Lifestyle

తొలిచూపులోనే పుట్టిన ఈ ప్రేమ క‌థ‌లు.. మీ మ‌న‌సును హ‌త్తుకుంటాయి..!

Soujanya Gangam  |  Mar 8, 2019
తొలిచూపులోనే పుట్టిన ఈ ప్రేమ క‌థ‌లు.. మీ మ‌న‌సును హ‌త్తుకుంటాయి..!

తొలిప్రేమ‌ (first love).. జీవితంలో దాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం. కొంద‌రికి మొద‌టి చూపులోనే ప్రేమ పుడితే (Love at first sight) మ‌రికొంద‌రి స్నేహం ప్రేమ‌గా మారుతుంది. ఎలా పుడితేనేం.. ప్రేమ పుట్టిందంటే చాలు.. జీవిత‌మంతా ఆనంద‌మయంగా కనిపిస్తుంది. ఎప్పుడూ న‌చ్చిన‌వారితో క‌లిసి ఉండాల‌నిపిస్తుంది. న‌చ్చిన వ్య‌క్తుల చేయి ప‌ట్టుకొని జీవితాంతం ఆనందంగా ఉండిపోతే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న రావ‌డ‌మూ స‌హ‌జ‌మే.. ప్రేమ స్వ‌చ్ఛ‌మైన‌దైతే జీవితాంతం కొన‌సాగుతుంది. లేదా చిన్న త‌గాదాలు వ‌చ్చి వ్య‌క్తులు విడిపోతారు. ఇలా క‌లిసి ఉన్నా.. లేక విడిపోయినా.. మొద‌టిసారి మ‌న‌సులో ప్రేమ పుట్టిన ఆ క్ష‌ణాలు మ‌న‌కు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి కొన్ని మ‌ధుర‌మైన తొలిప్రేమ క‌థ‌ల‌ను మ‌న‌తో పంచుకుంటున్నారు కొంత‌మంది.. వారి క‌థ‌ల‌ను వినేద్దాం రండి..

1. ప‌ప్పీ క‌లిపిన బంధం..

ఓ ఆదివారం ఉద‌యాన్నే మా ప‌ప్పీని బ‌య‌ట తిప్పేందుకు తీసుకెళ్లాను. అలా మేమిద్దరం ద‌గ్గ‌ర్లో ఉన్న పార్క్‌లో తిరుగుతున్న సమయంలో.. మా కుక్క తన మెడ‌లోని గొలుసును కాస్త గ‌ట్టిగా లాగింది. అది ఊడిపోవడంతో.. పప్పీ నా నుండి దూరంగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. అలా వెళుతూ.. మా ప‌క్క‌నే కూర్చొని కిట్‌క్యాట్ తింటున్న ఓ అబ్బాయి పైకి వెళ్ల‌బోయింది. వెంట‌నే నేను దాన్ని ప‌ట్టుకోవ‌డానికి ప‌రిగెత్తాను. వెళ్లి దానిని ఎలాగోలా ఆపాను. 

ఇదంతా చూసిన ఆ అబ్బాయి త‌న ద‌గ్గ‌రికి వెళ్లిన నాకు ఓ చిన్న చాక్లెట్ ముక్క తీసి చేతికి అందించాడు. త‌న‌ని చూసి న‌వ్వి నేను ఆ ముక్క తీసుకునే లోపే మా కుక్క అత‌డి మీదకు మళ్లీ దూకి.. చాక్లెట్‌ని లాగి కింద ప‌డేసింది. దీనికి బాధ‌ప‌డిన నేను నా ప‌ప్పీ చేసిన ప‌నికి అత‌డికి సారీ చెప్పి.. అక్కడే మాకు కనిపించిన షాపు వద్దకు వెళ్లి ఇంకొకటి కొనేందుకు సిద్ధ‌మ‌య్యా. కానీ అత‌డు దానికి ఒప్పుకోలేదు.

“నేను మొత్తం చాక్లెట్ ఎలాగూ తినేవాడిని కాదు లెండి.” అంటూ న‌వ్వి ప‌రిస్థితిని కూల్‌డౌన్ చేశాడు. అప్పుడే అత‌డంటే నాకు ఇష్టం ఏర్ప‌డింది. ఆ మ‌రుస‌టి రోజు ఉదయాన్నే మ‌ళ్లీ కుక్క‌ను వాకింగ్‌కి తీసుకెళ్లిన‌ప్పుడు.. ముందు రోజు ఉన్న చోటే చేతిలో ఒక చాక్లెట్‌తో నిల‌బ‌డి ఉన్నాడ‌త‌ను. అత‌న్ని చూసి నాకు  కాస్త సిగ్గుతో పాటు, ఎంతో ఆనందంగా అనిపించింది. త‌న ద‌గ్గ‌రికి వెళ్లి మాట్లాడాను. ఆ తర్వాత కొన్ని రోజులు క‌లుసుకొని చాక్లెట్లు ఒకరికొకరికి ఇచ్చుకోవడం అలవాటైంది. ఆ తర్వాత కొన్ని నెల‌ల వరకు మా ప్రేమ కొన‌సాగింది. ఇప్పుడు తను నా జీవిత భాగ‌స్వామి. చెబితే ఏదో ప్ర‌క‌ట‌న‌లా ఉంద‌ని నా స్నేహితులు ఏడిపిస్తుంటారు కానీ ఇది మా జీవితంలో నిజంగానే జ‌రిగింది.

2. కొలీగ్స్ నుంచి ల‌వ‌ర్స్‌గా

నేను వూరి నుంచి నా క‌ల‌ల ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వ‌చ్చాను. అది ఉద్యోగంలో నా మొద‌టి రోజు. ఆ రోజే అత‌డిని చూశాను. అత‌డిని చూడ‌గానే మ‌న‌సులో ఏదో ఫీలింగ్‌. ఇంత‌కుముందెప్పుడూ నేను ఎవ‌రినీ ప్రేమించ‌లేదు. అది అంత అవ‌స‌రం అని కూడా అనిపించ‌లేదు. కానీ అత‌డిని క‌లిసిన త‌ర్వాత నా మ‌న‌సు మారిపోయింది. త‌ను చూసేందుకు అట్రాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు త‌న ప్ర‌వ‌ర్త‌న కూడా ఎంతో బాగుండేది. త‌ను నా కొలీగ్ కాబ‌ట్టి త‌ర‌చూ ప‌ని విష‌యంలో మాట్లాడుకునేవాళ్లం. మా ఇద్ద‌రి ఆలోచ‌న‌లు ఒకే ర‌కంగా ఉండేవి.

ఇద్ద‌రం ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, చిన్న విష‌యాల గురించి కూడా ఎక్కువ‌గా మాట్లాడుకోవ‌డం చేస్తుండేవాళ్లం. ఇద్ద‌రం గొడ‌వ‌పెట్టుకుంటే ఎక్కువ సార్లు నేనే గెలిచేదాన్ని. అయితే ఒక‌సారి నాలుగు రోజులు సెల‌వు పెట్టి వూరికి వెళ్లి వ‌చ్చాను. నేను వ‌చ్చేసరికి నా టేబుల్ పై ఒక నోట్.. అది త‌న నుంచే. నేను నీతో వాద‌న‌ల్లో జీవితాంతం ఓడిపోవ‌డానికి సిద్ధంగా ఉన్నా. కానీ నువ్వు మాట్లాడ‌క‌పోతే ఒక్క‌రోజైనా ఉండ‌లేను. నిన్ను అంత‌గా మిస్స‌య్యా. వెల్‌కం బ్యాక్ అంటూ నోట్ పెట్టాడు. అది చూసిన నా చిరున‌వ్వు రోజంతా అలాగే ఉండిపోయింది. అంత‌కుముందే మా ఇద్ద‌రి మ‌న‌సుల్లో మేమిద్ద‌రం ఒక‌రికొక‌రం ప‌ర్ఫెక్ట్ అని భావించామ‌ని నాకు అప్పుడు తెలియ‌లేదు. ఆ త‌ర్వాత మేమిద్ద‌రం ప్రేమించి పెళ్లిచేసుకున్నాం. త‌ను కేవ‌లం నా ఫ‌స్ట్ ల‌వ్ మాత్ర‌మే కాదు.. నా బెస్ట్‌ఫ్రెండ్ కూడా. త‌న‌ని క‌లవ‌క‌పోతే నా జీవితంలో ఇంత ఆనందం ఉండేది కాదేమో..!

