లడ్డూ ప్రియుల కోసం.. ఈ టాప్ 10 రెసిపీలు ప్రత్యేకం..!

లడ్డూ ప్రియుల కోసం.. ఈ టాప్ 10 రెసిపీలు ప్రత్యేకం..!

లడ్డూ (ladoo).. తీపి పదార్థాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన మిఠాయి. దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాదిలో కూడా పండగలకు దేవుడికి.. లడ్డూని నైవేద్యంగా పెట్టడం ఆనవాయతీ. ముఖ్యంగా వినాయకచవితికి వేలంపాటలో లడ్డూను అమ్మడం.. రికార్డుల కోసం అతి పెద్ద లడ్డూని తయారుచేయడం మనం చూస్తుంటాం. మరి ఇన్ని ప్రత్యేకతలున్న లడ్డూ పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకొని.. ఓ 10 రకాల లడ్డూలను కూడా టేస్ట్ చేసేద్దాం.. ఏమంటారు..? 

లడ్డూ అనే పదం "లట్టిక" అనే ఉర్దూ పదం నుండి పుట్టిందట. పూర్వకాలంలో జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం..  ఒక వంటకాన్ని కనిపెట్టి.. దాన్ని ఔషధంగా ఇచ్చేవారట. ఇదే తర్వాతి క్రమంలో లడ్డూగా రూపాంతరం చెందిందట. ఆయుర్వేద వైద్యుడు శుశ్రుతుడి కాలంలోనే.. లడ్డూల ప్రస్తావన ఉందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనేక రకాల లడ్డూలు.. బయట అనేక స్వీట్ షాపుల్లో లభ్యమవుతున్నాయి. అటువంటి లడ్డూలలో.. టాప్ 10 (recipes) మీకోసం ప్రత్యేకం.

తెలంగాణ స్పెషల్ వంటకం - సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!

మోతీచూర్ లడ్డు - దీని తయారీకి కావాల్సినవి రెండున్నర కప్పుల శెనగపిండి, అరలీటరు పాలు, యాలకుల పొడి, నెయ్యి, పంచదార, మంచినీరు. ఈ లడ్డూ తయారుచేయాలంటే.. తొలుత పాకం తయారీకి మందపాటి గిన్నెలో పంచదార, పాలు, నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాలతో కలిసిన ఆ మిశ్రమం బాగా పొంగాక వడబోసి.. స్టవ్ మీద ఓ ఆరు నిముషాలు మళ్లీ మరిగించాలి. తర్వాత కొంత కలర్ కలిపి.. చిక్కబడే వరకు మరిగించాలి. తీగపాకం రాకముందే దించి పక్కన పెట్టుకోవాలి. 

ఆ తర్వాత బూందీ తయారుచేయాలి. అందుకు గాను.. పిండిలో పాలు, యాలకులపొడి మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి బాగా మరిగించాలి. తరువాత గరిటెమీద పిండిని వేసి బూందీ తీసేయాలి. బూందీ బాగా వేగిన తరువాత.. పాకంలో వేసి కలపాలి. తర్వాత బూందీపాకాన్ని వెడల్పాటి పళ్ళెంలో పోయాలి. తరువాత గోరువెచ్చని నీళ్లు జల్లి మూతపెట్టి.. అయిదు నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు చేతులకు తడి అద్దుకుంటూ ఉండలు చుట్టాలి. 

 

రవ్వలడ్డు - రవ్వలడ్డు తయారీకి కావాల్సినవి రవ్వ, పంచదార, కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, కిస్ మిస్. తొలుత 3 కప్పుల రవ్వలో.. తరిగిన కొబ్బరి ముక్కలు, నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ నేతిలో బాగా వేయించాలి. అలా వేయించిన వాటిని.. రవ్వ మిశ్రమంలో కలిపేయాలి. ఇప్పుడు నెయ్యి పోసి బాగా కలపాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. 

భారతీయ దుస్తులను గురించి కూడా చదవండి

 

 

 

బేసిన్ లడ్డు : బేసిన్ లడ్డు తయారీకి కావాల్సినవి శనగపిండి, నెయ్యి, బొంబాయి రవ్వ, పంచదార, యాలకుల పొడి, బాదం పలుకులు, కిస్మిస్, శాఫ్రన్ కలర్. ఈ లడ్డు తయారీ విధానంలో తొలుత బాదం పలుకులు, కిస్మిస్‌లను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నెయ్యి వేసి బాగా కరిగించాలి. నెయ్యి కొంత వేడయ్యాక.. అందులో శనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

అలా కలుపుతూ పిండి గోధుమ రంగులోకి వచ్చేవరకూ వేయించాలి. తర్వాత మరొక పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి.. బొంబాయి రవ్వ మిశ్రమాన్ని, యాలకులపొడిని బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత.. దాన్ని శనగపిండి మిశ్రమంతో మిక్స్ చేసి.. బాగా వేయించాలి. అలా వేయించిన మిశ్రమాన్ని పంచదారతో కలిపి..పైన బాదంపప్పు, కిస్మిస్ అద్దాలి. ఆ తర్వాత ఆ పిండి వేడిగా ఉన్నప్పుడు.. దాన్ని లడ్డూలుగా చుట్టాలి. 

