Entertainment

Bigg Boss Telugu 3 : కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ

Sandeep Thatla  |  Aug 10, 2019
Bigg Boss Telugu 3 :  కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున ..  తీవ్ర హెచ్చరికలు జారీ

“బిగ్ బాస్ తెలుగు 3” (Bigg Boss Telugu 3) కి సంబంధించి మూడవ వారం చివరికి వచ్చేశాం. ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో మూడవ కంటెస్టెంట్ బిగ్ బాస్ నుండి వెళ్లిపోనున్నారు. ఇక అంతకంటే ముందు.. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాం

విచిత్రమైన శిక్షలతో.. ఇంటి సభ్యులను ఉక్కిరిబిక్కిరి చేసిన బిగ్‌బాస్

కింగ్ ‘నాగార్జున’కి కోపం వచ్చిన వేళ…

సాధారణంగా కింగ్ నాగార్జున (Nagarjuna )అంటే చాలా కూల్‌గా ఉంటూ.. తన చుట్టూ ఉన్న వారితో సరదాగా గడిపే వ్యక్తి అని మనకి తెలుసు. అలాంటి నాగార్జున నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులని ఒక దుమ్ము దులిపేశాడు. వారం మొత్తం జరిగిన సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి ప్రస్తావిస్తూ.. ఆ సంఘటనలతో సంబంధం ఉన్న వారిని కాస్త మందలిస్తూ… వారు చేసిన తప్పులను వివరంగా తెలియజేశాడు. 

ముందుగా అలీ రెజాతో 21 గుంజిళ్లు తీయించి ఎపిసోడ్ మొదలుపెట్టిన నాగార్జున… హిమజతో జరిగిన వాగ్వాదంలో.. తను ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని తెలిపాడు. ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా వారి పైన చేతులు వేయడం చేస్తే.. వారు తిరిగి కొట్టడం సాధారణం అని.. బయట సమాజంలో కూడా మహిళలు అలాగే చేయాలని సూచించాడు. అలాగే ఆ అమ్మాయిని అలీ అంతలా దూషించడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తూ, భవిష్యత్తులో అలా ప్రవర్తించకుండా ఉండమని సున్నితంగా హెచ్చరించాడు నాగ్.

అలీ – హిమజల గొడవ జరుగుతున్న సమయంలో.. తమన్నా సింహాద్రి తప్ప.. ఏ ఒక్క ఇంటి సభ్యుడు కూడా అలీ చేస్తున్నది తప్పు అని చెప్పనందుకు ఇంటి సభ్యులని కూడా నాగ్ మందలించడం జరిగింది. ఈ విషయంలో తమన్నా చేసిన పనికి మెచ్చుకుంటూనే, తనని నామినేట్ చేసాడని రవికృష్ణ వెంటపడి దూషించడం ఎంతవరకు సబబు అని నాగ్ ప్రశ్నించాడు. అలాగే “జర్నలిస్టులు అందరూ నటిస్తారు” అని చేసిన కామెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పి… తమన్నాతో జర్నలిస్టులకి సారీ చెప్పించాడు నాగార్జున.

ఇలా ఈ ఇద్దరు చేసిన తప్పులని ఎత్తి చూపిన తరువాత, కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గాయపడ్డ రవికృష్ణని జాగ్రత్తగా ఉండమని తెలిపారు నాగ్. ఆ తర్వాత మొత్తం ఎపిసోడ్‌లో వితిక, రాహుల్ సిప్లిగంజ్ ప్రవర్తించిన తీరుని వారికే వీడియో రూపంలో చూపించి “అలా ప్రవర్తించడం తప్పు” అని తెలిపారు. అలాగే శ్రీముఖి వృత్తి యాంకరింగ్ పైన కూడా రాహుల్ చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోమని తెలిపి .. ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పించాడు ‘మన్మధుడు’ నాగార్జున.

“కొబ్బరిమట్ట” మూవీ రివ్యూ – ఇది సంపూ మార్క్ కామెడీ

ఇక ఆఖరిగా నామినేషన్స్ రోజు హల్చల్ చేసిన పునర్నవితో మాట్లాడుతూ.. “కావాలంటే ఇంటిలో ఉన్న అందరిని నామినేట్ చేయండి” అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నాగార్జున ప్రశ్నించారు. “బిగ్‌బాస్ రూల్స్ అందరూ తప్పనిసరిగా పాటించాలి, అందులో ఎవ్వరికి మినహాయింపు లేదు” అని చెప్పేసి.. ఈరోజు ఇంట్లో వాళ్ళతో తేల్చుకోవాల్సింది తేల్చుకున్నాను అని.. ఆ అంకాన్ని అక్కడితో ముగించారు.

చివరిలో కో-ఆర్డినేషన్ గేమ్ పేరిట, ఇంటిలో సఖ్యత లేకుండా ఉంటున్న ఇద్దరి మధ్యన ఒక బెలూన్ పెట్టి దానిని బ్యాలెన్స్ చేస్తూ నడవమని తెలిపారు. ఈ గేమ్‌లో జంటలుగా – అలీ – హిమజ, పునర్నవి – బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్ – శ్రీముఖి, తమన్నా – రవికృష్ణ, శివ జ్యోతి – వితిక , వరుణ్ – మహేష్ విట్టా, రోహిణి – ఆశు రెడ్డిలు మనకు కనువిందు చేశారు.

మొత్తానికి నిన్నటి  ఎపిసోడ్‌లో నాగార్జున ‘కింగ్’ లా.. హౌస్ మేట్స్ చేసిన తప్పులని సరిదిద్దుతూ వారిని రఫ్ ఆడించాడు అనే చెప్పాలి.  ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వ్యక్తులు – రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, పునర్నవి, వితిక, తమన్నా.  ఈరోజు ఎపిసోడ్‌లో ఈ అయిదుగురరిలో ఎవరు నిష్క్రమిస్తారన్నది వేచి చూడాల్సిందే.

“మన్మథుడు” మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ)

Read More From Entertainment