చాలా కాలం గ్యాప్ తర్వాత “నేనే రాజు నేనే మంత్రి”తో హిట్ కొట్టిన దర్శకుడు తేజ. హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా సీత (Sita). మరి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధించింది? సినిమా పేరు, ట్రైలర్లో కనిపించిన ఫిమేల్ ఓరియెంటేషన్ సినిమాలోనూ కనిపించిందా?
ఇరవై సంవత్సరాలు జనాలకు దూరంగా పెరిగిన అబ్బాయి, మనుషుల మధ్యకు వస్తే ఎలా ఉంటుంది? అలాంటి అబ్బాయికి డబ్బే సర్వస్వం అనుకొనే అమ్మాయి ఎదురుపడితే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథ.
ఓ కనస్ట్రక్షన్ కంపెనీ ఓనర్ సీత (Kajal Agarwal). తన బిజినెస్ కోసం ఎంతకైనా తెగిస్తుంది. జాలి, దయ, కనికరం లేని వ్యక్తి. మనుషుల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. ఈమెకు ఎమ్మెల్యే బసవరాజుకు (సోనూసూద్) మధ్య ఓ క్రేజీ ఎగ్రిమెంట్ జరుగుతుంది. ఈ విషయంలోనే ఇద్దరికీ గొడవలు మొదలవుతాయి. వీటి నుంచి బయటపడేందుకే ఎప్పుడో చిన్నప్పుడు తనకు దూరంగా వెళ్లిన తన బావ రఘురామ్‌ను (Bellamkonda Srinivas) వెతుక్కొంటూ భూటాన్‌కు వెళుతుంది.
అతని మీద ప్రేమ కంటే.. అతని ఆస్తి మీద ఉన్న మక్కువతోనే అతని కోసం వెళుతుంది సీత. అతని డబ్బు కోసం రకరకాల ప్లాన్లు వేస్తుంటుంది. ఈ క్రమంలోనే బసవ రాజు సీతను ఇబ్బంది పెట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. సీత ఆ ఇబ్బందుల నుంచి బయటపడుతుందా? అమాయకుడైన రఘురామ్ ఆమెను కాపాడగలుగుతాడా? అన్నది తెరమీద చూడాల్సిందే.
ఈ సినిమా మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూనే తిరుగుతుంది. సీతగా కాజల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పుకోవాలి. రూత్లెస్ బిజినెస్ ఉమన్‌గా మంచి నటనే కనబరిచింది. పొగరు, డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని తన హావభావాలతో చక్కగా పలికించింది.
ఇక హీరో నటన విషయానికి వస్తే కల్లాకపటం తెలియని అమాయకుడిగా నటించడానికి బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడనే చెప్పుకోవాలి. చాలా చోట్ల అతని నటన తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో పాత్రకు తగినట్టుగా హావభావాలు పలికించలేకపోయాడు. బసవరాజుగా సోనూసూద్ తనదైన శైలిలో నటించారు. సోనూసూద్, తనికెళ్ల భరణి మధ్య జరిగే సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. మధ్యమధ్యలో బిత్తిరి సత్తి ఆర్కెస్ట్రా కామెడీ బాగా వర్కవుట్ అయింది. పాయల్ రాజ్ పుత్ ప్రత్యేకగీతం కూడా ఫర్వాలేదనిపిస్తుంది.
సినిమా తెరకెక్కించే విషయంలో తేజ ఎంచుకొన్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ ఆ ఆసక్తిని తెరపై క్రియేట్ చేయడంలో కాస్త తడబడ్డారు. కొన్ని సీన్లు ఇంతకు ముందే చూసినట్లుగా అనిపిస్తుంటుంది. సినిమా మొత్తం సీత మీదే దృష్టి పెట్టడం వల్ల మిగిలిన పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేకుండా పోయింది. కొన్ని సీన్లలో లాజిక్ మిస్సయింది. ముఖ్యంగా కారణం లేకుండా బస్తీ జనాల్లో హీరో మీద ప్రేమ పుట్టుకు రావడం, హీరోయిన్ మనసులో మార్పు రావడం మన లాజిక్‌కు అందవు. ప్రేక్షకుడికి కనెక్టయ్యే ఎమోషన్ సినిమాలో మిస్సయింది.
కథ నిడివి మరికాస్త తగ్గించి ఉంటే సినిమా మరింత ఆకట్టుకొని ఉండేది. చివరిలో వచ్చే వరస ట్విస్ట్‌లు సైతం విసుగు తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో సైతం ఆకట్టుకొనే సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పొచ్చు. మొదటి అర్థభాగం సినిమా సరదాగానే సాగిపోతుంటుంది. కానీ రెండో భాగానికి వచ్చేసరికి నిడివి కాస్త ఎక్కువైంది. ఎడిటర్ కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది.
ఈ సినిమాకి మంచి స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు కాస్త ఫర్వాలేదనిపించాయి. కెమెరా పనితనం బాగుంది.
సినిమా ప్లస్ పాయింట్స్
కాజల్ నటన
సోనూసూద్ విలనిజం
తనికెళ్ల భరణి సెటైర్లు
మైనస్ పాయింట్స్
హీరో క్యారెక్టరైజేషన్
చివరిలో వచ్చే ట్విస్టులు
ఎమోషన్ సరిగా పండించలేకపోవడం
ఇవి కూడా చదవండి:
మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్ ఫొటోస్ భలే బాగున్నాయి.. మీరూ ఓ లుక్కేయండి..!
నీకెంత మంది ప్రపోజ్ చేశారు? అభిమాని ప్రశ్నకు రకుల్ ఎలాంటి జవాబిచ్చిందంటే..?
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla