Diet

ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. (Tips For Pregnant Women In Telugu)

Soujanya Gangam  |  Jun 25, 2019
ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. (Tips For Pregnant Women In Telugu)

ప్రెగ్నెన్సీ (Pregnancy).. ప్రతీ మహిళ జీవితంలోని అత్యద్భుతమైన ఘట్టం. గర్భం ధరించాలని.. అమ్మా.. అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. గర్భం ధరించగానే తన గురించి కంటే తన కడుపులోని బిడ్డ (Baby) గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. తనకు పుట్టబోయే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుకుంటుంది. ఇది ప్రతి మహిళకు సహజంగా ఏర్పడే భావన. 

అయితే గర్భం ధరించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలో.. ఏం తినాలో.. ఏం తినకూడదో అనే విషయంలో మహిళలు కంగారు పడడం సహజం. ఫలానా పని నేను చేయొచ్చా? చేయకూడదా? అంటూ రోజువారీ పనుల గురించి కూడా  ఆలోచించడం సహజం. ఈ క్రమంలో గర్భం ధరించిన తర్వాత ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం.. మొదలైన విషయాలలో మహిళలకు వచ్చే సందేహాలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

గర్భం రాగానే ఏం చేయాలంటే..

గర్భం రాగానే సంతోషంతో పొంగిపోవడం మాత్రమే కాదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. ఇవి మీరు గర్భవతి అని తెలిసిన మొదటి రోజు నుంచి పాటించాల్సిందే.. అవేంటంటే..

Shutterstock

మంచి డాక్టర్‌ని ఎంచుకోండి.

ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది చేసే తప్పు సరైన ఆసుపత్రిని ఎంచుకోకపోవడం. ఈ విషయాన్ని తొలుత చాలామంది సాదాసీదాగా తీసుకుంటారు. కానీ ఒకసారి నెలలు పూర్తిగా నిండాక ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి మారుతుంటారు.  కానీ గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవం జరిగే వరకూ ఒకే హాస్పిటల్‌లో చూపించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు డాక్టర్‌కి మధ్య ఓ సయోధ్య ఏర్పడుతుంది. ప్రసవం సమయంలోనూ మీ చుట్టూ అందరూ తెలిసినవారే ఉంటారు. కాబట్టి ఇబ్బందిగా అనిపించదు. అందుకే గర్భం ధరించగానే మీ బడ్జెట్‌కి తగినట్లు సిటీలోనే మంచి డాక్టర్‌తో పాటు, మంచి హాస్పిటల్‌ని ఎంచుకోవడం శ్రేయస్కరం. 

వేగం తగ్గించండి..

చాలామంది అమ్మాయిలకు వేగంగా నడవడం, పరిగెత్తడం, మెట్లెక్కడం, డ్యాన్స్ చేయడం, సైక్లింగ్ చేయడం.. లాంటి అలవాట్లు ఉంటాయి. అయితే గర్భం ధరించిన తర్వాత.. ఇలాంటి వేగవంతమైన పనులు చేయకూడదు. అలా చేయడం వల్ల కళ్లు తిరిగి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో హెచ్‌సీజీ హార్మోన్ వల్ల కళ్లు తిరుగుతుంటాయి. అందుకే ఈ సమయంలో ఇలాంటి పనులకు స్వస్తి పలకాలి. 

అన్నీ సరైనవి కావు..

గర్భిణీ స్త్రీలకు ఎందరో ఎన్నో సలహాలు ఇస్తుంటారు.  వ్యాయామం చేయకుండా ఉండాలని.. తల్లీ, బిడ్డకి సరిపడా భోజనం చేయాలని.. అస్సలు పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంటారు. ఇవన్నీ మీపై ప్రేమతో వాళ్లు చెప్పేవే.. కానీ నిజాలు కాదు. కనుక మీ ప్రెగ్నెన్సీ‌కి సంబంధించిన సలహాలు, సూచనలు అందరి నుంచి తీసుకోండి. శాస్త్రీయంగా ఆ పద్దతులు మీ ఆరోగ్యానికి మంచివా? లేదా? అని తెలుసుకోండి. అలా తెలుసుకున్న తర్వాతే వాటిని పాటించడం మంచిది. దీనికోసం వైద్యుల సలహాలతో పాటు.. మీరు కూడా ఇంటర్నెట్‌లో వెతికి తెలుసుకోవడం మంచిది.

shutterstock

ప్రెగ్నెన్సీ జర్నల్ అవసరమే..

గర్భం ధరించిన రోజు నుండి.. ప్రతీ మహిళ ప్రెగ్నెన్సీ జర్నల్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఇందులో మీరు చేసే పనులు, తినే ఆహారం, మీ ఫీలింగ్స్‌తో పాటు మీ శరీరంలో వస్తున్న మార్పులు, మీ బిడ్డకు మీరు చెప్పాలనుకుంటున్న మాటలు, పిల్లల కోసం మీరు ఎంపిక చేసుకున్న పేర్లు, మీ బిడ్డ స్కానింగ్ రిపోర్ట్స్‌తోపాటు.. ఎప్పటికప్పుడు బరువు, ఎత్తు వంటి వివరాలు కూడా జోడించండి.

ఈ పరీక్షలు ఆరోగ్యాన్ని పెంచుతాయి..

గర్భం ధరించారని తెలియగానే డాక్టర్ వివిధ రకాల రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకోమని సలహా ఇస్తారు. ఇప్పుడే ఇవన్నీ అవసరమా? అని చాలామంది భావిస్తారు. కానీ ఇవన్నీ మీ ఆరోగ్యం కోసమే. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకే గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకూ మీ డాక్టర్ చెప్పినప్పుడల్లా పరీక్షలు చేయించుకోవడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.

ప్రెగ్నెన్సీ సమయంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధారణ సమయం కంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అటు మీ ఆరోగ్యంతో పాటు.. ఇటు బిడ్డ ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి వీలుంటుంది. ఈ సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలంటే..

shutterstock

మరీ ఎక్కువ బరువు పెరగొద్దు..

ప్రెగ్నెన్సీ సమయంలో పెరిగిన బరువు తిరిగి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. చాలా కష్టం కూడా అవుతుంది. అందుకే ఈ సమయంలో ఎక్కువ బరువు పెరగొద్దు. సాధారణంగా ఒక మహిళ పది నుంచి పదిహేను కిలోల వరకూ బరువు పెరిగితే సరిపోతుంది. అయితే గర్భం దాల్చాక ఎంత బరువు పెరగాలన్నది.. గర్భం దాల్చక ముందు మీ బరువు ఎంత ఉందన్న దాని ఆధారంగా నిర్ణయించాలి. సాధారణ బరువున్న మహిళ 12 నుంచి 18 కేజీల వరకూ బరువు పెరగచ్చు. అదే తక్కువ బరువున్న వారు పద్నాలుగు నుంచి ఇరవై కేజీల వరకూ బరువు పెరిగే వీలుంటుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు మాత్రం కేవలం ఏడు నుంచి తొమ్మిది కేజీల వరకు మాత్రమే బరువు పెరగాలి. అంతకంటే ఎక్కువ పెరిగితే తగ్గించడం కష్టమవుతుంది.

మందులు మర్చిపోవద్దు..

గర్భం ధరించిన మొదటి రోజు నుంచి కొన్నిసార్లు గర్భం కోసం ప్రయత్నిస్తున్న సమయం నుంచే డాక్టర్లు కొన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌కి సంబంధించిన మందులను అందిస్తుంటారు. వీటిలో ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ విటమిన్స్, క్యాల్షియం, ఐరన్ వంటి మందులను రోజూ వేసుకోవడం వల్ల గర్భం ధరించిన తర్వాత.. మీకు మీ కడుపు‌లోని బిడ్డకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. పైగా బిడ్డలో ఎముకల ఎదుగుదల, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.

మంచి నిద్ర అవసరం..

సాధారణంగానే ప్రతి మనిషికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరం. అయితే శ్రమ ఎక్కువగా పడేవారు ఇంకాస్త ఎక్కువగా నిద్రపోవచ్చు. కంటి నిండా నిద్రపోవడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి దూరంగా ఉండే వీలుంటుంది.

shutterstock

ప్రయాణాలు ఎక్కువగా వద్దు..

గర్భం ధరించినప్పుడు.. మరీ అవసరమైతే తప్ప విమాన ప్రయాణం చేయకూడదు. ట్రైన్‌లోనూ మరీ దూర ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే ఒకే చోట కూర్చోవడం వల్ల కాళ్లు వాచిపోయే ప్రమాదం ఉంది. కాళ్లలో డీప్ వీన్ త్రాంబోసిస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకవేళ మీరు కారులో ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే… వాహనాన్ని మధ్యలో ఆపి కాసేపు అటూ ఇటూ తిరగడం మంచిది. 

ఒత్తిడి అస్సలు వద్దు..

సాధారణంగా ఆఫీస్ పని, ఇంట్లో పని, కుటుంబంలో సమస్యలు.. ఇలా రకరకాల కారణాలు మనపై ఒత్తిడిని పెంచుతాయి. గర్భం ధరించిన తర్వాత అసలే హార్మోన్లలో మార్పుల వల్ల చాలా సెన్సిటివ్ గా తయారవుతారు. ఇక ఒత్తడికి కూడా గురైతే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

వీటి విషయంలో జాగ్రత్త..

గర్భం ధరించిన సమయంలో ఎన్నో విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. బీపీ ఎక్కువైతే ప్రీఎక్లాంప్సియా, ఇన్ఫెక్షన్లు, ఉమ్మనీరు తక్కువగా ఉండడం, జెస్టేషనల్ డయాబెటిస్ వంటి సమస్యల నుంచి బిడ్డకు జన్యు పరంగా వచ్చే సమస్యలు, మిస్ క్యారేజ్, బిడ్డ కడుపు లోనే మరణించడం వంటి కాంప్లికేషన్లెన్నో ఉంటాయి. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఐదో నెల తర్వాత వరుసగా పన్నెండు గంటల పాటు బిడ్డ కదలికలు తెలియకపోతే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి. అది కాకుండా ఏదైనా ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Shutterstock

పాజిటివ్ గా ఆలోచించండి.

నెగెటివ్ ఆలోచనలు, బాధ, భయం లాంటివన్నీ బిడ్డపైనా ప్రభావం పడుతుంది. అందుకే పాజిటివ్ గా ఆలోచిస్తూ బిడ్డ కోసం మంచి పాటలు వింటూ.. మీకు కడుపు లో బిడ్డకు ఆనందాన్ని అందించే పనులు చేస్తూ ఉండాలి.

టైట్ గా ఉండే దుస్తులు వద్దు..

సాధారణంగా టైట్ గా ఉండే దుస్తులు ధరించడం వల్ల వూపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అసౌకర్యంగా అనిపిస్తుంది. గర్భం ధరించిన తర్వాత ఇది మరింత ఎక్కువవుతుంది. చాలామంది పొట్ట కనిపించకుండా దాన్ని అదిమి పెట్టేలా టైట్ గా ఉండే దుస్తులు ధరిస్తారు. కానీ దీనివల్ల కడుపు లోని బిడ్డపై ఒత్తిడి పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వదులుగా ఉన్న దుస్తులు ఎంచుకోవడం మంచిది.

గర్భ్ సంస్కార్

గర్భ్ సంస్కార్ అంటే బిడ్డ కడుపు లో ఉన్నప్పటి నుంచే వారికి అన్ని విషయాలపై శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఇది బిడ్డల మానసిక, శారీరక వికాసం కోసం చాలా అవసరం. దీనికోసం ఐదో నెల నుంచి పిల్లలకు శిక్షణ అందించడం ప్రారంభించాలి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఉన్న సంగీతాన్ని తల్లి వింటూ ఉండడం.. కడుపు దగ్గర పెట్టి బిడ్డకు వాటిని వినిపించడం వల్ల పిల్లల ఆలోచనలపై అది ప్రభావం చూపుతుంది.

శుభ్రత ముఖ్యమే..

గర్భం ధరించిన తర్వాత కొందరిలో చెమట ఎక్కువగా పట్టడం మరికొందరిలో చర్మం పొడిబారిపోవడం చూడొచ్చు. దీనికోసం రోజుకు రెండు పూటల స్నానం చేస్తూ చర్మం పొడిబారకుండా లోషన్స్ ఉపయోగించాలి. గర్భం ధరించాక పళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి డెంటిస్ట్ ని సంప్రదించడం.. రోజూ నోటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేస్తుండాలి. వజైనల్ డిశ్చార్జ్ కూడా పెరుగుతుంది కాబట్టి గోరువెచ్చని నీటితో ఆ భాగాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి.

తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఆహారం..

గర్భంతో ఉండడం అనేది ఓ ప్రత్యేకమైన సందర్భం. అదేదో ఆరోగ్యం బాగాలేని స్థితి కాదు. కానీ పెద్దవాళ్లు చెప్పినట్లు మరీ ఇద్దరు వ్యక్తులకు కూడా తినాల్సిన అవసరం లేదు. సాధారణంగా తీసుకునే ఆహారం కంటే మూడు వందల క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. మరి, ఆహారంలో భాగంగా ఏం తీసుకోవాలంటే..

Shutterstock

ముడి ధాన్యాలు, పప్పుధాన్యాలు

గర్భం దాల్చిన తర్వాత రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెరల స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. అందుకే ముడి ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలు కూడా తీసుకోవాలి.

డైరీ ఉత్పత్తులు

ప్రెగ్నెన్సీలో సాధారణంగా మనకు అవసరమైన క్యాల్షియం స్థాయుల కంటే ఎక్కువ అవసరమవుతాయి. అందుకే సాధారణం కంటే ఎక్కువ మోతాదులో పాలు, పెరుగు, పనీర్ వంటివి తీసుకోవాలి.

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు ప్రక్రతి అందించే వరం. వాటిలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఎక్కువ శాతం అందుతాయి. అంతేకాదు.. గర్భం ధరించిన తర్వాత వీటిని తినడం వల్ల లైట్ గా కూడా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.

Shutterstock

ప్రొటీన్లు

గర్భం ధరించిన వారు ప్రొటీన్ కోసం పప్పుధాన్యాల మీద మాత్రమే ఆధారపడకుండా గుడ్లు, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడప్పుడూ చికెన్, రొయ్యలు, మటన్ వంటివి కూడా తీసుకోవచ్చు. శాకాహారులు పనీర్, టోఫూ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు తీసుకోవచ్చు.

గింజలు, నట్స్, బీన్స్

బీన్స్ లో ఎక్కువగా ఉండే ప్రొటీన్లతో పాటు నట్స్, సీడ్స్ లో శరీరానికి అవసరమయ్యే ఫాటీ యాసిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని తీసుకోవాలి.

shutterstock

తీసుకోకూడనివి..

గర్భం ధరించిన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో.. అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండడం అంతే అవసరం. వీటిలో రక్తంలో చక్కెర స్థాయులు పెంచేవి, పోషకాలు లేని ఆహారం, క్యాలరీలు ఎక్కువగా అందించే ఆహారంతో పాటు ఈ సమయంలో తినకూడదని మరికొన్ని పదార్థాలున్నాయి. అవేంటంటే.. 

కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్

గర్భం ధరించిన మహిళలు కాఫీ లేదా కెఫినేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కెఫీన్ పెరిగి మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూ కనీసం 200 ఎంజీ కంటే ఎక్కువగా కెఫీన్ తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

పచ్చిబొప్పాయి, పైనాపిల్, ద్రాక్ష

గర్భం తో ఉన్న మహిళలు పచ్చి బొప్పాయి తినకూడదని పెద్దలు చెప్పే విషయం గురించి మనకు తెలిసిందే. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచే గుణాన్ని కలిగి ఉండడంతో పాటు ఇందులోని లేటెక్స్ రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. అందుకే దీనికి దూరంగా ఉండాలి. అలాగే పైనాపిల్ లో బ్రొమిలిన్ అనే కెమికల్ ఉండడం వల్ల అది గర్భాశయం గోడలను ముడుచుకుపోయేలా చేసి మిస్ క్యారేజ్ అయ్యేలా చేస్తుంది. అలాగే నల్ల ద్రాక్షలోని రెస్వెరటాల్ అనే కెమికల్ కూడా కడుపు లోని బిడ్డకు విషంగా పరిణమిస్తుంది కాబట్టి దీన్ని కూడా తినకూడదు.

ఆల్కహాల్, ధూమపానం

గర్భిణులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మిస్ క్యారేజ్, పుట్టుకతోనే బిడ్డ చనిపోయే ప్రమాదం పెరగడంతో పాటు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ వల్ల పిల్లల అవయవ లోపాలు, గుండె పనితీరులో సమస్యలు ఏర్పడవచ్చు.

Shutterstock

ఫాస్ట్ ఫుడ్

బిడ్డలు కడుపు తో ఉన్నప్పుడు మనం తినే ఆహారం బిడ్డల ఆహారపుటలవాట్లపై ప్రభావం చూపుతుంది. మీరు చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పిల్లలకు కూడా అదే అలవాటై వూబకాయానికి దారి తీస్తుంది. అంతే కాక ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే ఎంఎస్ జీ కడుపు లో ఉన్న బిడ్డలో అవకరాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

పాశ్చురైజ్ చేయని జ్యూస్, పాలు

పాశ్చురైజ్ చేయని జ్యూస్ లేదా పాలలో లిస్టీరియా, సాల్మొనెల్లా, ఈ కొలై, కాంఫిలోబాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంటుంది. ఇవి పుట్టే బిడ్డ ప్రాణానికే హాని కలిగిస్తాయి. అందుకే దీన్ని తీసుకోకుండా ఉండడం మంచిది.

ప్యాకేజ్డ్ ఫుడ్

ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే పోషకాలు తక్కువగా ఉంటాయి. గర్భం ధరించిన తర్వాత మన శరీరంలోని అవయవాలతో పాటు బిడ్డ శరీరం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో పోషకాలు అవసరమవుతాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలు మాత్రమే కాకుండా పోషకాలు కూడా ఉండేలా చూసుకోవాలి. అందుకే ప్యాకేజ్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

ఐస్ క్రీం, బేకరీ ఫుడ్

ఐస్ క్రీం, బేకరీ ఫుడ్ వంటి వాటిలోనూ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని రిఫైన్డ్ కార్బొహైడ్రేట్ల వల్ల శరీరంలోని ఒకేసారి చక్కెర స్థాయులు పెరుగుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో చేయాల్సిన వ్యాయామాలు

ప్రెగ్నెన్సీ సమయంలో మామూలుగా చేసే వ్యాయామాల కంటే కాస్త విభిన్నమైనవి చేయాల్సి ఉంటుంది. శరీరంపై బరువు పడకుండా ఉంటూనే మిమ్మల్ని సహజ ప్రసవానికి సిద్ధం చేయడానికి అది మీకెంతగానో ఉపయోగపడుతుంది. మరి, ఆ వ్యాయామాలేంటంటే..

shutterstock

యోగా

ఏ సమయంలోనైనా సరైన వ్యాయామంగా యోగాని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మార్జాలాసనం, తాడాసనం, వీరభద్రాసనం, త్రికోణాసనం, ఉత్తానాసనం, శవాసనం, వ్రక్షాసనం, బద్దకోణాసనం వంటి ఆసనాలు చేయడం వల్ల యోగా చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

కార్డియో

ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని వ్యాయామాల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కాస్త వేగం తగ్గించి వ్యాయామాలను చేస్తే సరిపోతుంది. కాస్త నెమ్మదిగా పరిగెత్తడం, నడవడం, సైక్లింగ్ వంటివి చేస్తుండడం వల్ల బరువు పెరగకుండా ఉండే వీలుంటుంది.

Shutterstock

హిప్ రైసెస్

వెల్లకిలా పడుకొని మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఉంచాలి. నడుము పైకి లేపుతూ ఉండాలి. మీ భుజాలపై బరువు పడేలా ఉంచి అలా లేపి వీలైనంత ఎక్కువ సమయం గాల్లో ఉంచాలి. ఇలా ఐదు సార్లు చేస్తే ఒక సెట్ పూర్తవుతుంది. ఇలాంటి సెట్స్ రోజూ మూడు చేయడం మంచిది. ఈ వ్యాయామాన్ని రెండో త్రైమాసికంలో ప్రారంభించవచ్చు.

లైయింగ్ కోబ్లర్

మూడో త్రైమాసికంలో పొట్ట కిందికి జారిన తర్వాత ప్రసవానికి సిద్ధమయ్యేందుకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది. దీనికోసం పద్మాసనంలో కూర్చొని కాళ్లను వెడల్పుగా చేస్తూ రెండు పాదాలు అనుకునేలా చేయాలి. ఆ తర్వాత కాళ్లు పైకి ఉంచి మీరు పడుకోవడం వల్ల కటి వలయం భాగంలో ఒత్తిడి పడుతుంది. కాబట్టి సహజ ప్రసవం అయ్యే వీలుంటుంది.

Shutterstock

డౌన్ వర్డ్ డాగ్

నిలబడి కాళ్లను కాస్త వంచి చేతులను కిందకు ఉంచాలి. కాళ్లు దూరంగా ఉంచి పాదాలను వత్తి పెడుతూ ఇటు అర చేతులు, అటు అరికాళ్లపై భారం వేసి అధో ముఖ స్వానాసన ఆసనంలా వేయాలి. ఇలా రోజుకు కనీసం ఐదు సార్లు చేయాలి.

గ్లూ స్ట్రెచ్

కుర్చీపై కూర్చొని కాళ్లు స్ట్రెయిట్ గా చాపి కాలు మీద కాలు వేసుకొని అరి కాలిని మీ నడుము వద్దకు జరుపుతుండాలి. అలా వీలైనంత జరిపి ఐదు సెకన్ల పాటు ఉంచి ఆ తర్వాత తీసేయాలి. తిరిగి మరోకాలితో ఇదేలా చేయాలి.

సైడ్ ప్లాంక్

పక్కకి తిరిగి పడుకొని మోచేతిని కింద ఆనించి ఉంచాలి. మరో చేతిని పైకి లేపి నడుము భాగాన్ని పైకి లేపుతూ వీలైనంత వరకూ లేపాలి. ఇలా ఒక్కోచేత్తో మూడు సార్లు చేయాలి. మధ్యలో నొప్పిగా అనిపిస్తే మానేయొచ్చు.

Shutterstock

స్క్వాట్స్

ఓపెనింగ్ స్క్వాట్స్ గా పిలిచే ఈ వ్యాయామం కోసం మోకాళ్ల వద్ద వంచి కూర్చోవాలి. రెండు కాళ్లను కింద ఆనించి నడుము మాత్రం ఆనకుండా కూర్చోవాలి. ఇండియన్ టాయిలెట్ ఉపయోగించినప్పుడు కూర్చున్నట్లుగా కూర్చుంటూ రెండు అరచేతులను నమస్కారం పెడుతున్నట్లుగా ఉంచి రెండు మోకాళ్ల కు మోచేతులు ఆనించి ఉంచాలి.

పెల్విక్ స్ట్రెచెస్

కుర్చీలో కూర్చున్నట్లుగా ఎక్సర్ సైజ్ బాల్ పై కూర్చొని ముందుకు వెనక్కి జరుగుతూ కటి వలయ భాగంపై ఒత్తిడి పడేలా చేయాలి. ఇలా ఇరవై సార్లు ముందుకి ఇరవై సార్లు వెనక్కి చేయడం వల్ల కటి వలయం సహజ ప్రసవానికి సిద్ధమవుతుంది.

తరచూ ఎదురయ్యే సందేహాలకు సమాధానాలు

shutterstock

1. గర్భం ధరించాక సెక్స్ లో పాల్గొనవచ్చా?

గర్భం ధరించినంతమాత్రాన మీరు మీ భర్త సెక్సువల్ గా యాక్టివ్ గా ఉండకూడదు అని రూలేం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఇద్దరూ సెక్స్ లో పాల్గొనవచ్చు. కడుపు లోని బిడ్డ చుట్టూ ఉమ్మనీరు, మాయ, ఆపై కండరాలు, చర్మం వంటివన్నీ ఉంటాయి కాబట్టి బిడ్డకు సెక్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

అయితే ఈ సమయంలో పొట్ట వల్ల ఇబ్బందిగా అనిపించకుండా సెక్స్ పొజిషన్స్ మార్చి ప్రయత్నించాలి. ఏ నెల వరకూ సెక్స్ లో పాల్గొనవచ్చన్నది మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

2. గర్భం ధరించిన తర్వాత ఏ నెల వరకూ ఆఫీస్ కి వెళ్లి పనిచేయవచ్చు?

గర్భం ధరించిన తర్వాత ఏ నెల వరకూ ఆఫీస్ కి వెళ్లి పనిచేయవచ్చు అన్న విషయం మీరు చేసే పని మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పనిలో ఇబ్బంది ఎదురవడం, రాత్రుళ్లు నిద్రలేకపోవడం వంటివన్నీ ఉంటే ఆఫీస్ కి వెళ్లకపోవడం మంచిది.

దానితో పాటు మీ పని ప్రదేశంలో ఎక్కువగా నిలబడడం, కష్టం ఎక్కువగా ఉండే పని అయితే పని త్వరగా మానేయడం మంచిది. లేదంటే కూర్చొని చేసే ఉద్యోగం అయితే మీకు సౌకర్యంగా ఉంటే డెలివరీ వరకూ పనిచేయవచ్చు.

Shutterstock

3. కడుపు లో ఉన్న బిడ్డకు ప్రమాదం ఉందని తెలిపే సంకేతాలేంటి?

గర్భంతో ఉన్నప్పుడు బిడ్డకు హాని కలిగిందేమో అన్న అనుమానం రాగానే వైద్యులను సంప్రదించాలి. అలా అనుమానం వచ్చేందుకు ప్రమాదమేమో అని తెలిపే సంకేతాలను గుర్తించాలి. అవేంటంటే.. రక్తస్రావం, మరీ ఎక్కువగా వాంతులవడం, తీవ్రమైన జ్వరం, కడుపు లో బిడ్డ కదలికలు తగ్గడం లేక ఆగిపోవడం, ఒకేసారి ఎక్కువ బరువు పెరగడం, ఫిట్స్, డయేరియా, రంగుల్లో ఉన్న వజైనల్ డిశ్చార్జ్, కడుపు నొప్పి, యోని నుంచి నీళ్లు కారుతున్నట్లుగా అనిపించడం వంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.

4.గర్భం ధరించిన తర్వాత ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి?

గర్భం దాల్చే ముందు మీకు ఏయే సమస్యల బారిన పడే ప్రమాదం ఉందో తెలుసుకోవాలి. అవి రాకుండా ఏవైనా మందులు వాడే వీలుంటుందో తెలుసుకొని అవి వాడాలి. మంది ఆరోగ్యకరమైన బరువు కొనసాగిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వంటివి చేయడం వల్ల గర్భం దాల్చిన తర్వాత కడుపు లో బిడ్డకు, మీకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

ప్రెగ్నెన్సీ సమయంలో అడిగేందుకు.. ఇబ్బందిపడే సందేహాలకు సమాధానాలివిగో..!

తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి..

అమ్మతనంలోని అనుభూతే వేరు.. నేను తల్లిని కాబోతున్నా: అమీ జాక్సన్

Read More From Diet