దశాబ్ద కాలం క్రితం తెలుగు చిత్రం ‘కర్తవ్యం’ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి వరకూ గ్లామర్ రోల్స్ పోషించిన.. ఆమె యాక్షన్ స్టార్‌గా మారింది. తెలుగులో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు నాంది పలికింది. ఆమే విజయశాంతి (vijaya shanti). పోలీస్ లాకప్, ఒసేయ్ రాములమ్మ, భారతరత్న, ప్రతిఘటన లాంటి చిత్రాలు ఆమెను ఒక ప్రత్యేక నటిగా తీర్చిదిద్దాయి. కొన్ని పాత్రలను కేవలం లేడీ అమితాబ్ విజయశాంతి మాత్రమే పోషించగలదని నిర్మాతలూ నమ్మారు. ప్రేక్షకులూ ఆమెకు బ్రహ్మరథం పట్టారు.
కానీ పెళ్లయ్యాక.. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాక.. విజయశాంతి సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ 13 ఏళ్ల తర్వాత.. మహేష్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా పలు పత్రికలకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు మీకోసం
ఈ కథనం కూడా చదవండి: ఆయన సినిమాల్లో.. “కథానాయిక పాత్రలు” చాలా స్పెషల్..!
Vijaya Shanti in movie – KARTHAVYAM
“నేను పుట్టింది మద్రాస్. ఆ తర్వాత వరంగల్ జిల్లా రామగుండానికి మా నాన్నగారు కుటుంబంతో సహా తరలివచ్చారు. కానీ ఆయన నా చిన్నప్పుడే చనిపోయారు. 14 ఏళ్లకే నా సినీ కెరీర్ మొదలైంది. భారతీరాజా దర్శకత్వంలో తమిళ చిత్రం ‘కలక్కుల్ ఈరమ్’తో నటనా ప్రస్థానం మొదలైంది. అదే సంవత్సరం విజయనిర్మల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘కిలాడి క్రిష్ణుడు’లో కూడా అవకాశం వచ్చింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాను.
తెలుగులో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాలు చేసినా.. 1985లో విడుదలైన ‘ప్రతిఘటన’ చిత్రం నాకు నిజంగానే ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకోవడం ఓ మరుపురాని అనుభూతి. ఆ సినిమా విడుదలైన మరుసటి సంవత్సరమే నేను నటించిన రేపటి పౌరులు చిత్రానికి ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు రెండూ వచ్చాయి” అని తన కెరీర్ గురించి తెలిపారు విజయశాంతి.
ఈ కథనం కూడా చదవండి: సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!
Vijaya Shanthi in movie Prathighatana
“1990లో ప్రముఖ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ గారి జీవితాన్ని ప్రేరణగా తీసుకొని.. దర్శకులు మోహన్ గాంధీ ఓ చిత్రాన్ని తీయాలని భావించారు. అందులో ప్రధాన పాత్రకు నన్ను తీసుకున్నారు. అదే ‘కర్తవ్యం’. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. కానీ నాకు పెద్ద స్టార్ హోదా కట్టబెట్టిన చిత్రం అదే. ఈ సినిమా హిందీ రీమేక్‌లో కూడా
నేనే నటించాను. ఆ సినిమా చూసిన చాలామంది నన్ను లేడీ అమితాబ్ అన్ని పిలవడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత వరుసగా పోలీస్ పాత్రలే చేశాను. 1997లో దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన “ఒసేయ్ రాములమ్మ” మరో అనుభవం. ఆ సినిమా చూశాక పల్లెల్లో అనేకమంది నన్ను రాములమ్మ అని, రాములక్క అని ప్రేమతో పిలిచేవారు. వారి భావోద్వేగాలు అలా ఉండేవి. అంతకన్నా నాకు ఆనందం ఏముంది” అని చెబుతూ తన మదిలో భావాలను కూడా పంచుకున్నారు విజయశాంతి.
Vijaya Shanti in movie “Osey Ramulamma”
అలాగే విజయశాంతి తన కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు. 1988లో తాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని.. తమది అన్యోన్య దాంపత్యమని పేర్కొన్నారు. తన లైఫ్‌లో తన భర్తే అసలైన హీరో అని చెబుతారామె. తన కష్టనష్టాల్లో తాను ఎప్పుడూ పాలు పంచుకుంటూ ఉంటాడని.. పెళ్లై 32 ఏళ్లయినా.. ఇప్పటికీ చాలా సరదాగా, ఆనందంగా తాము కలిసి జీవిస్తున్నామని తెలిపారు విజయశాంతి.
ఇక రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని భావించిన తరుణంలో.. పిల్లలను కూడా తాము వద్దనుకున్నామని.. నిజాయతీగా కొన్ని పనులు చేయాలంటే.. కొన్ని వదులుకోవాలని నిర్మోహమాటంగా ఆమె చెప్పడం గమనార్హం. విజయశాంతి మెదక్ నుండి 2009లో లోక్ సభ ఎంపీగా ఎంపికైన సంగతి మనకు తెలిసిందే.
ఈ కథనం కూడా చదవండి: మహిళా క్రికెట్ నేపథ్యంలో.. తొలి తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’
Vijaya Shanti Marriage Photograph
ఒకసారి విజయశాంతి నట జీవితాన్ని పరిశీలిస్తే.. ఆమె ఖాతాలో 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నాలుగు నంది అవార్డులు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించిందామె. హిందీలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అనిల్ కపూర్ వంటి టాప్ హీరోలతో ఆమె నటించింది. తెలుగులో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ చిత్రం.. హిందీ రీమేక్‌లో కూడా విజయశాంతి నటించింది. తెలుగులో రాధిక పోషించిన పాత్రను ఆమె హిందీలో పోషించడం విశేషం.
తెలుగులో అత్యధికంగా చిరంజీవితో కలిసి 19 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విజయశాంతి.. బాలక్రిష్ణతో కలిసి 17 చిత్రాలలో నటించింది. వెంకటేష్‌తో కలిసి శత్రువు, సూర్య ఐపీఎస్, చినరాయుడు మొదలైన చిత్రాలలో నటించింది. దాదాపు అప్పటి కాలంలోని టాప్ హీరోలందరితోనూ నటించిన ఏకైక హీరోయిన్ విజయశాంతి.
2006లో వచ్చిన నాయుడమ్మ, విజయశాంతి నటించిన చివరి స్టైయిట్ చిత్రం. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ ఏ చిత్రానికీ సైన్ చేయలేదు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తన కొత్త సినీ కెరీర్ ప్రారంభించబోతున్నారు విజయశాంతి. చిత్రమేంటంటే.. 1987లోనే ఆమె మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన “కొడుకు దిద్దిన కాపురం”లో.. మహేష్ తల్లిగా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకి తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు విజయశాంతి.