Lifestyle

‘జెర్సీ’ తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? – మూవీ రివ్యూ

Sandeep Thatla  |  Apr 19, 2019
‘జెర్సీ’ తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? –  మూవీ రివ్యూ

“కొన్ని సినిమాలు మనం థియేటర్లో చూసి అక్కడే వదిలేస్తాం.. కానీ ఇంకొన్ని మాత్రం మనతో పాటు ఇంటికి రావడమే కాదు.. మన మనసుపై కొంత కాలం ప్రభావం చూపిస్తాయి కూడా..’’ న్యాచురల్ స్టార్ నానీ నటించిన జెర్సీ (Jersey) కూడా ఈ కోవకు చెందిన చిత్రమే. ఏడేళ్ల తన కొడుకు ఇండియన్ టీం జెర్సీ కావాలని అడగ్గా.. దానిని తన కొడుక్కి కానుకగా ఇచ్చేందుకు ఆ తండ్రి చేసే ప్రయత్నమే ఈ చిత్రం.

ఇక కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ రంజీ క్రికెట్ టీంలో (Hyderabad Ranji Cricket Team)  బెస్ట్ బ్యాట్స్ మెన్ అయినప్పటికీ.. ఇండియన్ క్రికెట్ టీంకి ఎంపిక కాలేకోవడంతో తన కొడుకు, భార్యను చూసుకోవడానికి క్రికెట్‌నే పక్కన పెట్టేస్తాడు అర్జున్ (నానీ). సరిగ్గా పదేళ్ల తర్వాత.. చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉండిపోతాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు గడవడం కోసం తాజ్ బంజారా హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తుంటుంది అర్జున్ భార్య సారా (శ్రద్ధ శ్రీనాథ్ – Shraddha Srinath). వీరిద్దరి గారాల బిడ్డ నానీ (రోనిత్ ఖమ్రా). నానీ అడిగిన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ కోసం అర్జున్ ఏం చేశాడు? కొడుకు కోరికను తీర్చగలిగాడా?? లేదా?? అన్నది వెండితెరపైనే చూడాలి.

ఈ చిత్రంలో నానీ తాను పోషించిన అర్జున్ పాత్రతో.. నటనపరంగా మరో పది మెట్లు పైకి ఎక్కేసాడని చెప్పచ్చు. ముఖ్యంగా ఇలాంటి కథని అంగీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు.. నానీ ఇప్పుడు నిజంగానే ఒక స్టార్ హీరో అయిపోయాడు. కేవలం తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనే కాదు.. నానీ కెరీర్‌లో కూడా జెర్సీ ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఇక హీరోయిన్‌గా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ కూడా పాత్ర మేరకు బాగా నటించిందని చెప్పచ్చు. ముఖ్యంగా నానీతో కలిసి నటించిన సన్నివేశాల్లో ఓ వైపు గ్లామరస్‌గా కనిపిస్తూనే.. మరోవైపు అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను చక్కగా ఆకట్టుకుంది.

 

అలాగే ఈ సినిమాలో అర్జున్ కొడుకు నానీ పాత్రలో నటించిన రోనిత్ ఖమ్రా (Ronit Kamra) గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కథకు ఈ పాత్ర చాలా కీలకం. అలాంటి కీలకమైన పాత్రలో.. వయసు చిన్నదైనా చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించాడు రోనిత్. ఇక అసిస్టెంట్ క్రికెట్ కోచ్‌గా సత్యరాజ్ (Sathyaraj) చేసిన పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. నానీ – సత్యరాజ్‌ల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సగటు ప్రేక్షకుల గుండెలను హత్తుకొనేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

సహజసిద్ధమైన కథతో ముందుకెళ్లే ఇలాంటి చిత్రాలకు బలమైన కథనం కూడా చాలా అవసరం. భారీ పంచులు, బిల్డప్స్‌తో కూడుకున్న షాట్స్‌కు ఈ తరహా చిత్రాల్లో పెద్దగా స్కోప్ ఉండదు. సాదాసీదాగా సాగిపోయే సంభాషణల ద్వారా సగటు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే మంచి కిక్ కూడా ఇస్తుండాలి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinannuri) ఈ కథకు తగ్గ బలమైన కథనాన్ని రాసుకోవడంలో సఫలత సాధించాడనే చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా అర్జున్ – నానీల మధ్య వచ్చే సన్నివేశాలే కాకుండా, అర్జున్ – సారాల మధ్య వచ్చే సీన్స్ కూడా ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా ఉంటాయి. ఈ పాత్రల భావోద్వేగాలను కూడా వెండితెరపై చక్కగా చూపించగలిగారు. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడం ద్వారా.. తాను కూడా మంచి దర్శకుడినని అనిపించుకున్నారు గౌతమ్.

కేవలం దర్శకుడిగానే కాదు.. మాటల రచయితగా కూడా గౌతమ్ సిక్స్ కొట్టారనే చెప్పాలి. మనసుకు హత్తుకునే సంభాషణలు ఈ చిత్రంలో ఎన్నో ఉన్నాయి. ఇక జెర్సీ సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే మనం ముందుగా చెప్పుకోవాల్సింది.. సను వర్గీస్ (Sanu Varghese) కెమెరా పనితనం గురించి.. మొదటి భాగంలో సహజంగా ఉండే పాత్రలను ఎంత బాగా చూపించారో; రెండో భాగంలో మనకు కనిపించే క్రికెట్‌ని కూడా అంతే సహజంగా ఉండేలా తీర్చిదిద్దారు.

ఇక అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ఒక ప్లస్ పాయింట్‌గా నిలిచింది. పాటలు కూడా సందర్భానికి తగ్గట్లుగా ఉన్నాయి. అలాగే కృష్ణకాంత్ అందించిన సాహిత్యం కూడా కథకు బాగా సరిపోయింది.

నిర్మాణపరంగా జెర్సీ టీంకి సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) వెన్నుదన్నుగా నిలిచిందనే చెప్పాలి. ఎందుకంటే 1986 & 1996 సంవత్సరాల నాటి కథ తెరపై చూపిస్తున్నప్పుడు అప్పటి ప్రేక్షకులు వాడిన వస్తువులు, వాహనాలు మొదలైన వాటితో పాటు.. ఒక రకంగా అప్పటి వాతావరణాన్ని కూడా వీలైనంత సహజసిద్ధంగా చూపించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ జెర్సీ టీం సక్సెస్ సాధించింది. ఇందుకు ప్రొడక్షన్ డిజైన్ వారిని మనమంతా అభినందించి తీరాలి.

జెర్సీ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే- గౌతమ్ కెప్టెన్సీలో..  స్టార్ బ్యాట్స్‌‌మన్‌గా నానీ కొట్టిన భారీ సిక్సర్.

ఇవి కూడా చదవండి

సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ చిత్రం ద్వారా.. యువతకి కనెక్ట్ అయ్యే 7 అంశాలు ఇవే..!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

“ఓల్డ్ మ్యాన్” వేషాల్లో సల్మాన్, అమీర్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!

Read More From Lifestyle