పుస్తెలమ్మయినా.. పులస తినాలని ఎందుకు అంటారో మీకు తెలుసా?

పుస్తెలమ్మయినా.. పులస తినాలని ఎందుకు అంటారో మీకు తెలుసా?

పులస (pulasa).. హిల్సా ఇలిషా అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ చేప (fish) గురించి వినని వాళ్లు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండరేమో.. ఆ చేపల రుచి అలాంటిది. ఏం చేసైనా సరే.. అరుదుగా వచ్చే ఈ చేపల రుచి చూడాలని అనుకోనివారు ఉండరు. అందుకే పుస్తెలమ్మయినా పులస తినాలని చెప్పే సామెత వాడుకలోకి వచ్చింది. పులస తింటే చాలు.. జన్మ ధన్యమైపోతుందని భావించే వాళ్లు కూడా చాలామందే. సాధారణంగా సముద్రంలో పెరిగే ఈ చేపను విలస చేప అంటూ ఉంటారు. ఇది బంగ్లాదేశ్ జాతీయ చేప.

ఈ చేపలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా ప్రాంతాల్లోని సముద్రంలో జీవిస్తుంటాయి. వర్షాలు పడే సమయం అంటే జులై, ఆగస్టు సమయానికి గుడ్లు పెట్టేందుకు బంగాళాఖాతంలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, బెంగాల్‌లో హుగ్లీ నదిలో మాత్రమే గుడ్లు పెడతాయి. జూలై, ఆగస్టు సమయంలో నదుల్లోకి చేరుకున్న ఈ చేపలు గుడ్లు పెట్టిన తర్వాత అక్టోబర్‌లో తిరిగి తమ ప్రదేశాలకు వెళ్లిపోతాయట.

instagram
హైదరాబాద్ ట్రెండ్స్: ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా?

సముద్రంలో ఉన్నప్పుడు విలసగా ఉండే ఈ చేప.. గోదావరి ఉపనదులైన వశిష్ట, గౌతమి, వైనతేయల్లోని మంచి నీటిలో ఎదురీదడం వల్ల  శరీరంలో మార్పులు వచ్చి రుచి అద్బుతంగా మారుతుందట. సముద్రంలోని ఉప్పు నీళ్ల నుంచి గోదావరిలోకి ఎదురీదుతూ ఆ నురగను, అందులోని పురుగులను తిని జీవిస్తుందట ఈ చేప. దీని వల్ల దాని రుచి పూర్తిగా మారుతుంది. అందుకే గోదావరి సముద్రంలో కలిసే యానాం, కోటిపల్లి వద్ద రుచి మామూలుగా ఉంటే.. ధవళేశ్వరం వద్ద దొరికే చేపల రుచి మాత్రం చాలా బాగుంటుందట. అందుకే అక్కడ ఈ చేప చాలా ఎక్కువ రేటు పలుకుతుంది.

instagram
ఫుల్ జార్ సోడా.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ సోడా గురించి మీకు తెలుసా?

పులస చేప ఆయిల్ ఫిష్ జాతికి చెందింది. ఇందులో మన శరీరానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాలా ఎక్కువగా ఉంటాయట. "రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.." అందిస్తుంది. కాబట్టి చాలామంది ఈ చేపలను ఎంత ఖరీదైనా కొనేందుకు సిద్ధపడతారట. అందుకే ఇప్పుడు ఈ చేపల ధర రూ. 4 వేల నుంచి రూ. 10 వేల వరకూ పలుకుతోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి కొన్నా.. సరైన పద్దతిలో వండకపోతే ఈ చేపల రుచి సరిగ్గా రాదట. బాగా అనుభవం ఉన్నవాళ్లే ఈ పులస పులుసును చక్కగా వండగలరు.

వంకాయలు, బెండకాయలు వేసి చేసే పులస పులుసును.. ఒక్కసారి తింటే దాని రుచి జీవితాంతం మర్చిపోరట. అయితే వీటిలో ముళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా తినాల్సిందే. వండిన రోజు కాకుండా మరుసటి రోజు.. వీటి రుచి ఇంకా ఎక్కువగా ఉంటుందట. అయితే వీటిని మిగిలిన వంటల్లా.. స్టవ్ మీద వండితే.. రుచి అంత బాగుండదట. కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండిన పులస పులుసు.. వండిన తర్వాత రోజు అద్భుతంగా ఉంటుందంటారు దీన్ని రుచి చూసిన వాళ్లు.

Instagram
వైజాగ్ ట్రెండ్స్: ఈ ఫేమస్ వంటకాలను.. ఓసారి మీరూ రుచి చూడండి..!

ఈ చేపలను కృత్రిమంగా పెంచడానికి వీలు పడదు. ప్రపంచంలో పులస చేపలు కేవలం ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో మాత్రమే లభిస్తాయట. అంతేకాదు.. ఇవి సాధారణంగా వలలకు కూడా దొరకవట. వీటికోసం ప్రత్యేకమైన వలలు రాత్రి వేస్తే ఉదయం, ఉదయం వేస్తే సాయంత్రానికి చేపలు పడతాయట. అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఒక్కోసారి అస్సలు చేపలే పడవట. వలలో పడిన వెంటనే చనిపోయినా రెండు రోజుల పాటు తాజాగా ఉండడం పులస ప్రత్యేకత.

అందుకే వీటికి అంత డిమాండ్. ఈ డిమాండ్ చూసి చాలామంది విలస చేపలను పులసలుగా అమ్మే ప్రయత్నం చేస్తుంటారట. అయితే విలసలు తెలుపు రంగులో (వెండి రంగులో) ఉంటే.. అవి గోదావరిలోకి వచ్చాక వాటి శరీరంలో మార్పులు వచ్చి శరీరంపై ఉన్న ఉప్పుదనం మొత్తం తగ్గడం వల్ల పులస చేపలు గోధుమ రంగులోకి మారతాయి. తెలుపు, గోధుమ రంగులు కలగలిసిన రంగుల్లో ఉండే ఈ చేపను కట్ చేస్తే లోపల గుండ్రని చక్రాలుగా కనిపిస్తాయి. ఇలా ఇతర ఏ చేపలకూ ఉండకపోవడం విశేషం.

పులసల్లో రెండు రకాలుంటాయి. అవి పోతు లేదా గొడ్డు పులస, శన పులస. శన పులస అనేది గుడ్లు పెట్టడానికి సిద్ధమైన చేప. ఇది చాలా రుచిగా ఉంటుందట. అయితే ఇలా గుడ్లు పెట్టకముందే పులసల్ని వేటాడి తినేయడం వల్ల వీటి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందట. ఇలా పులసల్ని తింటూ పోతే కొన్నాళ్లకు ఈ జాతి అంతరించిపోతుందని.. అందుకే వీటి జాతి పూర్తిగా అంతరించకుండా వీటిని తినడం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.