తల్లి (Mother) కావడం ప్రతి స్త్రీ కోరుకునే వరం. అయితే ఓ అమ్మ నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు పిల్లలకు తల్లైంది. ముందు ఒక ఆరోగ్యకరమైన బాబుకి జన్మనిచ్చింది. ఆపై నెలరోజుల తర్వాత మరోసారి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే.. కడుపులో మరో ఇద్దరు పిల్లలున్నట్లుగా తెలిసింది. మరో విచిత్రమేమిటి అంటే.. ముందు పుట్టిన బాబు, తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలు వేర్వేరు గర్భాశయాలు (Womb) నుంచి పుట్టడం. ఇదేంటి అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇదెలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మహిళ కథను మీరు చదవాల్సిందే..
Source – bdnews24
బంగ్లాదేశ్‌కి చెందిన అరీఫా సుల్తానా అనే మహిళకు ఈ నెల 22న కడుపులో నొప్పిగా అనిపించిందట. ఈ నొప్పులు ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి ఆమె కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. సిజేరియన్ చేసి కవలలైన పాప, బాబులను బయటకు తీశారు. ఆమె కడుపుతో ఉందన్న విషయం తెలుసుకొని తన కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు.
సాధారణంగా నెలలు నిండి బిడ్డ పుట్టే సమయం వరకూ గర్భంతో ఉన్నామని తెలియని వాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఈ పిల్లలు అందుకు పూర్తిగా భిన్నం. ఎందుకంటారా? ఈ పిల్లలు పుట్టడానికి కేవలం 26 రోజుల ముందే వారి తల్లి మరో బిడ్డకి జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ మగ బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడట.
మగ బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే.. తిరిగి నొప్పులు రావడంతో కడుపులో ఏమైనా సమస్య ఉందేమో అనుకున్నామని.. అయితే అల్ట్రాసౌండ్ పరీక్ష చేసిన తర్వాత మరో విచిత్రమైన నిజం బయటపడిందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ మహిళకు సాధారణంగా అందరికీ ఉన్నట్లుగా ఒకటి కాకుండా రెండు గర్భాశయాలు ఉన్నాయట. ముందు పుట్టిన బాబు ఒక గర్భాశయం నుంచి పుడితే.. ఈ ఇద్దరు కవలలు మరో గర్భాశయం నుంచి పుట్టడం విశేషం.
ఇలా ఒక మహిళలో రెండు గర్భాశయాలు ఉండడం చాలా అరుదని ఒకవేళ రెండు గర్భాశయాలు ఉన్నా.. అందులో ఒకటి పూర్తిగా ఎదగకుండా ఉండిపోయి.. పిల్లలు కనేందుకు ఉపయోగపడదని వైద్యులు చెబుతున్నారు. అయితే రెండు గర్భాశయాలు సక్రమంగా పనిచేయడం, రెండింటి నుంచి కేవలం నెల రోజుల వ్యవధిలోనే పిల్లలు పుట్టడం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు వైద్యులు. ఇలా లక్షల్లో ఒకరికి మాత్రమే అవుతుంటుందని వారు వెల్లడిస్తున్నారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ గర్భాశయాలు.. సాధారణంగా జన్యు లోపాలతో ఏర్పడతాయని అవి పనిచేయడం చాలా అరుదని వెల్లడిస్తున్నారు.
ఇలా రెండు గర్భాశయాలు ఉన్న మహిళలు లక్షకి ఒకరో ఇద్దరో ఉంటారు. ప్రపంచంలో వీరి సంఖ్య ఎక్కువే.. కానీ ఈ రెండు గర్భాశయాలు పని చేయడం మాత్రం కాస్త అరుదే అని చెప్పుకోవాలి. ఇలా ఒకేసారి రెండు గర్భాశయాల్లో అండం ఫలదీకరణం చెంది పిల్లలు పుట్టడం మరింత అరుదు. ఇప్పటివరకూ ఇలాంటి మహిళలు ఎందరో ఉన్నా.. రెండు గర్భాశయాలున్న మహిళగా మొదట గుర్తింపు పొందిన వ్యక్తి మాత్రం అమెరికాలోకి లింకన్ ప్రాంతానికి చెందిన మైర్‌ట్లే కార్బిన్. ఈమెకి కేవలం రెండు గర్భాశయాలే కాదు. రెండు జననేంద్రియాలు, నాలుగు కాళ్లు కూడా ఉండేవట.
అంటే ఆమె నడుముపై వరకూ ఒక వ్యక్తి అయినా.. నడుము కింది భాగంలో కడుపులో ఉండగానే తన కవల సోదరి శరీరం ఆమెకు అంటుకుపోయి పుట్టిందట. సాధారణంగా ఇలా పుట్టిన వాళ్లు ఎక్కువ కాలం బతకరు. కానీ కార్బిన్ అరవై సంవత్సరాలు జీవించింది. పంతొమ్మిదేళ్ల వయసులో క్లింటన్ బిక్‌నెల్ అనే వైద్యుడిని పెళ్లాడిన ఆమె తన రెండు గర్భాశయాల ద్వారా ఒక మగ, నలుగురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చింది కూడా.
ఇప్పుడు ఈ తల్లికి కూడా రెండు గర్భాశయాలు పనిచేయడం విశేషం. గర్భం ధరించిన తర్వాత డెలివరీ వరకూ స్కానింగ్ చేయించుకోకపోవడం వల్ల ఈ విషయం బయటపడలేదు. అయితే మొదటిసారి మగబిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆమె కడుపులో మరో ఇద్దరు పిల్లలున్న సంగతి వైద్యులు గమనించకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి.
అమ్మనే కానీ నాకూ అన్నీ తెలియవు: మాతృమూర్తులకు సోనాలీ సందేశం
కూతురితో పోటీ పడి మరీ.. పీహెచ్‌డీ చేసిన ఓ అమ్మ కథ..!
బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!