Beauty

మీ కురులు ప‌ట్టులా మెరిసిపోవాలా?? ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకుంటే స‌రి..!

Lakshmi Sudha  |  Jan 25, 2019
మీ కురులు ప‌ట్టులా మెరిసిపోవాలా??  ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకుంటే స‌రి..!

వాతావరణంలోని కాలుష్యం, దుమ్ము, ధూళి ప్రభావం ముందుగా పడేది చర్మం, కురుల పైనే.  మనం ఉపయోగించే హెయిర్ డ్రయర్లు, హెయిర్ స్ట్రెయిటెనర్ల ప్రభావం దానికి తోడైతే.. అవి మరింత కళావిహీనంగా తయారవుతాయి. మరి, జుట్టు కోల్పోయిన సహజత్వాన్ని తిరిగి అందించేదెలా?

వారానికి రెండు సార్లు తలస్నానం చేసి రెండు మూడు నిమిషాలు కండిషనర్ అప్లై చేసినంత మాత్రాన వెంట్రుకలకు లోతైన పోషణ అందదు. పోషణ అందించడంతో పాటు అవి పట్టులా మృదువుగా తయారవ్వాలంటే.. స్పా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దీనికోసం ప్రత్యేకించి స్పాలకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చక్కగా మీ అంతట మీరే స్పా చికిత్స చేసుకోవచ్చు.

హెయిర్ స్పా అంటే ఏంటి?

జుట్టుకి పోషణనిచ్చి, కండిషనింగ్ చేసే కొన్ని రకాల ఉత్పత్తులను క్రమపద్ధతిలో కురులకు అప్లై చేసేదే హెయిర్ స్పా. ఈ పద్దతిలో జుట్టుకు నూనె రాయడం, ఆవిరి పట్టడం, షాంపూ చేయడం, కండిషనింగ్ చేయడం చివరిగా హెయిర్ మాస్క్ వేస్తారు. ఇలా స్పా చేయడం పూర్తయ్యే సరికి మీ జుట్టు సిల్కీగా, సాఫ్ట్ గా తయారవుతుంది. అందుకే హెయిర్ స్పాను ప్రతి పదిహేను రోజులకోసారి చేయించుకోవడం మంచిది. లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు వేసుకోవచ్చు. హెయిర్ స్పా చేసుకోవడానికి సహజసిద్ధమైన హెయిర్ మాస్క్ లేదా దుకాణంలో కొనుగోలు చేసిన హెయిర్ ప్యాక్ అయినా ఉపయోగించవచ్చు. సెలూన్ లో అయితే స్పా చేయడానికి గంట సమయం పడుతుంది.

హెయిర్ స్పా ప్రభావం ఎంత కాలం ఉంటుంది?

హెయిర్ స్పా వల్ల జుట్టు సుతిమెత్తగా తయారవుతుంది. అయితే ఇది స్పా తర్వాత మీరు చేసే మొదటి తలస్నానం వరకు ఉంటుంది. డీప్ కండిషనింగ్ ఉత్పత్తులను వాడినట్లయితే.. రెండు సార్లు తలస్నానం చేసేవరకు ఉంటుంది. ఆ తర్వాత మునపటిలాగే మారిపోతుంది. అందుకే తరచూ హెయిర్ స్పా చేసుకోవడం ద్వారా జుట్టు పట్టులా ఉండేలా చూసుకోవచ్చు.

హెయిర్ స్పా చేసుకొనే పద్ధతి ఏంటి?

హెయిర్ స్పా చేసుకోవడానికి సాధారణంగా ఐదంచెల పద్ధతి పాటిస్తుంటారు. నూనె రాయడం, ఆవిరి పట్టడం, షాంపూ చేయడం, కండిషనింగ్ చేయడం, చివరిగా హెయిర్ మాస్క్ వేయడం ద్వారా స్పా పూర్తవుతుంది. ఈ ఐదు పనులన్నీ పూర్తయ్యేసరికి సుమారుగా గంట సమయం పడుతుంది.

సెలూన్‌లో స్పా ట్రీట్మెంట్  చేయించుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

బ్యూటీ సెలూన్లో స్పా రూ. 1000 నుంచి ప్రారంభమవుతుంది. మీ జుట్టు పొడవు ఆధారంగా ఈ ధర పెరుగుతూ వస్తుంది.

హెయిర్ స్పా ఇంట్లో చేసుకోవడం కుదురుతుందా?

కచ్చితంగా కుదురుతుంది. కాకపోతే కాస్త శ్రమపడాల్సి వస్తుంది. అయినప్పటికీ తక్కువ ఖర్చుతోనే సెలూన్ లో స్పా చేసుకొన్న మాదిరిగా కురులను సొంతం చేసుకోవచ్చు. ఇంట్లోనే హెయిర్ స్పా చేయించుకొనేట్లయితే.. దానికోసం అన్నీ సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. లేదంటే.. హెయిర్ స్పా చేసుకోవడానికి అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడొచ్చు. మీ జుట్టు పొడిగా, బిరుసుగా, నిర్జీవంగా ఉన్నప్పుడు హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సిల్కీగా, సాఫ్ట్‌గా ఇంకా చెప్పాలంటే అచ్చం పట్టులా మారిపోతుంది. పైగా తక్కువ ఖర్చులోనే హెయిర్ స్పా కూడా చేసుకోవచ్చు.

1. మొదట హాట్ ఆయిల్ మసాజ్

హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ స్పా ట్రీట్మెంట్ మొదలవుతుంది. దీనికోసం మీరు కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె ఏదైనా ఉపయోగించవచ్చు. నూనెను గోరువెచ్చగా ఉండేలా వేడి చేసి.. కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. ఆపై 20-30 నిమిషాల పాటు మర్ధన చేసుకోవాలి. మసాజ్ పూర్తయిన తర్వాత మీకు చాలా రిలాక్స్ అయ్యామనే భావన కలుగుతుంది.

2. కొంచెం ఆవిరి

హెడ్ మసాజ్ పూర్తయిన తర్వాత జుట్టుకి కాస్త ఆవిరి పట్టాల్సి ఉంటుంది. దీనికోసం బకెట్‌లో వేడి నీరు పోసి దానిలో మెత్తటి టవల్ ను ముంచి బాగా పిండాలి. ఇప్పుడు దాన్ని తలకు చుట్టుకొని 15-20 నిమిషాలుండాలి. ఇలా చేయడానికీ కారణం లేకపోలేదు. టవల్‌లో ఉన్న వేడి కారణంగా తలకు రాసుకొన్న నూనె మాడుకి బాగా పడుతుంది. దీనివల్ల జుట్టుకి తగిన పోషణ అందుతుంది. హాట్ టవల్ వాడటం ఇష్టం లేకపోతే.. ఫేషియల్ స్టీమర్‌ను దీనికోసం ఉపయోగించవచ్చు.

3. ఇట్స్ టైం ఫర్ షాంపూ..

ఆవిరి పట్టడం పూర్తైన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈక్ర‌మంలో తలకు అప్లై చేసుకొన్న నూనె మొత్తం వదిలిపోయేలా చూసుకోవాలి. అలాగే తలస్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.

4. హెయిర్ మాస్క్

హెయిర్ స్పా చేసుకోవడంలో చివరిది హెయిర్ మాస్క్ వేసుకోవడం. ఇది కురులకు తేమనందిస్తుంది. దీనికోసం మీరు ఇంట్లో ఉన్న పదార్థాలతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. లేదా మార్కెట్లో దొరికే హెయిర్ మాస్క్ అయినా ఉపయోగించవచ్చు.

