Education

ఆమె 105 సంవత్సరాల విద్యార్థిని.. నాలుగో తరగతి పాసై రికార్డు సాధించిన బామ్మ..

Soujanya Gangam  |  Nov 21, 2019
ఆమె 105 సంవత్సరాల విద్యార్థిని.. నాలుగో తరగతి పాసై రికార్డు సాధించిన బామ్మ..

(105 year old Grandma proves age is just a number and attempts fourth grade exam)

ఒక లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం ఇట్టే దూసుకుపోగలమని మన పెద్దలు చెబుతుంటారు. వయసు, శరీరం.. ఏవీ మనం చేయాలనుకున్న పనికి అడ్డుగా నిలవవు. “దేన్నైనా సాధించగలం” అన్న ఫీలింగ్ మన మనసులో ఉంటే చాలు.. మన స్థితిగతులు ఎలా ఉన్నా.. మనం కోరుకున్న లక్ష్యాన్ని సాధించేస్తాం. అదే ఎంతటి బలం ఉన్నా సరే.. “నేను ఈ పని చేయగలనా ?” అన్న అపనమ్మకం మీకుంటే.. దాన్ని మీరు సాధించలేరు. ఈ విషయాన్ని నిరూపిస్తూ 105 సంవత్సరాల వయసులో కూడా చదువుకుంటానని ముందుకొచ్చింది ఓ బామ్మ. 

కేరళకి చెందిన కాత్యాయనీ అమ్మ అనే బామ్మ.. గతంలో 96 సంవత్సరాల వయసులో నాలుగో తరగతి పరీక్షలు రాసి 99 శాతం మార్కులతో పాసైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మర్చిపోక ముందే.. ఇప్పుడు మరో బామ్మ కూడా చదువుపై తన ఆసక్తిని చూపిస్తూ పరీక్షలు రాసి పాసయ్యింది.

కేరళలోని కొల్లమ్‌కి చెందిన భగీరథీ అమ్మ అనే 105 సంవత్సరాల బామ్మకి చదువంటే ప్రాణం. కానీ మూడో తరగతి పూర్తి కాగానే తల్లి మరణించడంతో.. ఇంటి బాధ్యతను ఆమె తన భుజాలకెత్తుకుంది. ఇంటికి పెద్ద కూతురైన ఆమె.. తల్లి లేని లోటు తన తోబుట్టువులకు తెలియకుండా ఉండేందుకు తన శాయశక్తులా ప్రయత్నించింది. మూడో తరగతితో తన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి.. తోబుట్టువులతో పాటు తండ్రిని కూడా కంటికి రెప్పలా చూసుకుంది.

అందుకే పెళ్లయ్యాక.. తన కోరికను నెరవేర్చుకోవాలని భావించింది. కానీ .. ఆమెకు అక్కడా మొండి చెయ్యే ఎదురైంది. భర్త తనకు సహకరించినా.. పిల్లలు పుట్టిన తర్వాత వారి బాధ్యతలతోనే సమయం గడిచిపోయింది. ఆ తర్వాత భర్త మరణించడంతో.. ఒంటి చేత్తో తానే తల్లి, తండ్రి అయ్యి పిల్లలను పెంచి పెద్ద చేసింది. నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులను చదివించింది. తానొక్కతే ఆరుగురు పిల్లల పెళ్లిళ్లు కూడా చేసింది. ప్రభుత్వం నుంచి కూడా తనకు ఎలాంటి సహకారం అందలేదని.. ఆధార్ కార్డుతో పాటు వితంతు, వృద్ధాప్య పెన్షన్ వంటివేవీ రాకపోయినా.. తనే కష్టపడి కొడుకులు, కూతుళ్లతో పాటు.. మనవళ్లు, మనవరాళ్లను కూడా చూసుకున్నానని చెబుతుందీ బామ్మ.

తాజాగా తన బాధ్యతలన్నీ తీరిపోవడంతో.. ఈ బామ్మకి చదువుకోవాలనే కోరిక మళ్లీ పుట్టిందట. అందుకే కేరళ ప్రభుత్వం నిర్వహించే కేరళ స్టేట్ లిటరసీ ప్రోగ్రామ్‌లో భాగంగా చదువుకొని.. నాలుగో తరగతికి సమానమైన ఆ ప్రోగ్రామ్ పరీక్షలు రాసింది. ఈ పరీక్ష రాసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు కూడా సాధించింది. గతంలో ఈ రికార్డు 96 సంవత్సరాల కాత్యాయనీ అమ్మ పేరుతో ఉండేది.

ఈ సందర్భంగా ఈ మిషన్ రీసోర్స్ పర్సన్ అయిన కేబీ వసంత కుమార్ మాట్లాడుతూ.. “భగీరథీ అమ్మ వయసు వందేళ్లు దాటినా.. ఆమె కంటి చూపు చాలా బాగుంది. చెవులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఇక ఆమె జ్ఞాపకశక్తి కూడా మామూలుగా ఉండడం ఆశ్చర్యకరం” అంటూ చెప్పుకొచ్చారు.

చదువులోనూ, పరీక్షలు రాయడంలోనూ తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. తన కూతుళ్లు తనని జాగ్రత్తగా చూసుకున్నారని చెబుతుందీ బామ్మ. పరీక్షలు రాసే సమయంలో తనకు రాయడంలో కాస్త ఇబ్బంది ఎదురైతే.. తన చిన్న కూతురు తనకు సాయం చేసిందట.

ఆమె సాయంతో ఎన్విరాన్ మెంటల్ సైన్స్, గణితం, మలయాళం పరీక్షలు పూర్తి చేసిందీ బామ్మ. రాయడంతో పాటు పాటలు పాడడంలోనూ భగీరథీ అమ్మకి మంచి టాలెంట్ ఉందట. ఈ పరీక్షలు రాసి పట్టా తీసుకునేందుకు.. తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని.. తను తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు వదిలేశానని.. ఇప్పుడు దాదాపు 95 సంవత్సరాల తర్వాత తిరిగి చదువుకోవడం తనకెంతో సంతోషాన్ని అందిస్తోందని ఈ బామ్మ సంతోషంగా చెప్పడం విశేషం.

తన ఆరుగురు సంతానంలో ఒకరు మరణించారని.. పదిహేను మంది మనవళ్లు, మనవరాళ్లు ఉంటే.. అందులో ముగ్గురు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని చెప్పిన ఈ బామ్మ.. తనకు పన్నెండు మంది ముని మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని.. వారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందని చెబుతుంది.

తమ కలలను నెరవేర్చుకోవడానికి వయసు అనేది అడ్డు కాదని.. మరణించే లోపు ఏ వయసులోనైనా కలల సాకారానికి ప్రయత్నించవచ్చని ఈ బామ్మ నిరూపిస్తోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Education