వినసొంపైన మ్యూజిక్ ఓవైపు వినిపిస్తుండగా.. ఓ అందమైన అమ్మాయి తన చేతివేళ్లనే గన్ గా మలిచి తన బాయ్ ఫ్రెండ్ కు కన్నుకొట్టి , ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది.. ఏంటి?? ఇక్కడ సీన్ చదువుతుంటే మీ కళ్ల ముందు ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) వీడియో క్లిప్ మెదులుతోందా?? నిజమే మరి.. ఆ వీడియోకు ఏమైనా తక్కువ ఆదరణ లభించిందా మరి?? యావత్ ప్రపంచం మొత్తం ప్రియా వారియర్ ని ఒక చిలిపి అమ్మాయిగా పరిచయం చేసిన క్లిప్ అది. ఒరు అదార్ లవ్ (Oru Adar Love) అనే తమిళ చిత్రానికి చెందిన ఈ ఒక్క వీడియోతో ప్రియకు భాషా భేదం లేకుండా అన్ని ప్రాంతాలు, భాషల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. అంతేనా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో రాత్రికి రాత్రే ఆమె స్టార్ కూడా అయిపోయింది. మరి
ఇంకేముంది.. అప్పటివరకు కేవలం చిత్రంలోని ఒక చిన్న పాత్ర మాత్రమే అనుకున్న ప్రియ పాత్ర నిడివిని పెంచేలా చేసిందీ వీడియో. అంతేనా.. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమాను మరో రెండు భాషల్లో కూడా అనువాదం అయ్యేలా చేసింది. అలా వాలెంటైన్స్ డే (Valentines Day) రోజు తెలుగు ప్రేక్షకులను ప్రేమగా పలకరించిన చిత్రమే లవర్స్ డే (Lovers day). అప్పటికే ప్రియకు ఉన్న క్రేజ్ ఈ సినిమా పబ్లిసిటీకి ప్లస్ పాయింట్ గా మారగా; స‌్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు. మరి, ఇన్ని అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎవరెవరు ఎలా నటించారు? చూద్దాం రండి..
సినిమా విడుదలకు ముందు లవర్స్ డేకు సంబంధించి టీజర్, ట్రైలర్ తో దర్శకుడు ఒమర్ లులు (Omar Lulu) ఏ కథనైతే చూపించాడో అదే కథను వెండితెరపై చూపించేందుకు చాలా శ్రమించారు. ముఖ్యంగా ఈ కథ ఒక సెకండరీ హైస్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన అబ్బాయిలు, అమ్మాయిల మధ్య చిగురించే స్నేహం, ప్రేమ ఆధారంగా ముందుకెళ్తుంది. ఆ రెండు సంవత్సరాల పాటు వారంతా ఒక చిన్న గ్రూప్ గా మారి వారి టీనేజ్ ని ఎలా ఆస్వాదించారన్నదే ఈ చిత్ర కథ.
పాత్రల వయసు తక్కువే కాబట్టి అందులో నటించే వారి నటన కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటేనే కథ పండుతుంది. ఈ విషయంలో దర్శకుడు సఫలత సాధించాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ మహ్మద్..లతో పాటు మిగతా ప్రధాన పాత్రల్లో ఎంచుకున్న నటీనటులు కూడా చక్కని నటప్రతిభను కనబరిచారు. అంతేకాదు.. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కనిపించిన ప్రతిఒక్కరూ మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వీరంతా తమిళ నేపథ్యం ఉన్న నటీనటులు కాబట్టి తెలుగు ప్రేక్షకులకు తెరపై వారు చేసే నటనలో సహజత్వం కనిపించడం కాస్త కష్టమనిపించవచ్చు.
విడుదలకు ముందే మంచి పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని వెండితెరపై కథతో రక్తి కట్టించేందుకు దర్శకుడు శతవిధాలుగా ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అడుగడుగునా సాగే ఆసక్తికరమైన కథనాలతో పాటు క్లైమాక్స్ కూడా ఎవరి వూహకీ అందకుండా ఇవ్వడంలో ఒమర్ లులు విజయం సాధించాడు. అలాగే సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకి ఛాయాగ్రహకుడిగా పని చేసిన సిను సిద్ధార్థ్ (Sinu Siddharth) చాలా మంచి ప్రతిభ కనబరిచాడు. ఇక సంగీతం పరంగా షాన్ రెహ్మాన్ (Shaan Rahman) ట్యూన్స్ బాగానే ఉన్నా దానికి తెలుగు సాహిత్యం జోడించే సరికి అంతగా వినసొంపుగా అనిపించలేదు. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమికుల దినోత్సవం రోజు విడుదలైన లవర్స్ డే (Lovers Day) ప్రేక్షకులకు ప్రేమను పంచడంలో పూర్తి స్థాయిలో సఫలత సాధించకలేపోయిందనే అనుకోవాలి.
ఇవి కూడా చదవండి
ఒక రాజకీయ నాయకుడిని.. ప్రజా నేతగా మార్చిన “యాత్ర” (సినిమా రివ్యూ)
ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన.. మహేష్ బాబుకి దక్కిన అరుదైన అవకాశం..!