వంటగదిలోని పదార్థాలతో చేసుకోదగిన హెయిర్ మాస్క్ లు

1. అరటి పండు, తేనె హెయిర్ మాస్క్

అరటి పండులో విటమిన్ ఎ, ఇ, సి, పొటాషియం ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. తేనెలోని గుణాలు జుట్టుని మృదువుగా మారుస్తాయి. ఈ హెయిర్ మాస్క్‌ని ఎలా తయారుచేసుకోవాలంటే.. రెండు అరటి పళ్లను తీసుకొని వాటిని ముక్కలుగా కత్తిరించి బ్లెండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని తలకు అప్లై చేసుకొని పావుగంట ఆరనిచ్చి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. అవకాడో, బాదం నూనెతో

మీ జుట్టు పొడిగా, డల్‌గా ఉన్నట్లయితే అవకాడోతో తయారుచేసిన ఈ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. దీనిలో పుష్కలంగా ఉన్న విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకి అవసరమైన పోషణను అందిస్తాయి. అవకాడోను ముక్కలుగా చేసి బ్లెండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి. దీనికి కొంత బాదం నూనె, కొద్దిగా పాలు కలిపి దీన్ని మాస్క్‌లా వేసుకొని.. అరగంట సమయం ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

3. ఆలివ్ నూనె, పెరుగు

పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ స్కాల్ఫ్‌ను ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దీనిలోని విటమిన్ ఇ, లాక్టిక్ యాసిడ్, ప్రొటీన్లు, జింక్ జుట్టును కండిషన్ చేస్తాయి. అలాగే చుండ్రు, మాడు పొడిబారడం, జిడ్డుగా మారడం, పొలుసులు ఊడటం వంటి సమస్యలున్నవారు ఈ ప్యాక్ వేసుకొంటే మంచి ఫలితం లభిస్తుంది. కప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. దీన్ని తలకు అప్లై చేసుకొని 30-45 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. మరింత మంచి ఫలితం కోసం ఈ ప్యాక్‌ను నిద్రపోయే ముందు అప్లై చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాల్సి ఉంటుంది.

4. కొబ్బరి నూనె, తేనె

కొబ్బరి నూనెలో కురులకు మేలు చేసే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇతర పోషకాలున్నాయి. దీనికి తేనె తోడైతే.. అలల్లా ఎగసిపడే కురులు మీ సొంతమవుతాయి. ఇవి జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందిస్తాయి. మీది పొడిజుట్టు అయితే ఈ ప్యాక్ వేసుకోవచ్చు. గిన్నెలో కొన్ని చెంచాల కొబ్బరి నూనె తీసుకొని వేడి చేయాలి. దీనికి టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాల్సి ఉంటుంది.

కొనుగోలు చేయదగిన హెయిర్ స్పా ఉత్పత్తులు

కిచెన్‌లో ఉన్న పదార్థాలను ఉపయోగించి హెయిర్ మాస్క్‌లు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకొన్నాం కదా.. మార్కెట్లో మనం కొనుగోలు చేసి వాడదగిన కొన్నిరకాల ఉత్పత్తుల గురించి తెలుసుకొందాం.

1. లోరియల్ పారిస్ హెయిర్ స్పా (రూ. 599)

సెలూన్లలో ఎక్కువగా ఉపయోగించే హెయిర్ స్పా ఉత్పత్తి లోరియల్ పారిస్ హెయిర్ స్పా. దీన్ని ఒకసారి కొనుగోలు చేస్తే వీలైనన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు. మీ జుట్టు పొడవుగా ఉన్నట్లయితే నాలుగుసార్లు దీన్ని వాడుకోవచ్చు. అదే సెలూన్‌కి వెళ్లిన ప్రతిసారి వెయ్యికి తక్కువ కాకుండా చెల్లించాల్సి వస్తుంది. ఈ హెయిర్ స్పా ఉత్పత్తి డిస్కౌంట్‌లో ఐదొందల రూపాయలకు కూడా దొరుకుతుంది. అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతున్నట్లే కదా.. ఈ స్పా క్రీం మీ జుట్టుకు పోషణను అందిస్తుంది. ఆమ్పౌల్(ampoules) క్యాప్సూల్స్‌ను ఈ స్పా క్రీంకు జోడిస్తే మరింత మంచి ఫలితాన్ని అందుకోవచ్చు.

