సాధారణంగా పూలు (Flowers) మనం ఎందుకు ఉపయోగిస్తాం.. తలలో తురుముకోవడానికి.. దేవుడిని పూజించడానికి వాడతాం. కానీ ఎక్కడా కనీ వినీ ఎరగని రీతిలో పూలనే దేవతల ప్రతిరూపంగా భావించి బతుకమ్మగా (Bathukamma) పూజించడం కేవలం తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. దేశమంతా దసరా (Dussehra) శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తుంటే.. తెలంగాణ పడుచులు వాటితో పాటు మరింత వైభవంగా ఈ పూల పండగను నిర్వహిస్తారు.
పూలను గోపురంగా పేర్చి.. ఊరి మధ్యకు చేరి అందరూ చప్పట్లు కొడుతూ.. గుండ్రంగా తిరుగుతూ భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు. దసరాకి పది రోజుల ముందు వచ్చే అమావాస్య రోజు ప్రారంభమయ్యే.. ఈ బతుకమ్మ వేడుకలు దసరాకి రెండు రోజుల ముందు దుర్గాష్టమి రోజున ముగుస్తాయి. ఎన్నెన్నో పేర్లతో రకరకాలుగా తయారుచేసే ఈ బతుకమ్మ విశిష్టతతో పాటు.. దసరా గురించి కూడా విశేషాలు తెలుసుకుందాం రండి.
బతుకమ్మ కథ, దాని వెనకున్న చరిత్ర.. (History behind Bathukamma)
బతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి.. సరైన ఆధారాలు లేవు కానీ.. వెయ్యి సంవత్సరాల నుండీ ఇది కొనసాగుతూ వస్తోందని చెప్పడానికి మాత్రం రుజువులు ఉన్నాయి. బతుకమ్మ పండగ ప్రారంభం వెనుక కూడా చాలా కథలు చెబుతారు. అందులో ముఖ్యమైనది అమ్మవారి కథ. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట. ఆమెను మేల్కొల్పేందుకు స్త్రీలంతా కలిసి గుమిగూడి పాటలు పాడారట. ‘బతుకమ్మా’ అంటూ ఆమెను వేడుకున్నారట. అలా చేయగా.. సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందట. అప్పటి నుంచీ ఆమె స్థానంలో పూలను ఉంచి పూజించడం ఆనవాయితీగా మారిందట.
దీనితో పాటు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దక్షిణ భారత దేశాన్ని పాలించిన చోళ చక్రవర్తి ధర్మాంగదుడికి ఏడుగురు కొడుకులు. వారందరూ యుద్ధంలో మరణించగా.. లక్ష్మీ దేవిని పూజించి.. ఆమె అనుగ్రహంతో ఓ ఆడ బిడ్డను కన్నారు రాజు దంపతులు. చిన్నతనంలోనే ఎన్నో గండాలను దాటిన ఆమెను ‘బతుకమ్మా’ అని పిలిచేవారట. ఆమెను లక్ష్మీ దేవి అంశగా భావించి పూజలు కూడా చేయడం ప్రారంభించారు.
మరో కథలో భాగంగా రాష్ట్ర కూటులకు, చోళులకు జరిగిన యుద్ధంలో.. తెలంగాణ ప్రాంతాన్ని పాలించే చాళుక్యులు రాష్ట్రకూటుల పక్షం వహించారట. అయితే వేములవాడ రాజరాజేశ్వరుడిని పూజించిన పరాంతక సుందర చోళుడు.. తన కుమారుడికి రాజ రాజ చోళుడనే పేరు పెట్టాడట. ఆయన రాజయ్యాక చోళుల ప్రాభవం పెరిగింది. దీంతో చాళుక్యులు తమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆ తర్వాత రాజైన రాజేంద్ర చోళుడు.. వేములవాడ రాజ్యంపై దండెత్తి సంపదతో పాటు రాజ రాజేశ్వర స్వామి లింగాన్ని తీసుకెళ్లాడు.
ఆ విగ్రహాన్ని తంజావూరులో ప్రతిష్టించాడు. తమ ఇష్ట దైవం బృహదీశ్వరుడిని తీసుకెళ్లడం ఇక్కడి ప్రజలను బాధించింది. గుడిలో ఒంటరిగా మిగిలిన బృహదమ్మని (పార్వతీ దేవి) పూజిస్తూ పండగ చేయడం ప్రారంభించారు. అప్పటి నుండీ శివుడు లేని గౌరమ్మను మాత్రమే పూజిస్తూ పాటలు పాడడం మొదలైంది. పూల పర్వతాన్ని పూజిస్తూ.. శివ లింగం లేకపోయినా తాము పండగ చేసుకుంటామని చెబుతూ చోళులకు ప్రకటించడం కూడా ప్రారంభమైంది. క్రమేణా అదో పెద్ద పండగలా మారిపోయింది.
బతుకమ్మను ఎలా జరుపుకుంటారు ( How to celebrate Bathukamma Festival? )
బతుకమ్మను ఖరీదైన పూలతో కాకుండా ఇంటి చుట్టుపక్కల దొరికే పూల తోనే తయారుచేస్తారు. దీని వెనుక పర్యావరణానికి హితాన్ని చేకూర్చే కారణం కూడా ఉంది. ఈ పండగ శీతాకాలం ప్రారంభమయ్యే రోజుల్లో వస్తుంది. అప్పటికే చెరువులన్నీ నీళ్లతో నిండిపోతూ ఉంటాయి. అప్పటికే పడిన వర్షాలకు రంగురంగుల పూలు కూడా పూసి ఉంటాయి. ఈ పూలలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయి. వీటిని అందమైన గోపురాల రూపంలో పేర్చి పండగను జరుపుకుంటారు. బతుకమ్మ ఆడడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత.
ముందుగా పూలతో ఈ బతుకమ్మను అందంగా పేర్చుకొని.. వాటికి అగరబత్తులను గుచ్చి.. ఇంటి ముందు ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గు పెట్టి ఆ తర్వాత.. అక్కడ ఈ బతుకమ్మను ఉంచి ఐదు చుట్లు తిరుగుతారు. తర్వాత ఊరివారంరూ.. గుడి లేదా చెరువు గట్టుకి వెళ్లి అక్కడ అందరూ కలిసి బతుకమ్మ ఆడతారు. బతుకమ్మను ఆడే క్రమంలో.. స్థలాన్ని ముందే శుభ్రం చేసి ముగ్గులు పెట్టి మధ్యలో వెంపలి చెట్టు నాటుతారు. దాని చుట్టూ బతుకమ్మలన్నింటినీ ఉంచి.. వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ.. పాటలు పాడుతూ తిరుగుతారు.
ఈ చప్పట్లు కొట్టే తీరులోనూ ప్రాంతాన్ని బట్టి మార్పులుంటాయి. కొన్ని చోట్ల రెండు చప్పట్లు కొడితే.. మరికొన్ని చోట్ల మూడు చప్పట్లు కొడతారు. ఇంకొన్ని చోట్ల కర్రలతో కోలాటాలు కూడా ఆడతారు. ఇలా నచ్చినంత సేపు ఆడిన తర్వాత స్థానికంగా ఉన్న చెరువు, కుంటల దగ్గరికి వెళ్లి బతుకమ్మలను అందులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత తమతో పాటు తీసుకొచ్చిన నైవేద్యాలను.. ఒకరికొకరు పంచుకొని వాటిని ఆరగించి తిరిగి ఇంటికి వెళ్తారు. ఇలా తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. ఈ పండగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. గిన్నిస్ బుక్‌లోనూ స్థానం సంపాదించింది తెలంగాణ బతుకమ్మ.
ఈ బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకమైన పేరు ఉంటుంది. మొదటి రోజుని మహాలయ అమావాస్య రోజు లేదా పెత్రమాస అంటారు. ఈ రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ పండక్కి ముందు రోజే పూలను సేకరించి నీళ్లలో వేసి పెట్టి.. ఆరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక బతుకమ్మను పేర్చడం ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి చేసి ఆట మొదలుపెడతారు.
ఆ తర్వాత అటుకుల బతుకమ్మ, ముద్ద పప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని రకరకాల పేర్లతో బతుకమ్మను పిలుస్తారు. ఆరో రోజున మాత్రం అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజున బతుకమ్మను పేర్చరు. ఊరికే బతుకమ్మ ఆడతారు. ఆ రోజు బతుకమ్మ అలుగుతుంది కాబట్టే.. అలా చేస్తారని భక్తుల నమ్మకం.
బతుకమ్మ తయారీలో ఉపయోగించే పూలు (Batukamma Preparation and Floral Design)
బతుకమ్మ తయారీలో సాధారణంగా ఖరీదైన పూలను ఎక్కువగా ఉపయోగించరు. పొలాల్లో, గట్ల మీద, కంచెల్లో, ఇళ్ల పెరట్లలో పెరిగే మొక్కల పూలతోనే బతుకమ్మను తయారుచేసి పూజిస్తారు. బతుకమ్మలో ప్రత్యేకంగా ఈ పూలే ఉపయోగించాలని నియమం ఏదీ లేదు. గడ్డి పూల నుంచి.. మన చుట్టూ దొరికే ప్రతి పువ్వునీ బతుకమ్మ తయారీలో ఉపయోగించవచ్చు. అయితే కొన్ని పూలను మాత్రం అందులో తప్పనిసరిగా వాడతారు. వాటి రంగు లేదా ఔషధ గుణాల వల్ల.. కారణం ఏదైనా కావచ్చు.. ఆ పూలు బతుకమ్మ పూలగా పేరు సాధించాయి.
వీటిలో ముఖ్యమైనవి తంగేడు పూలు. బతుకమ్మలో ఎన్ని పూలున్నా కనీసం శాస్త్రానికి ఒక్క తంగేడు పువ్వైనా ఉపయోగించాల్సిందే అంటారు. వీటితో పాటు వాడే పూలు గునుగు పూలు.. పొడుగ్గా.. తెల్లగా ఉండే ఈ పూలను కూడా బతుకమ్మలో ఉపయోగించడం మనం చూడచ్చు. వీటిని అలాగే కాకుండా రంగులద్ది కూడా వాడవచ్చు. వీటితో పాటు ముత్యాల పువ్వులో కూడా రంగులు అద్ది బతుకమ్మలో ఉపయోగిస్తారు.
ఈ పూల తర్వాత బతుకమ్మల్లో ఎక్కువగా కనిపించే పూలు బంతి, చామంతి. అనేకమంది రంగు రంగుల బంతులు, చామంతులను ఎంచుకొని బతుకమ్మను పేరుస్తుంటారు. ఇక ఎక్కువమంది ఉపయోగించే పూలలో పట్టుకుచ్చు పువ్వు (వీటినే సీత జడ పూలు అంటారు), జిల్లేడు, రుద్రాక్ష, నంది వర్థనం, గన్నేరు, బిళ్ల గన్నేరు, మందార, గులాబీ, టేకు పూలను ఎక్కువగా వాడతారు. ఇక కూరగాయ మొక్కల పూలను కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా గుమ్మడి పువ్వు అండాశయాన్ని.. గౌరీ దేవి అంశగా తప్పనిసరిగా ఉపయోగించడం కనిపిస్తుంది.
బతుకమ్మ తయారీ (Preparation of Batukamma)
బతుకమ్మను పూల గోపురం లేదా పూల గుట్ట అని పిలవడానికి కారణం.. అవి ఆ ఆకారంలో కనిపించడమే. వీటిని వెదురుతో చేసిన బుట్టలోనో లేక ఇత్తడి పళ్లెంలోనో పేరుస్తారు. ముందు రోజే పూలను రంగుల్లో ముంచి ఆరబెట్టుకుంటారు. ఆ తర్వాత పళ్లెంలో సొర లేదా గుమ్మడి కాయల ఆకులను పేర్చిన తర్వాత.. ఒక రంగు పూలను అమర్చుకోవాలి. తర్వాత దానికి కాంబినేషన్‌గా ఉండే మరో రంగును ఎంచుకొని.. వరుసగా చుట్టూ ఫేర్చుకోవాలి. మధ్యలో మిగిలిన ఖాళీ ప్రదేశంలో చెట్ల ఆకులు, మిగిలిన పూల రెక్కలు పోసుకుంటూ పేర్చుకుంటూ పోవాలి.
మనం తీసుకున్న పూలు, కాంబినేషన్ బట్టి ఎన్ని వరుసలు పెట్టుకోవాలో చూసుకొని.. అంత పెద్ద పళ్లెం తీసుకొని పేర్చుకోవాలి. ఆఖరిలో తామర పువ్వు లేదా గుమ్మడి పువ్వులను పెట్టుకోవాలి. వాటిపై పసుపుతో తయారుచేసిన గౌరమ్మను ఉంచాలి. దానికి కుంకుమ బొట్టు పెట్టి అగరొత్తులు వెలిగించాలి. ఆ తర్వాత పత్తితో వత్తుల మాల చేసుకొని బతుకమ్మకు వేసి ఉంచాలి.
తల్లి బతుకమ్మను చేసుకున్న తర్వాత మిగిలిన పూలతో పిల్ల బతుకమ్మను కూడా చేయాలి. తల్లీ పిల్లలు ఎప్పుడూ కలిసి ఉండాలని ఇది చెబుతుంది. బతుకమ్మ ఆడడం కోసం.. పెళ్లయిన ఆడవారు కూడా పుట్టింటికి చేరుకోవడం .. తల్లీకూతుళ్ల ప్రేమకు ఈ పండుగ ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో చెబుతుంది.
బతుకమ్మ పాటలు (Batukamma Songs)
బతుకమ్మ అంటేనే జానపద పాటల పండుగ. ఈ పండుగలో పల్లె పదాలు కనిపిస్తాయి. పల్లె జీవనం కనిపిస్తుంది. వివిధ రకాల కథలు కనిపిస్తాయి. వీటిలో స్త్రీల జీవితం చుట్టూ తిరిగే కథలే ఎక్కువగా ఉంటాయి. పురాణాలకు చెందిన కథలు, అమ్మవారిని కొలుస్తూ పాడే పాటలు కూడా ఉంటాయి. ఉదాహరణకు పల్లె పడుచులు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ పాడే పాటలు కూడా ఉంటాయి. ఉదాహరణకు..
బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో
అంటూ పాట పాడతారు. వీటితో పాటు అప్పటి స్త్రీల జీవనం గురించి చెబుతూ
ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో.. ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో..
ఒక్కడే మా అన్న ఉయ్యాలో.. వచ్చన్నపోడు ఉయ్యాలో.. అంటూ పాడుకుంటారు.
వీటితో పాటు అమ్మవారిని కొలుస్తూ.. ‘శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా.. వంటి పాటలతో పాటు ఉసికెలో పుట్టే గౌరమ్మ.. ఉసికెలో పెరిగే గౌరమ్మ.. కుంకుమలో పుట్టే గౌరమ్మ.. కుంకుమలో పెరిగే గౌరమ్మ’ అంటూ పాడతారు.
శివుని రాక గురించి వేచి చూస్తూ “ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందమామ..” పాట పాడుతుంటారు. ఇవే కాదు… పూర్వ కాలంలో రాజుల కథలు, అత్తగారింట్లో అమ్మాయిలు ఎలా ఉండాలి.. పిల్లలను ఎలా పెంచాలి వంటి వాటన్నింటినీ.. పాటల రూపంలో పాడుతుంటారు. మొత్తంగా చెప్పాలంటే బతుకమ్మ పాటల్లో స్త్రీ జీవితం గురించే కనిపిస్తుంది.
బతుకమ్మ నైవేద్యాలు (Bathukamma Festival Special Recipes)
బతుకమ్మ సాధారణంగా తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు కాగా.. ఆఖరి రోజు మాత్రం సద్దుల బతుకమ్మ. ప్రతీ రోజు బతుకమ్మలను పెద్దగా పేరుస్తారు. మిగిలిన రోజుల్లో ఆ రోజు సంఖ్యను బట్టి.. అన్ని వరుసల బతుకమ్మలను పేరుస్తారు. ఆ రోజు పేరుకు తగినట్లుగా నైవేద్యాలను సిద్ధం చేసి బతుకమ్మ ఆడేటప్పుడు.. బతుకమ్మ పక్కనే ఉంచి. ఆ తర్వాత ఒకరికొకరు పంచుకొని తింటారు. ఏయే రోజుల్లో ఎలాంటి నైవేద్యాలు తయారు చేస్తారంటే..
ఎంగిలి పూల బతుకమ్మ : ఇది బతుకమ్మ పండుగలో మొదటి రోజు. అమావాస్య రోజున కాబట్టి నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి చేసే వాయనాలతో పాటు.. తమలపాకులు, తులసి ఆకులను నైవేద్యంగా ఇస్తారు.
అటుకుల బతుకమ్మ : పేరుకు తగినట్లే ఈ రోజున అటుకులను నైవేద్యంగా పెట్టి.. స్త్రీలందరూ వాయనంగా ఇచ్చుకుంటారు. కేవలం అటుకులు మాత్రమే కాకుండా కొందరు పప్పు, అటుకులు, బెల్లంతో తయారుచేసిన నైవేద్యాన్ని అర్పిస్తారు.
