చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ రావాలంటే కావాల్సింది సక్సెస్. అలా ఆ సక్సెస్‌తో పాటు దక్కేది పారితోషికం. సక్సెస్ మరియు పారితోషికం వెరసి సదరు హీరో లేదా హీరోయిన్‌ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతాయి. అలా ప్రస్తుతం మన దేశంలోనే నెంబర్ 1 హీరోయిన్ స్థానాన్ని హిందీ నటి కంగన రనౌత్ (Kangana Ranaut) దక్కించుకుందని భావిస్తున్నాయి పలు వర్గాలు.
ఇప్పటికే మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న నటిగా.. ఈ తరం నటీమణులలో మేటిగా నిలిచిన ఈ అభినయ తార ఇప్పుడు తన ఖాతాలో మరో అరుదైన రికార్డుని వేసుకోగా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం రేపుతోంది. అదేమిటంటే.. కంగనా మన దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా కొత్త రికార్డును నమోదు చేయబోతోంది.
సుమారు రూ 24 కోట్ల మేర పారితోషికాన్ని ఈమెకు ఓ చిత్ర నిర్మాత అందివ్వనున్నట్లు సమాచారం. ప్రముఖ దక్షిణాది నటి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీస్తున్న తలైవి (Thalaivi) చిత్రంలో టైటిల్ రోల్ పోషించేందుకు.. కంగనను తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు ఈ పారితోషికం అందించేందుకు చర్చలు జరగుతున్నాయని తెలుస్తోంది.
నేడు పరిశ్రమలో హీరోతో సమానంగా హీరోయిన్స్‌కి సైతం పారితోషికం ఇవ్వాలి అనే నినాదం ఊపందుకుంటున్న తరుణంలో ఈ వార్త పెను సంచలనమైంది.
అయితే ఈ వార్తకి ఇంత ప్రాధాన్యం రావడానికి కూడా కారణాలు లేకపోలేదు. – కంగనా రనౌత్ ఇప్పటికే పలు వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలి కాలంలో ఆమె.. పలువురు నిర్మాతలు మరియు నటుల పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి పతాక శీర్షికలకు ఎక్కింది. అయితే ఆమె ఎన్ని వివాదాల్లో ఉన్నా సరే.. నటన విషయంలో తనదైన ప్రతిభను కనబరుస్తూ.. ముందుకు పోతున్న ఆమెకి దక్కాల్సిన ప్రాధాన్యమే దక్కుతోందనివిమర్శకులు అంటున్నారు.
గతంలో కూడా భారీ స్థాయిలో పారితోషికాలు అందుకున్న నటీమణులు కొందరు ఉన్నారు. బాలీవుడ్ తారలులైన – దీపిక పడుకునే (Deepika Padukone), కత్రినా కైఫ్ (Katrina Kaif), అనుష్క శర్మ (Anushka Sharma) & ఆలియా భట్ (Alia Bhatt) మొదలైన వారు తీసుకొనే పారితోషకం విలువ కూడా సుమారు 10 నుండి 15 కోట్ల వరకు ఉండే ఆస్కారం ఉంది. అయితే ఈ పారితోషికాలు కూడా వారి గత చిత్రాల విజయాలను బట్టే నిర్దేశించబడతాయన్నది వాస్తవం.
తాజాగా కంగన విషయంలో సినిమా ట్రేడ్ పండితులు (Trade Analysts) మాత్రం కొత్త పాయింట్‌ను రేకెత్తించడం గమనార్హం. ఆయా చిత్రాన్ని మూడు ప్రధాన భాషల్లో తెరకెక్కిస్తున్న కారణంగా.. ఆ మూడు భాషల మార్కెట్‌ని పరిగణనలోకి తీసుకుని ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఉండవచ్చని వారు అంటున్నారు.
మొత్తానికి వివాదాలతోనూ, తను చేసే పాత్రలతోనే కాకుండా.. ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా కూడా మరో సంచలనమే సృష్టించింది ఈ అభినవ ఝాన్సీ లక్ష్మి భాయ్. అయితే కంగన ఒకవేళ తలైవి చిత్రానికి సైన్ చేస్తే.. తాను చేసే పాత్ర కూడా ఒక రకంగా పెను సవాలే అని చెప్పాలి. కారణం ఒక నటిగా జీవితాన్ని ఆరంభిం..చి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ అనేక ఒడిదుడుకులని ఎదుర్కొని తమిళనాట ‘అమ్మ’గా కొలిచే స్థాయికి ఎదిగిన “పురచ్చి తలైవి” (Puratchi Thalaivi) జీవిత ఆధారంగా తెరకెక్కించే చిత్రం అంటే దానిపై అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి.
ఇక ఈ ‘తలైవి’ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ (A.L. Vijay) దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
మరో సవాల్ విసురుతున్న కంగనా రనౌత్ ‘మణికర్ణిక’
జయలలిత బయోపిక్ “తలైవి” గురించి.. ఆసక్తికర విశేషాలు
కీర్తి సురేష్ “మహానటి” చిత్రం.. నిత్యా మీనన్ “ఐరన్ లేడీ”కి ఆదర్శమా?