మార్చి నెలకు రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International women’s day) – మార్చి 8. అలాగే మరొకటి ఏటా ఈ నెలను విమెన్ హిస్టరీ మంత్‌గా జరుపుకోవడం గమనార్హం. ఈ నెలలో మన చరిత్రపుటల్లో నిలిచిపోయేలా సేవలను అందించిన స్త్రీలను తలచుకోవడం కొన్ని చోట్ల ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మన దేశానికి చెందిన కొందరు డాక్టర్లు (doctors) వైద్యశాస్త్రంలో ఎలా తమ సేవలను అందించి.. చరిత్రలో నిలిచిపోయారో తెలుసుకుందాం.
ఆనందీ బాయి గోపాల్ జోషీ
మన దేశానికి చెందిన మొదటి డాక్టర్ ఆనందీ బాయి గోపాల్ జోషి. 1886లో వైద్య పట్టా పుచ్చుకున్నారామె. తొమ్మిదేళ్లకే ఇరవై సంవత్సరాల వ్యక్తితో ఆనందికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆనందంగా సాగిపోతున్న వారి జీవనంలో.. వారి మొదటి బిడ్డ పుట్టిన వెంటనే మరణించడం విషాదాన్ని నింపింది. దీంతో తానే వైద్యురాలిగా మారాలని నిర్ణయించుకున్నారు ఆనంది. పెన్సిల్వేనియాలోని మొదటి మహిళా మెడికల్ కాలేజీగా పేరొందిన డ్రెక్సెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నుంచి వైద్య శాస్త్రంలో విద్యనభ్యసించారు ఆనంది.
తన చదువు తర్వాత కొల్హాపూర్ రాజు ఆమెను ఘనంగా సన్మానించి ఆల్బర్ట్ ఎడ్వర్ట్ హాస్పిటల్‌లో మహిళల వార్డు ఇంఛార్జిగా నియమించారు. ఆ తర్వాత ఆమె ఇరవై రెండేళ్ల వయసులో అదే ఆసుపత్రిలో బోదకాలు వ్యాధితో మరణించారు. ఆనందీ బాయి గురించి ఎన్నో పుస్తకాలతో పాటు టీవీ సిరీస్ కూడా కొనసాగింది. ఆనందీబాయి మెమోరియల్ అవార్డును ఆమె జ్ఞాపకార్థం ప్రతిభావంతులైన వైద్యులకు ఇవ్వడం పరిపాటి.
కాదంబినీ గంగూలీ
కాదంబినీ కూడా ఆనందీ బాయి కాలంలోనే మెడిసిన్ చదివారు. భారత్‌లో చదివి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన మొదటి గ్రాడ్యుయేట్స్‌లో తను కూడా ఒకరు. దేశంలోని మొదటి తరం డాక్టర్లలో ఈమె కూడా ఒకరు. బంగ మహా విద్యాలయ నుంచి విద్యనభ్యసించారు. ఆ తర్వాత అది బెతూన్ స్కూల్‌తో కలిసిపోయింది. అలా బెతూన్ స్కూల్ నుంచి కలకత్తా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఆ తర్వాత బెతూన్ స్కూల్ నుంచే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి మెడిసిన్ చదవాలనుకున్నా.. అంతకుముందు మన దేశంలో మెడిసిన్ చేసిన మహిళలు ఎవరూ లేకపోవడంతో వారు కాదన్నారు. న్యాయపోరాటంతో అందులో చదివే హక్కును పొంది 1886లో గ్రాడ్యుయేట్ ఆఫ్ బెంగాల్ మెడికల్ కాలేజీ (జీబీఎంసీ) డిగ్రీని పొందారు. ఆపై ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, డబ్లిన్‌లలో వివిధ కోర్సులు చేసి ఆపై కోల్‌కతాలోని లేడీ డఫరిన్ హాస్పిటల్లో కొంతకాలం పనిచేసి తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు.
పద్మావతి అయ్యర్
భారత్‌లో కార్డియాలజీకి పద్మావతిని ఆద్యురాలిగా చెబుతారు. భారత్‌లో మొదటి మహిళా కార్డియాలజిస్ట్ అయిన ఆమె ప్రస్తుతం 101 ఏళ్ల వయసులోనూ తన ప్రాక్టీస్‌ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. బర్మాలో పుట్టిన ఆమె రంగూన్ మెడికల్ కాలేజీ నుంచి మెడిసిన్ పూర్తిచేశారు. 1949లో లండన్ వెళ్లిన ఆమె అక్కడి రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ కళాశాలలో ఎఫ్ఆర్‌సీపీ, ఎఫ్ఆర్‌సీపీఈ పూర్తి చేశారు. తాను చదువుకుంటున్న సమయంలోనే భారత్‌లో గుండెకు సంబంధించిన సమస్యలపై పెద్దగా అవగాహన లేదని గుర్తించి దేశానికి వచ్చిన తర్వాత.. దేశంలోనే మొదటి కార్డియాలజీ క్లినిక్ ప్రారంభించారు.
ఆ తర్వాత ఇండియన్ మెడికల్ కాలేజీలో కార్డియాలజీ విభాగాన్ని కూడా ప్రారంభించారు. అలాగే గుండె సంబంధిత సమస్యలపై అందరిలోనూ అవగాహన పెంచేందుకు దేశంలోనే మొట్టమొదటి హార్ట్ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. తాను చేసిన సేవలకు గాను 1992లో ఆమె పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కి ఇంకా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారామె. వీటితో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో కలిసి వైద్య విద్యార్థులకు ప్రివెంటివ్ కార్డియాలజీలో శిక్షణ కూడా అందిస్తుంటారామె.
ఇందిరా హిందూజా
ఇందిరా హిందూజా భారత్‌కి చెందిన మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించిన డాక్టర్. 1986లోనే ఆమె ఈ ఘనత సాధించారు. అంతేకాదు.. గైనకాలజిస్ట్, ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయిన ఇందిర గామెట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్‌ఫర్ అనే ప్రక్రియను విజయవంతంగా చేసిన మొదటి వైద్యురాలు. ఈ ప్రక్రియ ద్వారా అండాలు, శుక్రకణాలను ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ప్రవేశపెట్టి అక్కడ ఫలదీకరణం అయ్యేలా చేస్తారు.
ఇలా రెండు రకాల పద్ధతుల ద్వారా పిల్లలు లేని దంపతులకు చికిత్స చేస్తూ ఈ పద్ధతులను ప్రారంభించిన మొదటి వైద్యురాలిగా పేరు సాధించారు. ప్రస్తుతం ఇంకా హిందూజా హాస్పిటల్‌లో తన సేవలను అందిస్తున్నారు ఇందిరా. ఇవే కాదు.. 1991లో వూసైట్ డొనేషన్ టెక్నిక్ ద్వారా మెనోపాజ్ త్వరగా వచ్చిన వారికి, ఒవేరియన్ ఫెయిల్యూర్ అయిన వారికి చికిత్స చేసి సంతానం కలిగేలా చేస్తున్నారామె. తన సేవలకు గాను 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
చిత్ర తార
చిత్రతార కేరళకు చెందిన ఆంకాలజిస్ట్. కొట్టాయం మెడికల్ కాలేజీ నుంచి మెడిసిన్ పూర్తి చేసిన ఆమె దిల్లీలోని సఫ్దార్ జంగ్ కాలేజీ నుంచి గైనకాలజీలో ఎండీ పూర్తిచేశారు. ఆపై జెనైటో యూరినల్ సర్జరీలో ఎంసీహెచ్ పూర్తి చేశారు. అమెరికన్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ నుంచి ఆంకాలజీ గురించి చదివారామె. క్యాన్సర్‌కి సంబంధించిన పరిశోధన చేసిన ఆమె కేవలం ఆంకాలజిస్ట్‌గానే కాదు.. కేరళలోనే మొదటి యూరాలజిస్ట్‌గా కూడా పేరు ప్రఖ్యాతలు సాధించారు. 2014లో తాను చేసిన సర్జరీకి గాను దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచారు చిత్ర తార.
కేరళకు చెందిన 27 సంవత్సరాల యువతి ఆమె దగ్గరికి విపరీతమైన కడుపు నొప్పితో వచ్చింది. దాన్ని గర్భసంచి క్యాన్సర్‌గా గుర్తించిన చిత్రతార గర్భాశయాన్ని తొలగించాలని నిర్ణయించారు. అయితే అప్పటికి పిల్లలు లేని ఆమె తనకు పిల్లలు పుట్టరని ఎంతో బాధపడింది. దీంతో ఆమె అండాశయాల్లో ఆరోగ్యంగా ఉన్న దాన్ని తీసి కడుపు పైభాగంలో చర్మం కింద ఉంచి దానికి రక్త ప్రసరణ అయ్యేలా ఏర్పాటుచేశారు చిత్ర తార. ఈ అండాశయం ఆరోగ్యంగా ఉండడంతో పాటు అండాలను కూడా విడుదల చేసింది. క్యాన్సర్ పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇటీవలే ఆ అండాలతో ఆ యువతి సరోగసీ విధానం ద్వారా పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అండాశయాన్ని పూర్తిగా తొలగించకుండా దాన్ని వేరే ప్రదేశంలో ఉంచి రక్తప్రసరణ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పాటు దాన్ని నిర్వహించి సక్సెస్ అయ్యి భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పిల్లల్ని కనేందుకు మార్గం సుగమం చేశారు చిత్ర తార.
ఇవి కూడా చదవండి.
ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..
ఈ భూమి మీద అసలు మహిళ లేకపోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?
గ్రీన్ టీ కేవలం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..!
Images : Wikipedia