Entertainment

రాక్షసుడు మూవీ రివ్యూ – థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారి కోసం ..!

Sandeep Thatla  |  Aug 2, 2019
రాక్షసుడు మూవీ రివ్యూ – థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారి కోసం ..!

(Rakshasudu Movie Review)

తమిళంలో ‘రాచసన్’ (Ratchasan) పేరుతో 2018లో వచ్చిన చిత్రాన్ని.. ప్రస్తుతం తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశారు.  తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం తెలుగులోకి రీమేక్ అవుతుందనగానే అందరి దృష్టి ఈ సినిమా పైనే పడింది. అందుకు తగ్గట్టుగానే రాక్షసుడు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది.

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ (Friendship Day Gift Ideas In Telugu)

ఇక ఈరోజు విడుదలైన.. ఈ క్రైమ్ థ్రిల్లర్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదైనా థ్రిల్లర్ చిత్రాన్ని తీసుకుంటే… అందులోని కథ కన్నా.. కథనం పైనే ఆ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సినిమాల్లో ఆఖరున తెలిసే ట్విస్ట్ కన్నా.. ఆ ట్విస్ట్ వరకు మనల్ని తీసుకెళ్ళే ప్రయాణమే ఆసక్తిగొల్పుతుంది.

ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే – ఎప్పటికైనా దర్శకుడు కావాలన్న కోరికతో ఒక క్రైమ్ థ్రిల్లర్ కథాంశాన్ని సిద్ధం చేసుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అరుణ్. అయితే పోలీసు అయిన తన తండ్రి ఆకస్మికంగా చనిపోవడంతో అరుణ్‌ని ఆ  ఉద్యోగం చేయమంటూ ఇంట్లో వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంటారు. అయితే సినిమా ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వకపోయే సరికి..  పోలీసు వృత్తిని స్వీకరిస్తాడు.

అలా పోలీసుగా నియామకం అయ్యాక.. ఓ విచిత్రమైన కేసు తన వద్దకు వస్తుంది. 15 ఏళ్ళ వయసు గల అమ్మాయిలని గుర్తు తెలియని వ్యక్తి అపహరించి.. వారిని చిత్ర హింసలకు గురిచేసి చంపేస్తుంటాడు. ఆ కేసుని చూడగానే అరుణ్‌కి.. తాను సినిమా కోసం సిద్ధం చేసిపెట్టుకున్న రీసెర్చ్ గుర్తుకు వస్తుంది.

దాంతో ఇది ఓ సైకో చేస్తున్న పని అని తన పై అధికారులకి చెబుతాడు. అయితే అతన్ని ఎవరు నమ్మరు. కాకపోతే అరుణ్ చెప్పిన దాని ప్రకారమే హత్యలు జరుగుతుండగా.. ఇతను చెప్పింది పోలీసులు నమ్మే సమయంలో … అరుణ్ మేనకోడలు కూడా సైకో చేత చంపబడుతుంది. దీనితో అసలు ఈ వరుస హత్యలకు కారణం ఏంటి? ఆ సైకో ఎవరు? ఎందుకు 15 ఏళ్ళ వయసున్న స్కూల్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నాడు అన్న ప్రశ్నల కోసం వెతుకుతుంటారు.

మరి చివరికి ఆ సైకో ఎవరు అని అనేది అరుణ్ కనిపెట్టడా? లేదా అనేది వెండితెర పైన చూడాల్సిందే.

మేమిద్దరం విడిపోతున్నాం: సంచలన వార్తను ప్రకటించిన దియా మీర్జా

ఇక ఈ సినిమాలో మనల్ని ఒక నాలుగు అంశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అవేంటంటే –

* కథనం

పైన చెప్పినట్టుగా.. థ్రిల్లర్ కథాంశాలకి కథ కన్నా కథనం బాగుండాలి. అప్పుడే థ్రిల్లర్ సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు. అదే థ్రిల్లర్ చిత్రంలో పేలవమైన కథనం ఉంటే.. చివరన మంచి ట్విస్ట్ ఉన్నా ఆ సినిమా ప్రేక్షకులని రంజింపచేయలేకపోయే అవకాశాలే ఎక్కువ. అయితే ఈ రాక్షసుడు చిత్రంలో మాత్రం ఎక్కువ మార్కులు కథనానికి వేయాలి. ఈ కథనం రాసింది తమిళంలో రాచసన్ తీసిన దర్శకుడు రామ్ కుమార్. అక్కడక్కడా కొద్దిగా ఎడిటింగ్ లోపాలు కనిపించడం తప్ప.. సినిమా కథనం మాత్రం హైలైట్‌గానే నిలిచింది.

* బెల్లంకొండ శ్రీనివాస్ నటన

ఇప్పటికే నాలుగైదు కమర్షియల్ సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas)… ఈ చిత్రంతో మాత్రం తనలో ఒక  మంచి నటుడున్నాడన్న విషయాన్ని కచ్చితంగా నిరూపించుకున్నాడు. తను ఈ చిత్రం ద్వారా వచ్చిన అవకాశాన్ని.. సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు అని అనిపిస్తుంది.

ఎమోషనల్ సన్నివేశాల్లో సాయి శ్రీనివాస్ చూపిన అభినయం.. ఆయన గత చిత్రాల్లో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది. ఈ చిత్రం ద్వారా నటుడిగా కూడా మార్కులు కొట్టేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

* ఛాయాగ్రహణం

ఏ చిత్రం చూసినా.. మొదటి సన్నివేశం నుండే ప్రేక్షకుడు ఆ సినిమాలోకి లీనమవ్వాలి. అలా జరగాలంటే, సినిమాలో కెమెరా పనితనం బాగుండాలి. ఈ సినిమాలో ఛాయాగ్రాహకుడు వెంకట్ సీ దిలీప్ చాలా మంచి పనితనం చూపించాడు. సినిమా మొదటి సన్నివేశం నుండే.. మనం సినిమాలో లీనమైపోతాం. కెమెరా మ్యాన్‌కి అందుకే కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. 

* సౌండ్

కథనం ఆసక్తిగా ఉందంటే.. సన్నివేశాలు వచ్చే సమయాల్లో వెనక నుండి వచ్చే సౌండ్ కూడా ప్రేక్షకుడిని ఆ సన్నివేశం నుండి దూరం కాకుండా చేస్తుంది. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ సినిమాలకి తప్పనిసరిగా ఉండాల్సిన వాటిల్లో సౌండ్ ఒకటి. మనకి థ్రిల్ అనిపించే సన్నివేశాల వెనుక.. సందర్భోచిత సౌండ్ వస్తే ఆ సన్నివేశం తాలూకా ఇంప్యాక్ట్ బాగుంటుంది.

ఇతరత్రా అంశాలు

ఇక సినిమాలో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. రాజీవ్ కనకాల కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. జిబ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి చాలా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా దర్శకుడు రమేష్ వర్మ పనితీరుకి ఈ సినిమాలో మంచి మార్కులే పడ్డాయని చెప్పచ్చు.

ఈ  అంశాలు ఈ సినిమాని ప్రేక్షకులకి.. తప్పక నచ్చేలా చేస్తాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే థ్రిల్లర్స్‌ని ఆదరించే ప్రేక్షకులకి.. ఈ సినిమా మంచి కిక్ ఇస్తుందని అయితే చెప్పగలం.

 

బిగ్‌బాస్ తెలుగు: హోరాహోరీ పోరులో.. ఇంటికి తొలి కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్

 

 

Read More From Entertainment