Wedding

శభాష్ మిథాలీ రాజ్.. మరో చరిత్ర తిరగరాసిన క్రికెట్ దిగ్గజం

Babu Koilada  |  Feb 1, 2019
శభాష్ మిథాలీ రాజ్.. మరో చరిత్ర తిరగరాసిన క్రికెట్ దిగ్గజం

మిథాలీ రాజ్.. భారతదేశం గర్వించదగ్గ మహిళా క్రికెటర్. ఒక రకంగా మన దేశంలో మహిళా క్రికెట్‌కు క్రేజ్ ఆమె వల్లే వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాంటి మన లేడీ క్రికెట్ సూపర్ స్టార్ ప్రస్తుతం మరో రికార్డు కూడా సాధించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా మహిళా క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడడం అంటేనే గగనం. కానీ ఏకంగా 200 వన్డే మ్యాచ్‌లు ఆడి మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది మిథాలీ రాజ్. ఈ రోజే న్యూజిలాండ్ జట్టుతో ఆడిన వన్డేతో ఆమె ఈ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

తన కెరీర్‌లో 200 వన్డే మ్యాచ్‌లు ఆడిన మిథాలీ (Mithali Raj).. 51.33 సగటుతో 6622 పరుగులు చేయడం విశేషం. మరో చిత్రమేంటంటే భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పటికి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు 263 కాగా.. అందులో 200 మ్యాచ్‌లు మిథాలీ ఆడినవే ఉండడం విశేషం.

 

ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ కూడా మిథాలీ రాజ్ కావడం గమనార్హం. ఇప్పటికే ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ట్విటర్ వేదికగా కూడా ఆమెకు క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

36 సంవత్సరాల మిథాలీ రాజ్ జోధ్ పూర్  ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి దొరై రాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసేవారు. తన కెరీర్‌‌లో భాగంగా ఎక్కువ కాలం హైదరాబాద్‌లోనే గడిపారు మిథాలీరాజ్. 2001లో టెస్టు కెరీర్ ప్రారంభించిన మిథాలీ.. అంతకు ముందే 1999లో వన్డే క్రికెట్‌లో కూడా తన సత్తా చాటారు. 2003లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్న మిథాలీను “టెండుల్కర్ ఆఫ్ విమెన్ క్రికెట్” అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు ఆమె అభిమానులు.

 

గతంలో ఇండియన్ రైల్వేస్ తరఫున కూడా డొమస్టిక్ క్రికెట్ ఆడిన మిథాలీ.. ప్లేయర్ కోచ్‌గానూ భారతదేశంలో తన జూనియర్లకు శిక్షణ ఇచ్చారు. 2015లో పద్మశ్రీ పురస్కారం మిథాలీని వరించింది. 2017లో వోగ్ పత్రిక ఆ సంవత్సరానికి గాను మిథాలీరాజ్‌ను ఉత్తమ క్రీడాకారిణిగా పేర్కొంది. అదే సంవత్సరం బీబీసీ పత్రిక ప్రకటించిన 100 మంది ప్రముఖ మహిళల జాబితాలో కూడా మిథాలీ చోటు దక్కించుకుంది.

ఈ క్రమంలో మరో అరుదైన ఘనత సాధించిన మన మిథాలీరాజ్‌కు.. POPxo తరఫున చెప్పేద్దామా శుభాకాంక్షలు

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ కీ షాన్.. సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం

విజేతగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. అమ్మకు మాత్రం పసిబిడ్డే..!

క్రీడాకారులుగా దూసుకుపోవడానికి మన యువ హీరోలు రెడీ

Read More From Wedding