దర్శక ధీరుడు రాజమౌళి - రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?

దర్శక ధీరుడు రాజమౌళి - రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?

(S S Rajamouli Love Story)

ఎస్ ఎస్ రాజమౌళి.. (S S Rajamouli) ఆ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయన పేరుని ప్రపంచవ్యాప్తం చేశాయి... చేస్తూనే ఉంటాయి. అయితే తన విజయాల్లో ఆయన కుటుంబ పాత్ర  కూడా విస్మరించరానిది. రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడంటే.. ఆ చిత్రానికి వెన్నుముకగా ఉండేది ఆయన కుటుంబమే. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఆయన భార్య రమా రాజమౌళి. రాజమౌళి చిత్రాలలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె పోషించిన పాత్ర ఎంతో కీలకం.

కృష్ణవంశీ - రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

మరి టాలీవుడ్ జక్కన్నగా పేరుగాంచిన ఆ వ్యక్తికి.. సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్న రమ.. రాజమౌళి జీవితంలోకి ఎలా ప్రవేశించిందో చాలామందికి తెలీదు. అసలు వారి ప్రేమ, వివాహం గురించిన వివరాలు కూడా పెద్దగా ఎవరికి తెలియవు. ఈ క్రమంలో మనం కూడా వారి ప్రేమకథ ఎలా పుట్టిందో? వారి పెళ్లికి దారి తీసిన కారణాలేమిటో? తెలుసుకుందామా

నిజం చెప్పాలంటే.. రాజమౌళి, రమల (Rama Rajamouli) వివాహ బంధం ఎంతో ఆదర్శమైంది. ఎందుకంటే, రాజమౌళితో రమకి వివాహం కాక మునుపే.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పలు భేదాభిప్రాయాలతో ఆ దంపతులు విడిపోగా.. రమ తన కొడుకు కార్తికేయతో కలిసి ఒంటరిగా నివసించడం గమనార్హం. 

ఆ సమయంలోనే రాజమౌళికి రమతో  పరిచయం కావడం.. ఆ బంధం క్రమంగా స్నేహంగా.. ప్రేమగా మారి ఆ తరువాత ఇరువురు పెళ్లి చేసుకోవడానికి దారి తీసింది. అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే - రమ సొంత చెల్లెలు కీరవాణి భార్య వల్లి కావడం విశేషం. రాజమౌళి కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగానే.. ఆమెకు తనతో తొలిసారిగా స్నేహం ఏర్పడింది. రమా, రాజమౌళిల వివాహం కూడా చాలా నిరాడంబరంగా జరిగింది. రాజమౌళి అన్న కీరవాణి చేతుల మీదుగా.. ఆయన ఇంట్లోనే ఆ వివాహం జరిగింది.

వివాహానంతరం రమ, రాజమౌళి దంపతులు తీసుకున్న నిర్ణయాలు కూడా నలుగురికీ ఆదర్శంగా ఉండడం విశేషం. ఉదాహరణకి.. రమకు సంతానం ఉంది కాబట్టి.. మళ్లీ పిల్లల కోసం ఆలోచించలేదట ఈ ఆలుమగలు. అలాగే ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆ పాపే ఎస్. ఎస్. మయూఖ. 

సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు "పూరి జగన్నాధ్ - లావణ్య"ల లవ్ స్టోరీ..!

ఈ క్రమంలో వీరి ఇరు కుటుంబాలని సైతం మనం అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే వారిరువురు  దంపతులుగా తీసుకున్న నిర్ణయానికి.. వారంతా మద్దతు తెలపడం నిజంగానే ఒక మంచి పరిణామం. ఇక రాజమౌళి విజయ రహస్యం ఏంటి అని? ఎవరైనా ఇంటర్వ్యూలలో అడిగితే..  తన కుటుంబమే తన విజయానికి కారణమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఒకరకంగా అది నిజం అని కూడా అనిపిస్తుంది.

ఇవే విషయాలని ఒక ఇంటర్వ్యూ‌లో రామా రాజమౌళితో ప్రస్తావించగా- "అందులో పెద్ద విశేషమేముంది... మేమంతా ఒక కుటుంబం, మేమందరమూ ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉంటాం" అని చాలా చక్కగా చెప్పిందామె. ఇక వీరి ప్రేమకథ వింటే.. మీకు కూడా కచ్చితంగా ఒక మంచి ఆదర్శ ప్రేమకథగా అనిపించకమానదు. అందులో సందేహమే లేదు.

ఎన్నో గొప్ప కథలను తెరకెక్కించే దర్శక ధీరుడు రాజమౌళి వ్యక్తిగత జీవితం కూడా ఒక గొప్ప కథే. ముఖ్యంగా ఆయన తన జీవితంలోకి రమను ఆహ్వానించడం.. ఆ పైన వారి వైవాహిక జీవితం సాగిస్తున్న తీరు ఎందరికో ఆదర్శం అని చెప్పాలి. అయితే వీరిరువురు మాత్రం తమ జీవితం అందరికి ఆదర్శం అని ఏనాడూ చెప్పలేదు. బహుశా చెప్పరు కూడా. అంతే కదా.. ఒక పనిని మన మనసుకి నచ్చి చేయాలి తప్ప.. అదేదో పదిమంది మెప్పు కోసం చేయకూడదు కదా!

రమ, రాజమౌళిల ప్రేమకథని తెలుసుకున్న తరువాత ..కచ్చితంగా ఇది ఒక ఆదర్శ ప్రేమకథ అని మీరు కూడా భావిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా.. ఈ ఆదర్శ జంటకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

కొనసాగుతున్న RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!