Beauty

స్ట్రెచ్ మార్క్స్ మాయం చేయడానికి.. ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి..! (Home Remedies To Remove Stretch Marks In Telugu)

Soujanya Gangam  |  May 16, 2019
స్ట్రెచ్ మార్క్స్ మాయం చేయడానికి.. ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి..! (Home Remedies To Remove Stretch Marks In Telugu)

స్ట్రెచ్ మార్క్స్ (Stretch marks).. మన చర్మం (Skin)పై డ్యూరల్ చర్మపు పొర ఏ కారణం వల్లయినా కాస్త సాగినట్లుగా మారితే దానిపై గీతల్లాంటి మార్క్స్ ఏర్పడతాయి. దీని వల్ల మన చర్మం అందాన్ని కోల్పోతుంది. మన నడుము, పొట్ట భాగంపై ఎక్కువగా కనిపించే ఈ స్ట్రెచ్ మార్క్స్ మనం అందంగా కనిపించకుండా చేస్తుంది. పొట్ట, తొడలు, చంకలు, పిరుదులు.. ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి.

ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల అందమైన దుస్తులు వేసుకోవడానికి కాస్త వెనుకాడాల్సి వస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న భాగాలు కనిపించకుండా మొత్తం కప్పి ఉండేలా దుస్తులు వేసుకోవాలి. అందుకే వాటిని తొలగించడం దీనికి ఉన్న ఏకైక మార్గం. కొన్ని ఇంటి చిట్కాలతోనే ఈ స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించే వీలుంటుంది. అవేంటో తెలుసుకుందాం రండి..

స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడానికి గల కారణాలు

స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి ఇంటి చిట్కాలు

స్ట్రెచ్ మార్క్స్ గురించి ఎక్కువగా అడిగే ప్రశ్నలు – వాటి సమాధానాలు

స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడానికి గల కారణాలు (Causes Of Stretch Marks)

చర్మం పై పొర సాగినట్లుగా అయినప్పుడు ముందుగా రక్తనాళాలు కనిపిస్తాయి. అందుకే ముందుగా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎరుపు రంగులో కనిపిస్తాయి. రక్తనాళాలు తిరిగి మామూలు స్థితికి వచ్చిన తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ తెలుపు లేదా ఇతర ఏవైనా రంగుల్లోకి మారి లావుపాటి మార్క్స్ లా అలా మిగిలిపోతాయి. సాధారణంగా ఐదు కారణాల వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. అవేంటంటే..

1. ప్రెగ్నెన్సీ (Pregnancy)

సాధారణంగా చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలోనే స్ట్రెచ్ మార్క్స్ (Stretch marks) ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఈ సమయంలో మహిళల పొట్ట భాగం బాగా సాగుతుంది. ఈ భాగంలోని చర్మం మరీ ఎక్కువగా సాగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వస్తుంటాయి. కేవలం పొట్ట మాత్రమే కాదు.. తొడలు, రొమ్ములు కూడా లావుగా మారడం వల్ల ఆ ప్రాంతంలోనే స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వస్తాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ డెలివరీ తర్వాత కూడా తగ్గవు.

2. బరువు పెరగడం (Weight Gain)

సాధారణంగా మనం బరువు పెరిగినప్పుడు మన శరీరంలోని కొవ్వు కూడా పెరుగుతుంది. దీనికి తగినట్లుగా చర్మం కూడా సాగడానికి సమయం పడుతుంది. కానీ తొందరగా బరువు పెరిగిపోవడం వల్ల చర్మం సాగినట్లుగా మారిపోయి స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

3. జన్యుపరమైన కారణాలు (Genetic Causes)

కొంతమంది ఏం చేసినా చేయకపోయినా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి కారణం వారి చర్మం సాగే గుణం తక్కువగా ఉండడమే.. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

4. బరువు తగ్గడం ( Loosing weight)

సాధారణంగా అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ నెమ్మదిగా బరువు తగ్గాలి. ఇలా తగ్గినా స్ట్రెచ్ మార్క్స్ రావని చెప్పలేం. అలాంటివి వేగంగా క్రాష్ డైట్లు చేసి బరువు తగ్గితే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వ్యాయామం చేయడం వల్ల అప్పుడప్పుడూ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

5. యుక్త వయసు (Adolescence)

కొందరికి యుక్త వయసు వచ్చినప్పుడు వచ్చే హార్మోన్ మార్పుల వల్ల కాస్త బరువు పెరిగే అవకాశం ఉంటుంది. పైగా రొమ్ములు వంటి ప్రదేశాల్లో కొవ్వు పెరగడం కూడా జరుగుతుంది. కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి ఇంటి చిట్కాలు (Home Remedies To Remove Stretch Marks In Telugu)

స్ట్రెచ్ మార్క్స్ (Stretch marks) వచ్చాక వాటిని తొలగించడం అసాధ్యం అని చాలామంది అనుకుంటారు. కానీ ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తూ స్ట్రెచ్ మార్క్స్ తొలగించే అవకాశం ఉంటుంది. మరి, ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

1. కలబంద గుజ్జు (Aloe Vera)

స్ట్రెచ్ మార్క్స్ ని శాశ్వతంగా తొలగించేందుకు కలబంద మంచి మార్గం. దీని కోసం తరచూ కలబంద గుజ్జును స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసుకుంటూ ఉండాలి. మంచి ఫలితాల కోసం ఐదు విటమిన్ ఎ క్యాప్స్యూల్స్, పది విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకొని ఆ రెండింటినీ తీసి నూనె ఒక బౌల్ లో పోసుకోవాలి. అందులో కలబంద గుజ్జు కూడా చేర్చాలి. ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రుద్దాలి. ఇలా ఈ మిశ్రమాన్ని తరచూ రాసుకుంటూ ఉండడం వల్ల చర్మంలో కొల్లాజెన్ బంధాలు ద్రుఢంగా మారతాయి. దీంతో స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గిపోతాయి.

2. కోకో బటర్ (Cocoa Butter)

కోకో బటర్ చక్కటి చాక్లెట్ వాసనను అందిస్తూ చర్మానికి మాయిశ్చరైజేషన్ ని అందిస్తుంది. దీన్ని ముఖానికి రాసుకునే ఎన్నో ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. స్ట్రెచ్ మార్క్స్ తగ్గించేందుకు అర కప్పు కోకో బటర్ తీసుకొని అందులో టీ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రెగ్యులర్ గా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మంలో తేమను పెంచడంతో పాటు చర్మ కణాలను పునరుత్తేజం చేస్తుంది. ఇలా జరగడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారడానికి ఎంతో సమయం పట్టదు.

3. కీరా దోస, నిమ్మరసం (Cucumber And Lemon Juice)

నిమ్మరసంలోని యాసిడ్ డ్యామేజ్ అయిన కణాలు తిరిగి మామూలు స్థితికి మారేందుకు తోడ్పడుతుంది. కీరా రసం చర్మం చల్లగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఈ రెండూ సహజ ఉత్పత్తులు స్ట్రెచ్ మార్క్స్ తగ్గించేందుకు ఎంతో తోడ్పడతాయి. దీని కోసం కీరా రసం, నిమ్మ రసం రెండూ సమాన మోతాదుల్లో తీసుకోవాలి. ఇందులో కాటన్ బాల్ ని ముంచి దాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రుద్దాలి. అలా దాన్ని పది నిమిషాల పాటు ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

4. కొబ్బరి నూనె, ఇతర నూనెలు (Coconut Oil)

స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గాలంటే వాటిపై నూనెలు రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం కొబ్బరి నూనె, బాదం నూనె కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రుద్దాలి. ఈ రెండు నూనెలను సమాన మోతాదుల్లో తీసుకోవాలి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గిపోతాయి.

5. ఆముదం (Castor)

ఆముదం మచ్చలు, ముడతలు వంటివన్నీ పోగొడుతుంది. కేవలం చర్మానికి మాత్రమే కాదు.. ఇది జుట్టుకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. దీన్ని తరచూ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న దగ్గర రాసుకొని మసాజ్ చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ చాలా త్వరగా తగ్గిపోతాయి. అందుకే దీన్ని రోజూ పడుకునే ముందు అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి.

6. ఆలివ్ నూనె (Olive Oil)

ఆలివ్ నూనెలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడతాయి. చర్మాన్ని లోలోపల నుంచి అందంగా మారుస్తుంది. మచ్చ లేని సౌందర్యం మీ సొంతం అయ్యేలా చేస్తుంది. దీని కోసం రోజూ పడుకునే ముందు ఆలివ్ నూనెను చర్మానికి అప్లై చేసుకోవాలి.

ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట దీన్ని అప్లై చేసుకొని మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అది చాలా త్వరగా చర్మంలోకి ఇంకుతుంది. ఇలా రోజూ ఉదయాన్నే స్నానానికి ముందు రాత్రి పడుకోవడానికి ముందు మసాజ్ చేస్తూ ఉండడం వల్ల చాలా తక్కువ రోజుల్లోనే స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.

7. బంగాళాదుంప రసం (Potato Juice)

బంగాళాదుంపలో మన శరీరానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా అవసరమయ్యే ఎన్నో ఎంజైమ్స్ తో పాటు స్టార్చ్ కూడా ఉంటుంది. ఇది చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అన్ని రకాల మచ్చలను ఇట్టే తగ్గించడంలో బంగాళాదుంప చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది. దీని కోసం బంగాళాదుంప రసాన్ని తీసి దాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట కాటన్ బాల్ సాయంతో రుద్దాలి. అది ఆరిపోయిన తర్వాత తిరిగి మరోసారి రుద్దుకొని ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

8. కాఫీ (Coffee)

స్ట్రెచ్ మార్క్స్ (Stretch marks) దూరం చేసుకోవడానికి కాఫీ పొడి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సాధారణంగానే చర్మానికి మంచి స్క్రబ్బర్ లా ఉపయోగపడే కాఫీ పొడి స్ట్రెచ్ మార్క్స్ ని కూడా దూరం చేస్తుంది. దీని కోసం కాఫీ పొడిలో నీళ్లు కలిపి దీన్ని ఓ మిశ్రమంగా మార్చి స్ట్రెచ్ మార్క్స్ పై దీన్ని నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. అలా నాలుగైదు నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని తరచూ ఉపయోగిస్తే స్ట్రెచ్ మార్క్స్ చాలా త్వరగా తగ్గిపోతాయి.

9. బాదం నూనెతో.. (Almond Oil)

ఇతర నూనెల్లా బాదం నూనె కూడా చర్మంపై ఉన్న మచ్చలనే కాకుండా స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గించేందుకు తోడ్పడుతుందన్న విషయం మనకు తెలిసిందే. దీన్ని మామూలుగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రుద్దుకొని మసాజ్ చేయడం వల్ల అవి తగ్గే అవకాశాలుంటాయి. అయితే కేవలం ఇలాగే కాదు.. బాదం నూనెతో మిశ్రమం చేసి కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గించే వీలుంటుంది. దీని కోసం ఇందులో ఇతర నూనెలు లేదా విటమిన్ ఇ ఆయిల్ కలిపి మసాజ్ చేసుకోవాలి.

10. చక్కెరతో.. (Sugar)

చక్కెర మంచి స్క్రబ్బింగ్ ఏజెంట్. దీని ద్వారా చర్మం నునుపుగా మారడంతో పాటు స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గుతాయి. దీని కోసం టీ స్పూన్ చక్కెర, టీ స్పూన్ జాజికాయ పొడి, కొద్దిగా నిమ్మరసం కలిపి కాసేపు అలాగే ఉంచాలి. చక్కెర కాస్త కరుగుతున్నట్లుగా మారిన తర్వాత దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉ్న ప్రదేశంలో అప్లై చేసుకొని పది నిమషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు జల్లి నెమ్మదిగా రుద్దుతూ తొలగించడం వల్ల ఆ ప్రదేశానికి రక్త ప్రసరణ ఎక్కువగా అయ్యి స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గే వీలుంటుంది.

11. గుడ్డు మాస్క్ తో.. (Egg Mask)

దీని కోసం రెండు గుడ్లలోని పచ్చ సొనలను తీసుకొని అందులో తగినంత నిమ్మరసం కలుపుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల పాలు పోసి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మాస్క్ లా అప్లై చేసి పూర్తిగా ఆరే వరకూ అలాగే ఉంచుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా తొందరగా మంచి ఫలితాలను పొందే వీలుంటుంది.

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలివే..(FAQ’s)

1. స్ట్రెచ్ మార్క్స్ ఎంత కాలం నిలిచి ఉంటాయి?

చాలావరకూ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ కాలం పాటు ఉండవు. వాటికి మంచి రక్త ప్రసరణ జరిగి కొల్లాజెన్ బంధాలు ద్రుఢం కాగానే చాలా వరకూ తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి చాలా పెద్దవిగా ఉంటే మాత్రం పూర్తిగా తగ్గకుండా కాస్త రంగు తగ్గి చర్మంలో కలిసిపోయే అవకాశాలుంటాయి. ఎక్కువ శాతం స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి కనీసం సంవత్సరం సమయం పడుతుంది.

2. స్ట్రెచ్ మార్క్స్ తగ్గించేందుకు ఏదైనా ఆహారం తీసుకోవాలా?