3. నా అదృష్టం కూడా అలా క‌లిసొచ్చింది..

త‌న‌ని మొద‌టిసారి చూసిన‌ప్పుడే నేను త‌నే నాకు కాబోయే భ‌ర్త అని నిర్ణ‌యించుకున్నా. అంత‌కుముందు త‌న‌తో నేనెప్పుడూ మాట్లాడింది లేదు. ఇద్ద‌రికీ ప‌రిచ‌యం కూడా లేదు. కానీ మొద‌టిసారి చూడ‌గానే త‌న‌తోనే నా జీవితం గ‌డ‌పాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. త‌ను మా నాన్న స్నేహితుడి కొడుకు. మా ఇరు కుటుంబాలు క‌లిసిన‌ప్పుడు ఇద్ద‌రం క్యాజువ‌ల్‌గా క‌లిశాం. ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకున్నాం. ఇద్ద‌రం దాదాపు ఒకే వయ‌సుకు చెందిన వాళ్లం కాబట్టి కాస్త ఎక్కువ‌గానే మాట్లాడుకున్నాం. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా ఫోన్ లేదా చాటింగ్‌లో మాట్లాడినా పెద్ద‌గా క‌లిసింది లేదు. కానీ నా మ‌న‌సులో ఏదో ఒక మూల త‌ను నా భ‌ర్త‌యితే బాగుండు అన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.

ఆపై నేను మాస్ట‌ర్స్ చేయ‌డానికి లండ‌న్ వెళ్లిపోయాను. కొన్ని రోజుల త‌ర్వాత నాకు మా త‌ల్లిదండ్రులు ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఆ సంబంధం ఎవ‌రితోనో కాదు.. నేను ప్రేమించిన ఆ అబ్బాయితోనే.. న‌న్ను మొద‌టిసారి చూసిన‌ప్పుడు త‌నూ అలాగే ఫీల‌య్యాడ‌ట‌. అయితే త‌నూ ఎవ‌రికీ చెప్ప‌లేదు. వాళ్ల చెల్లెలికి త‌ప్ప‌. ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు వెతుకుతుంటే నా గురించి ఆలోచ‌న వ‌చ్చి వాళ్ల తల్లిదండ్రులు మా త‌ల్లిదండ్రులు సంబంధం మాట్లాడార‌ట‌. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత ప‌ట్ట‌రానంత సంతోషంగా అనిపించింది. మ‌నం నిజంగా మ‌న‌సులో ఏదైనా అనుకుంటే అది నిజ‌మ‌వుతుంద‌ని నాకు అప్పుడు అనిపించింది. అప్పుడు కొన‌సాగ‌ని మా ప్రేమని ఇప్పుడు పెళ్లి త‌ర్వాత కొన‌సాగిస్తున్నాం.

ఇవి కూడా చ‌ద‌వండి.

కాలేజీలో మొద‌లై.. జీవితాంతం నిలిచిన అంద‌మైన ప్రేమ‌ క‌థ‌లు మీకోసం..!

సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?

మ‌నుషులు దూరంగా ఉన్నా.. ఈ యాప్స్ తో మీ బంధం దృఢంగా ఉంటుంది..

Read More From Lifestyle