'అమల - నాగార్జునల' ప్రేమకథ ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అంతే స్ఫూర్తినీ నింపుతుంది..!

'అమల - నాగార్జునల' ప్రేమకథ ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అంతే స్ఫూర్తినీ నింపుతుంది..!

(Akkineni Nagarjuna and Amala - Love Story)

అక్కినేని నాగార్జున - టాలీవుడ్ మన్మథుడిగా అందరి చేతా కితాబునందుకున్న వ్యక్తి.  అలాగే 'కింగ్'గా కూడా ఆయన పేరు అభిమానులకు సుపరిచితం. ఈ స్టార్ హీరో తన సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు చూశాడు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా.. చిన్న వయసులోనే అనేక ఎత్తుపల్లాలని అతిదగ్గరగా చూశాడు. 

పెళ్లి చేసుకున్న తరువాత హీరోగా కెరీర్ ప్రారంభించిన.. అతికొద్దిమంది కథానాయకులలో నాగార్జున ఒకరు. ఆయన 1986లో 'విక్రమ్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అంతకు రెండేళ్ల ముందే.. అనగా 1984లోనే ఆయన వివాహం జరిగింది.

తెలుగు చిత్రసీమలో అప్పటికే పెద్ద నిర్మాత అయిన రామానాయుడి ఏకైక కుమార్తె లక్ష్మితో.. నాగార్జున వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే హీరో నాగచైతన్య. అయితే కొన్ని కారణాల వల్ల.. నాగార్జున తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్నారు.

కృష్ణవంశీ - రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

ఆ పరిణామం ఆయన కెరీర్‌ను, జీవితాన్ని కూడా కొన్ని సంవత్సరాలు ప్రభావితం చేసింది. అలాంటి సమయంలోనే  విడుదలైన శివ, గీతాంజలి చిత్రాలు నాగార్జునకు ఒక స్టార్ హోదాను కట్టబెట్టాయి. అలాగే సహచర నటి అమల రూపంలో.. నాగ్‌కు ఒక మంచి స్నేహితురాలు కూడా దొరికింది.  'కిరాయి దాదా' చిత్రంతో ప్రారంభమైన వీరి స్నేహం.. క్రమంగా 'శివ' చిత్రం విడుదల అయ్యేసరికి.. ఒకరంటే ఒకరికి ఇష్టంగా అర్ధమైంది. తెలుగులో అమల.. ఎక్కువగా నాగార్జున చిత్రాలలోనే నటించడం విశేషం.

అయితే అప్పటికే ఒకసారి వివాహబంధంలో విఫలమవ్వడంతో.. అమలతో తన జీవిత ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అడుగులు వేశారు నాగ్. ఇదే క్రమంలో ఆయన అమలతో  పెళ్లికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అప్పటికే నాగార్జున వ్యక్తిత్వంతో పాటు.. తనపై ఆయన చూపిస్తున్న ప్రేమను గురించి తెలిసిన ఆమె.. తన అంగీకారాన్ని తెలపడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఇక ఈ నిర్ణయాన్ని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కూడా కాదనలేదు. తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే సమర్థత.. నాగ్‌కు ఉందని ఆయనకు తెలుసు. అందుకే నాగార్జున - అమల.. వీరిరువురి పెళ్లికి తన అంగీకారాన్ని ఆయన ఆనందంగా తెలియచేశారు. వీరి వివాహం పెద్దలు, సన్నిహితుల సమక్షంలో 1992లో నిరాడంబరంగా జరిగింది. వీరిరువురికి కలిగినే సంతానమే అఖిల్. తను 1994లో జన్మించారు.

ఎప్పుడైతే నాగార్జునని పెళ్లి చేసుకున్నారో.. అప్పటి నుండి అమల తన సినీ కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె నాగార్జునకి అన్ని విషయాల్లోనూ వెన్నెముకగా నిలిచింది. ఆ సమయంలోనే ఆమె జంతువుల సంరక్షణ కోసం "బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్"ని ఏర్పాటు చేసింది. అలాగే సామాజిక సేవా రంగంలో కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తోంది. 

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

ఇక నాగార్జున మొదటి భార్య సంతానమైన నాగ చైతన్యతో కూడా.. అమలకి చాలా మంచి అనుబంధమే ఉంది. అలాగే వేర్వేరు తల్లుల పిల్లలే అయినా.. నాగ చైతన్య, అఖిల్‌లు కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా సొంత అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండడం గమనార్హం.

ఒకానొక సందర్భంలో  నాగ్ మాట్లాడుతూ.. " శివ" చిత్రం నాకు లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ అని చెప్పడం జరిగింది. ఆయన అలా చెప్పడానికి ముఖ్య కారణం - ఒకటి 'శివ' చిత్రం అయితే..  మరొకటి ఆయన ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే అమలతో ప్రేమలో పడడం. ఆ షూటింగ్‌లోనే నాగ్‌కు.. అమల తన జీవిత భాగస్వామి అయితే బాగుంటుందనే ఆలోచన వచ్చిందట.

వీరి ప్రేమకథ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానులకు ఉండడం సహజం. అందుకు కారణం.. వీరిద్దరూ సెలబ్రిటీలు కావడమే. అయితే ఇదే ప్రేమకథ.. చాలామందికి స్ఫూర్తి అని ఎందుకు అంటున్నామంటే.. "చాలా మంది వివాహం బంధంలో విఫలమైనా లేదా ప్రేమలో మోసపోయినా.. తమ జీవితం ముగిసిపోయింది" అని బాధపడుతుంటారు. అలాంటి వ్యక్తులు.. తమ జీవితంలో రెండో అవకాశం కోసం ప్రయత్నించవచ్చని.. అప్పుడు మంచి అనేది కచ్చితంగా జరుగుతుంది అనేదానికి.. అమల, నాగార్జుల ప్రేమకథ ఒక ప్రేరణ అని చెప్పవచ్చు. 

దర్శక ధీరుడు రాజమౌళి - రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?