ముద్ద పప్పు బతుకమ్మ : ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేస్తారు. దీన్ని అందరికీ పంచుతారు. ఇవే కాకుండా పెసర్లు, చక్కెర, బెల్లం కలిపి కూడా నైవేద్యాన్ని తయారుచేస్తారు.
నాన బియ్యం బతుకమ్మ : ఈ రోజున నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలు చేసి పెడతారు. లేదా బియ్యం, పాలు, బెల్లం కలిపిన అన్నాన్ని వండి నైవేద్యం పెడతారు.
అట్ల బతుకమ్మ : ఈ రోజు బతుకమ్మకు అట్లు లేదా దోశెలు నైవేద్యంగా సమర్పించి వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు.
అలిగిన బతుకమ్మ : ఆరో రోజు అసలు బతుకమ్మ పేర్చరు. నైవేద్యం కూడా తయారుచేయరు. పూర్వం బతుకమ్మ తయారుచేసే సమయంలో.. ఆరో రోజు మాంసం తగలడంతో “అపచారం జరిగింది కాబట్టి”.. ఆరోజు బతుకమ్మ ఆడరు.
వేపకాయల బతుకమ్మ : ఈ రోజు సకినాల పిండితో వేపకాయల్లా చిన్నగా ముద్దలు చేసి.. వాటిని వేయించి పెడతారు. అది చేయలేని వారు పప్పు బెల్లాలను వాయనం ఇస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ : పేరు వెన్నముద్దలే అయినా.. ఈ రోజు పూర్తిగా వెన్నను ఉపయోగించకుండా.. కేవలం నువ్వులు, బెల్లంతో పాటు కొద్దిగా వెన్న లేదా నెయ్యి కలిపి తయారు చేసిన ముద్దలను నైవేద్యంగా పెట్టి వాయనం ఇస్తారు.
సద్దుల బతుకమ్మ : సద్దుల బతుకమ్మ రోజు.. అన్నంతో ఐదు రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచుతారు.
వీటితో పాటు మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, జీడిపప్పు, బాదం పప్పు.. వంటి పదార్థాల్లో వీలున్నవి ఉపయోగించి.. సత్తు పిండి తయారు చేసి దాన్ని వాయనంగా ఇచ్చుకుంటారు. వీటితో పాటు రొట్టెలు, బెల్లంతో చేసే మలీద లడ్డులను కూడా వాయనంగా ఇచ్చుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకలు (Navrathri in AP and Telangana)
దసరా నవరాత్రుల్లో ఒక్కో ప్రదేశానిదీ ఒక్కో సంబరం. గుజరాత్లో గర్భాతో పూజలు చేస్తే, కోల్ కత్తాలో దుర్గా పండాల్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ నవరాత్రి వేడుకలు విభిన్నంగా ఉంటాయి. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ నవరాత్రులకు ప్రత్యేకం అయితే.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు ఆలయాల్లో ఈ తొమ్మిది రోజులు.. అమ్మవారిని తొమ్మిది విభిన్నమైన అవతారాల్లో అలంకరిస్తారు.
ఆఖరికి పదో రోజైన విజయ దశమి రోజున.. అమ్మవారిని రాజరాజేశ్వరి రూపంలో సిద్ధం చేస్తారు. ప్రసిద్ధ దేవీ క్షేత్రం అయిన విజయవాడలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వీటితో పాటు బాసర, ఆలంపూర్, శ్రీశైలం వంటి క్షేత్రాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ (Dussehra in Andhra Pradesh and Telangana)
దసరా పండగను ఘనంగా జరుపుకునే రాష్ట్రాల్లో కోల్ కతా, గుజరాత్.. ఆ తర్వాత కనిపించేవి మన తెలుగు రాష్ట్రాలే అని చెప్పుకోవచ్చు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయ దశమి అనే పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతుంది. ఈ పండగల సందర్భంగా ఆయుధ పూజ చేయడం ఆనవాయితీ. తమ తమ వాహనాలు, పనిముట్లకు ప్రతి ఒక్కరూ పూజలు నిర్వహిస్తారు. పూల దండలు వేసి కొత్త వాటిలా అలంకరిస్తారు. దసరా రోజు రావణాసురుడి బొమ్మను కాల్చి.. చెడుపై మంచి సాధించే విజయంగా భావిస్తారు. తెలంగాణలో అయితే.. ఈ పండగ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మహాలయ అమావాస్య సందర్భంగా పెద్దవాళ్లను తలచుకుంటూ బియ్యాన్ని, ఇతర వస్తువులను దానం చేస్తారు. దుర్గాష్టమి రోజే సద్దుల బతుకమ్మ వస్తుంది కాబట్టి.. ఆరోజు కనీసం ఐదు రకాల అన్నాలను తయారుచేస్తారు. మహర్నవమి సందర్భంగా దేవాలయాలకు వెళ్లడం కనిపిస్తుంది. ఇక అసలైన పండగ విజయ దశమి లేదా దసరా రోజు మొదలవుతుంది. ఆ రోజు సరదానే వేరు. ఉదయాన్నే లేచి ఇళ్లు శుభ్రం చేసి.. పూలు, మామిడి ఆకులతో అలంకరిస్తారు. అడవికి వెళ్లి పాలపిట్టను చూసి వస్తారు.
