మీరు ఫుడ్ లవర్స్ (food lovers) అయితే.. మీ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి రుచికరమైన పదార్థాలు లభిస్తాయో మీకు తెలిసే ఉంటుంది కదా. జీవితం చాలా చిన్నది. అందుకే మనకు నచ్చిన ఆహారం (food) తింటూ గడిపేయడం అనేది మనకు ఎంతో హాయిని అందిస్తుంది. అయితే కేవలం మన చుట్టుపక్కలే కాదు.. ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో వివిధ రకాల నోరూరించే అద్భుతమైన పదార్థాలు లభిస్తాయి. అందుకే సాధారణంగా మీరు ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడకపోతే.. నోరూరించే వంటకాలు తినాలనే మీ కోరికనే ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు కారణంగా మార్చుకోవచ్చు. ఇంతకీ మీ జిహ్వచాపల్యాన్ని మరింత పెంచే చక్కటి ఆహార పదార్థాల కోసం ఎక్కడికి వెళ్లాలో మీకు తెలుసా?
నేపుల్స్, ఇటలీ (Naples, Italy)
ఇది మనందరం ఎంతో ప్రాణప్రదంగా ఇష్టపడే వంటకమైన పిజ్జా పుట్టినిల్లు.. నేపుల్స్‌లోని పిజ్జేరియా డ మిషెల్ రెస్టారెంట్. ఎక్కువమంది ఇష్టపడే నియోపాలిటన్ పిజ్జా మొదటిసారి ఇక్కడే తయారైందట. టొమాటోలు, మోజరెల్లా ఛీజ్, ఆలివ్ ఆయిల్, తులసి ఆకులు కలిపి తయారు చేసే ఈ పిజ్జాని.. రాతితో తయారుచేసిన ఒవెన్‌లో 450 డిగ్రీల వద్ద 90 సెకన్లపాటు బేక్ చేసి సిద్ధం చేస్తారు. పిజ్జా పుట్టిన చోట.. దాని రుచిని ఆస్వాదించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నేపుల్స్‌కి చాలామంది పర్యాటకులు వస్తుంటారు.
మర్రాకెచ్, మొరాకో (Marrakech, Morocco)
ఎప్పుడూ ఒకే తరహా రుచి కాకుండా ఏదైనా ప్రత్యేకమైన రుచితో కూడిన వంటకాలను రుచి చూడాలని మీరు కోరుకుంటుంటే మొరాకోకి తప్పకుండా వెళ్లాల్సిందే.. ప్రపంచంలో నోరూరించే వంటకాలు తయారయ్యే ప్రదేశాల్లోనూ ఇది మొదటి స్థానం సంపాదించిందంటే.. అది కేవలం అక్కడి మార్కెట్లలో లభించే రుచికరమైన వంటకం టాజైన్ వల్లే. కూరగాయలు, మాంసం కలిపి మట్టిపాత్రల్లో తక్కువ మంటపై తయారుచేసే ఈ వంటకం.. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకాల్లో ఒకటిగా పేరుగాంచింది. అందుకే ఒక్కసారి మీరు కూడా ఈ వంటకాన్ని రుచి చూశారంటే చాలు.. అక్కడినుంచి తిరిగి వచ్చేసినా ఆ రుచిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.
టోక్యో, జపాన్ (Tokyo, Japan)
జపాన్ కేవలం టూరిజానికి మాత్రమే కాదు.. నోరూరించే వంటకాలకు కూడా ప్రసిద్ధే. అందులోనూ టోక్యో దగ్గర్లోని సుజుకి చేపల మార్కెట్‌లో నోరూరించే చేప వంటకాలు తింటే.. మీరు ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోరు. అక్కడ ఎన్నోరకాల జపనీస్ వంటకాలు లభిస్తాయి. అందులో టెంపూరా, సాషిమీ, సూషీ, సోబా, సుకియాకీ, మీసో సూప్‌లతో పాటు మంచినీటిలో పెరిగే ఈల్‌తో తయారుచేసే ఉనగి అనే వంటకం ఇక్కడ చాలా ప్రసిద్ధి.
బఫెల్లో, న్యూయార్క్ (Buffalo, New York)
బపెల్లో వింగ్స్ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ చికెన్ వింగ్స్‌కి ఆ పేరు ఎలా వచ్చిందో మనకు అర్థం కాదు.. ఎందుకంటే రుచికరమైన ఈ చికెన్ వింగ్స్.. మొదటిసారి న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రదేశంలో తయారయ్యాయి కాబట్టి. ఇక్కడి యాంకర్ బార్‌లో ఇవి మొదటిసారి తయారయ్యాయట. ఇప్పటికీ అక్కడ లభించే చికెన్ వింగ్స్.. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైనవని పేరుగడించాయి. సెలరీ, క్యారట్ ముక్కలతో పాటు బ్లూ ఛీజ్ డిప్‌తో సర్వ్ చేసే ఈ వంటకాన్ని తినేందుకు ఎంతోమంది అక్కడికి వస్తుంటారట. 1977లోనే బఫెల్లో ప్రభుత్వం.. జులై 29ని చికెన్ వింగ్స్ డేగా గుర్తించి ఆ వంటకానికి తమదైన గుర్తింపును అందించింది.
ఎన్సెనాడా, మెక్సికో ( Ensenada, Mexico)
ఫిష్ టాకోస్‌ని మనలో చాలామందే ఇష్టపడుతుంటారు. అద్భుతమైన రుచితో ఆకట్టుకునే ఈ టాకోస్.. మొదటిసారి మెక్సికోలోని సాన్ ఫెలిపేలో తయారయ్యాయని మీకు తెలుసా? అక్కడ రూబియోస్ అనే ఓ చిన్న షాప్‌లో మొదటిసారి ఈ వంటకాలు తయారయ్యాయి. అక్కడి నుంచి ప్రపంచంమంతా పాకినా.. ఎన్నో రకాల అద్భుతమైన రుచులతో టాకోస్ రూపొందినా దీన్ని తలదన్నేలా మరేవీ రాలేదని చెప్పుకోవచ్చు.
అందుకే ఎన్పెనాడాలోని చేపల మార్కెట్‌లో లభించే సీ ఫుడ్‌ని ఆస్వాదించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అక్కడికి వస్తుంటారు ఆహార ప్రియులు. అక్కడ లభించే రొయ్యల కాక్‌టెయిల్, ఫిష్ ఫిల్లెట్స్ వంటివి కూడా నోరూరించినా.. ఫిష్ టాకోస్ రుచిని మాత్రం ఏవీ తలదన్నలేవు. మీరు సీఫుడ్‌ని ఇష్టపడితే ఎన్సెనాడా ట్రిప్ మీకు మంచి అనుభూతులను మిగుల్చుతుంది.
హైదరాబాద్ ట్రెండ్స్: ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా?
ప్యారిస్, ఫ్రాన్స్ (Paris, France)
ప్యారిస్ కేవలం ప్రేమికులకు.. యాత్రికులకు మాత్రమే కాదు.. ఆహార ప్రియులకు కూడా చక్కటి హాలిడే స్పాట్. ఈఫిల్ టవర్‌కి నోరూరించే వైన్‌కే కాదు.. రుచికరమైన వంటకాలకు కూడా పెట్టింది పేరు ప్యారిస్. ఇక్కడ ప్రపంచంలో అద్భుతమైన బ్రెడ్, ఛీజ్.. ఇతర వంటకాలు లభిస్తాయి. ప్యారిస్ అందించే అద్భుతమైన వంటకాలకు ఎంతో గొప్ప సెలబ్రిటీ ఫాలోయింగ్ కూడా ఉంది. బిఫోర్ సన్‌సెట్, జూలీ అండ్ జూలియా, మిడ్‌నైట్ ఇన్ ప్యారిస్ వంటి ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లో ప్యారిస్‌లో లభించే అద్భుతమైన ఆహారాన్ని చూపుతూ ఈ ప్రదేశాన్ని పాపులర్‌గా మార్చారు హాలీవుడ్ దర్శకులు.
కోపెన్‌హగెన్, డెన్మార్క్ (Copenhagen, Denmark)
ఇది ప్రపంచంలోనే అత్యంత ఆనందమయమైన నగరంగా పేరు పొందింది. ఆనందం పొందాలంటే అందులో ఆహారం పాత్ర కూడా పెద్దదే. ప్రపంచంలో అత్యంత రుచికరమైన వంటకాల్లో.. కొన్నింటికి ఈ నగరమే ప్రధాన స్థానం. ముఖ్యంగా స్మోరెబ్రోడ్ శాండ్‌విచ్‌ని మాత్రం ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిందే. నోరూరించే సాల్మన్ చేపతో పాటు ఉడికించిన గుడ్లు, ముల్లంగి ముక్కలు పెట్టి రై బ్రెడ్‌తో తయారుచేసే ఈ శాండ్‌విచ్ అద్భుత రుచితో శాండ్‌విచ్ లవర్స్‌ని మాత్రమే కాదు.. నోరూరించే ఆహారాన్ని ఇష్టపడే వారందరినీ ఆకట్టుకుంటుంది.
ఇవన్నీ చూస్తుంటే మీకూ నోరూరిపోతోంది కదూ.. మరి, ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు వీసా సిద్ధం చేసేసుకోండి.
గోదావరి జిల్లాలు అనగానే.. ఈ నోరూరించే వంటకాలు గుర్తొచ్చేస్తాయి..!
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.