తెలుగు సినీ చరిత్రలో కళా తపస్వి కె విశ్వనాథ్ (K Viswanath) అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రూపొందించిన చిత్రాల్లో భావుకత మాత్రమే కాదు.. స్త్రీ స్వేచ్ఛ, స్వతంత్రం.. మొదలైన అంశాలు అన్నీ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. వెండితెరపై బలమైన స్త్రీ పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయనది అందెవేసిన చేయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇందుకు ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చెక్కిన కథానాయికల పాత్రలే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. నేడు (ఫిబ్రవరి 19) మన కళాతపస్వి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన రూపొందించిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాల గురించి, వెండితెరపై విశ్వనాథుడు ప్రాణం పోసిన కొన్ని బలమైన స్త్రీ పాత్రల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా కె విశ్వనాథ్ అనగానే తెలుగు చిత్రసీమతో అనుబంధం ఉన్నవారితో పాటు… సంగీతాభిమానులందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా “శంకరాభరణం”. సంగీతాన్నే సర్వస్వంగా భావించే ఓ వ్యక్తి జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఇందులో సోమయాజులు, మంజు భార్గవి పోషించిన పాత్రలే కథకు కీలకమని చెప్పచ్చు. ఈ సినిమా బంగారు నంది అవార్డు గెలుచుకోవడంతో పాటు జాతీయ అవార్డుని సైతం సొంతం చేసుకుంది.
ఇక, కె.విశ్వనాథ్ దర్శకుడిగా మారి తొలిసారిగా తెరకెక్కించిన “ఆత్మ గౌరవం” సినిమాలోని సావిత్రి పాత్రను చాలా బలమైన పాత్రగా చెప్పకోవచ్చు. అలాగే “ఓ సీత కథ”లోని సీత పాత్ర, సిరి సిరి మువ్వలోని హైమ పాత్ర కూడా గుర్తుపెట్టుకోదగ్గ పాత్రలే. “సీతామాలక్ష్మి”లో హీరోయిన్‌గా ఎదగాలనుకునే సీతాలు, శుభలేఖ చిత్రంలో వరకట్న దురాచారంపై ఎలుగెత్తి పోరాటం చేసిన లెక్చరర్ సుజాత, స్వాతిముత్యంలో “వటపత్రశాయికి వరహాల లాలి” అని పాడుతూ తల్లి ప్రేమకు నిలువుటద్దంలా నిలిచిన లలిత.. ఇవి అన్నీ కూడా కథకు ప్రాణం పోసిన పాత్రలే.
స్వయం కృషిలో ప్రేమ కోసం అమ్మతనాన్నే త్యాగం చేసిన గంగ పాత్ర… స్వర్ణకమలంలో ఆసక్తి లేకపోయినా కళకున్న విలువ తెలుసుకొని నాట్యరంగంపై మక్కువ పెంచుకున్న మీనాక్షి పాత్ర.. మొదలైనవన్నీ వెండితెరపై విశ్వనాథుడు చెక్కిన బలమైన స్త్రీ పాత్రలే! ఓ వైపు కథకు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు మహిళల మనోభావాలు, స్వేచ్ఛ, స్వతంత్రాలకు కూడా పెద్దపీట వేసిన దర్శకుడు ఆయన.
ఇక దర్శకుడిగా ఆయన దర్శకత్వం వహించిన తొలిచిత్రం “ఆత్మగౌరవం” నుంచి ఆఖరి చిత్రం “శుభప్రదం” వరకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను మనకు అందించారు. వాటిలో కొన్నింటికి ప్రేక్షకులు అందించిన ప్రశంసలతో పాటు కొన్ని అవార్డులు సైతం దక్కాయి. వాటిలో కొన్ని మీ కోసం…
ఆత్మగౌరవం – కాంస్య నంది అవార్డు – 1965
చెల్లెలి కాపురం – బంగారు నంది అవార్డు – 1971
కాలం మారింది – బంగారు నంది అవార్డు – 1972
శారద – బంగారు నంది అవార్డు – 1973
ఓ సీత కథ – రజత నంది అవార్డు, ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం & ఫిలిం ఫేర్ ఉత్తమ దర్శకుడు – 1974
జీవన జ్యోతి – బంగారు నంది అవార్డు, ఫిలిం ఫేర్ ఉత్తమ చిత్రం & ఫిలిం ఫేర్ ఉత్తమ దర్శకుడు – 1975
శంకరాభరణం – జాతీయ ఉత్తమ చిత్రం, బంగారు నంది అవార్డు, ఫ్రాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పబ్లిక్ అవార్డు గెలుచుకోవడంతో పాటు.. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రశంస – 1979
సప్తపది – ఉత్తమ జాతీయ చిత్రం, ఉత్తమ కథనానికి నంది అవార్డు, ఫిలిం ఫేర్ ఉత్తమ చిత్రం అవార్డు & మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రశంస – 1981
శుభలేఖ – ఫిలిం ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు – 1982
సాగర సంగమం – కాంస్య నంది అవార్డు, ఫిలిం ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు – 1983
స్వాతి ముత్యం – 59వ అకాడమీ అవార్డ్స్‌కి భారతేదేశం నుంచి ఎంపికైన చిత్రం, జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు), బంగారు నంది అవార్డు, ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, ఫిలిం ఫేర్ ఉత్తమ దర్శకుడు, ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్ & మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రదర్శన – 1985
శృతిలయలు – బంగారు నంది అవార్డు, ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు & ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు – 1987
స్వయంకృషి – మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రదర్శన- 1987
స్వర్ణ కమలం – బంగారు నంది అవార్డు, ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం అవార్డు, ఉత్తమ దర్శకుడిగా సినిమా ఎక్సప్రెస్ అవార్డు – 1988
సూత్రధారులు – జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు) & కాంస్య నంది అవార్డు – 1989
ఆపద్భాంధవుడు – కాంస్య నంది అవార్డు & ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు – 1992
శుభ సంకల్పం – ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు – 1995
స్వరాభిషేకం – జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు) – 2004
దాదాపుగా 45 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో విశ్వనాథ్.. ఒక దర్శకుడిగా 60 చిత్రాల వరకు దర్శకత్వం వహించగా అందులో 17 చిత్రాలకి జాతీయ & అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడం నిజంగా అద్భుతం. అంతేకాదు.. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు వెండితెరనే కాదు.. మన వాస్తవ జీవితాలను సైతం ప్రభావితం చేసినవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే కళాతపస్వి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “విశ్వ దర్శనం” చిత్ర టీజర్ విడుదల చేస్తున్నారు. జనార్థన మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
విరామం ఎరుగని ఈ తపస్వి కృషి, పట్టుదలకు 1992లో భారత ప్రభుత్వం సైతం పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతేనా.. ఆయన 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందడం విశేషం. మరి, ఇంతటి ఘనతను సాధించిన ఈ కళాతపస్వికి మనమంతా కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పేద్దామా..
పుట్టినరోజు శుభాకాంక్షలు విశ్వనాథ్ గారు..!
ఇవి కూడా చదవండి
వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న.. ప్రేమ పక్షులు – ఆర్య & సాయేషా
ఈ ఏడాది మోస్ట్ గ్లామరస్ స్టార్స్‌గా.. ఎంపికైన షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె..!
దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన కథానాయికలు వీరే..!
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla