నెలసరి సమయంలో.. అమ్మాయిలు కచ్చితంగా పాటించాల్సిన సూత్రాలు..!

నెలసరి సమయంలో.. అమ్మాయిలు కచ్చితంగా పాటించాల్సిన సూత్రాలు..!

మీకు నెలసరి(period) వచ్చిందా? అయితే చాలా అసౌకర్యంగా, చిరాగ్గా, అసహనంగా అనిపిస్తుంది. రుతుక్రమం ప్రారంభమైన నాటి నుంచి నెల నెలా ఓ ఐదారు రోజుల పాటు.. ఇలా ఉండటం మనకి అలవాటైపోయింది. కానీ ఆ సమయలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం మాత్రం ఎప్పటికీ అసాధ్యంగానే కనిపిస్తూ ఉంటుంది. మాటల మధ్యలో పీరియడ్స్‌కి సంబంధించిన విషయాలు చర్చకు వస్తే.. ఒకరి సమస్యలు మరొకరికి చెప్పుకోవడం, తమకు తెలిసిన చిట్కాలు పంచుకోవడం.. లాంటివి చేస్తూ ఉంటాం.

ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి, అయ్యే రక్తస్రావం దగ్గర నుంచి తాము ఉపయోగించే శానిటరీ న్యాప్కిన్ వరకు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు అమ్మాయిలు. ఇన్ని చేస్తున్నాం.. కానీ పీరియడ్స్ విషయంలో మనం పాటించాల్సిన మర్యాదలు మాత్రం మరచిపోతున్నాం. పీరియడ్స్ సమయంలో మర్యాదలేంటని ఆలోచిస్తున్నారా? అయితే మీరు దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

మనం పీరియడ్స్ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. మరికొందరు సామాజికంగా పాటించాల్సిన నియమాలను సైతం పాటిస్తారు. అయితే నెలసరి సమయంలో మీరు ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్ లేదా టాంఫూన్ ఎలా డిస్పోజ్ చేస్తారు? ఉపయోగించిన టాయిలెట్ పేపర్‌ను ఎలా పడేస్తారు? నిజం చెప్పొద్దూ.. అప్పుడప్పుడూ వాష్రూంకి వెళ్లినప్పుడు టాయిలెట్ సీట్ మీద కనిపించే రక్తపు బొట్లు, డస్ట్ బిన్లో సరిగ్గా మడతపెట్టకుండా పడేసిన న్యాప్కిన్లు ఇవన్నీ కాస్త చిరాకు కలిగిస్తాయి. అయితే ఆ సమయంలో మనం పాటించే కొన్ని పద్ధతుల వల్ల ఇతరులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.

వాష్రూం నుంచి బయటకు వచ్చే ముందు..

Shutterstock

పీరియడ్స్ సమయంలో వాష్రూం ఉపయోగించిన తర్వాత.. ఎక్కడా రక్తపు మరకలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. టాయిలెట్ సీట్ మీద రక్తపు బొట్లు ఏమైనా ఉండిపోయాయేమో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ సమయంలో తుడుచుకోవడానికి ఉపయోగించిన టాయిలెట్ పేపర్లను డస్ట్ బిన్లో వేసేటప్పుడు సైతం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.

రక్తంతో నిండిన టాయిలెట్ పేపర్లను జాగ్రత్తగా చుట్టి డస్ట్ బిన్లో వేయండి. ఎందుకంటే మనందరికీ పీరియడ్స్ వస్తాయి. కానీ ఇతరుల మెనుస్ట్రువల్ బ్లడ్‌ను చూడటానికి ఇష్టపడం కదా. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి.