స్ట్రెచ్ మార్క్స్ ముఖ్యంగా మన శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల, చర్మంలో కొల్లాజెన్ ఫైబర్స్ బంధాలు తెగిపోవడం వల్ల ఏర్పడుతుంటాయి. అందుకే హార్మోన్లను తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడానికి తగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొల్లాజెన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ తొందరగా తగ్గుతాయి. దీని కోసం ఆకుకూరలు, గింజలు, పండ్లతో పాటు సన్ ఫ్లవర్ నూనె, ఆలివ్ నూనె వంటివి ఎక్కువగా తీసుకోవడంతో పాటు నీళ్లు వీలైనంత ఎక్కువగా తాగాలి. 

3. గర్భం ధరించిన తర్వాత గోకడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందా?

చాలామంది గర్భిణులు పెద్దవాళ్ల నుంచి ఈ మాట విని ఉంటారు. గర్భం ధరించిన సమయంలో పొట్ట ప్రాంతంలో గోకడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అని.. అది పూర్తిగా నిజం కాదు.. అలాగని పూర్తిగా అబద్ధం కూడా కాదు. ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడానికి ఉన్న ఎన్నో కారణాల్లో ఇదీ ఒకటి.

స్ట్రెచ్ మార్స్ కి గోకడం కాదు.. కానీ దురద కారణం అవుతుంది. అందుకే చర్మం దురద పెట్టకుండా ఎప్పుడూ నీళ్లు తాగుతూ చర్మంపైనా మాయిశ్చరైజర్ ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల దురద పెట్టే అవకాశాలు తక్కువ. దీని వల్ల స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశాలు తగ్గించుకోగలం. కానీ వాటిని రాకుండా పూర్తిగా అడ్డుకోలేం. అందుకే మాయిశ్చరైజేషన్ తో పాటు మిగిలిన జాగ్రత్తలు కూడా పాటించాలి. 

4. స్ట్రెచ్ మార్క్స్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి?

స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే ఐదు ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి ఉంటుంది.
1. బరువు అదుపులో ఉంచుకోవడం : ఒక్కసారిగా బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల చర్మంలోని కొల్లాజెన్ ఫైబర్ బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అధిక బరువుంటే నెమ్మదిగా బరువు తగ్గడానికి ప్రయత్నించండి.
2. తేమ ముఖ్యం : మన చర్మానికి, శరీరానికి తగినన్ని నీళ్లు అందేలా చూసుకుంటే అది పొడిబారిపోయి స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే వీలైనన్ని నీళ్లు తాగాలి.
3. సమతులాహారం : స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ డిలతో పాటు జింక్ కూడా కావాలి. ఇక ప్రొటీన్ ఆహారంలో ఎక్కువగా ఉండడం కూడా ముఖ్యమే. ఇవన్నీ ఆహారంలో ఉండేలా చూసుకుంటూ జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటే సరి.
4. విటమిన్ సి తీసుకోండి : మనం తీసుకునే ఆహారంలో వీలైనంత ఎక్కువ విటమిన్ సి ఉంటే చర్మం ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. మొటిమలు, మచ్చలు, ముడతలతో పాటు స్ట్రెచ్ మార్క్స్ కూడా రాకుండా యవ్వనమైన మెరుపుతో ఆరోగ్యంగా కనిపిస్తారు.
5. వీటన్నింటితో పాటు ఒకవేళ స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తే వెంటనే వాటికి ట్రీట్ మెంట్ తీసుకోవడం ప్రారంభించాలి. ఆలస్యం చేసిన కొద్దీ వాటిని తగ్గించుకునే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే వీలైనంత త్వరగా ఇంటి చిట్కాలు అవి పూర్తిగా పనిచేయకపోతే డాక్టర్ సలహా మేరకు క్రీములు ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ ని పూర్తిగా తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే అందమైన మెరిసే చర్మం మీ సొంతమవడం ఖాయం.

ఇవి కూడా చదవండి.

పెళ్లి తర్వాత.. మీరు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

ట్యాన్‌తో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో దాన్ని ఇట్టే దూరం చేసుకోవచ్చు..!

ప్రెగ్నెన్సీ సమయంలో అడిగేందుకు.. ఇబ్బందిపడే సందేహాలకు సమాధానాలివిగో..!

పగుళ్లను (Cracked Heels) తగ్గించే ప్యాక్స్ ఇవే..

Read More From Beauty