హీరో 'శ్రీకాంత్' తన రియల్ లైఫ్ హీరోయిన్ 'ఊహ'కి చేసిన.. ప్రపోజల్ గురించి మీకు తెలుసా ?

హీరో 'శ్రీకాంత్' తన రియల్ లైఫ్ హీరోయిన్ 'ఊహ'కి చేసిన.. ప్రపోజల్ గురించి మీకు తెలుసా ?

హీరో శ్రీకాంత్ అనగానే మనకి ఠక్కున గుర్తొచ్చేవి.. ఫ్యామిలీ హీరోగా ఆయన చేసిన చిత్రాలు. అయితే ఫ్యామిలీ సినిమాల్లో ఎంతగా అలరించాడో అదే స్థాయిలో ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ వంటి చిత్రాలలో కూడా వైవిధ్యమైన పాత్రల్లో తన అభినయాన్ని పండించగలిగాడు.

సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు "పూరి జగన్నాధ్ - లావణ్య"ల లవ్ స్టోరీ..!

దాదాపు నూరు చిత్రాలు హీరోగా నటించి ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకోగలిగాడు. ఈ తరుణంలో ఆయన రియల్ లైఫ్ లవ్‌స్టోరీ (Love Story) గురించి మనమూ కొద్దిసేపు మాట్లాడుకుందామా..?

శ్రీకాంత్ తన సహచర నటి, హీరోయిన్ ఊహ అలియాస్ శివరంజని అలియాస్ ఉమ‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే.

చిత్రమేంటంటే.. శ్రీకాంత్ (Srikanth) తన సినిమా కెరీర్‌లో ఎన్నో ప్రేమకథలలో నటించాడు. నటించడమే కాకుండా ఆయా చిత్రాల్లో.. తనదైన శైలిలో పాత్రలకు జీవం పోసి ఎంతోమంది అమ్మాయిల హృదయాల్ని కొల్లగొట్టాడు. ఈ క్రమంలో మనం కూడా శ్రీకాంత్ నిజ జీవితంలో ఊహతో ఎప్పుడు ప్రేమలో (Love) పడ్డాడు? ఎలా తన మనసులోని మాటని బయటపెట్టాడు? వంటి విషయాలు తెలుసుకుందాం

శ్రీకాంత్, ఊహ.. వీరిద్దరూ కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు. అయితే వీరు తొలిసారిగా కలిసి నటించిన చిత్రం మాత్రం 'ఆమె'. ఈ చిత్రం ద్వారానే ఊహ తెలుగు చిత్రపరిశ్రమకి హీరోయిన్‌గా పరిచయమైంది. అలాగే ఆమె శ్రీకాంత్ జీవితంలోకి ప్రవేశించడానికి కారణం కూడా ఈ చిత్రమే. ఆమె చిత్రం ముహూర్తపు షాట్‌లోనే తొలిసారిగా వీరు ఒకరినొకరు చూసుకున్నారట. అలా ఏర్పడిన వారి పరిచయం.. ఆ తర్వాత స్నేహంగా మారింది. అదే స్నేహం ఇద్దరి మధ్య ఇష్టాన్ని పెంచింది. కానీ ఎంత స్నేహితులైనా.. ఈ ఇద్దరు కూడా తమ ప్రేమని ఒకరితో మరొకరు పంచుకోలేదు.

దర్శక ధీరుడు రాజమౌళి - రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?

కానీ ఓ సందర్భంలో.. శ్రీకాంత్ తన రియల్ లైఫ్‌లో కూడా.. హీరోలాగే డేరింగ్, డ్యాషింగ్‌‌గా ఊహ ఇంటికి నేరుగా వెళ్లి ప్రపోజ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారట. వారి ప్రేమకథకే ఇది ఓ హైలైట్ సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికి.. అది వారే అప్పటికి ఇంకా పంచుకోలేదు.

అటువంటిది శ్రీకాంత్ నేరుగా ఊహ (Ooha) ఇంటికి వెళ్ళడం మాత్రమే కాదు.. వాళ్ళ తల్లిదండ్రులని, ఊహని దేవుడగదిలోకి పిలిచి 'నేను తనని ప్రేమిస్తున్నాను.. అలాగే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను' అని చెప్పి తన మెడలోని బంగారు గొలుసు తీసి ఆమె మెడలో వేసాడట.

ఈ ఊహించని పరిణామానికి అందరూ షాక్ అయినప్పటికి .. అందులో నుండి బయటకి వచ్చి అందరూ వీరి ప్రేమని అంగీకరించారు. కానీ శ్రీకాంత్ ఈ షాక్ ఇవ్వకముందే.. ఊహ తల్లిదండ్రులు తనకి పెళ్లి సంబంధాలు చూశారట. ఈ ప్రపోజల్ తెలిసాక ఆ సంబంధాలు అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది.

శ్రీకాంత్ కూడా ఆ తర్వాత.. తన ఇంటిసభ్యులకు ఇదే స్టైల్‌‌లో సూటిగా తాను ఊహని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. తొలుత ఇది సాధ్యపడుతుందా లేదా..? అని ఆలోచించినప్పటికి వారు కూడా వీరిద్దరి ప్రేమని అంగీకరించి పెళ్ళికి పచ్చ జెండా ఊపడం గమనార్హం. 

కృష్ణవంశీ - రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

జనవరి 20, 1997 తేదిన ఈ ప్రేమికులు.. ఆలుమగలుగా మారారు. ఇక వీరి ప్రేమకి ప్రతిరూపాలుగా ముగ్గురు పిల్లలు - రోషన్, మేధ & రోహన్‌లు జన్మించారు. రెండేళ్ళ క్రితం రోషన్ హీరోగా 'నిర్మల కాన్వెంట్' అనే చిత్రంతో పరిచయమయ్యాడు. భవిష్యత్తులో మెయిన్ స్ట్రీమ్ హీరోగా ఎదిగేందుకు.. రోషన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం.

ఇక ఊహ హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని గృహిణిగా మారిన సంగతి తెలిసిందే. ఆమె పెళ్లి కారణంగానే నటనకి దూరమవ్వాల్సి వచ్చిందా? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తింది. అయితే ఆమె ఇదే విషయంపై స్పందిస్తూ.."నేను పెళ్లి చేసుకున్న తరువాత నటనను స్వస్తి చెప్పాలనుకున్నాను. ఇది నేను సినిమాల్లోకి అడుగుపెట్టగానే తీసుకున్న నిర్ణయం. అంతేతప్ప ఈ విషయంలో శ్రీకాంత్ ప్రమేయం ఏమీ లేదు" అని తెలిపింది.

'న్యాచురల్ స్టార్ నాని - అంజన'ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!