Birthday Special : 'విక్టరీ' అనే పదాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న.. ఫ్యామిలీ హీరో 'వెంకటేష్'

Birthday Special : 'విక్టరీ' అనే పదాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న.. ఫ్యామిలీ హీరో 'వెంకటేష్'

Victory Venkatesh Birthday Special

అగ్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఒక సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదగడానికి ఆ కుర్రాడు పడిన కష్టం అంతా ఇంతా కాదు. 'కలియుగ పాండవులు' సినిమాతో చిత్ర సీమకు పరిచయమయ్యాక.. తొలినాళ్లలో వెంకటేష్ కెరీర్ నత్తనడకే నడిచింది. కానీ ఆ తర్వాత ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు, ఫ్యామిలీ హీరోగా నిలదొక్కుకోవడానికి గాను తాను చేసిన ప్రయత్నాలు వెంకటేష్‌కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేశాయి. తన 30 ఏళ్ల కెరీర్‌లో 72 సినిమాలలో నటించిన వెంకటేష్.. ఇప్పటికి 7 నంది అవార్డులు, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకొని ఎన్నో రికార్డులనే తిరగరాశారని చెప్పచ్చు. 

నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ "వెంకీ మామ" విశేషాలివే..!

ఈ రోజు విక్టరీ వెంకటేష్ జన్మదినం సందర్భంగా.. ఆయన నటించిన చిత్రాలలో.. టాప్ 10 మీకోసం ప్రత్యేకం

స్వర్ణ కమలం - కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1988లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ నరక్తి జీవితానికి బాసటగా నిలిచిన చిత్రకారుడిగా వెంకటేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాల వేడుకలో స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నారు వెంకటేష్. 

ప్రేమ - 1989లో సురేష్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత ప్రేమ కావ్యం 'ప్రేమ' . ఈ చిత్రంలో వర్తమాన గాయకుడిగా వెంకటేష్ నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. రేవతి హీరోయిన్‌గా నటించిన ఇదే చిత్రం.. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కింది. 

Image Credit : Suresh Productions

చంటి - రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1992లో తెరకెక్కిన ఈ చిత్రం వెంకటేష్ ఎంత టాలెంటెడ్ యాక్టరో చెప్పకనే చెప్పింది. అమాయక పల్లెటూరి యువకుడిగా ఈ చిత్రంలో వెంకటేష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే చిత్రం హిందీలో కూడా  'అనారి' పేరుతో రీమేక్ అయ్యింది. 

ప్రేమించుకుందాం రా  - ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెంకటేష్‌కు ఒక్కసారిగా లవర్ బోయ్ ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం 'ప్రేమించుకుందాం.. రా'. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అంజలా జవేరీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 1997లో విడుదలైంది. 

సూర్య వంశం -  తండ్రీ, కొడుకులుగా వెంకటేష్ డ్యుయల్ రోల్ పోషించిన ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి నిర్మించగా.. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఒక రకంగా వెంకటేష్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఇది. ఇదే చిత్రాన్ని హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రీమేక్ చేశారు. 

ధర్మచక్రం - సురేష్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ న్యాయవాదిగా పోషించిన పాత్ర నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉంటుంది. ఎన్నో భావోద్వేగాలు, ఆవేశంతో నిండిన ఆ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 

'విక్టరీ' వెంకటేష్ ముద్దుల కూతురు ఆశ్రిత.. పెళ్లి ముచ్చట్లు మీకోసం..!

Suresh Productions

నువ్వు నాకు నచ్చావ్ - 2001లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇదే ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం. ఆర్తి అగర్వాల్ ఈ చిత్రంతోనే తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. 

ఘర్షణ - యాక్షన్ థ్రిల్లర్స్‌లో కూడా వెంకటేష్ అద్భుతంగా నటించగలరని నిరూపించిన చిత్రం 'ఘర్షణ'. తమిళ చిత్రం 'కాకా కాకా'కి రీమేక్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో రామచంద్ర ఐపీఎస్‌గా నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయి నటించారు. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. 

గురు -  2017లో విడుదలైన 'గురు' చిత్రంలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్‌గా తనదైన శైలిలో నటించారు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని నటనకు వెంకీ ఫిల్మ్‌ఫేర్ నుండి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును కైవసం చేసుకున్నారు.

ఇతర చిత్రాలు - ఒక రకంగా చెప్పాలంటే వెంకటేష్ నటన సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అదే నటన ఆయనను ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి కూడా బాగా దగ్గర చేసింది. దృశ్యం, మల్లీశ్వరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జయం మనదేరా, కలిసుందాం రా, రాజా, గణేష్, పవిత్ర బంధం, గోపాల గోపాల మొదలైన చిత్రాలలో నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరన్నది నిజం. తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకటేష్ నటించిన "వెంకీ మామ" చిత్రం ప్రస్తుతం హిట్ టాక్‌తో నడుస్తోంది. 

అతని వయసు 50.. ఆమె వయసు 25.. చిత్రమైన ప్రేమకథలో "విక్టరీ వెంకటేష్"

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.