2. స్ట్రీక్స్ ప్రొ హెయిర్ స్పా (రూ. 165)

తక్కువ ధరలో లభించినా మెరుగైన ఫలితాలను అందించే హెయిర్ స్పా ప్యాక్ కోసం మీరు చూస్తున్నారా? అయితే స్ట్రీక్స్ ప్రొ హెయిర్ స్పా దానికి సరైన ఎంపిక. దీనిలో ఉన్న విటమిన్ ఇ, తేనె జుట్టుకి కావాల్సిన పోషణను అందిస్తాయి. అంతేకాదు జుట్టును ఒత్తుగా కనిపించేలా చేస్తాయి.

3. Schwarzkopf స్పా ఎస్సెన్స్ హైడ్రేటింగ్ క్రీం (రూ. 590)

విరివిగా ఉపయోగించే హెయిర్ స్పా క్రీంల్లో ఇది కూడా ఒకటి. దీనిలో ఉన్న హైడ్రో కెరోటిన్లు జుట్టుకు పోషణ అందించి కోల్పోయిన తేమను తిరిగి అందిస్తాయి. దీన్ని తరచూ ఉపయోగించడం ద్వారా జుట్టు సిల్కీగా, స్మూత్ గా తయారవుతుంది.

4. జోవీస్ ఆర్గాన్ ఆయిల్ ఫ్రం మొరాకొన్ హెయిర్ స్పా మాస్క్ (రూ. 370)

హెయిర్ స్పా నిమిత్తం మంచి ఆర్గాన్ ఆయిల్ కోసం వెతుకుతుంటే.. ఇది మీకు సరైన ఎంపికనే చెప్పుకోవాలి. పైగా బడ్జెట్‌లోనే లభిస్తుంది. ఇది జుట్టుకి పోషణ అందించి, డల్‌గా ఉన్న కురుల్లో జీవం పోస్తుంది.

5. మమాఎర్త్  ఆర్గాన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్ (రూ. 538)

పారాబెన్, సల్ఫేట్ వంటి హానికారక రసాయనాలు లేని హెయిర్ మాస్క్ వాడాలనుకొంటే.. మమా ఎర్త్ పర్ఫెక్ట్ ఎంపిక. దీనిలో సహజసిద్ధమైన ఆర్గాన్ నూనె, పాల ప్రొటీన్లు, అవకాడో నూనె ఉంటాయి. ఇవి జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. గర్భం దాల్చినప్పుడు, ప్రసవం తర్వాత జుట్టు రాలే సమస్య మహిళల్లో అధికంగా ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి ఈ మాస్క్ ఉపయోగించవచ్చు. హానికారక రసాయనాలుండవు కాబట్టి దీన్నివాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఇవండీ.. హెయిర్ స్పా విశేషాలు. పట్టులాంటి మెత్తని కురుల కోసం వారానికోసారి హెయిర్ స్పా చేసుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం కుదరకపోతే.. కనీసం నెలకోసారైనా సరే స్పా ట్రీట్మెంట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల హెయిర్ టెక్స్చర్ మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన, ఒత్తుగా ఉండే నల్లని జుట్టు మీ సొంతమవుతుంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఇంట్లోనే hair spa చేసుకోండి.

Images: shutterstock

ఇవి కూడా చ‌ద‌వండి

నూనె కాని నూనె.. జొజోబా నూనె అందించే సౌందర్య ప్రయోజనాలివే..!

ఈ చిట్కాలతో.. నొప్పి లేకుండా వ్యాక్సింగ్ చేసుకోవడం సాధ్యమే..!

ఎప్ప‌టికీ మీ వయసు ఇర‌వైలానే క‌నిపించాలా?? అయితే ఇలా చేయ‌కండి..!

Read More From Beauty