Beauty

వాన నీటిలో తడిశారా? అయితే మీ చర్మం, జుట్టును ఇలా కాపాడుకోండి.

Soujanya Gangam  |  Aug 2, 2019
వాన నీటిలో తడిశారా? అయితే మీ చర్మం, జుట్టును ఇలా కాపాడుకోండి.

వర్షం అన్నా.. వర్షాకాలం (monsoon) అన్నా ఇష్టపడేవాళ్లు చాలామందే ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ముఖ్యంగా వానలో తడవడం అన్నా.. బయట వాన పడుతుంటే ఆ శబ్దం వింటూ దుప్పటి కప్పుకొని వేడి వేడి పకోడీలు తినడమన్నా నాకిష్టం. మీరూ నాలాంటి వారే అయితే.. అలా వానలో తడిసిన తర్వాత మీ జుట్టు (hair), చర్మం (Skin) పాడవకుండా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని పాటించకపోతే చర్మం దెబ్బతిని రఫ్‌గా, పొడిబారిపోయినట్లుగా మారుతుంది. జుట్టు కూడా రఫ్‌గా, చిక్కులు పడిపోయి కనిపిస్తుంది. అందుకే మీరు మళ్లీ కావాలని కానీ.. అనుకోకుండా కానీ వానలో తడిసినప్పుడు ఈ చిట్కాలను పాటించండి.

1. స్నానం చేయండి.

Shutterstock

వానలో మీరు పూర్తిగా తడిచిపోయి ఇంటికి వచ్చిన తర్వాత.. గోరు వెచ్చని నీటితో చక్కటి స్నానం చేయడం మంచిది. అలా చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరగడం మాత్రమే కాదు.. మీ చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి, టాక్సిన్లు వంటివన్నీ తొలగిపోతాయి. ఒకవేళ మీ ఇంటికి దగ్గర్లో వేప చెట్టు ఉంటే.. ఆ చెట్టు ఆకులు వేసి మరిగించిన నీటిని తలస్నానానికి ఉపయోగించండి. అప్పుడు వల్ల  తలభాగం, శరీరంపై ఏర్పడే సూక్ష్మజీవులు తొలగిపోతాయి. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. ఒకవేళ మీ ఇంటి దగ్గర వేప చెట్టు లేకపోతే.. వేప గుణాలున్న షాంపూ, సబ్బు ఉపయోగించి స్నానం చేయడం మంచిది.

జుట్టు రాలుతోందా? అయితే మీకోసమే ఈ పరిష్కార మార్గాలు..!

2. మాయిశ్చరైజేషన్

సాధారణంగా వేసవి, చలి కాలాల్లో చర్మం పొడిబారిపోతుంటుందని అంటారు. అందుకే మాయిశ్చరైజర్ ఎక్కువగా రాసుకుంటూ ఉంటారు. కానీ మాయిశ్చరైజర్ అన్ని కాలాల్లోనూ అవసరమే. వర్షా కాలంలో వాతావరణం వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వాన నీటిలో తడవడం వల్ల చర్మం దురదపెడుతుంది. దీన్ని నివారించేందుకు ఎస్‌పీఎఫ్ 15 ఉన్న మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మంలో తేమ పెరగడంతో పాటు సూర్యకిరణాల నుంచి కూడా కాపాడుకునే వీలుంటుంది.

3. కండిషనర్‌తో స్నేహం

Shutterstock

నా జుట్టు కర్లీ హెయిర్. ఇక వానలో తడిసినప్పుడు నా జుట్టు చాలా చిక్కులు పడిపోయి బిరుసుగా తయారవుతుంది. బయట వాతావరణంలో ఉన్న తేమ వల్ల నా జుట్టు పూర్తిగా పాడైపోతుంది. ఇలాంటివన్నీ జుట్టు తట్టుకోవాలన్నా.. చిక్కులు పడకుండా ఉండాలన్నా సిలికాన్ ఫ్రీ కండిషనర్ ఉపయోగించడం మంచిది. ఇది మీ జుట్టును మెత్తగా పట్టులా మారుస్తుంది.

మార్కెట్లో దొరికే కండిషనర్ ఉపయోగించడం మీకు ఇష్టం లేకపోతే.. ఇంట్లోనే గుడ్లు, పెరుగు కలిపి మీ జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. దీన్ని జుట్టుకు అప్లై చేసుకొని పది నిమిషాలు అలా ఉంచుకొని తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల మీ జుట్టు పట్టులా మెరుస్తుంది.

రెయినీ సీజన్‌ని.. రొమాంటిక్‌గా ఎంజాయ్ చేయడం ఎలాగో తెలుసా..?

4. జుట్టు ఆరబెట్టుకోండి..

వర్షాకాలంలో తడిసిన జుట్టును సరిగ్గా ఆరబెట్టుకోకపోతే వెంటనే నాకు జలుబు చేస్తుంది. మీక్కూడా అంతేనా? మన తలలోని బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు వానాకాలంలో త్వరగా వ్యాపిస్తాయి. అలా జరిగితే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మీరు తలస్నానం చేసిన తర్వాత జుట్టును సహజంగా టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవచ్చు. లేదా ధూపం వేసుకోవడం, బ్లో డ్రయర్‌ని చాలా తక్కువ లెవల్‌లో పెట్టుకొని ఆరబెట్టుకోవడం చేయచ్చు.

5. చంపీ చేయడం కూడా అవసరమే..

Shutterstock

మీరు ఇంటికి వెళ్లగానే తలస్నానం చేయాలి. అయితే ఆ తలస్నానానికి ముందు మీ జుట్టును టవల్‌తో బాగా తుడుచుకోవాలి. ఆపై మంచి కొబ్బరి నూనె, ఆముదం, బాదం నూనె.. ఇలా మీకు నచ్చిన గోరు వెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల మీ కుదుళ్లకు తేమ అందుతుంది. జుట్టు బలంగా మారేందుకు తోడ్పడుతుంది. ఆ తర్వాత ఓ గంటపాటు.. అలాగే ఉంచుకొని అనంతరం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మంచి షాంపూ, కండిషనర్ ఉపయోగించాలి. మీ జుట్టు మరీ ఎక్కువ తడిగా లేకపోతే రాత్రంతా ఉంచుకొని ఉదయం తలస్నానం చేయవచ్చు..

వర్షాకాలంలో మీ మొబైల్ ఫోన్ పాడవకుండా.. ఇలా కాపాడుకోండి.

6. స్టైలింగ్ ఉత్పత్తులు ఉపయోగించవద్దు..

జుట్టుకు నూనె, షాంపూ, కండిషనర్ తప్ప మరే ఉత్పత్తులూ ఉపయోగించకూడదు. అలాగే చర్మానికి కూడా సబ్బు, మాయిశ్చరైజర్ తప్ప.. మరే ఇతర ఉత్పత్తులు ఉపయోగించకుండా ఉండడం మంచిది. వివిధ పదార్థాలతో నీళ్లు కలవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇతర ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

7. మీ చర్మానికి ఓ షీట్ మాస్క్..

Shutterstock

వర్షంలో తడిచి ఇల్లు చేరుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటారు. అయితే ఆ తర్వాత పడుకునే ముందు మంచి మాయిశ్చరైజింగ్ గుణాలున్న షీట్ మాస్క్ ముఖంపై పెట్టుకొని లైట్లు డిమ్ చేసి.. మంద్ర స్థాయిలో సంగీతం వింటూ గడపండి. అలా ఓ అరగంట లేదా గంట పాటు ఉంచిన తర్వాత తీసేయొచ్చు. లేదా మీరు నిద్రపోతే.. ఉదయం వరకూ అలాగే ఉంచుకున్నా సమస్య లేదు. ఇది మీ చర్మంలో తేమను పెంచుతుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ టీ షర్ట్స్. ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Beauty