Diet

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Soujanya Gangam  |  Sep 4, 2019
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?

రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో మనం తినే ఆహారం గురించి పెద్దగా పట్టించుకోం. మన ఆరోగ్యం గురించి పెద్దగా ఆసక్తి చూపించం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎలాగైతే కారు నడవడానికి పెట్రోల్ లేదా డీజిల్ అవసరమో.. మన శరీరంలోని వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా ఆహారం అంతే అవసరం. అంతేకాదు.. ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని సరైన సమయానికి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

మనం తినే ఆహారాల్లో అన్నింటికంటే ముఖ్యమైంది అల్పాహారం. అదే బ్రేక్ ఫాస్ట్ (Breakfast). ఉదయాన్నే ఆలస్యమైందనో.. లేదా కొన్ని క్యాలరీలు తగ్గుతాయనో…బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల.. మంచి కంటే చెడు  ఎక్కువగా ఉంటుంది. అసలు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయంటే..

1. బరువు పెరుగుతారు..

Shutterstock

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల క్యాలరీలు తగ్గి బరువు తగ్గుతామని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. ఎన్నో పరిశోధనల్లో ఇది అపోహ అని తేలింది. నిజానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తిననివారు.. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట. ఎందుకంటే ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. అంతేకాదు.. ఆకలి ఎక్కువగా వేయడం వల్ల.. మధ్యాహ్నం సమయంలో భోజనం ఎక్కువగా తినేస్తారు. ఇది కూడా బరువు పెరగడానికి కారణమే. అందుకే బరువు తగ్గాలనుకునే వారు.. తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది.

2.డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.

ఓ పరిశోధన ప్రకారం.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 54 శాతం పెరుగుతుందట. హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ 46, 289 మంది మహిళలపై ఆరు సంవత్సరాల పాటు ఓ పరిశోధన నిర్వహించింది. ఇందులో భాగంగా బ్రేక్ ఫాస్ట్ తినే అలవాటు లేని వారిలో.. డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది.

3. జుట్టు రాలిపోతుంది

Shutterstock

బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల్లో జుట్టు రాలిపోవడం కూడా ఒకటి. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీరానికి ప్రొటీన్‌ని తీసుకునే శక్తి తగ్గుతుంది. దీనివల్ల జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు.. ఉదయం తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యం. బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల జుట్టులో కెరాటిన్ కూడా నిలిచి ఉంటుంది. అందుకే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ చేయడం అవసరం.

4. ఎసిడిటీ పెరుగుతుంది

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల రోజంతా ఎసిడిటీతో బాధపడాల్సి వస్తుంది. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండడం వల్ల..  కడుపులో యాసిడ్ నిల్వ ఉండిపోతుంది. ఉదయం కూడా ఆహారం తీసుకోకపోవడం వల్ల.. కడుపులోని యాసిడ్ ఎక్కువైపోయి పైకి తన్నుకువచ్చేస్తుంది. ఆ విధంగా ఎసిడిటీ సమస్య బాధిస్తుంది. ఇలా రోజూ జరుగుతుంటే.. అల్సర్ సమస్య కూడా వచ్చే అవకాశాలుంటాయి.

5. గుండెపైనా ప్రభావం..

Shutterstock

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌కి దూరంగా ఉండేవారిలో.. గుండె పోటు ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. దీనికి చాలా కారణాలున్నాయి. అయితే అందులోని ముఖ్యమైన కారణం.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉండడం. ఇది కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ అలవాటు లేనివారు.. ఎక్కువగా గుండెజబ్బుల బారిన పడతారట.

6. మెదడు పనితీరు తగ్గుతుంది

మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి.. శరీరంలో జీవక్రియలన్నీ కొనసాగేందుకు తోడ్పడుతుంది. మన శరీరంలో శక్తి ఉన్నప్పుడు.. మెదడు కూడా వేగంగా పనిచేస్తుంది. కానీ అలా మనం శరీరానికి శక్తి అందించనప్పుడు మెదడు కూడా వేగంగా పనిచేయదు. వీటితో పాటు అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి కూడా కనిపిస్తాయి.

7. తలనొప్పి తప్పదు

Shutterstock

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయని వారికి తలనొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల.. శరీరంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. గ్లూకోజ్ తగ్గడం వల్ల హార్మోన్ల స్థాయులు తగ్గి రక్తపోటు పెరుగుతుంది. అప్పుడు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Diet