
ఆరేళ్ల కిట్టు స్కూల్ నుంచి రాగానే వీడియో గేమ్స్‌కు అతుక్కుపోతాడు. ఎనిమిదేళ్ల వందన కూడా ఎప్పుడు చూసినా ప్లే స్టేషన్ కు తీసుకెళ్లమంటూ వాళ్ల పేరెంట్స్‌ను తెగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీరిద్దరు మాత్రమే కాదు.. ఈ రోజుల్లో పిల్లలంతా దాదాపు ఈ కోవకు చెందిన వారే!
కొందరు స్మార్ట్ ఫోన్లలో ఆటలు (Games) ఆడుతూ సమయం గడిపితే, ఇంకొందరు వీడియో గేమ్స్‌కు కళ్లప్పగించేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తరం పిల్లలకు బయట ఆడుకునే ఆటలు చాలా వరకు తెలియవనే చెప్పాలి. ముఖ్యంగా 80- 90ల కాలం నాటికి చెందిన కొన్ని ఆటల పేర్లు అడిగితే.. వీరు అస్సలు వాటి గురించి విని కూడా ఉండరు.
గ్రామీణ నేపథ్యంలో పెరిగే పిల్లల విషయంలో ఈ క్రీడల పరిజ్ఞానం కాస్త ఉంటున్నా.. నగరాల్లో పెరిగే పిల్లలు మాత్రం బాల్యంలో క్రీడలపై ఆసక్తిని కోల్పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందుకు దోహదం చేసే కారణాలు చాలానే ఉన్నాయి.
పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం, పిల్లలను క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొనే దిశగా ప్రోత్సహించే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు లేకపోవడం.. వంటివి ఓవైపు కారణాలైతే; ఆడుకోవాలని అనిపించినా ప్లే గ్రౌండ్ (Play ground), ఓపెన్ ప్లేస్ లేకపోవడం వల్ల కూడా కొందరు పిల్లలు ఈ ఆటలకు దూరమవుతున్నారు. కనీసం స్కూల్లో అయినా ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మనకు తెలియంది కాదు.
పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. మనం వారిని ఆ దిశగా ప్రోత్సహించకుండా ఎంత తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. చిన్నారులు బయటకు వెళ్లి ఇతర పిల్లలతో కలిసి ఆటలాడుకోవడం ద్వారా వారి మధ్య ఐక్యత, స్నేహం వంటివి పెంపొందడమే కాదు.. శారీరకంగానూ వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వారు ఆడే ఆటల ద్వారా వారికి శారీరకంగా ఎంతో కొంత వ్యాయామం అందుతుంది. ఇది వారిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఇంకొన్ని ఆటలైతే పిల్లల్లో ఏకాగ్రతను పెంచేందుకు కూడా బాగా తోడ్పడతాయి. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏ పిల్లల చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్స్ (Smart Phones), ఐ ప్యాడ్స్ (I Pads), ల్యాప్ టాప్స్ (Laptops).. ఇవే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో 90ల కాలం నాటి పిల్లలు బాగా ఎంజాయ్ చేసి ఆటల గురించి.. ఈతరం పిల్లలు మిస్ అవుతున్న కొన్ని సరదా సరదా ఆటలు గురించి ఓసారి తెలుసుకుందాం రండి..
Image: Wikipedia
* కుర్చీలాట (Musical chair) – ఈ రోజుల్లో ఫ్యామిలీ గెట్ టుగెదర్, పిక్నిక్స్.. వంటివి జరిగినప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ ఆటే! కానీ దీనిని ఎంతమంది పిల్లలు మామూలు రోజుల్లో ఆడుతున్నారు చెప్పండి??
Image: Wikipedia
* గన్నాల ఆట లేదా గచ్చకాయలు – ఆడపిల్లలు నలుగురైదుగురు కూర్చొని.. ఒక్కా పండూ.. లిక్కీ రెండూ అంటూ చిన్న చిన్న రాళ్లను ఎగరేసి పట్టుకుంటూ ఆడే ఆట ఒకప్పుడు పల్లెల్లో బాగా ప్రసిద్ధి.
Image: Youtube/Logical Shades
* కబడ్డీ (Kabaddi) – ఒకప్పుడు మన దేశంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడ మళ్లీ ప్రో కబడ్డీ పుణ్యమా అని ఈతరం పిల్లలకు తెలిసింది కానీ.. ఇది రాకముందు ఎంతమందికి ఈ క్రీడ గురించి తెలుసు??
* వామన గుంతలాట – ఈ ఆట ఆడడానికి సాధారణంగా కొయ్యతో తయారుచేసిన పొడుగాటి ఆకారంలో ఉన్న రెండు పెట్టెలను వాడతారు. ఈ పెట్టెలలో రెండు వరుసలలో ఏడేసి గుంటలు లేదా డిబ్బీల చొప్పున పద్నాలుగు గుంటలు కనిపిస్తాయి. ఆ గుంటల్లో గింజలు వేస్తూ అమ్మాయిలు ఈ ఆట ఆడతారు. ఆఖరికి ఎవరెన్ని గింజలు గెలుచుకుంటారో వారే విజేతన్న మాట.
* నాలుగు స్థంబాల ఆట – ఇప్పటికీ పల్లెల్లో ఆడుకొనే బహు సుపరిచితమైన ఆట ఇది.
* వైకుంఠపాళి లేదా పాముల పట్నం (Snakes & Ladders) – వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఆడే ఈ ఆట కేవలం ఆడే వారికి మాత్రమే కాదు.. చూసేవారికి కూడా ఆసక్తి కలిగేలా చేస్తుంది.
* తొక్కుడు బిళ్ల- నాకు తెలిసి ఈ రోజుల్లో ఈ ఆట గురించి తెలిసిన ఆడపిల్లలు ఉన్నారంటే అది కచ్చితంగా అతిశయోక్తే!
* తాడు బొంగరం లేదా బొంగరం
* ఆరు బయట ఉయ్యాల ఊగుతూ ఆడుకోవడం
* స్టాచ్యూ ఆట – చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా ఆడే ఆట ఇది. మరి, దీని గురించి ఎంతమందికి తెలుసు?
* గోలీలాట (Marbles)
* దొంగా – పోలీస్ ఆట
* కళ్ల గంతలాట (Blind-Fold Game)
* దాగుడు మూతలాట
* ఖో-ఖో (Kho-Kho)
* గిల్లీ – దండ
* ఏడు పెంకులు ఆట (7 Pieces)
వీటిలో చాలా ఆటలు పిల్లలకు శారీరక శ్రమను కలిగిస్తూ ఎంతో కొంత వ్యాయామాన్ని అందించేవే! అంతేకాదు.. వారిలో ఉన్న తర్కాన్ని మరింత మెరుగుపరిచి, విశ్లేషణాత్మకంగా ఆలోచించడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. కానీ ఇప్పటి పిల్లలు మాత్రం మొన్నటి వరకు టెంపుల్ రన్ (Temple run) వెనుక పరిగెత్తి, ఇప్పడు కొత్తగా వచ్చిన పబ్ జి (PUBG – Player Unkown Battlegrounds)లో మునిగి తేలుతున్నారు. ఇదొక్కటి చాలదూ.. వారు శారీరక శ్రమకు దూరమై టెక్నాలజీకి బానిసలుగా మారుతున్నారని చెప్పడానికి! ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని మనమంతా కోరుకుందాం..
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండి..!