Diet

రోజులో గంటల తరబడి కూర్చోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఇవే

Sandeep Thatla  |  Oct 25, 2019
రోజులో గంటల తరబడి  కూర్చోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఇవే

ఒకప్పుడు సాధారణంగా  50 ఏళ్ళు & 60 ఏళ్ళు వయసు వచ్చాక నడుం నొప్పి లేదా వెన్నుపూసకి సంబందించిన ఇబ్బందులు తలెత్తుతుండేవి. వాటికి కారణాలు కూడా యుక్త వయసులో ఏవైనా బరువులు ఎత్తడం వంటివి లేదా వెన్నుపూస పైన భారం పడే పనులు చేయడం తో అక్కడున్న కీళ్లు అరిగి వచ్చిన సమస్యలు అవి.. కానీ ఇప్పుడు 25 ఏళ్ళు & 30 ఏళ్ళు నిండకుండానే నడుం నొప్పి లేదా నడుము భాగంలో ఉండే డిస్క్ ప్రాబ్లమ్ అంటూ డాక్టర్లని సంప్రదించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణంగా వారు ప్రతిరోజు కూర్చుని పని చేయడమే అంటున్నారు నిపుణులు. కాలం మారిపోవడంతో ఇప్పుడు కూర్చొని చేసే ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. కానీ గంటల తరబడి అస్సలు లేవకుండా కూర్చొని పని చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట. వీటిలో వెన్నెముక సమస్యలు ఒకటి. 

బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

గంటల తరబడి (long hours) కదలకుండా కూర్చోవడం (sitting) వల్ల కలిగే సమస్యలు (bad effects)

* కూర్చున్న చోటు నుండి కదలకుండా 8 గంటల పాటు ఉండటం రోజుకి 20 సిగరెట్లు కాల్చడంతో సమానమని శాస్త్రవేత్తలు ఒక పరిశోధన ద్వారా కనుగొన్నారు. పైగా ఇలా ఒకే చోట కదలకుండా ఉండడం వల్ల ఊబకాయం సమస్య కూడా ఉత్పన్నమవుతుంది.

* ఇలాగే కూర్చుని ఉండడం వల్ల ప్రధానంగా వెన్నుముకకి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాగే వెన్నుపూస పైన కూడా దీనివల్ల దెబ్బతినే అవకాశం మెండుగా ఉంది.

* అలాగే ఇలా ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల మన శరీర జీవక్రియల వేగం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా కూర్చుని ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోయి గుండెజబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందట. 

* ఇక మన శరీరానికి ఏవిధమైన కదలిక లేకుండా ఒకే చోట కూర్చుంటే కండరాల బలహీనత సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. కూర్చుని ఉండడం వల్ల నడుము భాగం క్రింద ఉన్న అన్ని రకాల కండరాలు బలహీన పడిపోతాయట.

* అటు ఇటు నడవకుండా ఉండటం చేత, అరికాళ్ళు & కాళ్లకు అనుకున్న రీతిలో రక్తప్రసరణ జరగక కాళ్లకు సంబంధించిన సమస్యలు ఎదురవడంతో పాటు కీళ్లు బలహీనంగా మారతాయట. 

* ఇక ఒకే చోట కూర్చుని కనీసం తల కూడా అటు ఇటు తిప్పకుండా పని మీదనే దృష్టి పెట్టి పనిచేస్తుంటే కొంతకాలం తరువాత మెడ నరాలలో కదలిక లేక కొత్త సమస్యలు వస్తాయి. అలాగే అటు ఇటు కదలించకపోతే మెడ నొప్పులు కూడా వస్తాయట.

* మనం ఆహరం తీసుకున్న తరువాత కొద్దిసేపు మనం అటు ఇటు నడిస్తే, మన తీసుకున్న ఆహరం జీర్ణం అవుతాయి. అలా జీర్ణమైన తరువాత వచ్చే పోషకాలు మన శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా వెళతాయి. అలా కాకుండా తిన్న వెంటనే కదలకుండా ఒకే చోట కూర్చుంటే, మీరు తిన్నది మొత్తం ఒకే చోట కొవ్వులా పేరుకుపోయి మీ శరీరంలో ఉండే అన్ని భాగాలకు అవసరమైన పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల మీకు ఊబకాయ సమస్య కూడా వస్తుంది.

* అలా ఊబకాయం సమస్య తీవ్రమైతే, తద్వారా మీరు డయాబెటిస్ బారిన కూడా పడే అవకాశాలు లేకపోలేదు. అలాగే కొవ్వు బాగా పేరుకుపోవడంతో హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి అని చెబుతారు.

* ఇక శరీరానికి ఎక్కడా కూడా కదలిక లేకుండా ఉంచి అలాగే శరీరానికి సరిపడా నీరు కూడా అందివ్వకపోతే మీకు కిడ్నీలో రాళ్లు వచ్చేస్తాయి. దీని ద్వారా కిడ్నీ సంబంధిత బాధలు కూడా ఎదురుకోవాల్సి వస్తుంది.

* ఎక్కువ సేపు ఒకే చోట మనం కూర్చోవడం వల్ల కలిగే దుష్పరిణామాల్లో గుండెపోటు ప్రధానమైంది. శరీరాన్ని ఎటు కదల్చకుండా ఉండే సరికి శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం, మెటబాలిజం లో తేడాలు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వంటివన్నీ జరిగి అది చివరికి గుండెపోటుకి దారి తీసే అవకాశాలు ఎక్కువ అని పరిశోధనలు తెలుపుతున్నాయి.

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

పైన పేర్కొన్న సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు –

* 8 నుండి 10 గంటల పాటు ఒకే చోట కూర్చుని పనిచేసే వారు కచ్చితంగా ప్రతి గంటకు ఒకసారైనా లేచి అటు ఇటు కనీసం రెండు నిమిషాలైనా నడవాల్సి ఉంటుంది. అలా నడవడం ద్వారా మీ శరీరానికి కాస్త కదలిక ఇచ్చినవారవుతారు.

* ప్రతిరోజు 30 నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం కూడా పైన చెప్పిన వాటిని ఎదురుకునేందుకు ఉపయోగపడుతుంది.

* ఆఫీస్ కి వెళ్లే వారు, లిఫ్ట్ లేదా ఎలివేటర్లు వాడడం కన్నా మెట్లు ఎక్కడం మంచిది. ఇలా చేస్తే, మీ శరీర భాగాలకి అవసరమైన కదలిక ఇచ్చిన వారవుతారు.

* జంక్ ఫుడ్ తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

* ఎక్కువగా కూర్చుని పని చేసే వారు, గంట లేదా రెండు గంటలకొకసారి నీరు తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది.

* వీటన్నితో పాటు ఆఫీసు లేదా మీరు పని చేసే చోట కూర్చునే కుర్చీ సరిగ్గా ఉందొ లేదో చూసుకోవాలి. ఎందుకంటే సరైన విధంగా లేని కుర్చీలో కూర్చోవడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

* మీరు రోజు వ్యాయామం చేయకపోయినా సరే, వారంలో కనీసం మూడు నుండి నాలుగు రోజుల పాటు రోజుకొక గంటసేపు నడవడం కూడా మీ ఆరోగ్యానికి & పైన పేర్కొన్న సమస్యలకి ఒక పరిష్కారంగా ఉంటుంది.

షుగర్ వ్యాధి తీవ్రతను తగ్గించే.. ఇంటి చిట్కాలు..!

Read More From Diet