కురులు పట్టులా, మెత్తగా ఉండాలనే మనమంతా కోరుకుంటాం. మిగిలిన రోజుల్లో జుట్టు అందాన్ని కాపాడుకోవడం సులభమే. కానీ వర్షాకాలంలో (rainy season) మాత్రం అది కాస్త కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే వర్షంలో తడవడం వల్ల జుట్టు బిరుసుగా, జిడ్డుగా, పొడిగా మారిపోతుంటుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తిని ఎక్కువగా రాలిపోతుంది. పైగా ఏ సమయంలో కురుస్తుందో తెలియని వర్షంలో కొన్నిసార్లు తడిసిపోతుంటాం. దీనివల్ల కూడా కేశాల (hair) అందం దెబ్బ తింటుంది. వర్షంలో తడిచినా కురుల సౌందర్యం చెక్కు చెదరకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందామా.
1. క్రమం తప్పకుండా తలస్నానం
వానాకాలంలో వర్షం కురిసినప్పుడు మినహా మిగిలిన రోజుల్లో ఉక్కపోత ఉంటుంది. దీనివల్ల శరీరంపైనే కాకుండా స్కాల్ప్ పై సైతం చెమట పడుతుంది. దీనికి దుమ్ము, ధూళి కూడా తోడవడం వల్ల జుట్టు జిడ్డుగా తయారవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. తరచూ తలస్నానం చేయాల్సిందే. దీనికోసం మైల్డ్ షాంపూ ఉపయోగించాల్సి ఉంటుంది. వేసవితో పోలిస్తే.. వర్షాకాలంలో చాలా తక్కువ సార్లే తలను శుభ్రం చేసుకుంటాం. కానీ ఇలా చేయడం సరికాదు. క్రమం తప్పకుండా వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం మంచిది. కురుల సంరక్షణ (Hair care) విషయంలో కచ్చితంగా పాటించాల్సిన నియమం ఇది.
Shutterstock
2. తడి ఆరిన తర్వాతే..
సినిమాల్లో చూపించినట్లు వర్షంలో తడవడం బాగానే ఉంటుంది. కానీ అలా తడవడం వల్ల జుట్టు ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పైగా తడిసిన జుట్టును దువ్వడం, జడ వేసుకోవడం, ముడి వేసుకోవడం, గట్టిగా రబ్బరు పెట్టుకోవడం లాంటివి చేయడం వల్ల జుట్టు తెగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు దీర్ఘకాలంలో జుట్టు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే జుట్టు బాగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి. అలాగే వారానికోసారి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ మాస్క్ వేసుకోవడం ద్వారా కురుల ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
3. ఆర్గాన్ ఆయిల్‌తో మసాజ్
కేశాల ఆరోగ్య విషయంలో వర్షాకాలంలో మనం ఎదుర్కొనే ప్రధాన సమస్య.. అవి జిడ్డుగా, బిరుసుగా మారడమే. ఈ సమస్యకు చక్కని పరిష్కారం అందించడంతో పాటు.. కురులు ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది ఆర్గాన్ ఆయిల్. తలస్నానం చేసే ముందు.. ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం ద్వారా జుట్టు మృదుత్వాన్ని పొందుతుంది. డ్రై హెయిర్ ఉన్నవారు ఆర్గాన్ ఆయిల్ ఉపయోగిస్తే మంచి ఫలితం పొందుతారు.
జుట్టు రాలకుండా ఉండాలంటే.. తలకు నూనె ఇలా రాసుకోవాలి
Shutterstock
4. డీప్ కండిషనింగ్ చేసుకోవాలి
తేమ కోల్పోవడం వల్లే జుట్టు నిర్జీవంగా, బిరుసుగా మారిపోతుంది. అలాగే తరచూ తలస్నానం చేయడం, తలపై మురికి చేరడం వల్ల కూడా వెంట్రుకలు పొడిగా తయారవుతాయి. కాబట్టి వెంట్రుకలను కండిషనింగ్ చేసుకోవడం తప్పనిసరి. తల స్నానం చేసిన ప్రతి సారి జుట్టుకు కండిషనర్ రాసుకోవడమంటే కుదరకపోవచ్చు. కానీ వారానికోసారైనా కండిషర్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఇది వెంట్రుకలు తేమను కోల్పోకుండా చేసి పొడిగా మారకుండా కాపాడుతుంది.
5. ఎక్కువ సమయం దువ్వుకోవద్దు
కొంతమందికి తలను చాలా సేపు దువ్వుకోవడం అలవాటు. అలా ఎక్కువ సమయం దువ్వుకోకపోతే వారికి అంత తృప్తిగా అనిపించదు. మరికొందరు రోజుకి రెండు మూడు సార్లైనా తల దువ్వుకుని జడవేసుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు రాపిడికి గురై తెగిపోతుంది. చివర్లు చిట్లిపోతాయి. జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. అందులోనూ తడి తలను దువ్వితే మరింతగా హెయిర్ డామేజ్ అవుతుంది. అందుకే వెంట్రుకలు తడి ఆరిన తర్వాత వెడల్పు పళ్లున్న దువ్వెనతో దువ్వుకోవాలి.
Shutterstock
6. నూనెల గుణాలున్న షాంపూతో
మనం ఉపయోగించే షాంపూ కొన్ని సార్లు జుట్టుపై చేరిన మురికితో పాటు తేమను, సహజసిద్ధమైన నూనెలను కూడా తొలగిస్తుంది. పైగా వర్షాకాలంలో జుట్టు పొడిగా, బిరుసుగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో మనం ఉపయోగించే షాంపూ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం ఆయిల్ కేర్ షాంపూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది వెంట్రుకల్లోని తేమను పోగొట్టకుండా శుభ్రం చేయడంతో పాటు అవసరమైన పోషణ అందిస్తుంది.
7. స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా..
వర్షాకాలంలో జుట్టు బిరుసుగా మారకుండా ఉండటానికి పాటించాల్సిన చిట్కాల్లో అతి ముఖ్యమైనది స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం. జుట్టు అందంగా లేదనిపించిన సందర్భాల్లో వాటిని ఉపయోగించాల్సిన అవసరం రావచ్చు. అయినప్పటికీ వర్షాకాలంలో వాటిని ఉపయోగించకపోవడమే మంచిది.
ఎందుకంటే ఈ సమయంలో.. వాటిని మీరు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మీ జుట్టు అంత ఎక్కువగా పాడవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీటిలో ఉన్న రసాయనాలు స్కాల్ఫ్ పై ప్రభావాన్ని చూపిస్తాయి. కుదుళ్ల దగ్గర ఉత్పత్తి అయ్యే సహజమైన నూనెలను నాశనం చేస్తాయి. ఫలితంగా వెంట్రుకల మెరుపు తగ్గిపోతుంది. వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. తినాల్సిన, తినకూడని ఆహారం జాబితా ఇదే..
Shutterstock