హైదరాబాద్ వెళ్తున్నారా.. అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండిబందరు లడ్డు - బందరు లడ్డు కేవలం మచిలిపట్నంలో మాత్రమే దొరుకుతుంది. దీనిని కేవలం ఆ ప్రాంతంలోని రెండు కుటుంబాలు మాత్రమే తయారుచేస్తున్నాయి. ఇటీవలే  భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను కూడా సొంతం చేసుకుందీ లడ్డు. దీని రెసిపీ ఎవరికీ తెలియదని అంటుంటారు. అందుకే ఈ లడ్డు మాదిరిగా తయారుచేయాలని చాలామంది ప్రయత్నించినా.. ఫెయిల్ అయ్యారని చెబుతారు. కాకపోతే అన్ని లడ్డూల మాదిరిగానే దీని తయారీ విధానం ఉంటుందట.

ఈ లడ్డూల తయారీ కోసం కాగుతున్న నెయ్యిలో శనగపిండిని వేయించి.. పూస బూందీని తయారుచేస్తారట. తర్వాత అదే పూసను రోకలితో దంచి పిండిలా చేస్తారు. ఆ పిండిని పంచదార పాకంతో మిక్స్ చేస్తారు. ఆ మిశ్రమాన్ని మళ్లీ దంచుతారు. ఈ పాకంలో యాలకుల పొడి, పటికబెల్లం, జీడిపప్పు మొదలైన పదార్థాలను కలుపుతారు. తర్వాత ఆ మిశ్రమాన్ని ఉండలుగా చుడతారు. ఎలాంటి కృత్రిమ రంగులు ఉపయోగించకపోవడం వల్ల ఈ లడ్డూ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందట. ఈ లడ్డూ తయారీని బందరుకి వందేళ్ల క్రితం వలస వచ్చిన సిక్కు కుటుంబీకులు ప్రారంభించారని.. వారి నుండి తయారీ విధానాన్ని ఆంధ్రులు నేర్చుకున్నారని అంటారు. 

ఇరానీ ఛాయ్ - కేర్ అఫ్ హైదరాబాద్

 

 

 

అటుకుల లడ్డు - ఈ లడ్డు తయారీకి కావాల్సినవి అటుకులు, పచ్చికొబ్బరి తురుము, నెయ్యి, జీడిపప్పు, బెల్లం తురుము, కిస్మిస్, యాలకులు. ఈ లడ్డును తయారు చేయాలంటే.. తొలుత అటుకులను బాగా వేయించి.. పొడి చేసుకోవాలి. తర్వాత తురిమిన బెల్లం మిశ్రమాన్ని దాంతో బాగా కలపాలి. పచ్చి కొబ్బరి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్‌ను కూడా ఈ మిశ్రమంతో బాగా మిక్స్ చేయాలి. 

స్నేహితుల కోసం దీపావళి సందేశాలను కూడా చదవండి

మిల్క్ లడ్డు - ఈ లడ్డు తయారీకి ముఖ్యంగా కావాల్సింది పాలపొడి మరియు కండెన్స్‌డ్ మిల్క్. అలాగే నెయ్యి, కొబ్బరి తురుము, బాదం, బెల్లం, కిస్మిస్, జీడిపప్పు కూడా కావాలి. తొలుత బెల్లం తురుముతో, కొబ్బరిని బాగా మిక్స్ చేసి.. స్టవ్ బాగా కాగబెట్టాలి. తర్వాత అలా గట్టిపడిన మిశ్రమాన్ని.. డ్రై ఫ్రూట్స్‌తో బాగా కలపాలి.

తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పాలపొడి, కరిగించిన నెయ్యి, పాలు వేసి బాగా మిక్స్ చేసి.. స్టవ్ మీద పెట్టాలి. అది కోవా మాదిరిగా తయారయ్యేలా చూడాలి. ఆ కోవా మిశ్రమాన్ని.. ఇంతకు క్రితం తయారుచేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంతో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. అంతే.. మిల్క్ లడ్డు రెడీ.


 

 

ఓట్స్ లడ్డు - ఈ లడ్డు తయారుచేయడానికి కావాల్సినవి పావుకేజీ ఓట్స్. అలాగే 50 గ్రాముల నెయ్యి, ఇలాచి పొడి, చక్కెర, శనగపప్పు. తొలుత స్టవ్ మీద పాన్ పెట్టి.. కొద్దిగా నెయ్యి వేసి ఓట్స్ వేయించుకోవాలి. అలాగే వేయించిన ఓట్స్ పౌడరులా మారేవరకూ.. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఇదే పౌడరును, శనగపప్పు మిశ్రమంతో పాటు పంచదార, ఇలాచి మిశ్రమానికి కలిపి.. కరిగించిన నెయ్యిని అందులో వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని లడ్డులా మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి.

