ఫుల్ జార్ సోడా.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ సోడా గురించి మీకు తెలుసా?

ఫుల్ జార్ సోడా.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ సోడా గురించి మీకు తెలుసా?

సాధారణంగా వేసవిలో సోడా తాగని వారెవరైనా ఉంటారా? గతంలో గోలీ సోడాలు  గాజు సీసాల్లో లభ్యమయ్యేవి. ఈ సీసాల్లో  గ్యాస్ నింపాక.. గోలిని దీనికి  క్యాప్‌గా వాడేవారు. కానీ నేడు గోలీసోడా తాగే రోజులు పోయాయి. ఇక ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే సోడాలో అయితే.. రెడీమేడ్‌గా గ్యాస్ నింపి సర్వ్ చేస్తున్నారు. ఒక గ్లాసులో కాస్త నిమ్మఉప్పు, చక్కెర లాంటి పదార్థాలన్నింటితో పాటు.. చల్లటి నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. ఇదీ బాగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మరో సోడా గురించి మీకు తెలుసా? అదే ఫుల్ జార్ సోడా.


ఈ ఫుల్‌జార్ సోడా చాలా డిఫరెంట్ సోడా అని.. దీని రుచి అద్భుతంగా ఉంటుందని తాగినవాళ్లు చెబుతున్నారు. అయితే రుచి ఎలా ఉన్నా.. దీని తయారీలో కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. కాబట్టే ఈ ఫుల్‌జార్ సోడా (Fuljar soda) ఇంటర్నెట్‌లో వైరల్‌గా (viral)  మారిపోయింది. దీని తయారీ మాత్రమే కాదు..  తాగే పద్ధతి కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. అందుకేనేమో.. ఎంతో మంది ఒక్కసారి రుచి చూడగానే ఈ సోడాకి ఫ్యాన్స్‌గా మారిపోతున్నారు. కేరళలో తొలుత ప్రారంభమైన ఈ సోడా తయారీ పద్ధతి.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వారందరినీ ఆకట్టుకుంటోంది.


fulljar


ఫుల్‌జార్ సోడా.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో (ముఖ్యంగా కేరళలో) అందరినీ ఆకట్టుకుంటోన్న డ్రింక్. దీనికి యువత ఎంతగా ఆకర్షితులవుతున్నారంటే సంప్రదాయబద్ధమైన పానీయాలు, ఇతర డ్రింక్స్‌ని కూడా పక్కన పెట్టి దీని వైపు మొగ్గుచూపుతున్నారు.


మీకో విషయం తెలుసా? ఈ సోడాకి అంత అద్భుతమైన రుచి రావడానికి కారణం.. అందులో ఉపయోగించే పదార్థాలే. కేరళలో మొదలైన ఈ పానీయం క్రేజ్ టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్ల పుణ్యమా అని.. మన వరకూ పాకింది. క్లాసిక్ డ్రింక్ అంటూ దీన్ని ఒక బేసిక్ ఫ్లేవర్లోనే అందరూ ఇష్టపడుతున్నా.. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు తమ కస్టమర్ల కోసం ఇందులోనూ ఫ్లేవర్లను ప్రారంభించాయి. మ్యాంగో, లిచీ, ఆరెంజ్, గ్రీన్ యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్, కివీ వంటి పండ్ల ఫ్లేవర్లతో పాటు సాల్టెడ్, షుగర్ వంటి ఫ్లేవర్లలోనూ ఇది లభ్యమవుతోంది.


fuljarmain


ఇందులో ఏమాత్రం ఆల్కహాల్ లేకపోయినా.. ఈ సోడా తయారీకి మాత్రం చిన్న షాట్ గ్లాస్ అవసరమవుతుంది. ఒకవేళ మీ దగ్గర అలాంటి గ్లాస్ లేకపోతే చిన్న టీ గ్లాస్ తీసుకున్నా ఫర్వాలేదు. ఇప్పుడు దీన్ని తయారుచేసుకోవడానికి అల్లం, పుదీనా, మిరపకాయలను గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని విడివిడిగా అయినా గ్రైండ్ చేసిపెట్టుకోవచ్చు. ఒకవేళ విడివిడిగా గ్రైండ్ చేస్తే అల్లం అర స్పూన్, పుదీనా అరస్పూన్, మిరపకాయల పేస్ట్ అరస్పూన్ చొప్పున చిన్న గ్లాసులో వేసుకోవాలి.


అన్నీ కలిపి గ్రైండ్ చేయాలంటే.. అన్నింటినీ సమానపాళ్లలో తీసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఓ స్పూన్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా చక్కెర, ఓ స్పూన్ ఉప్పు కూడా వేయాలి. ఆ తర్వాత నానబెట్టిన సబ్జ గింజలను కూడా దీనికి కలుపుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద పొడవాటి గ్లాస్ తీసుకోవాలి. అందులో ప్లెయిన్ సోడాను పోసుకోవాలి. అయితే నిండా పోయకుండా కాస్త గ్యాప్ ఉంచడం మంచిది. ఇప్పుడు ఇంతకు క్రితం తీసుకున్న షాట్ గ్లాస్‌ని ఇందులో వేసేయాలి.


వేసేటప్పుడు సోడా బయటకు పొంగుతుంది కాబట్టి.. అలా పొంగిన సోడా వేస్ట్ కాకుండా కింద ఓ ప్లేట్ పెట్టడం మంచిది. అలా ప్లేట్‌లో పెద్ద గ్లాస్‌ని పెట్టి.. చిన్న షాట్ గ్లాస్‌తో దాన్ని తొరపాలి. అప్పుడు సోడా పొంగుతున్నట్లుగా నురగ వస్తుంది. వెంటనే దాన్ని తాగడం ప్రారంభించాలి. కారం కారంగా, తియ్యగా, ఉప్పగా అన్ని రకాల రుచులను అందిస్తూ అద్భుతంగా ఉంటుందీ సోడా. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.


దీనిలో కారం, ఉప్పు, చక్కెర మాత్రం మీ రుచికి తగినట్లుగా మార్చుకుంటే చక్కటి రుచిని సొంతం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ డ్రింక్ తయారీకి సంబంధించిన రెసిపీలు కూడా బాగానే లభ్యమవుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త ఫ్లేవర్‌తో ఈ ఫుల్ జార్ సోడాని తాగే ప్రయత్నం చేయండి.


ట్రెండ్ బాగానే ఉన్నా.. ఇలా సోడా పొంగుతున్నప్పుడు దీన్ని తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే దీన్ని తరచూ తాగకూడదని.. ఆ మాటకొస్తే ఏ సోడా లేదా కోలాలను కూడా తరచూ తాగడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మరీ తరచూ కాకుండా అప్పుడప్పుడూ మాత్రం ఈ టేస్టీ ఫుల్ జార్ సోడాని ప్రయత్నించి చూడండి.


ఇవి కూడా చదవండి.


జీలకర్ర తింటే చాలు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..


ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!


మీ సెక్స్ లైఫ్ ని ఆనందంగా మార్చేందుకు ఈ ఆహారపదార్థాలు ఎంతో తోడ్పడతాయి..


Images : Instagram, Instagram, Instagram.