శానిటరీ న్యాప్కిన్లను ఫ్లష్ చేయద్దు

శానిటరీ న్యాప్కిన్లు లేదా టాంఫూన్లను కమోడ్‌లో వేయడం వల్ల అది డ్రెయిన్ పైపుల్లో ప్రవాహానికి అడ్డుగా ఏర్పడుతుంది. మళ్లీ దీనికి ప్లంబింగ్ వర్క్ చేయాలంటే.. కాస్త ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అలాగే శానిటరీ న్యాప్కిన్లు బయోడీగ్రేడబుల్ కాదు. దీని వల్ల నీరు కలుషితమవుతుంది. కాబట్టి మీరు ఉపయోగించిన ప్యాడ్ లేదా టాంఫూన్లను ఇకపై ఫ్లష్ చేయడం మానేయండి.

4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాల్సిందే..

Shutterstock

మీకయ్యే రక్తస్రావాన్ని బట్టి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకోసారి ప్యాడ్ లేదా టాంఫూన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రక్తస్రావం అయితే.. నాలుగు గంటలకోసారి, తక్కువ రక్తస్రావమైతే ఆరుగంటలకోసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం ప్యాడ్ మార్చకుండా ఉంటే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ర్యాషెస్ రావడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇది టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌కు దారి తీయెచ్చు. ఇది ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు.

అక్కడ బాగా శుభ్రం చేసుకోండి..

వెజీనా సహజంగానే అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియాను బయటకు పంపించేస్తుంది. అయితే పీరియడ్స్ సమయంలో మాత్రం.. ఎప్పటికప్పుడు వెజీనాను శుభ్రం చేసుకోవడం ముఖ్యం. దీని కోసం సబ్బు ఉపయోగించాల్సిన అవసరం లేదు. వేడినీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే.. అక్కడ ఉన్న మంచి బ్యాక్టీరియాను సైతం సబ్బు చంపేస్తుంది. శుభ్రం చేసుకునేటప్పుడు వెనక నుంచి ముందుకు కాకుండా.. ముందు నుంచి వెనకకు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.

కాగితంలో చుట్టి డస్ట్ బిన్లో వేయండి.

Shutterstock

కొన్ని మాల్స్, హోటల్స్, ఆఫీసుల్లో శానిటరీ న్యాప్కిన్లను పడేయడానికి ప్రత్యేకంగా డస్ట్ బిన్లను ఏర్పాటు చేస్తుంటారు. శానిటరీ న్యాప్కిన్ల కోసం ప్రత్యేకంగా డస్ట్ బిన్లు ఉన్నా లేకపోయినా... న్యాప్కిన్ డస్ట్ బిన్లో వేసే ముందు.. దాన్ని గుండ్రంగా రేపర్లో చుట్టి పడేయండి. దీని కోసం ప్యాడ్‌కి ఉన్న ప్యాకేజింగ్ రేపర్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ రేపర్ లేకపోతే టాయిలెట్ పేపర్ లేదా పేపర్ ఉపయోగించవచ్చు. టాంఫూన్ కూడా ఇలాగే పేపర్లో చుట్టి పడేయండి. అంతేకానీ.. శానిటరీ వేస్ట్‌ను ఫ్లష్ చేయద్దు.

మరీ ఎక్కువగా పంచుకోవద్దు..

పీరియడ్స్‌కి సంబంధించిన విషయాల గురించి అమ్మాయిలు ఒకరితో ఒకరు చర్చించుకోవడం సహజంగా జరిగేదే. వాటి గురించి చర్చించడానికి లేదా సందేహాలు తెలుసుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అయితే మీ పీరియడ్ క్రాంప్స్ గురించి వినాలనే ఆసక్తి అందరికీ ఉండకపోవచ్చు. అందులోనూ మీకు కొత్తగా పరిచయమైన వారి దగ్గర.. దీనికి సంబంధించిన విషయాలను ప్రస్తావించకపోవడమే మంచిది.

పీరియడ్స్ విషయంలో అబ్బాయిలకు.. ఎలాంటి అపోహలుంటాయో మీకు తెలుసా? 

చిన్నప్పుడు శానిటరీ న్యాప్కిన్ గురించి.. ఇలా సిల్లీగా ఆలోచించేవాళ్లం..!

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది