Beauty

సహజమైన ఈ చిట్కాలు.. మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి (Homemade Beauty Tips In Telugu)

Lakshmi Sudha  |  Apr 3, 2019
సహజమైన ఈ చిట్కాలు.. మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి (Homemade Beauty Tips In Telugu)

చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందుకే చర్మాన్ని క్లెన్సింగ్, మాయిశ్చరైజ్, టోనింగ్ చేసుకోవడం అనేవి.. మన స్కిన్ కేర్ రొటీన్‌లో భాగంగా ఉంటాయి. దీనికోసం మనం మార్కెట్లో లభించే ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా.. అవి చర్మానికి నప్పుతాయా? లేదా? అనేదే ప్రశ్న. ఎందుకంటే మనలో చాలామంది చర్మతత్వానికి సరిపోయే ఉత్పత్తులను ఉపయోగించడం లేదు.

అంత వరకు ఎందుకు..? మనం బ్యుటీషియన్ దగ్గరకు వెళితే ఆమె కూడా మన చర్మానికి నప్పే ఫేషియల్ వేస్తుందనే గ్యారంటీ లేదు. ఇలాంటప్పుడు మనకు కూడా టోన్ స్కిన్ పొందడమనేది అసాధ్యమైపోతుంది. ఒకవేళ ఆ సమయానికి.. చర్మంలో ప్రకాశవంతమైన మార్పు కనిపించినా.. అది తాత్కాలిక ఫలితమే అవుతోంది. మరి చర్మం ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే ఏం చేయాలి?

మేకప్ వేసుకోవడం వల్ల మనం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దానికోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. తన సహజమైన మెరుపుని కోల్పోతుంది. అలాగని మేకప్ లేకుండా బయటకు వెళ్లలేం. కొన్ని రంగాల్లోని వారికి మేకప్ చాలా అవసరం కూడా. మరి చర్మం కోల్పోయిన మెరుపుని తిరిగి పొందడం ఎలా?

డోంట్ వర్రీ.. దానికి మా దగ్గర పరిష్కారం ఉంది. మన వంటింట్లో, కిచెన్ గార్డెన్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి మనం పాటించే నేచురల్ టిప్స్ సహజమైన సౌందర్యాన్ని కాపాడతాయి. అందుకే మీ Beauty ని కాపాడే Natural Face Packs వివరాలు మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..

సహజమైన చిట్కాల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు

చర్మాన్ని మెరిపించే నేచురల్ టిప్స్

సహజమైన చిట్కాల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు (Benefits Of Natural Skin Care)

మేకప్ వల్ల మనం అందంగా కనిపిస్తాం. కానీ చర్మం ఆరోగ్యంగా లేనట్లయితే మేకప్ వేసుకొన్నా పెద్దగా ఫలితముండదు. అందుకే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం. దానికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు కాకుండా.. చాలా చౌకగా లభించే కూరగాయలు, పండ్లు వంటివి ఉపయోగించి చర్మాన్ని పరిరక్షించుకోవచ్చు. దీనికోసం మనం ఇంత కష్టపడటం ఎందుకు? మార్కెట్లో దొరికే ఉత్పత్తులు ఉపయోగించవచ్చు కదా? అనే ఆలోచన మీకు రావచ్చు. కానీ నేచురల్  పదార్థాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనానికి అవి సాటి రావు. నమ్మాలనిపించడం లేదు కదా..? అయితే సహజమైన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకొంటే మీరే ఆ విషయం ఒప్పుకొంటారు.

  1. సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి మనం పాటించే చిట్కాలు లేదా వేసుకొనే ఫేస్ ప్యాక్‌ల వల్ల చర్మకణాలు జీవకళను సంతరించుకొంటాయి.
  2. చర్మానికి సాంత్వన దొరుకుతుంది. ఫలితంగా చర్మం మెరిసిపోతుంది.
  3. చర్మ సంరక్షణ కోసం అన్నీ సహజమైన ఉత్పత్తులనే ఉపయోగిస్తాం. కాబట్టి రసాయనాల ప్రభావం పడుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం ఉండదు.
  4. వీటిని పాటించడం మాత్రమే కాదు.. తయారు చేసుకోవడం సైతం సులభమే. ఇంట్లో ఉన్న పదార్థాలతో తక్కువ ఖర్చుతోనే వీటిని తయారుచేసుకొని చర్మానికి అప్లై చేసుకోవచ్చు.
  5. హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల చర్మం రిలాక్సవుతుంది.

చర్మాన్ని మెరిపించే నేచురల్ టిప్స్ (Homemade Beauty Tips In Telugu)

ఈ కథనంలో మనకు ఎప్పుడూ ఇంట్లో అందుబాటులో ఉండే బియ్యంపిండి, శెనగపిండి, పెసరపిండి, టమాటా, బంగాళాదుంప, బాదం పప్పు వంటి వాటితో సులభంగా తయారు చేసుకోగలిగిన ఫేస్ ప్యాక్స్, ఫేస్ మాస్క్స్ గురించి తెలుసుకొందాం.

Also Read: చర్మ ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు (Ayurvedic Tips For Skin)

ట్యాన్ తొలిగించుకొనేందుకు పాటించాల్సిన చిట్కాలు (Natural Beauty Tips To Get Rid Of Tan At Home)

కాసేపు ఎండలో తిరిగితే చాలు చర్మం పై ట్యాన్ పెరిగిపోతుంది. అలాంటిది ఇక వేసవిలో మన చర్మంపై ఎంత ట్యాన్ పేరుకుపోతుందో  చెప్పడం సాధ్యం కాదు? దాన్ని తొలగించుకొనేందుకు కొన్ని ఇంటి చిట్కాలు మీకోసం..

1. నిమ్మరసంతో.. (Lemon Juice)

నిమ్మరసంలో ఉన్న ఆస్కోర్బిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత‌ కణాలను, ట్యాన్‌ను తొలిగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ ఫలితాన్ని పొందడానికి మనమేం చేయాలంటే.. బాగా ముగ్గిన నిమ్మకాయ ముక్క తీసుకొని దానిలోని గింజలను తీసేయాలి. దీంతో ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరింత ఎక్కువ సమయం రుద్దుకోవాలి. రుద్దడం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాలు అలా వదిలేయాలి.

ఆపై నూనెతో ముఖాన్ని రెండు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకొంటున్నప్పుడు చర్మంపై పేరుకొన్న మురికి, మృత‌ కణాలు, మట్టి వదిలిపోతాయి. ఆ తర్వాత చర్మం పూర్తిగా శుభ్రం కావడంతో.. అది అందంగా మెరిసిపోతుంది. మీరు నిమ్మరసాన్ని మొదటిసారిగా చర్మానికి రాసుకొంటున్నట్లయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. గడ్డం దగ్గర కొద్దిగా నిమ్మరసం రాసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత కూడా.. మీకు ఏమీ ఇబ్బందిగా అనిపించకపోతే మీరు ఈ చిట్కాను పాటించవచ్చు.

2. టమాటా, ఎర్ర కందిపప్పు, కలబంద (Tomato, Sandalwood And Aloe Vera)

ట్యాన్ పోగొట్టుకోవడంతో పాటు చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవడానికి టమాటా, ఎర్రకందిపప్పు, కలబందతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. నానిన కందిపప్పులో చెంచా టమాటా గుజ్జు, కొద్దిగా కలబంద గుజ్జు కూడా కలిపి బ్లెండర్లో వేసి మెత్తటి గుజ్జుగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంపై ఉన్న ట్యాన్ పోతుంది.

3. స్ట్రాబెర్రీ , మిల్క్ క్రీం మిశ్రమం )Strawberry And Milk Cream)

స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ట్యాన్‌ను చాలా ప్రభావవంతంగా పోగొడుతుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ ని సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది.

కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

4. బొప్పాయి, తేెనె ఫేస్ ప్యాక్ (Papaya And Honey)

బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మంపై మ్యాజిక్ చేస్తాయి. ఇవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మృతకణాలను తొలిగించి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తేనెలోని గుణాలు చర్మానికి పోషణనిస్తాయి.

బాగా ముగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

5. నిమ్మరసం, కీర దోస, రోజ్ వాటర్ (Lemon Juice And Rose Water)

నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలుంటాయి. ఇవి ట్యాన్‌ను పోగొట్టి చర్మాన్నిమెరిపిస్తాయి. దీనికి రోజ్ వాటర్, కీర దోస రసం కూడా కలిపితే.. ఎండలో వదిలిపోయినట్లుగా తయారైన చర్మానికి తిరిగి జీవకళ అందుతుంది. ఈ మిశ్రమం చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్‌ను సైతం తగ్గిస్తుంది.

టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, కీర దోస రసం, రోజ్ వాటర్ తీసుకోవాలి. ఈ మూడింటిని గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

చర్మాన్ని బ్రైట్‌గా కనిపించేలా చేసే చిట్కాలు (Natural Tips For Glowing Skin)

స్కిన్ కాంప్లెక్షన్ మెరుగ్గా ఉండాలనే ప్రతి అమ్మాయి కోరుకొంటుంది. దీనికోసం మనం పార్లర్‌కి వెళ్లి ప్రత్యేకంగా ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్‌లు తయారుచేసుకొని.. ఉపయోగించడం ద్వారా చర్మాన్ని బ్రైట్‌గా కనిపించేలా చేసుకోవచ్చు.

చర్మ తత్వం తెలుసుకోవడానికి పరీక్షలు (How To Know Your Skin Type)

1. కొబ్బరి నూనె, తేనె (Coconut Oil And Honey)

చర్మ సంరక్షణ విషయంలో ఈ రెండింటికి చాలా ప్రాధాన్యముంది. మన ముందు తరాల వారు సైతం చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి వీటిని ఉపయోగించేవారు. తేనెలో ఉండే హైడ్రాక్సిల్ యాసిడ్, ఇతర ఎంజైమ్లు చర్మం మీద ఉన్న మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను తగ్గించి స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. చర్మ కణాలను ఆరోగ్యంగా మారుస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముదిమి ఛాయలు రాకుండా, చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. దీనివల్ల స్కిన్ టెక్స్చర్ సైతం మెరుగుపడుతుంది.

గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పున తేనె, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఐదు నుంచి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

2. కలబంద, పసుపు, రోజ్ వాటర్ (Aloe Vera, Turmeric And Rose Water)

చర్మం అందంగా, యవ్వనంగా, బ్రైట్‌గా కనిపించాలంటే.. ఈ మూడు పదార్థాలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సిందే. ఇది చర్మానికి కావాల్సిన పోషణను అందించి బ్రైట్‌గా కనిపించేలా చేస్తుంది.

గిన్నెలో టీస్పూన్ కలబంద గుజ్జు, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, టీస్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 25 నుంచి 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

3. కమలా ఫలం, పసుపు (Orange And Turmeric)

కమలా ఫలం సిట్రస్ జాతికి చెందిన పండు. దీనిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను ఇచ్చి అందంగా మెరిసిపోయేలా చేస్తుంది. పైగా కమలాఫలం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది. కమలాఫలానికి పసుపు జోడించి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్‌ను రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ ఫలితాన్ని పొందడానికి గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కమలాఫలం రసంలో అర టేబుల్ స్పూన్ పసుపు పొడి కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ప్యాక్‌ను తొలిగించుకొని చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

4. శెనగపిండి, పాలు, తేనె (Besan, Milk And Honey)

ఈ మూడు పదార్థాల్లోనూ సహజ సిద్ధమైన ఎక్స్ఫోలియేటింగ్ గుణాలున్నాయి. ఇవి చర్మ గ్రంథుల నుంచి విడుదలయ్యే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాదు చర్మకణాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి సహజమైన మెరుపును అందిస్తాయి.

గిన్నెలో టీస్పూన్ శెనగపిండి, అరకప్పు పాలు, ఒక స్కూప్ తేనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ను 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  ఈ సమయంలో దాన్ని తాకకూడదు. నిర్ణీత సమయం తర్వాత మైల్డ్ సోప్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది.

5. బొప్పాయి, పెరుగు (Papaya And Yogurt)

బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ స్కిన్ టోన్ మెరుగుపరిచి ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. పైగా ముఖంపై ఉన్న మచ్చలను సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో పెరుగుకు సాటి వచ్చేది ఏదీ లేదు. అలాంటిది ఈ రెండూ కలిపి ఫేస్ మాస్క్‌గా అప్లై చేసుకొంటే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.

బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి మిక్సీ ఆన్ చేసి పేస్ట్‌గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్ (Homemade Anti Aging Face Packs) 

వయసు పెరిగే  కొద్దీ చర్మం మెరుపు కోల్పోవడం సహజం. పైగా చర్మం తన బిగిని కోల్పోయి వదులుగా తయారవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ప్రస్తుతం మార్కెట్లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు విరివిగానే లభిస్తున్నాయి. అయితే వీటిని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలెలా ఉన్నా.. దుష్ప్రభావాలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకొనే యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్స్ అప్లై చేసుకోవడం మంచిది.

1. ఎగ్ వైట్ (Egg)

గుడ్డులోని తెల్లసొనలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ ఇచ్చి ముడతలు పడకుండా చూస్తాయి. అలాగే చర్మానికి అవసరమైన ఇతర పోషకాలు సైతం తెల్ల గుడ్డు సొనలో లభిస్తాయి.

గుడ్డు అందించే ఈ ఫలితాన్ని పొందడానికి.. ఎగ్ వైట్‌లో కొద్దిగా మిల్క్ క్రీం, కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

2. అరటిపండు, రోజ్ వాటర్, తేనె, పెరుగు (Banana, Rose Water, Honey And Yogurt)

అరటి పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి పోషణను అందించి ముడతలు పడకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ముఖం పై ఉన్న మచ్చలను చర్మం రంగులో కలసిపోయేలా చేస్తుంది. 

బాగా ముగ్గిన అరటిపండు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనిలో టీస్పూన్ చొప్పున రోజ్ వాటర్, తేనె, పెరుగు వేసి బ్లెండర్ సాయంతో మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.

3. బంగాళా దుంప (Potato)

బంగాళాదుంపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం యవ్వనంగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది. దీనివల్ల చర్మం సాగిపోదు. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

బంగాళాదుంపను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని పలుచని వస్త్రంలో వేసి బాగా పిండి రసాన్ని వేరు చేయాలి. ఈ పొటాటో జ్యూస్‌లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో దీనిని కడిగేసుకొంటే సరిపోతుంది. బంగాళాదుంప రసాన్ని తీసేటప్పుడు నీరు కలపకూడదు.

4. చెరకు రసం (Sugarcane Juice)

చెరకు రసంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతుంటాం. దీన్ని ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీనిలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

మూడు టేబుల్ స్పూన్ల చెరకు రసంలో.. చెంచా పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.

అందమైన చర్మం కోసం.. ఇంట్లో తయారుచేసిన ఈ బాడీ స్క్రబ్స్ వాడేద్దామా.!

5. కొబ్బరి పాలు (Coconut Milk)

కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

కొబ్బరి పాలల్లో దూదిని.. దాంతో ముంచి ముఖభాగంగలో.. మెడభాగంలో రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

యాంటీ ఏజింగ్ ప్యాక్స్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.