 

 కాశ్మీరీ లడ్డు - ఈ లడ్డు తయారీకి కావాల్సింది అరకేజీ ఖర్జూరం, బాదం, పిస్తా, సెమోలినా, పంచదార, యాలకుల పొడి, కొబ్బరి, నెయ్యి లేదా నూనె. తొలుత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి.. దానిలో నూనె బాగా మరిగించి అందులో బాదం పలుకులు, పిస్తా పలుకులు వేయించాలి. తర్వాత సమోలినా, పంచదార మిక్స్ చేసిన మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. అలా మరిగిన మిశ్రమంలో.. వేయించిన పిస్తా, బాదం పలుకులతో పాటు ఖర్జూరాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్స్ చేయాలి. అలాగే మిక్స్ చేసిన మిశ్రమాన్ని కొబ్బరి తురుముతో కలిపి ఉండలుగా చుట్టుకోవాలి. 

 

బూందీ లడ్డు - తెలుగు వంటకాల సంప్రదాయంలో బూందీ లడ్డుకి ఒక గొప్ప ప్రాధాన్యం ఉంది. దీని తయారీకి కావాల్సినవి అరకిలో శనగపిండి, చక్కెర, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, పచ్చ కర్పూరం, మిఠాయి రంగు. ఈ లడ్డు తయారీకి తొలుత శనగపిండిని తీసుకొని.. అందులో నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత పంచదారలో ఒక లీటర్ నీళ్లు పోసి మరగబెట్టాలి. లేత పాకం వచ్చేదాక.. అందులో గరిటె పెట్టి తిప్పుతుండాలి. తర్వాత అదే పాకంలో కొంచెం పాలతో పాటు చిటికెడు మిఠాయి రంగు పోయాలి. తర్వాత పాకం గిన్నెను దించేయాలి. 

తర్వాత శనగపిండి మిశ్రమాన్ని గరిటెతో తీసుకొని.. సన్నటి రంధ్రాలు కలిగిన చట్రంలో పోయాలి. అలా చట్రంలో పోసిన తర్వాత.. ఆ మిశ్రమం బొట్లు బొట్లుగా పెనంలో పడుతుంది. అలా తయారైన బూందీ ఎర్రటి రంగులోకి మారకముందు.. తీసి పక్కనున్న గిన్నెలో వేసుకోవాలి. బూందీ వేయించడం పూర్తయ్యాక.. దానికి జీడిపప్పు, కిస్మిస్‌ అద్ది.. పాకాన్ని కూడా కలపాలి. తర్వాత యాలకుల పొడి, పచ్చ కర్పూరం కూడా కలపాలి. తర్వాత పాకం చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి. 

 

 

తిరుపతి లడ్డు - తిరుపతిలో శ్రీవారికి అర్పించే ప్రసాదాల్లో ప్రధానమైనది లడ్డు. అయితే అన్ని లడ్డుల కంటే భిన్నంగా దీనిని తయారు చేస్తారట. పైగా ఈ లడ్డు తయారుచేయడానికి పేటెంట్స్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉన్నాయి. బయట ఎవరైన తిరుపతి లడ్డు పేరుతో అమ్మకాలు చేయడం నిషిద్ధం. అయితే ఈ లడ్డుకి కూడా ఓ చరిత్ర ఉంది.

19వ శతాబ్దానికి ముందు ఆలయంలో లడ్డుకి బదులు.. వడను ప్రసాదంగా ఇచ్చేవారట. అయితే 1900 తర్వాత ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు ఆలయ నిర్వహణ చూసేవారు. అదే సమయంలో తొలుత తీపి బూందీని ప్రసాదంగా ఇచ్చేవారు. తర్వాతి కాలంలో లడ్డూలను కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. 

తిరుపతి లడ్డు మూడు రకాలు. ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు. ఆస్థానం లడ్డు అనేది రాష్ట్రపతి, ప్రధాని వంటి ముఖ్య అతిధులకు మాత్రమే అందిస్తారు. దీనిలో నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వు వేసి ప్రత్యేకంగా తయారుచేస్తారు. 

కళ్యాణోత్సవ లడ్డూను ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకూ అందిస్తారు. ప్రోక్తం లడ్డును సాధారణ భక్తులకు అందిస్తారు.స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడీపప్పు, కర్పూరం మొదలైనవాటిని ఉపయోగించి తిరుపతి లడ్డుని తయారుచేస్తారు.

Featured Image:  Witty Sindhi & Priya Sweets