దసరా రోజు పాలపిట్టను చూస్తే చాలు.. సంవత్సరమంతా మంచి జరుగుతుందని అంతా భావిస్తారు. ఇక బంధుమిత్రులంతా ఒక్కచోట చేరి పిండి వంటలు, రుచికరమైన వంటకాలతో పండగ జరుపుకుంటారు. సాయంత్రం ఆయుధ పూజ, శమీ పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత పూజించిన జమ్మి ఆకులను ఒకరికొకరు పంచుకొని.. అలయ్ బలయ్ (దసరా శుభాకాంక్షలు) చెప్పుకుంటారు. పెద్దవాళ్లకు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు.
దసరా శుభాకాంక్షల మెసేజ్‌లు (Dussehra Special Messages)
దసరా అంటేనే చెడుపై మంచి సాధించే విజయానికి సూచిక. మరి ఈ పండగ సందర్భంగా.. మీ సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా? అందుకే ఈ శుభాకాంక్షలతో.. మీ సన్నిహితులకు దసరా విషెస్ చెప్పేయండి.
1. ఈ దసరా మీ ఇంట్లో ఆనందోత్సాహాలు నింపాలని, ఆ దుర్గా మాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. విజయ దశమి శుభాకాంక్షలు.
2. తన బిడ్డల పాలిట చల్లని తల్లి, ఆకలి అన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ, లాలించే భ్రమరాంబ, తప్పు చేసిన వారిని దండించే దుర్గ, ఆ అమ్మల గన్న అమ్మ మీ అందరినీ తన ఒళ్లో పెట్టుకొని కాపాడాలని.. అన్నింటా విజయాలు అందించాలని కోరుకుంటూ విజయ దశమి శుభాకాంక్షలు.
3. ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు.
4. మీ జీవితంలోనూ చెడు పై మంచి విజయం సాధించాలని.. అలాగే అంతా మంచే జరగాలని.. సరైన దారిలో నడిచేందుకు మీకు శక్తి సామర్థ్యాలు అందాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.
5. ఈ దసరా మీకున్న సమస్యలన్నింటినీ రావణుడిలా కాల్చేసి.. మీ కుటుంబానికి లెక్కలేనంత సంతోషం మూటగట్టుకు రావాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు.
6. చెడు పై మంచి సాధించిన విజయాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే రోజు విజయ దశమి. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
7. ఈ దసరా సందర్భంగా చెడును కాల్చి బూడిద చేసేద్దాం. మంచిని మనలోకి ఆహ్వానిద్దాం. హ్యాపీ విజయ దశమి.
8. దసరా చెడుపై మంచి గెలిచిన రోజు. ఈ సందర్భంగా మీ జీవితంలో… మీ చుట్టూ ఉన్న చెడు మొత్తం తొలగిపోయి.. మీలో, మీతో పాటు ఉన్న మంచి గెలవాలని కోరుకుంటూ.. హ్యాపీ దసరా.
9. ఈ అందమైన రోజున ఉన్న ఆనందం, అందం.. మీ జీవితంలో సంవత్సరమంతా ఉండాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు.
10. మీ దసరా మీ జీవితాల్లో ఆనందమైన వెలుగులు నింపాలని.. మీ జీవితం ఎప్పటికీ సంతోషమయంగా మారాలని కోరుకుంటూ విజయ దశమి శుభాకాంక్షలు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.