Lifestyle

చదరంగంలో నేటి తరానికి స్ఫూర్తి.. గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక..!

Lakshmi Sudha  |  Mar 12, 2019
చదరంగంలో నేటి తరానికి స్ఫూర్తి.. గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక..!

చిన్న వయసు నుంచి చెస్‌లో రాణిస్తూ.. తనదైన శైలిలో విజయాలు అందుకుంటూ ముందుకు సాగిపోతుంది ద్రోణవల్లి హారిక. ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా అందుకొన్న రెండో అమ్మాయి హారిక. తన క్రీడా జీవితంలో విజయాలూ ఉన్నాయి. ఓటమి ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. ‘మనకో లక్ష్యం ఉండాలి. దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి’- హారిక  పాటించే జీవన సూత్రమిది.

అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా  ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెస్ ర్యాంకింగ్స్‌లో ఏడో ర్యాంక్‌లో ఉన్న హారికను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించింది హారిక‌. ఈ నేపథ్యంలో చదరంగంలో తనదైన రీతిలో రాణిస్తూ.. ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోన్న ద్రోణవల్లి హారిక గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..

ఏడేళ్ల వయసులో తండ్రితో సరదాగా చెస్ ఆడ‌డం మొదలుపెట్టింది హారిక. తల్లిదండ్రులు ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో అంతర్జాతీయ స్థాయి చెస్ ప్లేయర్‌గా మారింది. చదరంగంలో దిగ్గజాలైన జుడిత్ పోల్గర్, వ్లాదిమిర్ క్రామ్నిక్, విశ్వనాథన్ ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగిపోతోంది.  తనదైన విజయాలు సొంతం చేసుకొంటోంది. కొన్నిసార్లు ఆమె వేసిన ఎత్తులు విజయాన్ని అందిస్తే.. మరికొన్నిసార్లు ఆమెను పరాజయం పాలు చేశాయి. అయినా నిరుత్సాహ పడకుండా ముందుకు సాగిపోతోంది.

ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించాలనేది ఆమె కల. కానీ మూడుసార్లు.. గెలుపు అంచుల వరకు చేరుకొని కాంస్య పతకంతో తృప్తి పడాల్సి వచ్చింది. ఏదో పతకం సాధించానులే అని సరిపెట్టుకోలేదు. తన కలను సాకారం చేసుకోవడానికే నిరంతరం ప్రయత్నిస్తోంది.

2011లో ద్రోణవల్లి హారిక గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకొంది. మీకో విషయం తెలుసా? కోనేరు హంపి తర్వాత గ్రాండ్ మాస్టర్ స్థాయికి చేరుకొన్న రెండో భారతీయ మహిళ హారిక. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.

చెస్‌లో ఆమె సాధించిన విజయాలకు గుర్తింపుగా 2007-08 ఏడాదికి అర్జున అవార్డు అందుకొంది. తాజాగా పద్మశ్రీ పురస్కారం స్వీకరించింది. ఈ విషయంలో తన సంతోషాన్ని ఫేస్ బుక్ ద్వారా పంచుకొంది. పద్మ పురస్కారం అందించిన స్పూర్తితో ఏదో ఒక రోజు ప్రపంచ మహిళల ఛాంపియన్ షిప్ అందుకొంటానని తెలియజేసింది. గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తర్వాత పద్మ అవార్డు అందుకొన్న చెస్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక కావ‌డం విశేషం.

ప్రముుఖుల ప్రశంసలు:

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదలైనవారు ద్రోణవల్లి హారికను మెచ్చుకొంటూ ట్వీట్ చేశారు.

సినీరంగానికి చెందిన ప్రముఖులు సైతం హారికను ట్విట్టర్ ద్వారా అభినందించారు. సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ సినిమాల దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆమెకు అభినందనలు తెలిపారు.

ఒలింపియన్ కరణం మల్లేశ్వరి సైతం హారికకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఆమె వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. గ‌తేడాది హైద‌రాబాద్‌కు చెందిన కార్తీక్ చంద్ర అనే వ్య‌క్తిని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది హారిక‌.

Photos: Harika Dronavalli Facebook

Also Read: #POPxoWomenWantMore ఏడాదిలో ఒక్క రోజు కాదు.. రోజూ మహిళలదే: నిఖత్ జరీన్

ఈ సమ్మర్ అడ్వెంచర్ డెస్టినేషన్స్.. మీకోసం ఎదురుచూస్తున్నాయి..

Must Read: ఈ న్యాయవాది.. మనదేశంలోనే కులం, మతం లేని మొదటి వ్యక్తి

Read More From Lifestyle