) అనే హార్మోన్ ఉంటుంది.


ఇది ఈస్ట్రోజెన్‌కు సింథటిక్ వెర్షన్ లాంటిది. కాంట్రాసెప్టివ్ పిల్స్ వ్యర్థ  పదార్థాలను నీటిలోకి వదలడం వల్ల.. కొన్ని రకాల చేపల జన్యువుల్లో మార్పులు వచ్చినట్లు గుర్తించారు. దీనివల్ల ఆ జాతులు అంతరించిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మొత్తం జీవ వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.


 


4. ఎయిర్ ఫ్రెషనర్లు


మనం ఉపయోగించే వాహనాలు, పరిశ్రమలు, చెట్లు నరికేయడం లాంటి పనుల వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతుందనే విషయం మనకు తెలుసు. మరి మనం ఉపయోగించే ఎయిర్ ఫ్రెషనర్లు సైతం వాతావరణ కాలుష్యానికి (environment pollution) కారణమవుతున్నాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. 2016లో బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ జరిపిన అధ్యయనం ప్రకారం ఆరుబయటే కాదు.. ఇంట్లోనూ కలుషితమైన గాలినే పీలుస్తున్నారని తెలిసింది. ఇంట్లో జరిగే ఈ వాయు కాలుష్యానికి ఎయిర్ ఫ్రెషనర్లే కారణమని నిర్ధారించారు.


ఎయిర్ ఫ్రెషనర్స్‌లో ఉపయోగించే లైమోనెన్ అనే రసాయనమే దీనికి కారణమని తేల్చారు. దీన్ని ఆహారపదార్థాల్లో ప్రత్యేకమైన ఫ్లేవర్ రావడానికి ఉపయోగిస్తారు. చెప్పాలంటే ఇది అంత హానికరమైనది కాదు. కానీ దీనిని గాల్లో ఉంచినప్పుడు ఓజోన్‌తో చర్య జరిపి ఫార్మాల్డిహైడ్‌ను వెదజల్లుతుంది. దీనివల్ల ఆస్తమా, క్యాన్సర్ వంటి సమస్యలు రావొచ్చు.


5. టీ బ్యాగ్స్


5-things-you-didnt-realise-were-harming-the-environment


అవును.. టీ బ్యాగ్స్ కూడా పర్యావరణ కాలుష్యం ఏర్పడటానికి కారణమవుతున్నాయి. అదెలాగంటే.. టీ బ్యాగులను తయారు చేయడానికి 75 శాతం వరకు బయో డీగ్రేడబుల్ పేపర్ ఫైబర్‌ను ఉపయోగిస్తారు. అలాగే కొంత మొత్తంలో పాలీ ప్రొపిలీన్ కూడా  ఉపయోగిస్తారు. ఇది కూడా ప్లాస్టికే. దీనివల్ల టీ బ్యాగ్ వేడి నీటిలో ముంచినా విడిపోకుండా ఉంటుంది.


అయితే ఇటీవలి కాలంలో టీ బ్యాగుల వినియోగం ఎక్కువ కావడం, వాటి తాలూకా చెత్త పేరుకుపోవడం వల్ల పర్యావరణం పెనుముప్పును ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.


6. డియోడరెంట్స్


డియోడరెంట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంటైన ట్రైక్లోజన్ ఉంటుంది. డియోడరెంట్స్‌లో మాత్రమే కాదు.. మనం ఉపయోగించే సబ్బులు, ఇతర క్లీనింగ్ ఉత్పత్తుల్లోనూ ఇది ఉంటుంది. ఇది ఇప్పుడు పర్యావరణానికి ముప్పుగా మారింది. మట్టి, నీరు, చేపల్లో ట్రైక్లోజన్ అవశేషాలు కనిపిస్తున్నాయి.


డియోడరెంట్స్‌లో ఉపయోగించే రసాయనాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతోంది. దీనివల్ల మనుషులు, జంతువులకు ఎలాంటి హాని జరగనప్పటికీ.. జలచరాలకు మాత్రం ప్రాణసంకటంగా మారుతోంది. కాబట్టి  ట్రైక్లోజన్ లేని డియోడరెంట్స్ ఉపయోగించడానికి ప్రయత్నించండి. దీనివల్ల నీటి కాలుష్యాన్ని నివారించవచ్చు.


7. శానిటరీ న్యాప్కిన్స్


7-things-you-didnt-realise-were-harming-the-environment


ఒక వయసుకి వచ్చిన తర్వాత అమ్మాయిల్లో నెలసరులు రావడం సహజం. ఒకప్పుడు నెలసరి సమయంలో పాత వస్త్రాలను ఉపయోగించేవారు. వాటి స్థానంలో ఇప్పుడు శానిటరీ న్యాప్కిన్స్, టాంఫూన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవి రీయూజబుల్ కాదు. పైగా ఏడాదికి కొన్ని వేల టన్నుల శానిటరీ న్యాప్కిన్లను వాడి పారేస్తున్నాం. మన దేశంలో అయితే ఏడాదిలో 432 బిలియన్ల శానిటరీ ప్యాడ్స్ ఉత్పత్తి చేస్తున్నారు.


ఇవి పూర్తిగా డీకంపోజ్ కావడానికి సుమారుగా 500 నుంచి 800 సంవత్సరాలు పడుతుందని అంచనా. పైగా వీటివల్ల భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతాయి. అంటే శానిటరీ న్యాప్కిన్స్ వల్ల పర్యావరణం(environment) ఎంత మేర నాశనం అవుతుందో గుర్తించండి. డిస్పోజబుల్ శానిటరీ న్యాప్కిన్స్‌కు బదులుగా క్లాత్ ప్యాడ్స్, వాషబుల్ పీరియడ్ అండర్ వేర్స్, మెనుస్ట్రువల్ కప్స్ ఉపయోగించడం మంచిది.


ఇవి కూడా చ‌ద‌వండి:
Save Earth Slogans in Hindi
पृथ्वी दिवस का इतिहास


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.