మాది 100 % 'లవ్ స్టోరీ' - సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

మాది 100 % 'లవ్ స్టోరీ' - సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

(Telugu Singer Geetha Madhuri and Actor Nandu's Love Story)

తెలుగులో వచ్చే 90 శాతం సినిమాల్లో ప్రేమకథలే ఉంటాయి. అలాగే చిత్రపరిశ్రమలోని సెలబ్రిటీలలో దాదాపు 20 శాతం మంది ప్రేమవివాహాలే చేసుకుంటారు. అలా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్న జంటల్లోని.. ఓ వైవిధ్యమైన జోడి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఇంతకీ ఆ జంట ఎవరంటే - తన చక్కటి గాత్రంతో.. అటు మాస్ ఇటు క్లాస్ అన్న తేడా లేకుండా.. పాటలు పాడడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కలిగిన గీతా మాధురి.. అలాగే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నందు.

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

ఈ ఇద్దరి ప్రేమ ఎలా మొదలైంది? వీరు ఒకరినొకరు ఇష్టపడటానికి కారణాలేంటి? వీరి ప్రేమ .. పెళ్లికి ఎలా దారితీసింది? వంటి ప్రశ్నలకి సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఈ ఇద్దరి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా? - ఒక సాంగ్ రికార్డింగ్ స్టూడియోలో. నందు హీరోగా ఒక సినిమా ప్రారంభోత్సవం జరగ్గా.. ఆ చిత్ర పాటల రికార్డింగ్ సమయంలో.. వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారట. అయితే అది కేవలం ముఖ పరిచయమే. అయితే కర్నూల్‌కి వరదలు వచ్చిన సమయంలో తెలుగు చిత్రపరిశ్రమ.. ఆ ప్రాంతానికి అండగా నిలబడింది. నిధులను సేకరించడం కోసం ఓ కార్యక్రమం కూడా చేసింది. ఇదే కార్యక్రమంలో గీతా మాధురి,  నందులు మళ్లీ కలిసారట. ఆ తర్వాతే వారిద్దరూ.. మంచి స్నేహితులుగా మారారట. 

అయితే వీరి ప్రేమకి కారణం మాత్రం.. ఇద్దరికీ జీవితం పట్ల ఉన్న భావసారూప్యత  అనే చెబుతారు. ఎందుకంటే చిత్రపరిశ్రమలో అవకాశాలు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. అటువంటి సమయంలో భవిష్యత్తు మీద క్లారిటీ ఉండడం ఎంతైనా అవసరం. ఈ విషయంలో మాత్రం ఈ జంటకి పక్కా క్లారిటీ ఉండేదట. బహుశా ఈ క్లారిటీనే వీరిరువురిని.. ఇలా ముందుకి సాగేలా చేసిందని అంటుంటారు వీరి సన్నిహితులు.

"100% లవ్" చిత్రంలో సెకండ్ హీరో పాత్రలో నటించాడు నందు. ఆ సినిమా  ఆడియో విడుదల కార్యక్రమానికి గీతామాధురి కూడా హాజరైందట. ఆ ఫంక్షన్‌లోనే వారి స్నేహం మరింత పెరిగిందని చెబుతుంటారు. నందు తనకు నచ్చడానికి ప్రధాన కారణం..  అతని కళ్ళు అని అంటుంది గీత. ఏదైతేనేం.. వీరి స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై.. ఇరు కుటుంబాలకి ముందుగా ఎటువంటి సమాచారం కూడా లేదట.

హీరో 'శ్రీకాంత్' తన రియల్ లైఫ్ హీరోయిన్ 'ఊహ'కి చేసిన.. ప్రపోజల్ గురించి మీకు తెలుసా?

ఒకరోజు ఉన్నటుండి.. వీరి ప్రేమకు సంబంధించి ఓ వెబ్ సైట్ వార్తని ప్రచురించడం జరిగింది. ఈ వార్త బయటకి రావడంతో.. ఇరు కుటుంబాలు ఈ విషయమై ఇద్దరినీ ఆరా తీశారట. అప్పటికే ఇరువురు జీవితాన్ని కలిసి పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి.. తమకి ఒకరంటే మరొకరికి ఉన్న ఇష్టాన్ని తమ పెద్దలకి తెలియచేశారు. ఇక అప్పటికే పాపులర్ సింగర్‌గా గీత మాధురి గురించి నందు ఇంట్లో తెలియడంతో పాటు.. గీతకి మంచి స్నేహితుడిగా వాళ్ళ ఇంట్లో నందుకి కూడా మంచి పేరుండడం ఈ జంటకి బాగా కలిసొచ్చింది.

అయితే వీరిద్దరూ ఇంకొద్ది సమయం తీసుకుని పెళ్లి చేసుకుందామని భావించగా..  పెద్దలు మాత్రం ప్రేమ వ్యవహారం బయటకి తెలిసాక ఎక్కువగా ఆలస్యం చేయడం మంచిది కాదని అనుకున్నారట. అందుకే ఇద్దరికీ వెంటనే వివాహం జరిపించారు. ఇక వీరి వివాహం...  9 ఫిబ్రవరి 2014 తేదిన హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కల్యాణ మండపంలో జరిగింది. ఈ ఇద్దరి వివాహానికి చిత్రపరిశ్రమ నుండి ఎందరో తరలి వచ్చారు. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి ప్రముఖులెందరో వచ్చి వీరిని ఆశీర్వదించడం జరిగింది.

ప్రస్తుతం వీరు తమ అయిదేళ్ల వివాహ బంధంలో.. ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా సాగిపోతున్నారు. వీరి వివాహమయ్యాక, నందు సినిమాలతో బిజీ అయిపోతే.. గీతా మాధురి తన పాటలు, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలతో ఇంకా బిజీ అయింది. ఇక వీరి ప్రేమ బంధానికి గుర్తుగా.. ఈ సంవత్సరం ఆగష్టు 9న ఈ జంటకి ఒక చంటి పాపాయి జన్మించింది. "గీతానంద నిలయం" అయిన వారింటికి.. "మహాలక్ష్మి వచ్చింది" అంటూ ఈ ఇరువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అయితే వీరి మధ్య ఒకరిపట్ల మరొకరి ఇష్టానికి కారణమైన "100% లవ్" చిత్రం.. వీరి జీవితాల్లో ఒక మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. అలాగే వీరిద్దరి మధ్య ఉంది కూడా.. 100% లవ్ అని చెప్పక తప్పదు.

'అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల' ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా...!