హైదరాబాద్ - సికింద్రాబాద్ బోనాలు 2019: జాతరలో భక్తులు సందర్శించే 6 టెంపుల్స్

హైదరాబాద్ - సికింద్రాబాద్  బోనాలు 2019: జాతరలో భక్తులు సందర్శించే 6 టెంపుల్స్

బోనాలు (Bonalu) అని చెప్పగానే గుర్తొచ్చేవి హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad) జంటనగరాలు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జంటనగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో చేసుకునే పండగే బోనాలు. ఇక ఈ బోనాలు అనేవి దాదాపు ఒక శతాబ్ద కాలం నుండి చేసుకుంటున్నప్పటికి కూడా.. అయిదేళ్ళ క్రితమే తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. పైగా 20 కోట్ల మేర బడ్జెట్ కూడా కేటాయించడంతో ఈ పండుగ మరింత ప్రఖ్యాతి గాంచింది.

ఇక ఈ బోనాలు ఎలా ప్రారంభమయ్యాయి? ఎప్పటి నుండి ప్రజలు వీటిని జరుపుకుంటున్నారు? బోనాల విశిష్టత ఏంటి? మొదలైన విషయాలు ఈ క్రింది లింక్ ద్వాారా తెలుసుకోవచ్చు.

బోనాలు 2019 జాతరకు సంబంధించిన సమగ్ర వివరాలు

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల సందర్భంగా.. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో ఈ ఉత్సవాలు నిర్వహించడం రివాజు.  అసలు బోనాలు ఉత్సవాలు ఏ గుడి నుండి మొదలుపెట్టి ఏ గుడితో ముగిస్తారు.. మొదలైన ప్రశ్నలకి సమాధానాలు ఈ క్రింది కథనంలో తెలుసుకుందాం

* శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మ వారి దేవస్థానం

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం.. ఈ బోనాల ఉత్సవాల్లో ప్రముఖ పాత్రను పోషిస్తోందని చెప్పుకోవచ్చు. బోనాలు మొదలైన మూడవ వారంలోనే ఈ దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవస్థానానికి బోనాల సందర్భంగా ప్రతియేడు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హాజరవుతారు. అలాగే ఈ దేవస్థానం నుండే అసలైన బోనాల సంప్రదాయం మొదలైందని కూడా చెబుతుంటారు. 

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

చిరునామా - ఈ దేవస్థానం సికింద్రాబాద్ ప్రాంతంలోని.. రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌కి సమీపంలో ఉంటుంది.

Ujjaini Mahankali Temple

* బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్

బోనాలు మొదలైన మొదటి ఆదివారం ఉదయానే.. బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ గుడిలో 'రేణుక ఎల్లమ్మ' కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుక అంగరంగవైభవంగా జరుగుతుంటుంది. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సంవత్సరం జులై 8 నుండి 10 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

చిరునామా- అమీర్ పేట్ దగ్గర, బల్కంపేట, హైదరాబాద్.

Balkampet Yellamma Temple

* శ్రీ కనకాల కట్ట మైసమ్మ టెంపుల్

ఈ కట్ట మైసమ్మ గుడికి పెద్ద చరిత్రే ఉంది. ట్యాంక్ బండ్ నిర్మించే సమయంలో కార్మికుల క్షేమం కోరి ఈ గుడిని నిర్మించారట. అలాగే  ట్యాంక్ బండ్ నిర్మించిన తరువాత కూడా ఈ గుడికి భక్తులు విరివిగా వచ్చేవారు.

ఇక 1908లో మూసి నదికి వరదలు వచ్చిన సమయంలో.. ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా చూడమని అప్పటి నిజాం రాజు అమ్మవారిని మొక్కారట. ఆ తరువాతి కాలంలో ఈ గుడికి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

ఈ కట్ట మైసమ్మ గుడి బోనాలు.. ప్రతి ఏడాది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జరిగే రోజే జరుగుతుంటాయి.

చిరునామా - ఇందిరా పార్క్ దగ్గర, సికింద్రాబాద్.

Katta Maisamma Temple

* దర్బార్ మైసమ్మ టెంపుల్

ఓల్డ్ సిటీ‌లోని ప్రఖ్యాత అమ్మవారి దేవాలయాల్లో.. దర్బార్ మైసమ్మ గుడి ఒకటి. ప్రతి సంవత్సరం బోనాలు అంగరంగవైభవంగా జరిగే దేవస్థానాలలో ఇది కూడా ఉంది. ప్రతి ఆషాడ మాసం ఆఖరి ఆదివారం నాడు.. ఈ గుడిలో బోనాలు నిర్వహిస్తుంటారు. కార్వాన్, ఓల్డ్ సిటీల నుండే కాకుండా.. భాగ్యనగరం నలువైపుల నుండి కూడా ప్రజలు ఇక్కడి అమ్మవారి దర్శనానికి వస్తుంటారు.

చిరునామా - కులసుంపుర, కార్వాన్, హైదరాబాద్.

Darbar Maisamma Temple

* లాల్ దర్వాజ మహంకాళి టెంపుల్

చార్మినార్ ప్రాంతంలో లాల్ దర్వాజాని 1907లో నిర్మించడం జరిగింది. అప్పటి నిజాం రాజులు ఈ గుడిలో బోనాల ఉత్సవాలని ప్రారంభించారు. ప్రఖ్యాత కట్టడం చార్మినార్ నుండి ఈ గుడి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కన్న - మాదన్న టెంపుల్‌గా కూడా దీనికి పేరుంది. ఇక్కడ జరిగే ఏనుగు అంబారీ ఊరేగింపు చాలా ప్రత్యేకం.

చిరునామా - లాల్ దర్వాజ, హైదరాబాద్

Lal Darwaza Mahankali Temple

* గోల్కొండ కోట

ప్రతి ఆషాడంలో గోల్కొండ కోటలోనే బోనాలు ప్రారంభమవుతాయి. ఆషాడ మాసంలో తొలి ఆదివారానికి రెండు రోజుల ముందు ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనితో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్టు లెక్క. ఇక లంగర్ హౌజ్ ప్రాంతం నుండి గోల్కొండ కోట వరకు ఊరేగింపుగా వెళ్ళి.. తర్వాత కోట వద్ద పూజలు నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున ఇక్కడి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆననాయితీ. అలా పట్టువస్త్రాలను సమర్పించాకే  బోనాల ఉత్సవాలని మొదలుపెడతారు.

చిరునామా - గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్.

Golconda Bonalu

ఈ పైన చెప్పిన ఆరు గుళ్ళను... బోనాల ఉత్సవాల సమయంలో ఎంతోమంది ప్రేక్షకులు సందర్శించి భక్తిశ్రద్దలతో అమ్మని కొలుస్తుంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పైన చెప్పిన గుళ్ళలో వేటినైనా దర్శించక పోయి ఉంటే.. వెంటనే వెళ్ళి దర్శించుకోండి.

హైదరాబాద్ హుసేన్ సాగర్‌లో.. మనమూ బోటు షికారు చేసేద్దామా..!

Featured Image: Shutterstock & Youtube