నోరూరించే ఈ రొయ్యల వంటకాలు.. మీరు రుచి చూశారా??

నోరూరించే ఈ రొయ్యల వంటకాలు.. మీరు రుచి చూశారా??

నాన్ వెజ్ అనగానే చికెన్, మటన్, చేపలు.. వీటి తర్వాత వినిపించే పేరు రొయ్యలు (Prawns).  వీటిని ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో ఇష్టపడుతూ ఉంటారు. కొందరు వీటిని కూరగా చేసుకొని తింటే, మరికొందరు ఫ్రై, ఇంకొందరు పులుసు.. ఇలా రకరకాలుగా వీటిని వండుతూ ఉంటారు. అయితే ఇవి చాలామందికి తెలిసిన రెసిపీస్. మరి, రొయ్యలనే కాస్త కొత్తగా వండుకొని.. వాటి రుచిని మీరు ఆస్వాదించాలని అనుకుంటున్నారా?? అయితే మీ కోసం మేం కొన్ని రెసిపీలు చెబుతున్నాం.. ప్రయత్నించి చూడండి ..!

1. రొయ్యల పులావ్..

రొయ్యల బిర్యానీ గురించి చాలామంది వినే ఉంటారు.. కానీ ఎప్పుడైనా రొయ్యల పులావ్ గురించి మీరు విన్నారా?? అల్లం- వెల్లుల్లి పేస్ట్‌తో మ్యారినేట్ చేసిన రొయ్యలకు యాలకుల పొడి, దాల్చిన చెక్క, లవంగం, ఎండుమిర్చి.. వంటి మసాలా దినుసులన్నీ కలిపి తయారుచేసిన మసాలా పౌడర్ జత చేసి తయారుచేసే.. ఈ వంటకాన్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించడం ఖాయం. కావాలంటే ఓసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

shutterstock

2. పెప్పర్ ప్రాన్స్

మన ఇంటికి స్నేహితులు, బంధువులు.. వంటివారిని కమ్మని విందుకు ఆహ్వానించినప్పుడు ఉప్పు, మిరియాల పొడి చల్లి.. ప్రిపేర్ చేసిన పెప్పర్ ప్రాన్స్ వారికి సర్వ్ చేస్తే వారంతా వహ్వా అనాల్సిందే. ఇందుకోసం రొయ్యలను ముందుగా.. అరగంట నుంచి 40 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటి మీద ఉప్పు, మిరియాల పొడి చల్లి వేడివేడిగా సర్వ్ చేస్తే లొట్టలేస్తూ లాగించేయాల్సిందే..

3. తందూరీ ప్రాన్స్..

చికెన్ తందూరీ గురించి విన్నాం.. కానీ ఈ తందూరీ ప్రాన్స్ ఏంటబ్బా?? అని ఆలోచిస్తున్నారా?? రొయ్యలనే చికెన్ తందూరీ తరహాలో తయారుచేస్తే.. వాటిని తందూరీ ప్రాన్స్ అంటారు. ఇవి మధ్యాహ్న సమయంలో తీసుకునే భోజనంలో.. మంచి స్టార్టర్‌గా ఉపయోగపడతాయి. పైగా వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కాబట్టి తక్కువ సమయంలోనే నోరూరించేలా వీటిని ప్రిపేర్ చేసి అతిథులకు అందించవచ్చు.

4. కేరళ ఫ్రైడ్ ప్రాన్స్

కేరళలో ప్రదేశాలు చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాదు.. అక్కడి వంటకాలు కూడా అంతే రుచికరంగా ఉంటాయని అందరికీ తెలుసు. మరి, రొయ్యలను ఎప్పుడైనా కేరళ స్టైల్లో వండడానికి ప్రయత్నించారా?? దీని కోసం మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. రొయ్యలను కొబ్బరినూనెలో వేయించి ఆవాలు, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి.. మొదలైన వాటితో తాలింపు వేయాలి. వీటి పైన కాస్త నిమ్మరసం పిండుకుంటే రొయ్యల రుచి అమోఘంగా ఉంటుంది.

shutterstock

5. ప్రాన్ బాల్చో

ఇదొక గోవా వంటకం. గోవాలోని మసాలా పదార్థాలు, ఉల్లిపాయలు, ఫెని.. వంటి పదార్థాలు ఉపయోగించి తయారు చేసే ఈ వంటకం చాలా స్పైసీగా ఉండడమే కాదు.. చూడగానే మన నోరూరిస్తుంది కూడా.

6. చింగ్రీ మచర్ మలైకరి

ఇది పక్కా బెంగాలీ వంటకం. అన్నంలో కలుపుకోవడానికి, చపాతీ లేదా రోటీలకు జతగా తీసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ మ్యాచ్. దీనిని బెంగాలీలు తమదైన శైలిలో తయారు చేస్తారు. కాబట్టి తినడానికి చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.

7. థాయ్ ఫ్రైడ్ ప్రాన్ అండ్ పైనాపిల్ రైస్

రొయ్యలు, అన్నం, పైనాపిల్ ఉపయోగించి తయారు చేసే థాయ్‌లాండ్ వంటకం ఇది. దీనిని తయారు చేయడం చాలా సులభం. అది మాత్రమే కాకుండా.. ఇందుకు పట్టే సమయం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందుకే చాలామంది ఈ వంటకాన్ని అమితంగా ఇష్టపడతారు.

shutterstock

8. మలై ప్రాన్స్ కర్రీ

ఇది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే రోటీ లేదా చపాతీలకు కూడా చక్కని జత. ఇందులో తాజా అల్లం, పెరుగు, దాల్చిన చెక్క పొడి, కొబ్బరిపాలు.. మొదలైనవి కలుపుతారు. ఇవన్నీ కూర రుచిని మరింతగా పెంచేస్తాయంటే అతిశయోక్తి కాదు. పైగా ఈ కర్రీ వండడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.

ఇవి మాత్రమే కాదు.. పెద్ద పరిమాణంలో ఉన్న రొయ్యలు అందుబాటులో ఉంటే.. వాటితో స్ప్రింగ్ రోల్స్ కూడా తయారు చేయచ్చు. కుంగ్ పావ్ ప్రాన్స్, ప్రాన్స్ టాకోస్, ప్రాన్స్ రైస్ బౌల్, కొలివాడ ప్రాన్స్, గార్లిక్ ప్రాన్స్.. మొదలైన వంటకాలెన్నో మనం ప్రయత్నించవచ్చు. కాబట్టి మీరు కూడా వీటిలో మీకు నచ్చిన వంటకాలను ఓసారి ప్రయత్నించి చూడండి..

ఇవి కూడా చదవండి

పుస్తెలమ్మయినా.. పులస తినాలని ఎందుకు అంటారో మీకు తెలుసా?

వైజాగ్ ట్రెండ్స్: ఈ ఫేమస్ వంటకాలను.. ఓసారి మీరూ రుచి చూడండి..!

లడ్డూ ప్రియుల కోసం.. ఈ టాప్ 10 రెసిపీలు ప్రత్యేకం..!