ఇన్‌స్టంట్ బ్రైట్ నెస్ అందించే ఫేస్ ప్యాక్‌లు (Face Packs For Instant Brightness)

ఏవైనా పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లాలనుకొన్నప్పడు ఇన్‌స్టంట్ బ్రైట్నెస్ కోసం మార్కెట్లో దొరికే పీల్ మాస్కులు ఉపయోగిస్తాం. అన్ని సందర్భాల్లోనూ అవి మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో.. ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఫేస్ ప్యాక్స్ ప్రయత్నించండి. ఇవి మీ చర్మానికి తగిన పోషణను ఇవ్వడంతో పాటు అందంగా మెరిపిస్తాయి.

1. చందనం, రోజ్ వాటర్ (Sandalwood And Rose Water)

చందనం ముఖం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. రోజ్ వాటర్ సైతం చర్మానికి మెరుపునందిస్తుంది. వేసవిలో ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి ఉపశమనం దొరుకుతుంది.

గంధపు చెక్కను రోజ్ వాటర్‌తో అరగదీసి.. దాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే సరిపోతుంది.

2. టమాటా, పెరుగు (Tomato And Yogurt)

ఈ రెండింటిలోనూ చర్మానికి మేలు చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన మిశ్రమం ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

టేబుల్ స్పూన్ టమాటా గుజ్జులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

3. ఓట్ మీల్, చందనం, రోజ్ వాటర్ ( Oatmeal, Sandalwood And rose Water)

ఓట్ మీల్ సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్ మీల్ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చందనం, రోజ్ వాటర్ చర్మానికి ఇనస్టంట్ గ్లోను అందిస్తాయి.

రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్లో టీస్పూన్ చందనం పొడి వే..సి సరిపడినంత రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత మసాజ్ చేసుకొంటున్నట్టుగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్నమృతకణాలు సైతం తొలగిపోతాయి.

4. టమాటా, పంచదార ( Tomato And Sugar)

టమాటాలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు చర్మం పీహెచ్ విలువను క్రమబద్ధీకరిస్తాయి. చర్మం టోన్‌ను మెరుగుపరిచి ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. దీనికి చక్కెరను కలిపి మసాజ్ చేసుకోవడం ద్వారా.. చర్మానికి రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.

చిన్న సైజులో ఉన్న టమాటాను తీసుకొని దాన్ని స్పూన్ సాయంతో మెత్తగా చేయాలి. దీనిలో కొద్దిగా చక్కెర కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చేతి వేళ్లను తడి చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

5. బాదం, పాలు (Almonds And Milk)

బాదం గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. అలాగే నిర్జీవంగా మారిన చర్మకణాలకు జీవం పోస్తుంది. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.

ఐదు నుంచి ఆరు బాదం గింజలను తీసుకొని వాటిని నానబెట్టాలి. బాగా నానిన తర్వాత వాటి తొక్క తీసి గింజలను పేస్ట్‌లా తయారుచేయాలి. ఆపై కొద్దిగా పాలు కలిపి ముఖానికి, మెడకు రాసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫేస్ ప్యాక్‌లు చర్మానికి ఇనస్టంట్ బ్రైట్ నెస్ అందించడం మాత్రమే కాకుండా చర్మాన్ని అందంగా, మృదువుగానూ మారుస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ ఫేస్ ప్యాక్స్ మాదిరిగానూ ఉపయోగించవచ్చు. దీనికోసం మీకు నచ్చిన, మీరు పాటించడానికి వీలుగా ఉన్న ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

Images: Shutterstock

ఇవి కూడా చదవండి

జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఈ నేచురల్ టిప్స్ మీకోసమే..

చామంతి టీ.. గురించి మీరెప్పుడైనా విన్నారా? రుచి చూశారా?

బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందించే.. బహు చక్కని దుంప ‘బీట్రూట్’

Read More From Beauty