2020 సంవత్సరంలో.. ఇప్పటికి దుమ్మురేపిన టాలీవుడ్ సినిమాలివే.. !

2020 సంవత్సరంలో.. ఇప్పటికి దుమ్మురేపిన టాలీవుడ్ సినిమాలివే.. !

2020 సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే ఓ నెల గడిచిపోయింది.  అదే సమయంలో ఈ సంవత్సరం.. తెలుగు సినీ పరిశ్రమ కూడా అనేక కొత్త చిత్రాలతో తన హంగామాను కొనసాగించింది.   సినిమా పరిశ్రమలో ఒక సెంటిమెంట్ ఉంది. ఈ కారణంగా ప్రతి ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల పైన చాలామందికి గురి ఉంటుంది. నిజం చెప్పాలంటే.. ఈ నమ్మకం వమ్ము కాలేదు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' టీజర్.. ఫ్యాన్స్ అంచనాలని అందుకుంటుందా?

ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే.. పెద్ద హీరోలు తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వారే - రజినికాంత్, మహేష్ బాబు, అల్లు అర్జున్. ఈ ముగ్గురి నుండి వచ్చిన మూడు చిత్రాలు కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. 

ముందుగా సూపర్ స్టార్ రజినికాంత్ (rajnikanth) సినిమా దర్బార్ విషయానికి వస్తే, పేరుకి ఇది తెలుగు వారికి డబ్బింగ్ చిత్రమైనప్పటికి.. రజనికి మన వద్ద ఉన్న ఫాలోయింగ్ చూసుకుంటే.. అది ఏ పెద్ద హీరోకి ఉన్న ఫాలోయింగ్‌కి తక్కువ కాదు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన చిత్రాలు ఇక్కడ ఎంతమేర వసూళ్ళు రాబడతాయి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.. పైగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది స్టార్ దర్శకుడు మురుగదాస్.

ఈ దర్శకుడుకి కూడా మన వద్ద మంచి మార్కెట్ ఉంది. ఇక వీరిద్దరి కలయికతో.. చాలా రోజుల తరువాత పోలీసు గెటప్‌‌లో చేస్తున్న చిత్రం కావడం కూడా.. ఈ దర్బార్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సంవత్సరం ఈ చిత్రం తెలుగులో పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ.. తమిళంలో మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 

ఇక ఈ సంవత్సరం విడుదలైన రెండవ చిత్రం 'అల వైకుంఠపురంలో'.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన మూడవ చిత్రం ఇది.  ఈ చిత్రం పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ  చిత్రం కూడా అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. హిట్ టాక్‌ను సొంత చేసుకుంది. ముఖ్యంగా కథ, కథనం, పాటలలో త్రివిక్రమ్ మార్క్ శైలి కనపడింది. బన్నీ అభిమానులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు" తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!

ఇక మహర్షి వంటి బ్లాక్ బస్టర్‌‌తో తన కెరీర్‌లో.. 25వ మైలురాయిని విజయవంతంగా దాటిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu). ఆయన 26వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరూతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రానికి వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం విశేషం. అనిల్ దర్శకత్వం వహించిన F2 చిత్రం.. గత సంక్రాంతికి విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

అలాగే సరిలేరు నీకెవ్వరూ చిత్రం కూడా మంచి విజయవంతమైన చిత్రంగానే నిలిచింది. ఈ చిత్రానికి మరొక అదనపు ఆకర్షణగా లేడీ అమితాబ్ విజయ శాంతి... చాలా కాలం తరువాత ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌నే ఖాతాలో వేసుకుంది. 

ఈ మూడు పెద్ద చిత్రాల నడుమ.. ప్రతి సంక్రాంతికి చక్కటి కుటుంబ కథా చిత్రం కూడా విడుదల కావడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా 'ఎంత మంచివాడవురా' అనే కుటుంబకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండేళ్ల క్రితం ఇదే సంక్రాంతి సీజన్‌కి వచ్చిన 'శతమానం భవతి' చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో కాగా.. మెహ్రీన్ హీరోయిన్‌గా నటించడం విశేషం. అయితే ఈ చిత్రం అనుకున్న మేర విజయాన్ని సాధించలేదు. 

ఇక ఇటీవలే విడుదలైన చిత్రాల విషయానికి వస్తే.. నాగశౌర్య నటించిన చిత్రం 'అశ్వథ్థామ' మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే తమిళ చిత్రం '96' కు రీమేక్‌గా వచ్చిన 'జాను' చిత్రం కూడా పాజిటివ్ టాక్‌‌ను సొంతం చేసుకుంది.  ఈ చిత్రంలో శర్వానంద్, సమంతలు హీరో, హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన రవితేజ 'డిస్కో రాజా' చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం అందరి దృష్టి ఫిబ్రవరి 14 తేదిన విడుదల అవుతున్న విజయ్ దేవరకొండ చిత్రం "వరల్డ్ ఫేమస్ లవర్" చిత్రం మీదే ఉంది. 

హైదరాబాద్ ట్రెండ్స్ : ఈ హోటల్‌ యజమాని నుండి ఉద్యోగుల వరకూ.. అందరూ మహిళలే..!