Chhapaak Movie Review : అస్తిత్వం కోసం.. ఓ అతివ చేసే పోరాటం ఈ 'చపాక్'

Chhapaak Movie Review : అస్తిత్వం కోసం.. ఓ అతివ చేసే పోరాటం ఈ 'చపాక్'

Deepika Padukone's Chhapaak Movie Review

ఇప్పటి వరకూ మనం ఎన్నో బయోపిక్‌లు చూసుంటాం. దేని గొప్పదనం దానిదే. ఆయా వ్యక్తుల జీవితాల నుండి మనం ఎంతోకొంత నేర్చుకుంటూ, స్ఫూర్తిని పొందుతూ లైఫ్‌లో ముందుకువెళ్లడానికి ఈ సక్సెస్ స్టోరీస్ పనికొస్తుంటాయి. మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్, దంగల్, మాంటో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.  కానీ ఓ కథ మనలో స్ఫూర్తిని రగల్చడమే కాకుండా.. ఆలోచింపజేస్తూ మానవత్వపు విలువల ప్రాధాన్యాన్ని తెలిపితే అదే ఈ 'చపాక్'. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన  ఈ చిత్రంలో దీపికా పదుకొణే ప్రధాన పాత్ర పోషించారు.

ఈ సినిమా కథలోకి వెళితే.. మాలతి (దీపిక పదుకొణే) ఓ కాలేజీ అమ్మాయి.  ఆ వయసులో అందరితోనూ కలివిడిగా తిరిగే ..  ఆమెది స్నేహానికి ప్రాణమిచ్చే తత్వం. అలాంటి తనకు ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అతడే బబ్బూ. రోజు మాలతి వెంట పడడమే తన పని. ప్రేమిస్తున్నానని ఆమెను వేధించడమే తన నిత్య దినచర్య. అయితే ఇదే సమయంలో మాలతి మరో అబ్బాయితో సన్నిహితంగా మెలుగుతుంది.

దేశంలో 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. అమ్మాయిలకు న్యాయం జరిగేదెప్పుడు : సమంత

ఇది నచ్చని బబ్బూ ఆమెను పలుమార్లు హెచ్చరిస్తాడు. ఆ తర్వాత యాసిడ్ బాటిల్‌తో దాడి చేస్తాడు. ఈ పనిచేయడానికి ఓ మహిళ కూడా సహకరిస్తుంది. యాసిడ్ దాడి జరిగాక మాలతి జీవితమే మారిపోతుంది. ఆమె ముఖంపై ఓ మాయని మచ్చని మిగులుస్తుంది. అప్పటి వరకు తనతో ఎంతో స్నేహంగా మెలిగిన వారు.. ఆ ఘటన జరిగాక ఆమె ముఖం చూడడానికే ఇష్టపడరు. కొందరు ఆమెను దూరం కూడా పెడతారు. అలాగే ఆమెకు భరోసా ఇచ్చి.. అండగా నిలిచినవారు కూడా కొందరు ఉంటారు. అందులో అమోల్ అనే కుర్రాడు ఒకరు. 

మానవత్వానికి మచ్చుతునకలు ఈ ఛాయా చిత్రాలు

అనుకోకుండా మాలతి జీవితంలోకి వచ్చిన అమోల్ (విక్రాంత్ మస్సీ) ఆమెలో మనోధైర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తాడు. అయినా మాలతిని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఆమె రూపాన్ని చూసి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడం లాంటి ఘటనలు ఆమెను కుంగదీస్తాయి. అలాంటి సమయంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా.. తమలాంటి వారి అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడడం కోసం.. తమ సమస్యలకు ఒక పరిష్కారాన్ని పొందడం కోసం న్యాయపోరాటానికి సిద్ధమవుతుంది ఆమె. మరి ఆ పోరాటంలో తను ఎంతవరకు విజయం సాధించిందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ముఖ్యంగా మాలతి పాత్రలో దీపిక ఒదిగిపోయి నటించిందనే చెప్పాలి. ఆమె వేసుకున్న ప్రొస్థటిక్ మేకప్.. చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా భావోద్వేగంతో నిండిన సన్నివేశాలలో ఆమె నటన ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఒక రకంగా అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. అలాగే దర్శకురాలు మేఘనా గుల్జార్ సినిమాను నడిపిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సంభాషణల విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. నేటి యువత తీరుతెన్నులు, ప్రవర్తన, సభ్య సమాజంలో సగటు ఆడపిల్లపై ఎదుటివారికి ఉండే చులకన భావం.. ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు. ఒక మనిషి.. జీవితంలో ముందుకు వెళ్లాలంటే వ్యక్తిత్వమనేది ఎంత ముఖ్యమో కూడా చెప్పకనే చెప్పారు. 

స్వార్థంతో నిండిన ఈ సమాజంలో.. తన అస్తిత్వం కోసం, విలువల కోసం ఆడపిల్ల ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈవ్ టీజర్స్, ర్యాగింగ్ పేరుతో ఆడపిల్లల ఆత్మాభిమానంతో ఆడుకొనేవారు, అమ్మాయి అంటే ఒక సెక్స్ సింబల్ మాత్రమే అనే ఒక గుడ్డి నమ్మకంతో బతికేవారు.. ఇలా మనకు ఈ సమాజంలో ఎందరో కనిపిస్తుంటారు. అలాంటి వారందరికీ చెంపపెట్టు ఈ సినిమా. మనిషి మనిషిలా బతకాలని చెప్పే సినిమా. విలువలతో కూడిన పెంపకమనేది ఇంటి నుండే మొదలవ్వాలని చాటి చెప్పే సినిమా. 

మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

నిజం చెప్పాలంటే.. యాసిడ్ దాడికి గురయ్యాక లక్ష్మీ అగర్వాల్ ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. ఈ సమాజంలోని మనుషుల ప్రవర్తనే అందుకు కారణం. కానీ ఆ ఆలోచనను తర్వాత విరమించుకున్నారు. తనలాగే ఇలాంటి దాడులకు గురైన మహిళలకు బాసటగా నిలిచారు. వారి హక్కుల కోసం న్యాయపోరాటం చేశారు. వారికి ఉపాధి అవకాశాలనూ వెతికిపెట్టారు. ఆమె టీమ్‌ సభ్యులలలో కొందరు ఒక కేఫ్ పెట్టుకొని..  ఇప్పుడు దాని మీద వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. ఇలా చెప్పాలంటే చాలా ఉంది. ఏదేమైనా.. లక్ష్మి జీవితం అస్తిత్వం కోసం పోరాటం చేసే ఎందరో వ్యక్తులకు స్ఫూర్తిదాయకం. ఆమె జీవితాన్ని సినిమాగా తీయాలని మేఘనా గుల్జార్ భావించడం.. అందులో దీపిక నటించడానికి మొగ్గుచూపడం అభినందనీయం. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి